తూచ్‌.. అదంతా ఉత్తిదే! | PCB Breaks Silence Allegations PKR 50 Lakh Fine Players T20 WC Debacle | Sakshi
Sakshi News home page

T20 WC 2026: తూచ్‌.. అదంతా ఉత్తిదే!

Mar 14 2026 3:57 PM | Updated on Mar 14 2026 4:07 PM

PCB Breaks Silence Allegations PKR 50 Lakh Fine Players T20 WC Debacle

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చెత్త ఆటతీరుతో సూపర్‌-8లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పాక్‌ జట్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఒక్కో ఆటగాడికి పీకేఆర్‌ 50 లక్షలు (భారత కరెన్సీలో సుమారు రూ.16.5 లక్షలు) జరిమానా విధిస్తున్నట్లు కొన్ని రోజుల కిందట ఆ దేశ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 

ఈ కఠిన నిర్ణయం స్వయంగా పీసీబీ చైర్మన్‌ మొహసీన్‌ నఖ్వీనే తీసుకున్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా పాక్‌ ఆటగాళ్లకు విధించిన జరిమానాల్లో నిజమెంత అనే దానిపై పీసీబీ ప్రతినిధి ఆమిర్‌మిర్‌ స్పందించారు. 

‘టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన కనబరిచినందుకు పాక్‌ ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్న గాసిఫ్‌ మాత్రమే. అలాంటి నిర్ణయాలు పీసీబీ ఎప్పుడూ తీసుకోదు. ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనకుగానూ పాకిస్థాన్‌ ఆటగాళ్లను, కోచ్‌, సిబ్బందిని హెచ్చరించిన మాట నిజమే కావొచ్చు. కానీ ఆటగాళ్లపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు గానీ జరిమానా కానీ విధించలేదు.’ అని చెప్పుకొచ్చారు.

ఇక సల్మాన్‌ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై తడబడి గెలిచింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌ ఎలాగోలా సూపర్‌-8లో అడుగుపెట్టింది. 

అయితే సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. కానీ కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2024లోనూ పాక్‌ జట్టు సెమీస్‌ చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా నాసిరకం ఆటతీరుతో నాకౌట్‌కు చేరకుండానే పాకిస్థాన్‌ వరుసగా రెండోసారి సూపర్‌-8 దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. 

అయితే టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం కారణంగా ఆటగాళ్లకు జరిమానా విధించారన్న విషయంపై వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ స్పందించాడు. పాక్‌ ఆటగాళ్లకు విధించిన జరిమానా మొత్తాన్ని తాను కడుతానని, కానీ ఆ డబ్బులు జట్టును మళ్లీ మంచి ట్రాక్‌లోకి తెచ్చేందుకు ఉపయోగించాలని కోరడం గమనార్హం. 

ఇటీవలే బంగ్లాదేశ్‌లో మొదలైన వన్డే సిరీస్‌ను కూడా పాక్‌ ఓటమితోనే ప్రారంభించింది. తొలి వన్డేలో పాకిస్థాన్‌ 114 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో వన్డేలో మాత్రం బంగ్లాపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే ఆదివారం జరగనుంది.

చదవండి: ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement