ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్‌! | Suryakumar Yadav Completed 5 Years In International Cricket This Day | Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్‌!

Mar 14 2026 5:09 PM | Updated on Mar 14 2026 6:07 PM

Suryakumar Yadav Completed 5 Years In International Cricket This Day

క్రికెట్‌ అభిమానులంతా అతడిని ముద్దుగా మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని పిలుస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్‌ ఏ యాంగిల్‌లో బంతి వేసినా బౌండరీ లేదా సిక్సర్‌ బాదడం అతడి నైజం. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఐదేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన టీమిండియా జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో ఒకసారి కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ అందుకొని దిగ్గజాల సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. అతడే భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. మార్చి 14 (శనివారం)తో సూర్యకుమార్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో ఐదేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నాడు. ‘ఐదేళ్ల ఏళ్ల క్రితం టీమిండియాకు ఆడాలన్న ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడమనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్‌గా నేను పొందిన జ్ఞాపకాలను మరోసారి పంచుకుంటున్నా.’ అంటూ ట్వీట్‌ చేశాడు.

టీ20 క్రికెట్‌లో భారత తరఫున అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన సూర్యకుమార్‌ యాదవ్‌ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం విశేషం. మార్చి 14, 2021లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ద్వారా సూర్య తన కెరీర్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఆడాడు. సూర్యకుమార్‌ ఇప్పటివరకు టీమిండియా తరఫున 113 టీ20 మ్యాచ్‌లు ఆడి 162.94 స్ట్రైక్‌రేట్‌తో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 25 అర్థసెంచరీలున్నాయి.

ప్రస్తుతం సూర్యకుమార్‌ టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఉన్నారు. ఈ ఇద్దరు 2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 

2024 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్‌ ఆ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్‌లో బౌండరీ వద్ద క్యాచ్‌ అందుకోవడం ఎన్నటికీ మరిచిపోలేని సంఘటన. సూర్య క్యాచ్‌ అందుకోవడంతో మ్యాచ్‌ భారత్‌వైపు తిరగడం, ఆ తర్వాత టీమిండియా టైటిల్‌ గెలవడం చకచకా జరిగిపోయాయి.

రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్‌ జట్టును విజయపథంలో నడిపించడంలో విజయవంతమయ్యాడు. ఇప్పటివరకు సూర్య సారథ్యంలో 40 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం ఎనిమిదింట మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు టీ20 క్రికెట్‌లో సూర్య చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వివిధ దేశాల్లో (భారత్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌) రావడం విశేషం. 

2022 ఏడాదిలో సూర్యకుమార్‌ టీమిండియా తరఫున 31 మ్యాచ్‌ల్లో 187 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. 

చదవండి: తూచ్‌.. అదంతా ఉత్తిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement