
సొంతగడ్డపై హైదరాబాద్ మరో ఓటమి
7 వికెట్లతో ముంబై ఘన విజయం
రాణించిన బౌల్ట్, రోహిత్, సూర్య
ఐపీఎల్–2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది... గత ఏడాది రన్నరప్ ఈసారి పేలవ ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది...ముంబై పేసర్లు బౌల్ట్, చహర్ ధాటికి 13/4 వద్ద నిలిచి, ఆపై ఎలాగోలా 143 వరకు చేరినా... ఆ స్కోరు ఓటమిని తప్పించలేకపోయింది. రోహిత్ శర్మ మరో చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించగా మరో 26 బంతుల ముందే ముంబై విజయతీరం చేరింది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో మ్యాచ్ మ్యాచ్‌కీ జోరు పెంచుతూ చెలరేగుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గింది. ముందుగా రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఆదుకున్న క్లాసెన్...
ఒకటి, రెండు, మూడు, నాలుగు... సన్‌రైజర్స్ టాప్–4 బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఇన్నింగ్స్ మరీ పేలవంగా ప్రారంభమైంది. హెడ్ (0), అభిషేక్ శర్మ (8), నితీశ్ కుమార్ రెడ్డి (2) చెత్త షాట్లు ఆడి నిష్క్రమించగా, ఇషాన్ కిషన్ (1) తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు (24) సన్‌రైజర్స్ నమోదు చేసింది. కొద్దిసేపటికి అనికేత్ వర్మ (12) కూడా వెనుదిరగడంతో 35/5 వద్ద రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి.
స్కోరు 100 దాటుతుందా అనే సందేహం కనిపించింది. బ్యాటింగ్ కుప్పకూలటంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అదనపు బ్యాటర్ మనోహర్‌ను తీసుకోవాల్సి వచ్చింది. క్లాసెన్, మనోహర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. 34 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. క్లాసెన్, మనోహర్ ఆరో వికెట్‌కు 63 బంతుల్లో 99 పరుగులు జోడించారు.
చకచకా లక్ష్యం వైపు...
స్వల్ప ఛేదనలో ముంబై ఆరంభంలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, విల్ జాక్స్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 46 బంతుల్లోనే 64 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. జాక్స్ వెనుదిరిగిన తర్వాత రోహిత్‌కు సూర్య జత కలిశాడు. 35 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హర్షల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మరింత జోరు ప్రదర్శించిన రోహిత్ ఎట్టకేలకు విజయానికి మరో 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) నమన్ (బి) బౌల్ట్ 0; అభిషేక్ (సి) పుతూర్ (బి) బౌల్ట్ 8; ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 1; నితీశ్ రెడ్డి (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 2; క్లాసెన్ (సి) తిలక్ (బి) బుమ్రా 71; అనికేత్ (సి) రికెల్టన్ (బి) పాండ్యా 12; మనోహర్ (హిట్ వికెట్) (బి) బౌల్ట్ 43; కమిన్స్ (బి) బౌల్ట్ 1; హర్షల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–13, 4–13, 5–35, 6–134, 7–142, 8–143. బౌలింగ్: దీపక్ చహర్ 4–0– 12–2, బౌల్ట్ 4–0–26–4, బుమ్రా 4–0–39–1, సాంట్నర్ 4–0–19–0, పాండ్యా 3–0–31–1, పుతూర్ 1–0–15–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి అండ్ బి) ఉనాద్కట్ 11; రోహిత్ (సి) అభిషేక్ (బి) మలింగ 70; జాక్స్ (సి)మనోహర్ (బి) అన్సారీ 22; సూర్యకుమార్ (నాటౌట్) 40; తిలక్‌వర్మ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–77, 3–130. బౌలింగ్: కమిన్స్ 3–0–31–0, ఉనాద్కట్ 3–0–25–1, హర్షల్ 3–0–21–0, ఇషాన్ మలింగ 3–0–33–1, అన్సారీ 3.4–0–36–1.
అవుట్ కాకుండానే...
సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దీపక్ చహర్ వేసిన బంతి అతని లెగ్‌సైడ్ దిశగా వెళ్లగా కిషన్ గ్లాన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ రికెల్టన్ బంతిని అందుకున్న మరుక్షణమే కిషన్ అవుట్‌గా భావించి స్వచ్ఛందంగా పెవిలియన్ వైపు నడిచాడు. నిజానికి ముంబై ఆటగాళ్లు ఎవరూ గట్టిగా అప్పీల్ కూడా చేయకపోగా... అంపైర్ వినోద్ శేషన్ కూడా వైడ్‌గా ప్రకటించేందుకు రెండు చేతులు పైకెత్తబోయాడు.
అయితే కిషన్ స్పందనను చూసిన అతను తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్‌గా ఖాయం చేశాడు. కిషన్ తనంతట తానే వెళ్లిపోవడాన్ని ముంబై కెప్టెన్ పాండ్యా భుజం తట్టి మరీ అభినందించాడు. అయితే ఆ తర్వాత రీప్లేల్లో అతని బ్యాట్‌కు బంతి తగల్లేదని, నాటౌట్ అని తేలింది. ఇషాన్ కిషన్ అతిగా స్పందించకుండా ఉంటే వికెట్ చేజారేదే కాదు.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X రాజస్తాన్
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం