టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర | Ind vs Eng 5th T20: India Scripts History Become 1st Team In The World To | Sakshi
Sakshi News home page

టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

Published Mon, Feb 3 2025 1:38 PM | Last Updated on Mon, Feb 3 2025 3:44 PM

Ind vs Eng 5th T20: India Scripts History Become 1st Team In The World To

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో భారీ తేడాతో గెలుపొంది.. ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు హోదా కలిగిన జట్లలో ఇంత వరకు.. ఏ టీమ్‌కీ సాధ్యం కాని రీతిలో ‘బిగ్గెస్ట్‌ విక్టరీ(Biggest Victory)’ల విషయంలో అత్యంత అరుదైన ఘనత సాధించింది.

కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 4-1(India Won Series With 4-1)తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో ఈ సిరీస్‌ ఆరంభించిన టీమిండియా.. చెన్నైలోనూ గెలిచింది. అయితే, ఆ తర్వాత రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.

ఏకపక్ష విజయం 
అయితే, పడిలేచిన కెరటంలా పుణె వేదికగా మరోసారి సత్తా చాటి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ సొంతం చేసుకుంది. ఈ నాలుగు మ్యాచ్‌లలో టీమిండియాకు ఇంగ్లండ్‌ గట్టి పోటీనివ్వగా.. నామమాత్రపు ఆఖరి టీ20లో మాత్రం సూర్యకుమార్‌ సేన ఏకపక్ష విజయం సాధించింది.

అభిషేక్‌ పరుగుల సునామీ
వాంఖడేలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ సారథి జోస్‌ బట్లర్‌(Jos Buttler) టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మార్క్‌వుడ్‌ సంజూ శాంసన్‌(16)ను త్వరగానే పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌కు శుభారంభం అందించినా.. ఆ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. భారత మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ దూకుడు కనబరిచాడు.

ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో పరుగుల సునామీ సృష్టించాడు. ఇతరులలో తిలక్‌ వర్మ(15 బంతుల్లో 24), శివం దూబే(13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.

బౌలర్ల విజృంభణ 
ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌(23 బంతుల్లో 55) అర్ధ శతకం సాధించగా.. మిగతా వాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెన్‌ డకెట్‌ 0, కెప్టెన్‌ బట్లర్‌ 7, హ్యారీ బ్రూక్‌ 2, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 9, జాకొబ్‌ బెతెల్‌ 10, బ్రైడన్‌ కార్సే 3, జేమీ ఓవర్టన్‌ 1, జోఫ్రా ఆర్చర్‌ 1*, ఆదిల్‌ రషీద్‌ 6, మార్క్‌ వుడ్‌ 0 పరుగులు చేశాడు.

ప్రపంచంలోనే ఏకైక జట్టుగా
ఫలితంగా 97 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూనే భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు, శివం దూబే, అభిషేక్‌ శర్మచ వరుణ్‌ చక్రవర్తి తలా రెండు.. రవి బిష్ణోయి ఒక వికెట్‌ తీశాడు. దీంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ కథ ముగిసిపోయింది. టీమిండియా చేతిలో 150 పరుగుల భారీ తేడాతో మట్టికరిచింది.

కాగా టీమిండియా అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థి జట్టుపై 150 పైచిలుకు పరుగులతో విజయం సాధించడం ఇది రెండోసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. 

అంతేకాదు.. అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్లపై ఎక్కువసార్లు(4) గెలుపొందిన టీ20 టీమ్‌గానూ తన రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఇక వన్డేల్లోనూ బిగ్గెస్ట్‌ విక్టరీ సాధించిన జట్టుగా టీమిండియాకు రికార్డు ఉంది. శ్రీలంకపై 2023లో తిరువనంతపురం వేదికగా 317 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్లు(ఫుల్‌ మెంబర్‌ సైడ్‌)
👉ఇండియా- న్యూజిలాండ్‌పై 2023లో అహ్మదాబాద్‌ వేదికగా 168 పరుగుల తేడాతో గెలుపు
👉ఇండియా- ఇంగ్లండ్‌పై 2025లో ముంబై వేదికగా 150 పరుగుల తేడాతో గెలుపు
👉పాకిస్తాన్‌- వెస్టిండీస్‌పై 2018లో కరాచీ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు
👉ఇండియా- ఐర్లాండ్‌పై 2018లో డబ్లిన్‌ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు
👉ఇంగ్లండ్‌- వెస్టిండీస్‌పై 2019లో బెసెటెరె వేదికగా 137 పరుగుల తేడాతో గెలుపు
👉ఇండియా- సౌతాఫ్రికాపై 2024లో జొహన్నస్‌బర్గ్‌ వేదికగా 135 పరుగుల తేడాతో గెలుపు.

చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్‌ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement