టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పుతో చెన్నై బరిలో దిగనున్నట్లు తెలిపింది. కాగా కోల్‌కతాలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్‌పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్.. అతడి స్థానాన్ని నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఓ పేసర్‌తో భర్తీ చేయడం విశేషం.
బ్యాటర్ల వైఫల్యం
తాజా భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ టీమిండియాతో తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.
బట్లర్ అర్ధ శతకం చేసినా
ఓపెనర్లు ఫిల్ సాల్ట్(0) డకౌట్ కాగా.. బెన్ డకెట్(4) కూడా విఫలమయ్యాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.
హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్(0), జాకబ్ బెతెల్(7), జేమీ ఓవర్టన్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్‌లో గస్ అట్కిన్సన్(2), ఆదిల్ రషీద్(8*), మార్క్‌వుడ్(1) కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.
12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం
ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసి.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లలో సంజూ శాంసన్(26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ(19*), హార్దిక్ పాండ్యా(3*) నాటౌట్‌గా నిలిచారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అట్కిన్సన్ మాత్రం కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసిన యాజమాన్యం.. 29 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు తుదిజట్టులో చోటు కల్పించింది.
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం రెండో టీ20 జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతుంది.
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Comments
Please login to add a commentAdd a comment