విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్‌లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్‌లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..
క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్‌లు)
కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్‌లు)
ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్‌లు)
నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్‌లు)
కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్‌లు)
కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్‌లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో పోలార్డే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.
160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్‌ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు.
డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్‌ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment