
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.
కెరీర్‌లోనే అత్యుత్తమంగా
స్వభావసిద్ధంగా ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.
ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.
అయితే, రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.
కానీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.
దురదృష్టం వెంటాడింది
సౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.
కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.
చెత్త ‘వరల్డ్’ రికార్డు
తద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మెరుగ్గా ఆడేందుకు
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.
బ్యాటర్ల కారణంగానే
కాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
రాజ్‌కోట్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.
చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్‌లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్
Comments
Please login to add a commentAdd a comment