
మునగ ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు మునగ కాయల దిగుబడి
ఎకరానికి వెయ్యి మొక్కలు.. మొక్కకు 150 కాయలు..
మునగాకు, గింజల ద్వారా అదనపు ఆదాయం
ఏడాదికి ఎకరానికి రూ.75 వేల ఆదాయం వస్తుందంటున్న శాస్త్రవేత్తలు
సాంప్రదాయ పంటలు పండించే చాలా మంది రైతుల నికరాదాయం ఎకరానికి రూ.20 వేలకు మించటం లేదు. పత్తి, మొక్కజొన్నకు బదులుగా మునగ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతుల నికరాదాయం పెరుగుతుంది. 3 సంవత్సరాలలోపు ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. వాతావరణ ఒడిదుడుగులను తట్టుకోవటానికి మునగ దోహద పడుతుంది.
నాటిన 7–8 నెలల్లో తొలి పంట కోతకు వస్తుంది. మూడేళ్లలో వరుసగా కనీసం 5 కార్శి పంటలు తీసుకోవచ్చు. మునగ ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, విస్తరణ శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర మునగ సాగుపై అందించిన పూర్తి వివరాలు.
పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తినే వారికి ఆరోగ్యం, పండించే వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఏ నేలలైనా ఓకే
అన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5–8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గల సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. ఆరు నెలల్లోనే కాతకు వచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయి.
చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!
అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు
మునగ విత్తనంతో మొక్కలు పెంచి, నాటుకోవాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఏ సమయంలో విత్తినా వేసవిలోనే (జనవరి–ఏప్రిల్ మధ్యలో) పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది. ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు నాటాలి. మొక్కలను ముందుగా నర్సరీల్లో పెంచాలి. పీకేఎం–1 మునగ రకం విత్తుకోవటం మేలు. పాలిథిన్ సంచుల్లో విత్తిన 15 రోజుల్లో మొలక వస్తుంది. మొక్కల మధ్య 1 మీ., వరుసల మధ్య 1.5 మీ. దూరంలో గుంతలు తీసుకోవాలి. అర ట్రక్కు పశువుల ఎరువుకు రెండు బస్తాల వేపపిండి, 10 కేజీల ట్రైకోడెర్మా కలపాలి. దీన్ని ప్రతి గుంతకు రెండు దోసెళ్ళు (ఒక కిలో), గుప్పెడు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి.
ప్రతి మొక్కకూ డ్రిప్ ద్వారా 135: 23: 45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో డ్రిప్ ద్వారా అందించాలి. డ్రిప్ ద్వారా 10–15 లీ. నీరివ్వాలి. నాటిన తర్వాత 3, 6 నెలలకు నత్రజని ఎరువు వేయాలి. వాస్తవానికి మునగ మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. జీవన ఎరువులు కూడా వాడితే నేల సారం, నేల ఆరోగ్యం పెరిగి తెగుళ్ళు రాకుండా ఉంటాయి.
బొంత పురుగులతో జాగ్రత్త
మునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచేస్తాయి.
దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. వేపనూనె మందు ద్రావణం పిచికారీ చేస్తే మొక్కలపై పురుగులకు వికర్షకాలుగా పనిచేస్తాయి.
ఈ పంటలతో మునగను కలపొద్దు
ఆయిల్ పామ్, పత్తి, కూరగాయ పంటల్లో అంతర పంటగా వేస్తే మునగ మొక్కలు ఎరువులు, నీరు ఎక్కువగా అంది చాలా ఏపుగా పెరుగుతాయి. కానీ, పూలు, కాయలు ఆలస్యంగా రావడం స్పష్టంగా గుర్తించాం. కాబట్టి, అంతర పంటగా వేసినప్పుడు మునగ మొక్కలకు ఎక్కువ నీరు, ఎరువులు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చీడపీడలు ఆశించే టమాటా, వంగ, మిర్చి పంటలను మునగలో అంతర పంటలుగా వేసుకోకూడదు. ఎరువులు, సస్యరక్షణ చర్యలు తక్కువ అవసరమయ్యే కూరగాయ పంటలను మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మునగ దిగుబడి తగ్గిపోతుంది. పొలంలో మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి.
ఇదీ చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు
కత్తిరించిన 4–5 నెలల్లో మళ్లీ కాపు
మునగ నాటిన మొదట్లో ప్రతి 2 నెలలకోసారి (6 నెలల్లో 3 సార్లు) విధిగా కొమ్మలు కత్తిరిస్తే.. కొమ్మలు గుబురుగా వచ్చి పూత, కాయల దిగుబడి ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు రాకుండా ఏపుగా బాగా ఎత్తు పెరిగితే పూత సరిగ్గా రాదు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోతాయి. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ. ఎత్తులో మొక్క కాండం, కొమ్మలను కత్తిరించాలి. దీంతో 4–5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఇలా 4–5 నెలల కొకసారి కార్సి పంటలను తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45, 15,30గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. ఏటా 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి.
మొక్కకు 150 కాయలు
ఒక ఎకరానికి 1,000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయల చొప్పున 1,50,000 కాయలు కాస్తాయి. రూపాయికి 2 కాయల చొప్పున (ఒక కేజీకి రూ.5) స్థానికంగా అమ్మితే.. ఎకరానికి ఏడాదికి రూ.75,000 ఆదాయం వస్తుంది. మునగ ఆకులను కోసి ఎండ బెట్టి పొడి చేసి అమ్మొచ్చు. మునగ గింజలు/నూనె ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.
మునగ ప్రకృతి సేద్యం ఇలా..
మునగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడి, మంచి దిగుబడులు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి మునగ సాగుకు బాగా అనుకూలం. భూమిని లోతుగా దున్ని సూర్య కాంతికి ఎండబెట్టాలి. గోతులు తవ్వి, ఎండిన ఆకుల చెత్త, పశువుల ఎరువు, ఘనజీవామృతం లేదా వర్మీ కంపోస్ట్ కలిపి గోతులను నింపాలి. సేంద్రియంగా సాగు చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి.
విత్తనాలను బీజామృతంలో శుద్ధి చేసిన 24 గంటల తర్వాత విత్తాలి. మొక్కలకు జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం వాడాలి. ద్రవ జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరివ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపనూనె, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను తయారు చేసి పిచికారీ చేయాలి. పచ్చి రొట్ట పంటలను పెంచి, కత్తిరించి, మొక్కల మొదళ్ల చుట్టూ మల్చింగ్‌గా వెయ్యాలి. కలుపు సమస్య తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు 30–40% తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మునగ కాయలు రుచిగా, పోషకాలు అధికంగా ఉండి, ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి.
ఇతర వివరాలకు.. డా. టి. భరత్ – 97005 49754