జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో కొత్తగా 14 మంది క్రికెటర్ల పేర్లు చేరాయి. ‘నాడా’ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసే రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ)– 2025 జాబితాలో భారత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
వీరితో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్(Shubman Gill), రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, తిలక్ వర్మ(Tilak Varma) పేర్లు కూడా జత చేరాయి.
ఇక ముగ్గురు మహిళా క్రికెటర్లు షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుకా సింగ్ పేర్లను కూడా ‘ఆర్‌టీపీ’లో చేర్చారు. ‘నాడా’ నిబంధనల ప్రకారం ఈ ఏడాదిలో ఏ సమయంలోనైనా వీరి శాంపిల్స్‌ను అధికారులు సేకరిస్తారు.
డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతే
తాము ‘ఎప్పుడు, ఎక్కడ’ ఉంటామో చెబుతూ అధికారుల కోసం ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. తమ చిరునామా, ప్రాక్టీస్, ప్రయాణాలు, మ్యాచ్‌ల షెడ్యూల్‌వంటి వివరాలు కూడా వారు అందజేయాల్సి ఉంటుంది.
కాగా డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతే దానికి సదరు ఆటగాడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో ఏదైనా కారణంతో మూడుసార్లు ఇలాగే జరిగితే డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కింద ‘నాడా’ చర్యలు తీసుకుంటుంది. 2019 నుంచే ‘నాడా’ పరిధిలోకి క్రికెటర్లు రాగా... ఓవరాల్‌గా అన్ని క్రీడాంశాల్లో కలిపి ప్రస్తుతం 227 మంది భారత ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.
మరిన్నిక్రీడా వార్తలు
ఆసియా మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు చైనాలో జరగనున్న ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది షట్లర్లు పాల్గొంటారు. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన స్టార్ పీవీ సింధుతోపాటు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో ఆడతారు. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది.
ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక బరిలోకి దిగుతారు’ అని వెల్లడించారు.
పురుషుల జట్టు: లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, సతీశ్ కుమార్.
మహిళల జట్టు: సింధు, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య.
సహజ శుభారంభం
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–3, 3–6, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ యురికో మియజకి (జపాన్)పై సంచలన విజయం సాధించింది.
2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రషి్మక 0–6, 0–6తో ప్రపంచ 155వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో 45 నిమిషాల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 7–6 (7/2), 7–6 (7/4)తో దరియా కుదషోవా (రష్యా)పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment