
8 మందికి కొత్తగా అవకాశం
ముక్కోణపు టోర్నీకి జట్టు ప్రకటన
ఆదివారం లంకతో భారత్ తొలి మ్యాచ్
కొలంబో: స్వదేశంలో జరగనున్న మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్ కోసం శ్రీలంక జట్టు భారీ మార్పులు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం శ్రీలంక జట్టు 8 మార్పులు చేసి బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు 0–2తో సిరీస్ కోల్పోవడంతో జట్టును ప్రక్షాళన చేసింది.
సీనియర్ బ్యాటర్ చమరి ఆటపట్టు లంక జట్టుకు సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆకట్టుకున్న మీడియం పేసర్ మల్కీ మదారాకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నమెంట్‌లో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. మ్యాచ్‌లన్నీ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫైనల్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత అమ్మాయిల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.
శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్ ), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని, మనుడి ననయక్కర, హాసిని పెరెరా, ఆచిని కులసూర్య, పియూమి బడాల్గే, దేవ్‌మి విహంగ, హన్సిమ కరుణరత్నె, మల్కీ మదారా, ఇనోషి ప్రియదర్శిని, సుగంధిక కుమారి, రష్మిక, ఇనోక రణవీర.