ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ల అసమర్థతను బాగానే కప్పి పుచ్చుతున్నావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
దమ్ముంటే రెండో టీ20(India vs England)లో సత్తా చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్చర్‌ను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై స్పందిస్తూ.. ఆర్చర్ ఒకింత వింత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..
టీమిండియా ఘన విజయం
ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో బట్లర్ బృందాన్ని చిత్తు చేసింది.
ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్ల విజృంభణ కారణంగా ఇంగ్లండ్‌ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనలోనూ అదరగొట్టింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 133 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
సుడిగాలి ఇన్నింగ్స్‌తో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తంగా 34 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.
అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు.
జోఫ్రా ఆర్చర్‌కు వికెట్లు
ఇక టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు జోఫ్రా ఆర్చర్‌కు దక్కాయి. సంజూ శాంసన్‌తో పాటు.. సూర్యకుమార్ యాదవ్‌లను ఈ రైటార్మ్ పేసర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. అదృష్టం వల్లే టీమిండియా గెలిచిందన్న అర్థంలో వ్యాఖ్యానించాడు.
అదృష్టం వల్లే గెలిచారు
‘‘ఈరోజు మ్యాచ్‌లో మిగతా బౌలర్లతో పోలిస్తే పరిస్థితులు నాకు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. మావాళ్లలో అందరూ బాగానే బౌలింగ్ చేశారు. అయితే, టీమిండియా బ్యాటర్ల అదృష్టం వల్ల వారికి భంగపాటు ఎదురైంది.
టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి. కానీ.. మేము సరిగ్గా క్యాచ్‌లు పట్టలేకపోయాం. తదుపరి మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేయబోము. అన్ని క్యాచ్‌లు ఒడిసిపడతాం. అప్పుడు నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేస్తాం’’ అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.
నిజానికి తొలి టీ20లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మాత్రమే ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తిలక్ వర్మ కూడా ఓసారి బంతిని గాల్లోకి లేపినా.. అదేమీ అంత తేలికైన క్యాచ్ కాదు. ఈ రెండు తప్ప టీమిండియా బ్యాటర్లు క్యాచ్‌లకు ఎక్కువగా అవకాశం ఇవ్వనే లేదు.
అయినప్పటికీ అదృష్టం వల్లే టీమిండియా బ్యాటర్లు తప్పించుకున్నారంటూ ఆర్చర్ వ్యాఖ్యానించడం.. అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం. మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామంటూ.. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వడం గమనార్హం.
చదవండి: Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి విఫలమై!
Comments
Please login to add a commentAdd a comment