beans
-
ఫ్రాన్స్, బెల్జియం చాక్లెట్లలో ఆంధ్రా రుచులు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ‘కోకో’కు ప్రపంచ స్థాయి బ్రాండింగ్ తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీవో) ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడం విజయవంతం కావడంతో మరో ఐదు ఎఫ్‌పీవోల ద్వారా చెన్నై, ముంబై, కేరళతో పాటు ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట 21 వేల హెక్టార్లలో కోకో సాగవగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రస్తుతం 40 వేల హెక్టార్లకు విస్తరించింది. ఏటా 38 వేల టన్నుల కాయలు దిగుబడి వస్తుండగా.. వాటి నుంచి 11 వేల టన్నుల గింజలొస్తాయి. దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్లే, క్యాంప్కో, లోటస్ వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి. సాధారణంగా గుజ్జుతో కూడిన గింజలను 1–2 రోజులు ఎండబెట్టి కంపెనీలకు అమ్ముతుంటారు. వీటికి కిలో రూ.180–210 చొప్పున చెల్లిస్తుంటారు. కోకో రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రీమియం చాక్లెట్ల తయారీలో ఉపయోగించే ఫైన్ ఫ్లావర్డ్ బీన్స్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా 35 శాతం సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తోంది. ప్రీమియం కోకో గింజల ఉత్పత్తి కోసం బాక్స్ పర్మంటేషన్పై అవసరమైన సాంకేతిక శిక్షణనిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా కృష్ణా జిల్లా నూజివీడు మండలం తడికలపూడిలోని సాయిరాగ్ ఫుడ్స్ అండ్ బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సబ్సిడీపై ఆర్థిక చేయూతనివ్వగా.. గడిచిన ఏడాదిలో 25 టన్నుల ప్రీమియం కోకో గింజలను ముంబై నుంచి ఫ్రాన్స్‌కు ఎగుమతి చేశారు. ఫలితంగా కంపెనీ పరిధిలోని 300 మందికి పైగా రైతులు కిలోకు రూ.80 అదనంగా లబ్ధి పొందారు. 35 శాతం సబ్సిడీపై రుణాలు పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇదే రీతిలో ప్రోత్సహించేందుకు 25 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను గుర్తించారు. తొలి విడతగా ద్వారకా పామ్ ఆయిల్‌ఫెడ్, చింతలపూడి ఫార్మర్స్ ఫెడ్, తీగలవంచ నర్సాపురం ఫెడ్, మద్ది ఆంజనేయ, టి.కృష్ణారెడ్డి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌లకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.10 లక్షల సబ్సిడీ(35 శాతం)తో రూ.28 లక్షల ఆర్థిక చేయూతనిచ్చారు. ఈ ఎఫ్‌పీవోల పరిధిలో 1500 మంది రైతులు 5 వేల ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నారు. వీరికి ఫైన్ ఫ్లావర్డ్ కోకో గింజల ఉత్పత్తిపై శిక్షణ కూడా ఇచ్చారు. డిసెంబర్ నుంచి ఇవి 16 టన్నుల చొప్పున చెన్నై, ముంబై కంపెనీల ద్వారా ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫర్మంటేషన్ చేస్తారిలా.. గుజ్జుతో కూడిన కోకో గింజలను గాలి తగలకుండా 3 రోజులు, గాలి తగిలేలా 3 రోజులు ఫర్మంటేషన్ చేస్తారు. ఆ తర్వాత గుజ్జు నుంచి వేరు చేసిన గింజలను వేరు డ్రయింగ్ ప్లాట్ ఫారమ్స్‌పై ఐదు రోజుల పాటు ఎండబెడతారు. సారి్టంగ్, గ్రేడింగ్ తర్వాత క్వాలిటీ గింజలను 5, 20 కిలోల చొప్పున ప్యాకింగ్ చేస్తారు. ఇలా తయారైన ఫ్లావర్డ్ బీన్స్‌కు మార్కెట్ రేటు కంటే 30 శాతం అదనపు ధర లభిస్తుంది. అదే సేంద్రియ పద్ధతిలో సాగు చేసి, శాస్త్రీయ పద్ధతిలో ఫర్మంటేషన్ చేస్తే మరో 15 శాతం అదనంగా చెల్లిస్తామంటున్నాయి. ఒక్కో రైతుకు రూ.20 వేలు అదనపు ఆదాయం కంపెనీ పరిధిలో 223 మంది రైతులు 557 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు 400 కిలోల కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో కిలోకు రూ.180 లోపే వస్తున్నాయి. ఫర్మంటేషన్ చేసి కేరళకు చెందిన కంపెనీ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కిలోకు రూ.50–80 చొప్పున.. ఒక్కో రైతుకు రూ.20 వేలు అదనంగా ఆదాయం వస్తోంది. తొలి దశలో 16 టన్నులు ప్రాసెస్ చేసి ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – నల్లజర్ల పవన్‌కుమార్, ఎండీ, ద్వారకా తిరుమల పామ్ ఆయిల్ ఫెడ్ ప్రొడ్యూసర్స్ కంపెనీ సబ్సిడీతో ఆర్థిక చేయూత కోకో రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎఫ్పీవోలుగా ఏర్పడి ముందుకొచ్చే రైతులకు 35 శాతం సబ్సిడీపై ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైన శిక్షణ కూడా ఇస్తాం. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
బీన్స్ గింజపై ఆస్కార్ ‘నాటు నాటు’
తెనాలి(గుంటూరు జిల్లా): లాస్ ఏంజిలిస్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..ఊర నాటు’ పాటను ప్రవాస భారతీయ చిత్రకారుడు బీన్స్ గింజపై చిత్రీకరించారు. దర్శక ప్రముఖుడు రాజమౌళి తీసిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటను జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కువైట్‌లోని పాహీల్ అల్ వతానీ ఇండియన్ ప్రైవేట్ స్కూలులో చిత్రకళ విభాగం అధిపతి ఎ.శివనాగేశ్వరరావు వైట్ బీన్స్ గింజపై సూక్ష్మంగా చిత్రీకరించారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్‌ను, మధ్యలో ఆస్కార్ అవార్డును తీర్చిదిద్దారు. చిత్రకారుడనైన తాను, ఈ సూక్ష్మచిత్రంతో ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టు శివనాగేశ్వరరావు ‘సాక్షి’కి ఫోనులో వెల్లడించారు. శివనాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. చదవండి: రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల -
కిడ్నీ సమస్యలకు బీన్స్, తులసి, ద్రాక్ష
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడాలేకుండా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లు, జీవన విధానంలో మార్పుతో ఈ సమస్య సాధారణంగా మారింది. ఈ సమస్య రాకుండా, అప్పటికే సమస్య ఉంటే అది పెద్దది కాకుండా చూసుకోవాలంటే అది మన చేతిలో పనే. కిడ్నీ బీన్స్(రాజ్మా): ఈ బీన్స్ మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన అరవై గ్రాముల బీన్స్ గింజలను వేయాలి. ఈ నీటిని నాలుగు గంటలపాటు సన్నటి మంట మీద ఉంచి మరగనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు 8 గంటల పాటు చల్లబరచాలి. చల్లారిన మిశ్రమాన్ని మళ్లీ వడకట్టుకోవాలి. రోజులో రెండు గంటలకోసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కొన్నిసార్లు తీసుకోవాలి. డికాషన్ తయారయిన 24 గంటలలోపే అది ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్‌లో సమస్యలు, ఏ ఇతర సమస్యలున్నా ఇది మంచి చిట్కా. తులసి ఆకులు: తులసి ఆకులకు ఒక టీస్పూన్ తేనె కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ద్రాక్ష: ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్ ఉంటాయి. ఇవి మూత్రపిండ సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య తలెత్తదు. ఇది చాలా సురక్షితమైనది కూడా. -
చల్లాడ్స్
కట్ చేయండి... ఎండను తగ్గించండి... కలపండి... ఎండను తొలగించండి... ఫ్రిజ్‌లో పెట్టండి... ఎండను చల్లబరచండి... ఆరగించండి... ఎండను తరిమికొట్టండి... ఎండలకు సలాడ్‌తో జవాబు చెప్పండి... క్యాబేజీ, బీన్స్, రైస్, ఎగ్ ... కాదేదీ సలాడ్కనర్హం... ఆరోగ్యమూ చల్లదనమూ వీటి సొంతం! చికెన్ సలాడ్ విత్ చౌ మే నూడుల్స్ కావలసినవి: డ్రెసింగ్ కోసం: బ్రౌన్ సుగర్ – 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ – 2 టీ స్పూన్లు, కమలాపండు రసం – 2 టీ స్పూన్లు, నువ్వుల నూనె – 4 టీ స్పూన్లు, వెజిటబుల్ ఆయిల్ – పావు కప్పు, వెనిగర్ – 3 టేబుల్‌స్పూన్లు సలాడ్ కోసం: లెట్యూస్ ఆకు – ఒకటి (చిన్నది, సన్నగా తరగాలి. ఈ ఆకు దొరకని చోట క్యాబేజీ తరుగు ఉపయోగించుకోవచ్చు), ఉడికించిన బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్ – 4 ముక్కలు, ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లు, క్యారట్ తురుము – అర కప్పు, నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించకూడదు), పల్లీలు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), కమలా పండు తొనలు – 10 తయారీ: ∙డ్రెస్సింగ్ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో, లెట్యూస్ లేదా క్యాబేజీ తరుగు, చికెన్, ఉల్లికాడల తరుగు, డ్రై నూడుల్స్, క్యారట్ తురుము, పల్లీ ముక్కలు వేసి బాగా కలిపి, డ్రెసింగ్ వస్తువులు వేసిన పాత్రలో వేసి కలపాలి ∙కమలా పండు తొనలతో అలంకరించి, వెంటనే అందించాలి. గ్రీక్ రైస్ సలాడ్ కావలసినవి: అన్నం – 3 కప్పులు, పుట్ట గొడుగులు – కప్పు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీరు ఒంపేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి), టొమాటో – 1 (ముక్కలు చేయాలి), కీర దోస చక్రాలు – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, చీజ్ – పావు కప్పు, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను, మిరియాల పొడి – అర టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో అన్నం, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి మూత పెట్టి, ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీసేయాలి ∙బౌల్స్‌లో సర్వ్ చేసే ముందు, కొద్దిగా కొత్తిమీర వేసి అందించాలి. క్యాబేజీ సలాడ్ విత్ ఎ క్రంచ్ కావలసినవి: క్యాబేజీ తరుగు – ఒక కప్పు, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, నూడుల్స్ – ఒక ప్యాకెట్, నువ్వులు – ఒక టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4 (మెత్తగా చేయాలి), బాదం పప్పులు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)డ్రెసింగ్ కోసంసోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ – పావు కప్పు, పంచదార – అర కప్పు, రిఫైన్డ్ ఆయిల్ – పావు కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, అల్లం తురుము – పావు టీ స్పూను తయారీ: ∙పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక సోయా సాస్, వెనిగర్, పంచదార, రిఫైన్డ్ ఆయిల్, మిరియాల పొడి, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి ∙ చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి ∙ ఒక చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక నూడుల్స్, నువ్వులు, వెల్లుల్లి ముద్ద వేసి పదార్థాలన్నీ బంగారు రంగులోకి మారేవరకు కలిపి దింపేయాలి ∙ ఒక పెద్ద బౌల్లో నూడుల్స్ మిశ్రమం, క్యాబేజీ తరుగు వేసి కలపాలి ∙ ఫ్రిజ్‌లో నుంచి డ్రెసింగ్ మిశ్రమం బయటకు తీసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి, బాదం పప్పులతో అలంకరించి చల్లగా అందించాలి. త్రీ బీన్ సలాడ్ కావలసినవి: నానబెట్టిన అలసందలు – ఒక కప్పు ; నానబెట్టిన చిక్కుడు గింజలు; – ఒక కప్పు ; నానబెట్టిన సెనగలు – ఒక కప్పు ; ఉల్లి తరుగు – అర కప్పు ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు ; పంచదార – పావు కప్పు ; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు ; ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; నల్ల మిరియాలు – పావు టీ స్పూను; వెనిగర్ – 2 టీ స్పూన్లు తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మూడు రకాల గింజలూ వేసి బాగా కలపాలి ∙ కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙ వేరొక బౌల్లో వెనిగర్, పంచదార, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గింజలున్న బౌల్లో వేసి కలిపి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి, అందించాలి. సాల్మన్ ఎగ్ స్పెషల్ సలాడ్ కావలసినవి: సాల్మన్ చేప – 14 ముక్కలు (ఫోర్క్‌తో గాట్లు పెట్టి, నూనెలో వేయించాలి), ఉడికించిన కోడిగుడ్లు – 6 (పెంకు తీసి, కోడి గుడ్లను చిన్నచిన్న ముక్కులుగా చేయాలి), ఉల్లి తరుగు – అర కప్పు, ఆవాలు – ఒకటిన్నర స్పూన్లు (నీళ్లలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి), చీజ్ – అర కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూను, మిరప పొడి – పావు టీ స్పూను, ఉప్పు – తగినంత తయారీ: పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్లో వేసి బాగా కలిపి, మూత పెట్టి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి చల్లగా అందించాలి. చపాతీ నూడుల్స్ ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు నూడుల్స్‌కి బాగా అలవాటు పడ్డారు. మైదాతో తయారయ్యే నూడుల్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వాటికి బదులుగా చపాతీలతో నూడుల్స్‌లా చేసి పెడితే, మళ్లీ మళ్లీ కావాలంటారు. కావలసిన వస్తువులు: చపాతీలు – 3, ఉల్లిపాయ – 1, పచ్చి మిర్చి – 2, క్యారట్ – 1, బీన్స్ – 8, అజినమోటో– చిటికెడు, పంచదార – ఒక టీ స్పూను, మిరియాలపొడి – ఒక టీ స్పూను, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 4 టీ స్పూన్లు ∙ఉల్లిపాయలను సన్నగా తరగాలి ∙క్యారట్, బీన్స్‌లను సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ∙చపాతీలను కత్తెరతో సన్నగా నూడుల్స్‌లా కట్ చేయాలి ∙ప్యాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి ∙క్యారట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి ∙పంచదార, అజినమోటో జత చేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత కట్ చేసుకున్న చపాతీ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దింపేసి, కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి. మైదాపిండితో దుష్ప్రభావాలు ఫుడ్ ఫ్యాక్ట్స్ సాధారణంగా బిస్కెట్లు, బ్రెడ్, కేకులు వంటి బేకరీ ఉత్పత్తులలో మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కువగా తినే పిజ్జా, పేస్ట్రీలు, బర్గర్లు, పరాఠాలు, నాన్, స్వీట్స్ వంటి వాటిలో సైతం మైదా వాడకం ఎక్కువే. మైదాపిండిని గోధుమల నుంచే తయారుచేస్తారని తెలుసా! గోధుమ పిండిని సన్నటి జల్లెడలో జల్లించితే వచ్చేదే మైదా పిండి. ఇంత ఎక్కువగా జల్లించడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు పూర్తిగా బయటకుపోతాయి. జల్లెడ పట్టిన పిండిని బెంజైల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో బ్లీచింగ్ చేశాక, వచ్చిన మెత్తని పిండిని మైదాపిండిగా వాడుతుంటారు. ఇన్ని రకాలుగా ప్రోసెస్ చేయడం వల్ల ఈ పిండి మానవ ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుంది. చెడు ప్రభావాలు... మైదా పిండిలో అత్యధికంగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల ఈ పిండిని ఏ రూపంలో తిన్నా సుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి, పాంక్రియాస్‌పై ఒత్తిడి పడుతుంది. చివరకు ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. శరీరంలోని కొవ్వు శాతం పెరిగి, ఊబకాయులవుతారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. కోలన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మలబద్దకం కలుగుతుంది. ఇన్ని చెడు ప్రభావాలు కలిగించే మైదాను వాడటం అవసరమా అని ఆలోచించుకోవాలి. మైదాకు బదులుగా... మైదాకు బదులుగా జొన్న, రాగి, వరి... ధాన్యాల నుంచి తయారయ్యే పిండిని వాడటం మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాల్ పోస్టర్లు అతికించడానికి, బట్టలకు గంజి పెట్టడానికి ఉపయోగించే మైదాను రోజువారీ ఆహారంలో నుంచి తొలగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంటి చిట్కాలు ఉసిరి పచ్చడి నల్లబడకుండా ఉండాలంటే, పచ్చడిలో తగినంత నిమ్మరసం కలిపితే సరి ∙దోస ఆవకాయ ఘాటుగా అనిపిస్తే, కొద్దిగా నిమ్మరసం పిండితే, ఘాటు కొంతవరకు తగ్గుతుంది ∙టొమాటో పప్పు చప్పగా అనిపిస్తే, టీ స్పూను నిమ్మరసం జత చేస్తే రుచిగా ఉంటుంది. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. మీరు చేసిన భిన్నమైన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail : familyvantakalu@gmail.com సేకరణ: వైజయంతి -
‘కూరా’ భారం
భగ్గుమంటున్న కూరగాయల ధరలు కొత్తమీర కట్ట రూ.100...బెండ, మిరప, కాకర కిలో రూ.40 70 శాతం పంట దిగుబడి తమిళనాడు, కర్ణాటకకు ఎగుమతి ధరల పెరుగుదలకు ఇదే అసలు కారణం సొమ్ము చేసుకుంటున్న దళారులు బెంబేలెత్తుతున్న సామాన్యులు చిత్తూరు కలెక్టరేట్లో పనిచేస్తున్న గంగాధర్ కూరగాయలు కొనుగోలు చేద్దామని మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ధరలు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. కొత్తిమీర కట్ట రూ.100, బీన్స్ కిలో రూ.80, బెండ కిలో రూ. 40, కాకర కిలో రూ. 40, క్యారెట్ కిలో రూ.40 ఇలా కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తి పోయాడు. ఇవేం ధరలు బాబోయ్ అంటూ అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసుకుని వెనుదిరిగాడు. మూడు నెలలుగా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు ఏమి కొనాలన్నా.. తినాలన్నా ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వేసవి ప్రారంభం నుంచే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయాలు బోరుబావులపై ఆధారపడి మాత్రమే సాగు చేస్తారు. ఈ సీజన్లో ( 3 నెలలు) జిల్లా వ్యాప్తంగా 24,281 హెక్టార్లలో రైతులు కాయగూరలు సాగుచేశారు.రాయలసీమ జిల్లాలతో పాటు ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పోలిస్తే కూరగాయల దిగుబడిలో జిల్లా ప్రథమస్థానంలో ఉంది. పొరుగు జిల్లాలతో పోలిస్తే జిల్లాలో ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దిగుబడిలో 70 శాతం పంట చెన్నై, బెంగళూరు, వేలూరు, విజయవాడ తదితర ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతుండడమే దీనికి ప్రధాన కారణం. ఎగుమతే కారణం జిల్లాలో దిగుపడి అయ్యే కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండడంతో ఇక్కడ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పడమటి మండలాల్లో అధిక శాతం మంది రైతులు కూరగాయల సాగును చేస్తున్నారు. ప్రధానంగా పలమనేరు, మదనపల్లి, వి.కోట, కలికిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూరగాయల బహిరంగ మార్కెట్‌ను వ్యాపారస్తులు నిర్విహ స్తున్నారు. దీంతో ఇక్కడి మార్కెట్లలో రైతుల నుంచి అయినికాడికి కొనుగోలు చేసే కూరగాయలను వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలైన చెన్నై, బెంగళూరు, విజయవాడ, వేలూరు తదితర ప్రాంతాలకు అధిక ధరలకు తరలించి లాభపడుతున్నారు. రైతులు మాత్రం దళారులు సొమ్ము చేసుకుంటున్న దానిలో మూ డో వంతు ఆదాయాన్ని కూడా పొందడం లేదు. వ్యాపారులు లాభాలకోసం ఇతర ప్రాంతాలకు కూరగాయలను తరలించడం వలన జిల్లావాసులకు అవసరమైన మేరకు కూరగాయలు లభించడంలేదు. దీంతో ఇటు రైతులు, అటు వినియోగదారులు నష్టాలపాలవుతున్నారు. కొనలేని స్థితిలో ప్రజలు సామాన్య ప్రజలు కూరగాయలను కొనలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రెండు కేజీల కూరగాయలు కొనాలన్నా రూ. వందకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో కూరగాయలు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొనివుంది. మార్కెట్లలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కొనలేకపోతున్నాం అధిక ధరల కారణంగా కూరగాయలను కొనలేకపోతున్నాం. రోజుకు కనీసం రూ.50 పెడితే గాని నాణ్యమైన కూరగాయ లు దొరకడం లేదు. రోజంతా కూలి చేసినా రూ.200 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. అందులో రూ.50 కూరగాయలకే ఖర్చు చేస్తే మిగిలిన వస్తువులను ఏవిధంగా కొనాలో అర్థం కావడం లేదు. - కాంచన, గృహిణి, అయ్యప్పగారిపల్లె ప్రభుత్వం పట్టించుకోవాలి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకుని కూరగాయల ధరలు తగ్గించాలి. వందలాది రూపాయలు వెచ్చించి కూరగాయలు కొంటున్నా. కనీసం చేతి బ్యాగు కు కూడా రావడం లేదు. అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు దొరకడం లేదు. - సుమతి, గృహిణి, మురకంబట్టు -
ధరలకు రెక్కలు
ఘాటెక్కిన అల్లం మళ్లీ ఉల్లి లొల్లి పెళ్లిళ్ల సీజన్లో కూరల కొరత నగరవాసి జేబులు ఖాళీ ఎండలు మండుతున్నాయి.. కూరగాయల ధరలు భయపెడుతున్నాయి. ఒకవైపు దిగుబడి తగ్గిపోవడం.. మరోవైపు లగ్గసర్లు కావడంతో కూరలకు గిరాకీ బాగా పెరిగింది. బీన్స్, క్యారెట్, క్యాప్సికం కాదేదీ.. ధరల పెరుగుదలకనర్హం అన్నట్లుంది కూరగాయల పరిస్థితి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తేనే జేబులోకి సరిపడా కూరలు వస్తాయన్న చందంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఏం కొనాలో.. ఏం తినాల్లో అర్ధంకాక సగటుజీవి అల్లాడిపోతున్నాడు. విజయవాడ సిటీ : కూరల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ పెరిగింది. కూరగాయలు పండించే సీజన్ ముగియడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో వ్యాపారులు ధరలు దండిగా పెంచేశారు. ఫలితంగా కాయగూరలు దొరకక జనం ఇబ్బందిపడుతున్నారు. ఈ ప్రభావం రైతుబజార్లపై పడి అక్కడా ధరలు బాగా పెరిగాయి. ప్రైవేటు మార్కెట్ల వర్తకులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ జేబులు గుల్లచేస్తున్నారు. ఉల్లిపాయలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంటే.. అల్లం ధర కూడా ఘాటెక్కింది. వారం రోజుల క్రితం కంటే కూరగాయల ధరలు సగానికి సగం పెరిగాయి. వేసవి సీజన్ పూర్తికావడంతో స్థానికంగా కూరల దిగుబడులు తగ్గాయి. వారం రోజులుగా దాదాపు 30 శాతం దిగుబడులు తగ్గినట్లు రైతుబజారు అధికారులు చెప్పారు. విజయవాడలో ఐదు, జిల్లాలో 12 రైతుబజార్లు ఉన్నాయి. స్థానిక రైతుబజార్లకు 5,500 క్వింటాళ్ల కూరగాయల ఉత్పత్తులు వస్తుంటాయి. వీటిన్నింటిలో స్వరాజ్యమైదానం రైతుబజారులో అత్యధికంగా రోజుకు మూడు వేల క్వింటాళ్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి. కొద్ది రోజులుగా రెండు వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. జిల్లాలో జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్‌జంక్షన్, నూజివీడు రైతుబజార్లకూ కూరగాయలు తక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రైవేటు మార్కెట్లలో రేట్లు విపరీతంగా పెంచేశారు. ఇక ఇళ్ల వద్ద పావుకిలో కూరగాయలు రూ.10 చొప్పున, కేజీ రూ.40కి విక్రయిస్తున్నారు. ఇంకొన్ని రకాల కూరగాయలను కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయించిన ఉల్లి కేజీ రూ.21కు పెరిగింది. బయట మార్కెట్లో రూ.25కు విక్రయిస్తున్నారు. అల్లం రైతుబజార్లలో కేజీ రూ.120కి విక్రయిస్తుంటే.. బయట మార్కెట్లో రూ.150 వరకు అమ్ముతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో కూరలు అందుబాటులోకి వచ్చేటప్పటికి మరో రెండు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.