వింగ్‌డ్‌ బీన్స్‌..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే! | How to grow Winged beans rich in nutrients and health benefits | Sakshi
Sakshi News home page

వింగ్‌డ్‌ బీన్స్‌..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!

Published Wed, Feb 26 2025 1:41 PM | Last Updated on Wed, Feb 26 2025 1:53 PM

How to grow Winged beans rich in nutrients and health benefits

వింగ్‌డ్‌ బీన్‌ (సోఫోకార్పస్‌ టెట్రాగోనోలోబస్‌)..  ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఒక రకం చిక్కుడు పంట. మిగతా చిక్కుడు కాయల కన్నా ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ చిక్కుడు కాయకు నాలుగు ముఖాలు ఉంటాయి. అందువల్ల ఈ తీగ జాతి కూరగాయ మొక్కకు ‘రెక్కల చిక్కుడు’ అని పేరొచ్చింది. ఉష్ణమండల ప్రాంతాల్లో చక్కగా పెరుగుతుంది. ఆసియా దేశాలకు బాగా అనుకూలమైనదైనా, ఇప్పటి వరకు  తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సాగు చేయని పంట ఇది. ఇది కూరగాయ పంట. ఆకుకూర పంట. దుంప పంట. పప్పు ధాన్యపు పంట కూడా! ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకొని దిగుబడినిచ్చే అద్భుత పంట!! 

భారత్, బర్మా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, చైనా తదితర దేశాల్లో సాగవుతోంది. వింగ్‌డ్‌ బీన్స్‌తో కూర చేసుకోవచ్చు. ఎండు చిక్కుడు గింజల కోసం కూడా పెంచవచ్చు.  గాలిలో పుష్కలంగా ఉన్న నత్రజనిని గ్రహించి నేలకు అందించే సామర్థ్యం అన్ని పప్పుధాన్యపు పంటలకూ ఉంది. దీనికి కొంచెం ఎక్కువగా ఉంది. దీని వేర్లపై ఉండే బుడిపెల ద్వారా నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది. దీని ఆకుల్లో కూడా అత్యంత నాణ్యమైన మాంసకృత్తులు ఉంటాయి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు దోహదపడే ఈ చక్కని చిక్కుడు పంటపై మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. వింగ్‌డ్‌ బీన్‌లో కూడా అనేక రకాల వంగడాలు ఉన్నాయి. అద్భుతమైన ఈ కూరగాయ పంట ప్రతికూల బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో నివసించే పేద గ్రామీణ కుటుంబాల ఆహారంలో మాంసకృత్తులను తగినంత చేర్చగల శక్తి ఉన్న పంట ఇది. సారం అంతగా లేని భూముల్లో సైతం మంచి దిగుబడినిస్తుంది. 

పంట  పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, భూసారాన్ని పెంపొందించడానికి, వాణిజ్యపరంగా ఆదాయం పొందడానికి కూడా వర్షాధార వ్యవసాయంలో వింగ్‌డ్‌ బీన్‌ సాగును ్ర΄ోత్సహించవలసిన అవసరం ఉందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్‌) పరిశోధన, విస్తరణ సిబ్బందికి సూచించింది. వింగ్‌డ్‌ బీన్స్‌ ప్రజల పళ్లాల్లోకి చేర్చగలిగితే మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలమని, పౌష్టికాహార లోపాన్ని  పారదోలగలమని ఐసిఏఆర్‌ ఆశిస్తోంది. కూరగాయ తోటల్లో, ఇంటిపంటల్లో, మిద్దె తోటల్లో సైతం సాగు చేయదగిన మేలుజాతి తీగ జాతి కూరగాయ పంట ఇది.

వన్‌ స్పెసీస్‌ సూపర్‌మార్కెట్‌!
ఐసిఏఆర్‌ వింగ్‌డ్‌ బీన్‌ని ‘వన్‌ స్పెసీస్‌ సూపర్‌మార్కెట్‌’గా అభివర్ణించింది. ఆకుపచ్చని కాయలు, ఆకులు, గింజలతో పాటు.. కొంచెం లావుగా పెరిగే దీని వేర్లు కూడా చక్కని పోషకాలతో కూడి ఉండటమే ఇందుకు కారణం. ఆకులను పాలకూర మాదిరిగా పప్పులో వేసుకోవచ్చు. పూలను సలాడ్‌గా తినొచ్చు. దుంప మాదిరిగా ఊరే వేర్లను విడిగా తినొచ్చు లేదా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో కలుపుకోవచ్చు. ఈ తీగ జాతి మొక్క వేగంగా అల్లుకుపోతుంది కాబట్టి సజీవ ఆచ్ఛాదనగా వేసుకోవచ్చు. ప్రధాన పంట మధ్యలో కలుపు పెరగనీయకుండా అంతరపంటగా, పంటమార్పిడి కోసం సాగు చేస్తూ భూసారాన్నిపెంపొందించుకోవచ్చు. ఇది తేలిగ్గా చనిపోదు. ఇతరత్రా ప్రధాన ఆహార పంటలతో పోల్చితే కరువును, వరదను, వేడిని, చీడపీడలను అధికంగా తట్టుకునే శక్తి ఈ పంటకు ఉంది. 

ఇది బహు వార్షిక పంట. అయితే, వార్షిక పంటగానే సాగులో ఉంది. ఈ తీగ 3–4 మీటర్ల కన్నా  పొడవుగానే పెరుగుతుంది. తీగ సాధారణంగా ఆకుపచ్చగా ఉంటుంది. కొన్ని రకాల వింగ్‌డ్‌ బీన్‌ జాతుల తీగ ఊదా, గులాబీ, గోధుమ రంగుల్లో కూడా ఉంటాయి. పూలు తెలుపు నుంచి ముదురు ఊదా రంగు, నీలం, నీలం తెలుపు కలగలపు రంగుల్లో ఉంటాయి. కాయలు నాలుగు పలకలుగా 15-22 సెం.మీ. ΄ పొడవున 2-3 సెం.మీ. వెడల్పున ఉంటాయి. కాయలో 5 నుంచి 20 గుండ్రటి గింజలుంటాయి. ఎండిన తర్వాత ముదురు గోధుమ రంగులో ఉంటాయి. 

వింగ్‌డ్‌ బీన్‌ పంటలో ఎక్కువ రకాలు న్యూగినియా, మారిషస్‌ దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అస్సాం, మణిపూర్, మిజోరం, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో ఎక్కువగా దీన్ని సాగు చేస్తున్నారు. ఉత్తరాది మైదాన ప్రాంతాల్లోనూ మంచి దిగుబడినిస్తున్నట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి తప్ప పెద్దగా ప్రాచుర్యంలోకి రాని పంట ఇది.

పుష్కలంగా  పోషక విలువలు
వచ్చే కాలంలో మన ప్రాంతాల్లో కూడా బాగా ్ర΄ాచుర్యంలోకి తేదగిన అద్భుత  పోషక విలువలు కలిగిన పంట వింగ్‌డ్‌ బీన్‌.  ప ప్రొటీన్, పీచు, బీకాంప్లెక్స్‌ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు తగుపాళ్లలో వింగ్‌డ్‌ బీన్స్‌లో ఉన్నయి. థయామిన్, పైరిడాక్సయిన్‌  (విటమిన్‌ బి–6), నియాసిన్, రిబోఫ్లావిన్‌ వంటి బికాంప్లెక్స్‌ విటమిన్లు ఉన్నాయి. ఇనుము, రాగి, మాంగనేసు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు ఉన్నాయి. వింగ్‌డ్‌ బీన్‌ ఆకుల్లో పీచు, విలమిన్‌ ఎ, సి, ఖనిజాలు ఉన్నాయి. వంద గ్రాముల తాజా ఆకుల్లో 45 మిల్లీ గ్రాముల విటమిన్‌ సి (రోజువారీ అవసరంలో ఇది 75%), 8090 ఇంటర్నేషనల్‌ యూనిట్ల (ఐయు) విటమిన్‌ ఎ (270% ఆర్‌డిఎ) ఉంటాయి.  

లేత వింగ్‌డ్‌ బీన్‌ కాయల్లో ఫొలేట్స్‌ పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల బీన్స్‌లో 66 మైక్రో గ్రాముల (రోజుకు మనిషికి రోజువారీ అవసరంలో ఇది 16.5%) ఫొలేట్స్‌ ఉంటాయి. డిఎన్‌ఎ సంశ్లేషణకు, కణ విభజనకు విటమిన్‌ బి–12తో ΄ాటు ఫొలేట్స్‌ అతి ముఖ్యమైనవి. గర్భం దాల్చే సమయం నుంచి ప్రసవం వరకు తల్లికి ఫొలేట్స్‌ లోపం లేకుండా ఉంటే బిడ్డకు న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌ రావు. వంద గ్రాముల తాజా వింగ్‌డ్‌ బీన్స్‌లో 18.3 మిల్లీ గ్రాముల (రోజువారీ అవసరంలో 31%) విటమిన్‌ సి ఉంటుంది. విటమిన్‌ సి నీటిలో కరిగే యాంటీఆక్సిడెంట్‌. ఇన్ఫెక్షన్లకు తట్టుకునే రోగనిరోధక శక్తిని కలిగించటంలో తోడ్పడుతుంది. రక్త నాళాలకు సంకోచ వ్యాకోచ గుణాన్ని ఇస్తుంది. ఆహారంలో తగినంతగా తీసుకుంటే కేన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. వింగ్‌డ్‌ బీన్స్‌ అతి తక్కువ కేలరీలతో కూడిన కూరగాయ. వంద గ్రాముల్లో 49 కేలరీలు మాత్రమే ఉంటాయి.

అతివృష్ఠినీ తట్టుకుంటుంది!
కరువు కాటకాలను, వరదలను, తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని, చీడపీడలను తట్టుకొని దిగుబడినివ్వగలగటం అనే లక్షణం వాతావరణ మార్పుల నేపథ్యంలో మిగతా ప్రధాన పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో కూడా వింగ్‌డ్‌ బీన్స్‌ నిరాశపరచదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలకు ఆహార కొరత, ΄పౌకాహార లోపాన్ని సరిదిద్దే క్రమంలో తోడ్పడే పంటగా దీన్ని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీని ఆకులు, కాయలు, గింజలు, దుంపల్లాంటి వేర్లను తినటానికి వీలుంది. మిగిలిన తీగను పశుగ్రాసంగా వాడుకోవచ్చు. నత్రజనిని స్థిరీకరిస్తుంది కాబట్టి పంట మార్పిడికి ముఖ్యమైన పంటగా ఇది గుర్తింపు  పొందింది. ఇది ప్రధానంగా స్వీయపరాగ సంపర్క పంట. మహా అయితే 7.6% మేరకు పరపరాగ సంపర్కం జరుగుతున్నట్లు గుర్తించారు. 

వింగ్‌డ్‌ బీన్స్‌ పంట అనావృష్టిని, అతివృష్టిని కూడా తట్టుకుంటుంది. 700 మిల్లీ మీటర్ల నుంచి 4100 ఎం.ఎం. వార్షిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత 15.4 – 27.5 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతను ఇష్టపడుతుంది. మెత్తని దుక్కి చేసి విత్తుకుంటే వేరు వ్యవస్థ విస్తరించడానికి వీలుగా ఉంటుంది. ఇసుక నేలల నుంచి లోతైన రేగడి నేలలు, నీరు నిలబడని ఎర్ర నేలలు, సేంద్రియ పదార్థం బాగా ఉన్న నేలలు అనుకూలం. 4.3–7.5 మధ్య ఉదజని సూచిక ఉన్న నేలలు అనుకూలం. సెప్టెంబర్‌ మధ్య నుంచి అక్టోబర్‌ మధ్యలో పూత వస్తుంది. 18 డిగ్రీల కన్నా తక్కువ, 32 డిగ్రీల సెల్షియస్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పూత రాదు. సముద్రతలం నుంచి 2,000 మీటర్ల ఎత్తు వరకు గల ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది (హైదరాబాద్‌ 542 మీ. ఎత్తులో ఉంది). కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో విస్తారంగా సాగు చేయటానికి, తోటల్లో అంతరపంటగా సాగు చేయటానికి ఇది అనుకూలమైన పంట. 

విత్తుకోవచ్చు. కాండం ముక్క పెట్టినా వస్తుంది. హెక్టారుకు 15–20 కిలోల విత్తనాలు అవసరం. విత్తనం పైన గట్టి పెంకులాంటి పొర ఉంటుంది. 1-2 రోజులు నానబెట్టి, 3-4 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 5-7 రోజుల్లో మొలకెత్తుతుంది. 25 డిగ్రీల సెల్షియస్‌ పగటి ఉష్ణోగ్రత ఉన్న కాలంలో చక్కగా పెరుగుతుంది. ఉత్తర–దక్షిణ నిలువు పందిళ్లకు తీగలు పాకిస్తే ఎండ బాగా తగిలి బాగా పెరుగుతుంది. కూరగాయ పంటగా సాగు చేసేటప్పుడు 90 సెంటీమీటర్లు (36 అంగుళాలు)“ 90 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తన పంటగా అయితే 45 సెం.మీ.“ 45 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. తీగ 3-4 మీటర్ల కన్నా తక్కువ పెరిగే రకాలైతే 30 సెం.మీ. “ 20 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. రుతుపవనాలు వచ్చిన తర్వాత జూన్‌–జూలైల్లో నాటుకోవాలి. వింగ్‌డ్‌ బీన్‌ వేరు దుంపలను కూడా ఆహారంగా వాడుతారని చెప్పుకున్నాం కదా. దుంపల కోసం సాగు చేసేటప్పుడు ఆగస్టు–సెప్టెంబర్‌ మధ్య ఆలస్యంగా విత్తుకుంటే రొట్ట ఎక్కువ పెరగకుండా వేరు ఎక్కువ పెరుగుతుంది.

నత్రజని తక్కువ నేలలైనా.. 
నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది కాబట్టి వింగ్‌డ్‌ బీన్స్‌ పంటను సారం తక్కువగా ఉన్న నేలల్లోనూ విత్తుకోవచ్చు. హెక్టారుకు 20 టన్నుల మాగిన పశువుల ఎరువుతోపాటు 50:80:50 కిలోల ఎన్‌.పి.కె. ఎరువులు హెక్టారుకు వేసుకోవాలి. నత్రజనిని మాత్రం రెండు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని విత్తనానికి ముందు, రెండో భాగాన్ని 40–60 రోజుల మధ్య వేసుకోవాలి.

నెలలోనే కమ్మేస్తుంది!
వింగ్‌డ్‌ బీన్స్‌ తీగ విత్తిన నెల రోజుల్లోనే వేగంగా పెరిగి  పొలం అంతా కమ్మేస్తుంది. విత్తిన తర్వాత 15–20 రోజులకు ఒకసారి కలుపు తీస్తే చాలు. వేరు దుంపల కోసం సాగు చేస్తే నేల మీదే పాకించవచ్చు. కూరగాయ పంటగా, విత్తనాల పంటగా సాగు చేసుకుంటేపాదులను ఒక మోస్తరు ఎత్తు గల ఊత కర్రలకు పాకిస్తే కాయలు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది.  తుప్పు తెగులు, ఆకుమచ్చ వంటి శిలీంధ్ర తెగుళ్లు తప్ప మిగతా తీవ్రమైన చీడపీడలేవీ ఈ పంటకు సోకవు. రూట్‌నాట్‌ నెమటోడ్స్‌ సమస్య ఉండొచ్చు. అవసరాన్ని బట్టి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.

చదవండి: ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన
ఐరన్‌ లోపానికి అర్క ఐరన్‌ ఫార్టిఫైడ్‌ మష్రూమ్‌


 


 

హెక్టారుకు 5–10 టన్నులు
విత్తుకున్న 10 వారాలకు ఆకుపచ్చని వింగ్‌డ్‌ బీన్స్‌ కూరగాయలను కోసుకోవచ్చు. హెక్టారుకు 5–10 టన్నుల వరకు తాజా కాయలతోపాటు అంతే బరువైన వేరు దుంపల దిగుబడి వస్తుంది. విత్తనాలైతే హెక్టారుకు 1 నుంచి 1.5 టన్నుల దిగుబడి వస్తుంది. తాజా వింగ్‌డ్‌ బీన్స్‌ కూరగాయలను ప్లాస్టిక్‌ బాగ్స్‌లో కట్టి 10 డిగ్రీల సెల్షియస్, 90% తేమ గల చోట నిల్వ చేస్తే 4 వారాల వరకు బాగుంటాయి. 

ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం,పౌష్టిక విలువలతో కూడిన పంట కావటంతో వింగ్‌డ్‌ బీన్స్‌ పంట భవిష్యత్తులో విస్తారంగా సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సాగవుతున్న రాష్ట్రాల్లో నుంచి అనువైన రకాలను సేకరించి తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యాన పరిశోధనా సంస్థలు పరిశోధన చేసి స్థానికంగా రైతులకు విత్తనాలను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వం విధానాల ద్వారా ఈ పంట వ్యాప్తికి దోహదం చేయాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement