సాక్షి, అమరావతి: ఆంధ్ర ‘కోకో’కు ప్రపంచ స్థాయి బ్రాండింగ్ తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీవో) ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడం విజయవంతం కావడంతో మరో ఐదు ఎఫ్‌పీవోల ద్వారా చెన్నై, ముంబై, కేరళతో పాటు ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నాలుగేళ్ల కిందట 21 వేల హెక్టార్లలో కోకో సాగవగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రస్తుతం 40 వేల హెక్టార్లకు విస్తరించింది. ఏటా 38 వేల టన్నుల కాయలు దిగుబడి వస్తుండగా.. వాటి నుంచి 11 వేల టన్నుల గింజలొస్తాయి. దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్‌లే, క్యాంప్కో, లోటస్ వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి. సాధారణంగా గుజ్జుతో కూడిన గింజలను 1–2 రోజులు ఎండబెట్టి కంపెనీలకు అమ్ముతుంటారు.
వీటికి కిలో రూ.180–210 చొప్పున చెల్లిస్తుంటారు. కోకో రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రీమియం చాక్లెట్ల తయారీలో ఉపయోగించే ఫైన్ ఫ్లావర్డ్ బీన్స్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా 35 శాతం సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తోంది. ప్రీమియం కోకో గింజల ఉత్పత్తి కోసం బాక్స్ పర్మంటేషన్‌పై అవసరమైన సాంకేతిక శిక్షణనిస్తోంది.
పైలట్ ప్రాజెక్ట్‌గా కృష్ణా జిల్లా నూజివీడు మండలం తడికలపూడిలోని సాయిరాగ్ ఫుడ్స్ అండ్ బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సబ్సిడీపై ఆర్థిక చేయూతనివ్వగా.. గడిచిన ఏడాదిలో 25 టన్నుల ప్రీమియం కోకో గింజలను ముంబై నుంచి ఫ్రాన్స్‌కు ఎగుమతి చేశారు. ఫలితంగా కంపెనీ పరిధిలోని 300 మందికి పైగా రైతులు కిలోకు రూ.80 అదనంగా లబ్ధి పొందారు.
35 శాతం సబ్సిడీపై రుణాలు
పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇదే రీతిలో ప్రోత్సహించేందుకు 25 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను గుర్తించారు. తొలి విడతగా ద్వారకా పామ్ ఆయిల్‌ఫెడ్, చింతలపూడి ఫార్మర్స్ ఫెడ్, తీగలవంచ నర్సాపురం ఫెడ్, మద్ది ఆంజనేయ, టి.కృష్ణారెడ్డి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌లకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.10 లక్షల సబ్సిడీ(35 శాతం)తో రూ.28 లక్షల ఆర్థిక చేయూతనిచ్చారు. ఈ ఎఫ్‌పీవోల పరిధిలో 1500 మంది రైతులు 5 వేల ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నారు. వీరికి ఫైన్ ఫ్లావర్డ్ కోకో గింజల ఉత్పత్తిపై శిక్షణ కూడా ఇచ్చారు. డిసెంబర్ నుంచి ఇవి 16 టన్నుల చొప్పున చెన్నై, ముంబై కంపెనీల ద్వారా ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫర్మంటేషన్ చేస్తారిలా..
గుజ్జుతో కూడిన కోకో గింజలను గాలి తగలకుండా 3 రోజులు, గాలి తగిలేలా 3 రోజులు ఫర్మంటేషన్ చేస్తారు. ఆ తర్వాత గుజ్జు నుంచి వేరు చేసిన గింజలను వేరు డ్రయింగ్ ప్లాట్ ఫారమ్స్‌పై ఐదు రోజుల పాటు ఎండబెడతారు. సారి్టంగ్, గ్రేడింగ్ తర్వాత క్వాలిటీ గింజలను 5, 20 కిలోల చొప్పున ప్యాకింగ్ చేస్తారు. ఇలా తయారైన ఫ్లావర్డ్ బీన్స్‌కు మార్కెట్ రేటు కంటే 30 శాతం అదనపు ధర లభిస్తుంది. అదే సేంద్రియ పద్ధతిలో సాగు చేసి, శాస్త్రీయ పద్ధతిలో ఫర్మంటేషన్ చేస్తే మరో 15 శాతం అదనంగా చెల్లిస్తామంటున్నాయి.
ఒక్కో రైతుకు రూ.20 వేలు అదనపు ఆదాయం
కంపెనీ పరిధిలో 223 మంది రైతులు 557 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు 400 కిలోల కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నారు. స్థానిక మార్కెట్‌లో కిలోకు రూ.180 లోపే వస్తున్నాయి. ఫర్మంటేషన్ చేసి కేరళకు చెందిన కంపెనీ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కిలోకు రూ.50–80 చొప్పున.. ఒక్కో రైతుకు రూ.20 వేలు అదనంగా ఆదాయం వస్తోంది. తొలి దశలో 16 టన్నులు ప్రాసెస్ చేసి ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – నల్లజర్ల పవన్‌కుమార్, ఎండీ, ద్వారకా తిరుమల పామ్ ఆయిల్ ఫెడ్ ప్రొడ్యూసర్స్ కంపెనీ
సబ్సిడీతో ఆర్థిక చేయూత
కోకో రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎఫ్‌పీవోలుగా ఏర్పడి ముందుకొచ్చే రైతులకు 35 శాతం సబ్సిడీపై ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైన శిక్షణ కూడా ఇస్తాం. మార్కెటింగ్ సదుపాయం
కల్పిస్తాం. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ
Comments
Please login to add a commentAdd a comment