ధరలకు రెక్కలు
- ఘాటెక్కిన అల్లం
- మళ్లీ ఉల్లి లొల్లి
- పెళ్లిళ్ల సీజన్‌లో కూరల కొరత
- నగరవాసి జేబులు ఖాళీ
ఎండలు మండుతున్నాయి.. కూరగాయల ధరలు భయపెడుతున్నాయి. ఒకవైపు దిగుబడి తగ్గిపోవడం.. మరోవైపు లగ్గసర్లు కావడంతో కూరలకు గిరాకీ బాగా పెరిగింది. బీన్స్, క్యారెట్, క్యాప్సికం కాదేదీ.. ధరల పెరుగుదలకనర్హం అన్నట్లుంది కూరగాయల పరిస్థితి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తేనే జేబులోకి సరిపడా కూరలు వస్తాయన్న చందంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఏం కొనాలో.. ఏం తినాల్లో అర్ధంకాక సగటుజీవి అల్లాడిపోతున్నాడు.
విజయవాడ సిటీ : కూరల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ పెరిగింది. కూరగాయలు పండించే సీజన్ ముగియడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో వ్యాపారులు ధరలు దండిగా పెంచేశారు. ఫలితంగా కాయగూరలు దొరకక జనం ఇబ్బందిపడుతున్నారు.
ఈ ప్రభావం రైతుబజార్లపై పడి అక్కడా ధరలు బాగా పెరిగాయి. ప్రైవేటు మార్కెట్ల వర్తకులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ జేబులు గుల్లచేస్తున్నారు. ఉల్లిపాయలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంటే.. అల్లం ధర కూడా ఘాటెక్కింది. వారం రోజుల క్రితం కంటే కూరగాయల ధరలు సగానికి సగం పెరిగాయి. వేసవి సీజన్ పూర్తికావడంతో స్థానికంగా కూరల దిగుబడులు తగ్గాయి. వారం రోజులుగా దాదాపు 30 శాతం దిగుబడులు తగ్గినట్లు రైతుబజారు అధికారులు చెప్పారు.
విజయవాడలో ఐదు, జిల్లాలో 12 రైతుబజార్లు ఉన్నాయి. స్థానిక రైతుబజార్లకు 5,500 క్వింటాళ్ల కూరగాయల ఉత్పత్తులు వస్తుంటాయి. వీటిన్నింటిలో స్వరాజ్యమైదానం రైతుబజారులో అత్యధికంగా రోజుకు మూడు వేల క్వింటాళ్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి. కొద్ది రోజులుగా రెండు వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. జిల్లాలో జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్‌జంక్షన్, నూజివీడు రైతుబజార్లకూ కూరగాయలు తక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రైవేటు మార్కెట్లలో రేట్లు విపరీతంగా పెంచేశారు.
ఇక ఇళ్ల వద్ద పావుకిలో కూరగాయలు రూ.10 చొప్పున, కేజీ రూ.40కి విక్రయిస్తున్నారు. ఇంకొన్ని రకాల కూరగాయలను కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయించిన ఉల్లి కేజీ రూ.21కు పెరిగింది. బయట మార్కెట్‌లో రూ.25కు విక్రయిస్తున్నారు. అల్లం రైతుబజార్లలో కేజీ రూ.120కి విక్రయిస్తుంటే.. బయట మార్కెట్‌లో రూ.150 వరకు అమ్ముతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో కూరలు అందుబాటులోకి వచ్చేటప్పటికి మరో రెండు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.