ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్‌ను పంపించాలని సూచించాడు. తద్వారా శుబ్‌మన్ గిల్‌పై వేటు వేయాలని పరోక్షంగా సెలక్టర్లకు సలహా ఇచ్చాడు.
దుబాయ్ వేదికగా
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్(Dubai)లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13 డెడ్‌లైన్ విధించగా.. బీసీసీఐ మాత్రం మినహాయింపు కోరింది. జనవరి 17 నాటికి తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు ఆ వివరాలు వెల్లడించలేదు.
అతడిని సెలక్ట్ చేయండి
ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్తాన్ టైమ్స్‌తో ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘‘సెలక్టర్లకు నాదో సలహా. యశస్వి జైస్వాల్‌ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్బుతం. వన్డే ఫార్మాట్‌కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. కచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి’’ అని వీరూ భాయ్ పేర్కొన్నాడు.
పంత్ వద్దు: భజ్జీ
మరోవైపు.. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా తన మొదటి ఓటు సంజూ శాంసన్‌కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు.
కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్ రోహిత్- జైస్వాల్‌ల పేర్లను సూచించగా.. భజ్జీ రిషభ్ పంత్‌ను కాదని సంజూ శాంసన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం విశేషం.
కాగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు, టీ20లలో టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో మెరిసిన జైసూ ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్ తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే, జైస్వాల్‌కు ఇంత వరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ యాభై ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు.
జైసూ భేష్
అయితే, ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్‌లో జైసూ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్‌లలోనే అతడు ఐదు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు.
చదవండి: ILT20 2025: చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
Comments
Please login to add a commentAdd a comment