‘కూరా’ భారం | Vegetable prices falls | Sakshi
Sakshi News home page

‘కూరా’ భారం

Published Thu, Jun 26 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

‘కూరా’ భారం

‘కూరా’ భారం

  • భగ్గుమంటున్న కూరగాయల ధరలు
  •  కొత్తమీర కట్ట రూ.100...బెండ, మిరప, కాకర కిలో రూ.40
  •  70 శాతం పంట దిగుబడి తమిళనాడు,  కర్ణాటకకు ఎగుమతి
  •  ధరల పెరుగుదలకు ఇదే అసలు కారణం
  •  సొమ్ము చేసుకుంటున్న దళారులు
  •  బెంబేలెత్తుతున్న సామాన్యులు
  • చిత్తూరు కలెక్టరేట్‌లో పనిచేస్తున్న గంగాధర్ కూరగాయలు కొనుగోలు చేద్దామని మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ధరలు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. కొత్తిమీర కట్ట రూ.100, బీన్స్ కిలో రూ.80, బెండ కిలో రూ. 40, కాకర కిలో రూ. 40, క్యారెట్ కిలో రూ.40 ఇలా కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తి పోయాడు. ఇవేం ధరలు బాబోయ్ అంటూ అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసుకుని వెనుదిరిగాడు. మూడు నెలలుగా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు ఏమి కొనాలన్నా.. తినాలన్నా ఇబ్బంది  పడుతున్నారు. పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.                

    వేసవి ప్రారంభం నుంచే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయాలు బోరుబావులపై ఆధారపడి మాత్రమే సాగు చేస్తారు. ఈ సీజన్‌లో ( 3 నెలలు) జిల్లా వ్యాప్తంగా 24,281 హెక్టార్లలో రైతులు కాయగూరలు సాగుచేశారు.రాయలసీమ జిల్లాలతో పాటు ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పోలిస్తే కూరగాయల దిగుబడిలో జిల్లా ప్రథమస్థానంలో ఉంది. పొరుగు జిల్లాలతో పోలిస్తే జిల్లాలో ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దిగుబడిలో 70 శాతం పంట చెన్నై, బెంగళూరు, వేలూరు, విజయవాడ తదితర ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతుండడమే దీనికి ప్రధాన కారణం.     
     
    ఎగుమతే కారణం  

    జిల్లాలో దిగుపడి అయ్యే కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండడంతో ఇక్కడ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పడమటి మండలాల్లో అధిక శాతం మంది రైతులు కూరగాయల సాగును చేస్తున్నారు. ప్రధానంగా పలమనేరు, మదనపల్లి, వి.కోట, కలికిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూరగాయల బహిరంగ మార్కెట్‌ను వ్యాపారస్తులు నిర్విహ స్తున్నారు.

    దీంతో ఇక్కడి మార్కెట్లలో రైతుల నుంచి అయినికాడికి కొనుగోలు చేసే కూరగాయలను వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలైన చెన్నై, బెంగళూరు, విజయవాడ, వేలూరు తదితర ప్రాంతాలకు అధిక ధరలకు తరలించి లాభపడుతున్నారు. రైతులు మాత్రం దళారులు సొమ్ము చేసుకుంటున్న దానిలో మూ డో వంతు ఆదాయాన్ని కూడా పొందడం లేదు. వ్యాపారులు లాభాలకోసం ఇతర ప్రాంతాలకు కూరగాయలను తరలించడం వలన జిల్లావాసులకు అవసరమైన మేరకు కూరగాయలు లభించడంలేదు. దీంతో ఇటు రైతులు, అటు వినియోగదారులు నష్టాలపాలవుతున్నారు.
     
    కొనలేని స్థితిలో ప్రజలు
    సామాన్య ప్రజలు కూరగాయలను కొనలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రెండు కేజీల కూరగాయలు కొనాలన్నా రూ. వందకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో కూరగాయలు కొనాలంటేనే భయపడే  పరిస్థితి నెలకొనివుంది. మార్కెట్లలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
     
     కొనలేకపోతున్నాం
     అధిక ధరల కారణంగా కూరగాయలను కొనలేకపోతున్నాం. రోజుకు కనీసం రూ.50 పెడితే గాని నాణ్యమైన కూరగాయ లు దొరకడం లేదు. రోజంతా కూలి చేసినా రూ.200 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. అందులో రూ.50 కూరగాయలకే ఖర్చు చేస్తే మిగిలిన వస్తువులను ఏవిధంగా కొనాలో అర్థం కావడం లేదు.
     -  కాంచన, గృహిణి, అయ్యప్పగారిపల్లె

     ప్రభుత్వం పట్టించుకోవాలి
     కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకుని కూరగాయల ధరలు తగ్గించాలి. వందలాది రూపాయలు వెచ్చించి కూరగాయలు కొంటున్నా. కనీసం చేతి బ్యాగు కు కూడా రావడం లేదు. అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు దొరకడం లేదు.          
     - సుమతి, గృహిణి, మురకంబట్టు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement