టీమిండియాతో తొలి టీ20లో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. పరుగులు రాబట్టేందుకు వీలుగా ఉన్న పిచ్ మీద సత్తా చాటలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యామన్న బట్లర్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపిందని తెలిపాడు. ఏదేమైనా భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని.. తదుపరి మ్యాచ్‌లో తాము తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నాడు.
అర్ష్‌దీప్ అదరగొడితే..
కాగా ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(0)ను డకౌట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. అనంతరం బెన్ డకెట్(4)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.
వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు
అర్ష్‌దీప్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్(0)తో పాటు హ్యారీ బ్రూక్(17)ను అవుట్ చేశాడు.
అదే విధంగా.. కొరకాని కొయ్యగా మారిన కెప్టెన్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచే దూకుడు కనబరిచింది.
అభిషేక్ శర్మ ధనాధన్
సంజూ శాంసన్ (20 బంతుల్లో 26) వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) విఫలం కాగా.. తిలక్ వర్మ(19), హార్దిక్ పాండ్యా(3) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అభిషేక్ ధాటికి 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఒత్తిడి పెంచలేకపోయాం.. ఓటమికి కారణం అదే
ఈ నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘టీమిండియాపై ఒత్తిడి పెంచలేకపోయాం. నిజంగా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక మా జట్టులోని కొంత మంది.. కొందరు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి.. వికెట్ బాగానే ఉంది. ఫాస్ట్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది.
కానీ మేము ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. టీ20 క్రికెట్‌లో మేము మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం. అయితే, అల్ట్రా- అగ్రెసివ్ జట్టుతో పోటీలో ఈరోజు వెనుకబడిపోయాం. ఏదేమైనా టీమిండియాతో పోరు రసవత్తరంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లలో కచ్చితంగా రాణిస్తాం. ప్రతీ వేదికపై విభిన్న పిచ్ పరిస్థితులు ఉంటాయి.
జోఫ్రా ఆర్చర్ సూపర్‌స్టార్
మా జట్టులో జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అతడొక సూపర్‌స్టార్. ప్రత్యర్థిని కచ్చితంగా భయపెట్టగలడు. ముందుగా చెప్పినట్లు మేము తిరిగి పుంజుకుంటాం’’ అని పేర్కొన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైనట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.
కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ సంజూ, సూర్య రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ వికెట్‌ను ఆదిల్ రషీద్ దక్కించుకున్నాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది.
చదవండి: NADA: డోపింగ్ పరీక్షలు.. బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..
𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP— BCCI (@BCCI) January 22, 2025
Comments
Please login to add a commentAdd a comment