విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్(Karun Nair) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు.
ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. ఏడు ఇన్నింగ్స్‌లో అతడు నాటౌట్‌గా నిలవడం విశేషం.
బ్యాటర్‌గా దుమ్ములేపుతూనే.. కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో విదర్భను విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు చేర్చాడు. దేశీ వన్డే టోర్నీలో విదర్భ ఇలా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అతడిని ఎంపిక చేయాలి
ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో.. కరుణ్ నాయర్‌ను ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్ నాయర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నా.. అతడిని ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేయడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ కరుణ్ నాయర్ ఆడుతున్న తీరు అమోఘం. అతడు ఊహకు అందని రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు.
ఫామ్‌లో ఉన్నంత మాత్రాన సెలక్ట్ చేయరు
అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు అతడి గురించే చర్చిస్తున్నారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కరుణ్ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఎందుకంటే.. సెలక్టర్లు ఇప్పటికే టీమ్ గురించి తుది నిర్ణయానికి వచ్చి ఉంటారు.
ఏదేమైనా కరుణ్ నాయర్ గొప్ప ఆటగాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలిగే ఇన్ ఫామ్ బ్యాటర్‌ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. అతడు గనుక తిరిగి జట్టులోకి వస్తే నాకూ సంతోషమే’’ అని డీకే పేర్కొన్నాడు.
అయితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా కరుణ్ నాయర్ ఎంపికయ్యే అవకాశం లేదని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.
చాంపియన్స్ ట్రోఫీలో జైసూ ఆడటం ఖాయం
‘‘ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు జైస్వాల్‌కు విశ్రాంతినిచ్చారు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన అనంతరం ఈ యువ ఆటగాడికి తగినంత రెస్ట్ అవసరం.
ఈ విషయంలో సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వందకు వంద శాతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిస్తారు. వన్డేల్లో అరంగేట్రం కదా అని ఆందోళన చెందాల్సిన పనిలేదు.
అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేయగలడు. ఇంగ్లండ్‌తో టీ20లలో ఆడనంత మాత్రాన అతడికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో, టీ20లలో అదరగొడుతున్న జైస్వాల్ ఇంత వరకు వన్డేల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.
చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment