
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ వేసవి రోజుల్లో కూరగాయ పంటలను సన్‌బర్న్ నుంచి కాపాడుకోవటానికి ఓ సేంద్రియ రైతు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫొటోలో పొలాన్ని చూడండి.. మొక్కజొన్న తోటలాగా ఉంది కదా! కానీ, నిజానికి అది టొమాటో తోట!!
టొమాటో మొక్కలకు తోడు– నీడ కోసం పక్కనే మొక్కజొన్న విత్తారు. ప్రచండమైన ఎండల నుంచి టొమాటో తోటను కాపాడుకోవటానికి రైతు రంగప్రసాద్ ఈ వినూత్న ఉపాయాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన రంగప్రసాద్ నాలుగేళ్ల క్రితం సేంద్రియ సేద్యం చేపట్టారు.
నాగర్‌కర్నూలు జిల్లా చారుగొండ మండలం జూపల్లిలో 70 ఎకరాల భూమి తీసుకొని ఐఫామ్స్‌ను స్థాపించారు. రకరకాల పండ్ల చెట్లు, కూరగాయలు, నాటుకోళ్లు, మేకలు.. పెంచుతున్నారు. గచ్చిబౌలిలో సొంతంగా స్టోర్ తెరచి ఆహారోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
ఎండలు మండి΄ోతున్న నేపథ్యంలో ఈ ఏడాది టొమాటో, క్యాబేజీ, బ్రకోలి, లెట్యూస్ వంటి పంటలు సాగుచేస్తున్న అన్ని మడుల్లోనూ పక్కన మొక్కజొన్నను కూడా ఉత్తర – దక్షిణ వరుసలుగా విత్తుతున్నారు. 3–3.5 అడుగులకో వరుస చొప్పున మొక్కజొన్న విత్తుతున్నారు. ‘ప్రతి 30 రోజులకోసారి కొత్త కూరగాయల ప్లాట్‌లో మొక్కలు నాటుతూ ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తున్నాం.
అవి నాటేటప్పుడే మొక్కజొన్న విత్తనాలను కూడా వరుసల మధ్య విత్తుతున్నాం. అవసరమైతే, ఈ వరుసల మధ్యలో 15 రోజులకోసారి మొక్కజొన్న విత్తుతాం. అందువల్ల, ఎప్పుడు చూసినా అనేక ఎత్తుల్లో మొక్కజొన్న మొక్కలు పచ్చగా పెరుగుతూ ఉంటాయి. పక్కన ఉన్న ప్రధాన కూరగాయ మొక్కలకు నీడను, చల్లదనాన్ని ఇవి అందిస్తుండటంతో ఎండను తట్టుకొనే శక్తి వస్తోంద’న్నారు.
మొక్కజొన్నే ఎందుకు? అంటే.. ‘మొక్కజొన్న వేగంగా పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా, ఎత్తుగా పెరుగుతాయి. దీంతో తోట వత్తుగా మొక్కలతో నిండి ఉంటుంది. నీడ పడుతుంది. మొక్కజొన్నను తోడు–నీడ పంటగా నాటిన కూరగాయ తోటలో 3 డిగ్రీల సెల్షియస్ మేరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. బేబీ కార్న్/కండెలను అమ్ముతున్నాం. చొప్పను ఆవులకు మేపుతున్నాం..’ అన్నారు రంగప్రసాద్ (98851 22544).
(చదవండి: తొలి ‘జన్యుసవరణ’ వరి!)