టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్- కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు చేపట్టబోనని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉండటం తలనొప్పితో కూడిన పని అని అశూ వ్యాఖ్యానించాడు.
ఆచితూచి...
భారత్‌లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని.. అయితే, వారిలో ఎవరిని జట్టుకు ఎంపిక చేయాలనేది ఎల్లప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఓ ఆటగాడి వైపు మొగ్గు చూపేటపుడు ప్రదర్శన, ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.
కాగా ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్లను ప్రకటించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
అతడి గురించే ఎక్కువగా చర్చ
ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇవ్వాల్సిందని కొంతమంది అభిప్రాయపడగా.. సంజూ శాంసన్‌కు ఈసారీ అన్యాయం జరిగిందంటూ సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.
వన్డేల్లో రిషభ్ పంత్ కంటే మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్ కోటాలో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టీ20లకి తిరిగి వస్తే.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ పరిస్థితి ఏమిటి?
వీరే కాకుండా ఓపెనింగ్ కోటాలో రుతురాజ్ గైక్వాడ్‌కు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? దేశవాళీ క్రికెట్ వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్‌ను సెలక్టర్లు కనికరించకపోవడానికి కారణం? .. ఇలాంటి చర్చలు భారత క్రికెట్ వర్గాల్లో జరుగుతున్నాయి.
జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?
ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంతర్జాతీయ టీ20లలోకి యశస్వి జైస్వాల్ తప్పక తిరిగి రావాలి. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉన్న వ్యక్తి. మొదటి ప్రాధాన్యం కలిగిన ఓపెనర్.
ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీగా పరుగులు చేస్తే.. సెలక్టర్లకు తలనొప్పి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా లేదంటే.. టీమ్ మేనేజర్‌గా.. అదీ కాదంటే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందంలో ఉండే అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోను.
ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదువలేకపోవడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, సెలక్టర్లకు మాత్రం ఇది ఒక సమస్య. ఏదేమైనా.. పోటీలో ఉన్న ఆటగాళ్లందరి ప్రదర్శన, ప్రధాన టోర్నమెంట్లో ఒత్తిడిని ఏమేరకు జయించగలరన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తే బాగుంటుంది.
క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించగలిగే వాళ్లకే పెద్దపీట వేయాలి. ఎవరు గొప్ప ఆటగాడు అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే కొలమానాలు ఏవీ లేవు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, అరుదైన నైపుణ్యాలు, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు.
చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
Comments
Please login to add a commentAdd a comment