Cocoa production
-
కోకో.. లాభాల కేక..
సాక్షి, అమరావతి: నోరూరించే చాక్లెట్లు, బిస్కెట్లు, పానీయాలతో పాటు బేవరేజెస్, ఏడిబుల్, మెడికల్, కాస్మోటిక్స్ వంటి వాటి తయారీలో విరివిగా ఉపయోగించే కోకో సాగుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్‌గా మారింది. ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విస్తరించడమే కాదు చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టన్నుకు రూ.10 లక్షలకు పైగా రైతులకు కాసుల వర్షం కురిపించింది. 2019కు ముందు కేవలం 21వేల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగేది. అలాంటిది ఏటా 5వేల హెక్టార్ల చొప్పున వైఎస్ జగన్ సర్కారు విస్తరించడంతో మొత్తం విస్తీర్ణం ప్రస్తుతం 44,993 హెక్టార్లకు పెరిగింది.ఇక జాతీయ స్థాయిలో 1.11 లక్షల హెక్టార్లలో కోకో సాగవుతుండగా, అందులో 41శాతం ఏపీలోనే సాగవుతోంది. ఇక దిగుబడులపరంగా చూస్తే జాతీయ స్థాయిలో 30,388 టన్నుల దిగుబడులొస్తుండగా, అందులో 19,436 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. సాగులోనే కాదు.. ఉత్పాదకత, ఉత్పత్తిలో కూడా దేశంలోనే నెం.1గా ఏపీ నిలిచింది. అలాగే, ఏటా 80–85 శాతం పంట జనవరి నుంచి జూన్ వరకు, 15–20 శాతం పంట జూలై నుంచి అక్టోబరు మధ్య కోతకు వస్తుంది. దిగుబడిలో 80 శాతం పీపీపీ పద్ధతిలో రైతుల నుంచి నేరుగా క్యాడ్బరీ సంస్థ సేకరిస్తుంది. మిగిలిన వాటిని నెస్లే, క్యాంప్కో, లోటస్ వంటి కంపెనీలూ కొనుగోలు చేస్తుంటాయి. ఐదేళ్లలో కొత్తగా 25 వేల హెక్టార్లురాష్ట్రంలో 2.58 లక్షల ఎకరాల్లో కొబ్బరి, 5.46 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్, 3.50 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతుంది. ప్రస్తుతం కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో మాత్రమే అంతర్ పంటగా కోకోను జీడి మామిడిలో కూడా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నాటిన తర్వాత మూడేళ్ల పాటు హెక్టార్‌కు రూ.20వేల వరకు ఆరి్థక చేయూతనివ్వడంతో పాటు సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై బిందు పరికరాలందిస్తూ ప్రోత్సహించారు. అలాగే, ప్యాక్ హౌసెస్ కోసం రూ.2 లక్షలు, ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.10 లక్షలు, ఎఫ్పీఓల కోసం రూ.11లక్షల వరకు ఆరి్థక చేయూతనిచ్చారు. ఫలితంగా ఐదేళ్లలో 25వేల హెక్టార్లను కొత్తగా సాగులోకి తీసుకురాగలిగారు. హెక్టార్‌కు 850–950 కేజీల చొప్పున దిగుబడి వస్తోంది. నాటిన మూడో ఏట నుంచి మొదలై 40 ఏళ్లపాటు దిగుబడి వచ్చే పంట ఇది. రాలిన ఆకులతో భూసారం పెరుగుదలకోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి రెండు టన్నుల ఆకులు రాలి నేలలో కలిసి భూసారం పెరుగుతుంది. భూమిపై ఏర్పడే ఆకుల పొరవల్ల కలుపు సమస్య ఉండదు. తోటల్లోని భూమిలో తేమ శాతం నిలిచి ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో పిందె రాలిపోవడాన్ని నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగుచేయడంవల్ల ప్రధాన పంటల్లో 20 శాతం దిగుబడి పెరుగుతుందని సీటీఆర్ఐ తెలిపింది. ఆసియాలోనే అతిపెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీ..ఇక కోకో సాగులో నెం.1గా ఉన్న ఏపీలో మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1,600 కోట్ల పెట్టుబడితో గతేడాది భారీ పరిశ్రమ నెలకొల్పింది. క్యాడ్బరీ, టాంగ్, బోరి్నవిటా, ఓరియో, 5–స్టార్ వంటి చాక్లెట్లు ఉత్పత్తి చేసే ఈ సంస్థ ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవాను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ యూనిట్ ఏర్పాటుచేసింది. ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి కలి్పస్తుండగా, 18వేల మంది రైతులకు లబ్ధిచేకూరుతోంది. అలాగే, డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏటా 60 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో చిత్తూరులో రూ.300 కోట్లతో 700 మందికి ఉపాధి కలి్పంచేలా ఇండస్ట్రియల్ అండ్ కన్సూ్యమర్ చాక్లెట్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసింది. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు.. ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనిలా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని సంకల్పించారు. -
కోకో.. ధర కేక
సాక్షి అమలాపురం: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా దిగుబడి తగ్గినప్పటికీ.. కోనసీమ కోకో రైతులు కలలో కూడా ఊహించని విధంగా ధర పలుకుతుండడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కేజీ ఎండబెట్టిన కోకో గింజల ధర రూ.200 నుంచి ఏకంగా రూ.800 వరకు ఎగబాకింది. గతేడాది నుంచి చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో దిగుబడి గణనీయంగా పడిపోవడంతో.. కోకో గింజల డిమాండ్‌ను బట్టి ధర పెరగడానికి కారణమైందని రైతులు చెబుతున్నారు. దశాబ్దాలుగా సాగు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. కాకినాడ , తూర్పుగోదావరి, ఏలూరు, పశి్చమగోదావరి జిల్లాల్లో సుమారు 5,800 ఎకరాల్లో కోకో సాగవుతున్నట్లు అంచనా. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో అంతరసాగు వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తున్నది. దిగుబడి తగ్గినా.. తూర్పుగోదావరి జిల్లాలో ఎకరాకు దిగుబడి 1.50 క్వింటాళ్ల నుంచి రెండు క్వింటాళ్ల వరకు వస్తుండగా, ఏలూరు జిల్లా పరిధిలో నాలుగు క్వింటాల్ నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మనదేశంతోపాటు కోకో అధికంగా ఐవరీ కోస్ట్, ఘనా, ఇండోనేషియా, నైజీరియా వంటి దేశాలలో పండిస్తారు. ఆ దేశాల్లో 70 శాతం దిగుబడి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఆగస్టు వరకు వేసవిని తలపించే ఎండల వల్ల కోకో పూత రాలిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు దిగుబడిపై కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సగటు దిగుబడి ఒక క్వింటాల్‌కు తగ్గింది. కాగా, గతేడాది కోకో ఎండబెట్టిన గింజల ధర క్వింటాల్‌కు రూ.180 నుంచి రూ.240 మధ్యలో ఉండేది. ఈ ఏడాది జనవరి నుంచి స్వల్పంగా ధర పెరుగుతూ ప్రస్తుతం రూ.800కు చేరింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే ధర మరింత పెరిగే అవకాశముందని రైతులు అంచనా వేస్తున్నారు. -
ఫ్రాన్స్, బెల్జియం చాక్లెట్లలో ఆంధ్రా రుచులు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ‘కోకో’కు ప్రపంచ స్థాయి బ్రాండింగ్ తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీవో) ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడం విజయవంతం కావడంతో మరో ఐదు ఎఫ్‌పీవోల ద్వారా చెన్నై, ముంబై, కేరళతో పాటు ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట 21 వేల హెక్టార్లలో కోకో సాగవగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రస్తుతం 40 వేల హెక్టార్లకు విస్తరించింది. ఏటా 38 వేల టన్నుల కాయలు దిగుబడి వస్తుండగా.. వాటి నుంచి 11 వేల టన్నుల గింజలొస్తాయి. దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్లే, క్యాంప్కో, లోటస్ వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి. సాధారణంగా గుజ్జుతో కూడిన గింజలను 1–2 రోజులు ఎండబెట్టి కంపెనీలకు అమ్ముతుంటారు. వీటికి కిలో రూ.180–210 చొప్పున చెల్లిస్తుంటారు. కోకో రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రీమియం చాక్లెట్ల తయారీలో ఉపయోగించే ఫైన్ ఫ్లావర్డ్ బీన్స్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా 35 శాతం సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తోంది. ప్రీమియం కోకో గింజల ఉత్పత్తి కోసం బాక్స్ పర్మంటేషన్పై అవసరమైన సాంకేతిక శిక్షణనిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా కృష్ణా జిల్లా నూజివీడు మండలం తడికలపూడిలోని సాయిరాగ్ ఫుడ్స్ అండ్ బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సబ్సిడీపై ఆర్థిక చేయూతనివ్వగా.. గడిచిన ఏడాదిలో 25 టన్నుల ప్రీమియం కోకో గింజలను ముంబై నుంచి ఫ్రాన్స్‌కు ఎగుమతి చేశారు. ఫలితంగా కంపెనీ పరిధిలోని 300 మందికి పైగా రైతులు కిలోకు రూ.80 అదనంగా లబ్ధి పొందారు. 35 శాతం సబ్సిడీపై రుణాలు పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇదే రీతిలో ప్రోత్సహించేందుకు 25 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను గుర్తించారు. తొలి విడతగా ద్వారకా పామ్ ఆయిల్‌ఫెడ్, చింతలపూడి ఫార్మర్స్ ఫెడ్, తీగలవంచ నర్సాపురం ఫెడ్, మద్ది ఆంజనేయ, టి.కృష్ణారెడ్డి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌లకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.10 లక్షల సబ్సిడీ(35 శాతం)తో రూ.28 లక్షల ఆర్థిక చేయూతనిచ్చారు. ఈ ఎఫ్‌పీవోల పరిధిలో 1500 మంది రైతులు 5 వేల ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నారు. వీరికి ఫైన్ ఫ్లావర్డ్ కోకో గింజల ఉత్పత్తిపై శిక్షణ కూడా ఇచ్చారు. డిసెంబర్ నుంచి ఇవి 16 టన్నుల చొప్పున చెన్నై, ముంబై కంపెనీల ద్వారా ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫర్మంటేషన్ చేస్తారిలా.. గుజ్జుతో కూడిన కోకో గింజలను గాలి తగలకుండా 3 రోజులు, గాలి తగిలేలా 3 రోజులు ఫర్మంటేషన్ చేస్తారు. ఆ తర్వాత గుజ్జు నుంచి వేరు చేసిన గింజలను వేరు డ్రయింగ్ ప్లాట్ ఫారమ్స్‌పై ఐదు రోజుల పాటు ఎండబెడతారు. సారి్టంగ్, గ్రేడింగ్ తర్వాత క్వాలిటీ గింజలను 5, 20 కిలోల చొప్పున ప్యాకింగ్ చేస్తారు. ఇలా తయారైన ఫ్లావర్డ్ బీన్స్‌కు మార్కెట్ రేటు కంటే 30 శాతం అదనపు ధర లభిస్తుంది. అదే సేంద్రియ పద్ధతిలో సాగు చేసి, శాస్త్రీయ పద్ధతిలో ఫర్మంటేషన్ చేస్తే మరో 15 శాతం అదనంగా చెల్లిస్తామంటున్నాయి. ఒక్కో రైతుకు రూ.20 వేలు అదనపు ఆదాయం కంపెనీ పరిధిలో 223 మంది రైతులు 557 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు 400 కిలోల కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో కిలోకు రూ.180 లోపే వస్తున్నాయి. ఫర్మంటేషన్ చేసి కేరళకు చెందిన కంపెనీ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కిలోకు రూ.50–80 చొప్పున.. ఒక్కో రైతుకు రూ.20 వేలు అదనంగా ఆదాయం వస్తోంది. తొలి దశలో 16 టన్నులు ప్రాసెస్ చేసి ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – నల్లజర్ల పవన్‌కుమార్, ఎండీ, ద్వారకా తిరుమల పామ్ ఆయిల్ ఫెడ్ ప్రొడ్యూసర్స్ కంపెనీ సబ్సిడీతో ఆర్థిక చేయూత కోకో రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎఫ్పీవోలుగా ఏర్పడి ముందుకొచ్చే రైతులకు 35 శాతం సబ్సిడీపై ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైన శిక్షణ కూడా ఇస్తాం. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
తడికలపూడి టు ఫ్రాన్స్
సాక్షి, అమరావతి: కోకో పంటకు ప్రపంచస్థాయి బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు స్థానికంగా మాత్రమే కోకో గింజలను విక్రయిస్తున్న రైతుల ద్వారా ఫైన్ ఫ్లేవర్డ్ కోకో గింజల్ని ఉత్పత్తి చేసి వాటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడంతో ఇదే స్ఫూర్తితో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కోకో సాగు, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఏపీలో సాగు విస్తీర్ణం నాలుగేళ్లలో 21వేల హెక్టార్ల నుంచి 39,714 హెక్టార్లకు విస్తరించింది. తద్వారా 10,903 టన్నుల కోకో గింజలు ఉత్పత్తి వస్తుండగా దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్ట్లే, క్యాంప్కో వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి. అదనపు ధర కల్పించడమే లక్ష్యంగా.. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం మరోవైపు గింజల్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ వల్ల ప్రీమియం చాక్లెట్స్ తయారీకి అవసరమైన ఫ్లేవర్ కోకో గింజలకు వస్తుంది. వీటికి మార్కెట్ ధర కంటే 30% అదనంగా చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు, శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ చేస్తే మరో 15% అదనంగా చెల్లిస్తామంటున్నాయి. ప్రీమియం చాక్లెట్స్ తయారీలో ఉపయోగించే ఫైన్ ఫ్లేవర్డ్ గింజల ఉత్పత్తే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం 35% సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్ గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యంగా ముందుకొచ్చే రైతులు, ఎఫ్పీఓలకు సబ్సిడీపై ఆర్ధిక చేయూతనిస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మరింతమంది రైతుల ద్వారా ప్రీమియం కోకో గింజలను ఉత్పత్తి చేసి నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ -
‘చాక్లెట్’ పంట.. ఏపీ వెంట
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంటగా పిలిచే ‘కోకో’ సాగును రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాలతో పాటు పానీయాలు, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ‘కోకో’కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కోకో సాగుతో పాటు ఉత్పాదకతలోనూ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గడచిన రెండేళ్లలో కొత్తగా 8 వేల హెక్టార్లలో విస్తరించిన ఈ సాగును రానున్న మూడేళ్లలో కనీసం 15 వేల హెక్టార్లలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 1990లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా ప్రారంభించిన కోకోను ఆ తర్వాత ఆయిల్‌పామ్ తోటల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న ఈ పంట తాజాగా కోస్తా, రాయలసీమ జిల్లాలకూ విస్తరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,199 హెక్టార్లలో ఇది సాగవుతుండగా.. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 22,015 హెక్టార్లలో విస్తరించింది. బహుళ ప్రయోజన పంటగా.. నాటిన మూడో ఏడాది నుంచి మొదలయ్యే కోకో దిగుబడి కనీసం 40 ఏళ్లపాటు కొనసాగుతుంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేసే కోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి రెండు టన్నుల ఆకులు రాలి నేలలో కలిసిపోతాయి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమిపై ఏర్పడే ఆకుల పొర వల్ల కలుపు శాశ్వతంగా నిర్మూలించబడుతుంది. ఇదే సందర్భంలో తోటల్లోని భూమిలో తేమ శాతం నిలిచి ఉండి ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. పైగా కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో పిందె రాలిపోవడాన్ని నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగు చేయడం వల్ల ప్రధాన పంటల్లో 20 శాతం దిగుబడి పెరుగుతుందని సీటీఆర్ఐ స్పష్టం చేసింది. ఏలూరులో కోకోవా, వెనీలా ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు సాగు ఖర్చుల కింద మూడేళ్ల పాటు హెక్టారుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. సూక్ష్మ సేద్య పరికరాలపై చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఇదిలావుండగా.. ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. మూడెకరాల్లో కోకో వేశా ప్రభుత్వం ప్రోత్సాహంతో అంతర్ పంటగా గతేడాది 3 ఎకరాల్లో కోకో మొక్కలు నాటాను. ఉద్యాన శాఖ అధికారులు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. – కె.గంగాధర్, రామన్నగూడెం, ప.గోదావరి రైతుల ఇంటి వద్దే కొనుగోలు కోకో సాగు విస్తరణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. రైతులకు అన్నివిధాలుగా సాంకేతిక సహకారం అందిస్తున్నాం. రైతుల ఇంటి వద్దకే వెళ్లి కోకో కాయలను కొనుగోలు చేస్తున్నాం. – ఎ.రవీంద్రరావు, అసిస్టెంట్ మేనేజర్, క్యాడ్బరీ ప్రభుత్వం ప్రోత్సాహం కోకో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పూర్తి స్థాయిలో కోకోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. – పావులూరి హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
రైతులకు భారం: నష్టాలు ‘కోకో’ల్లలు
అమలాపురం: కొబ్బరి, ఆయిల్పామ్లలో ప్రధాన అంతర పంటగా.. అదనపు ఆదాయంతో పాటు భూసారాన్ని పెంచే కోకో సాగు ఇప్పుడు రైతులకు భారంగా మారుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సుమారు 75 వేల ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగు జరుగుతోంది. మన జిల్లాలోనే సుమారు 8,151 ఎకరాల్లో సాగవుతోంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ ధర తగ్గిన ప్రతిసారీ దీని ఆదాయం రైతులను ఆదుకుంటోంది. వాతావరణం సహకరించి, దిగుబడులు ఆశాజకంగా ఉన్నప్పుడు కోకో ద్వారా రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఆదాయం వచ్చిన సందర్భాలున్నాయి. గడచిన ఐదేళ్లుగా కోకో ధర ఆటుపోట్లకు లోనవుతోంది. ఇష్టానుసారం ధర నిర్ణయం కోకో గింజల నుంచి తయారు చేసే చాక్లెట్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్నా కోకో గింజల ధర మాత్రం తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 2014, 2015 సంవత్సరాల్లో కోకో గింజల సగటు ధర కేజీ రూ.192 కాగా 2016లో రూ.200కు పెరిగింది. 2017లో రూ.191కి తగ్గింది. 2018లో రూ.160కు పడిపోయింది. అప్పట్లో అంబాజీపేట, అమలాపురం మండలాల్లో రైతులు ఈ తోటలను తొలగించారు. రూ.240కి పెరిగిన ధర తాజాగా మరోసారి రూ.180కి తగ్గింది. ఏటా సాగు పెట్టుబడులు పెరుగుతుండగా, కోకో గింజల ధర తగ్గుతూ వస్తోంది. ఒకటి రెండు కార్పొరేట్ కంపెనీలు మాత్రమే కొనుగోలు చేయడం, వారు ఇష్టానుసారం ధర నిర్ణయించడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది. కూలీ చెల్లింపునకే సరి.. ఇటీవలి కాలంలో గోదావరి జిల్లాల్లో కూలి ధరలు రైతుకు భారంగా మారాయి. పురుషులకు రూ.500 వరకూ, మహిళలకు రూ.250 నుంచి రూ.300 వరకూ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత దిగుబడికి కార్పొరేట్ చెల్లిస్తున్న ధర ప్రకారం ఎకరాకు రూ.27 వేలకు మించి రావడం లేదు. ఇది కూలీల చెల్లింపులకే సరిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో కోకో సాగుకు వారు క్రమేపీ దూరమవుతున్నారు. తాజాగా అమలాపురం మండలం కామనగరువులో ఒక రైతు తన పదెకరాల కొబ్బరి తోటలో ఉన్న అంతర పంట కోకోను తొలగిస్తున్నారు. కోకో సాగు బహుళ ప్రయోజనం ధరలో హెచ్చుతగ్గులు వచ్చినా కోకో సాగు బహుళ ప్రయోజనం. ధర తగ్గడం అనేది తాత్కాలికం. కోనసీమ కేంద్రంగా కోకో ప్రాసెసింగ్ పరిశ్రమ త్వరలోనే ప్రారంభం కానుంది. స్థానికంగా కొనుగోలు పెరిగితే మంచి ధర వచ్చే అవకాశముంది. మన ప్రాంతంలో దిగుబడి వచ్చే గింజలు చాలా నాణ్యమైనవి. కానీ దిగుబడి తక్కువగా వస్తోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు వచ్చే అవకాశముంది. పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఈ స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. అంతర పంటలు లేని సాధారణ కొబ్బరి తోటల్లో కన్నా కోకో సాగు జరిగే కొబ్బరి తోటల్లో దిగుబడి ఎక్కువ. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. కోకోకు ఆకురాల్చే గుణం ఉండడం వల్ల కొబ్బరి తోటకు మంచి సేంద్రియ ఎరువు అందుతుంది. – నేతల మల్లికార్జునరావు, ఏడీహెచ్, అమలాపురం ఐదేళ్లుగా ధర తప్ప అన్నీ పెరిగాయి ఐదేళ్ల క్రితం కోకో గింజల ధర కేజీ రూ.200 ఉండేది. ఇప్పుడు రూ.180. ఈ ఐదేళ్లలో ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలి రేట్లు అన్నీ పెరిగాయి. కోకో గింజల ధర మాత్రం పెరగడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చుకుంటే మనకు ఎకరాకు సగం దిగుబడి మాత్రమే వస్తోంది. కనీసం కూలీలకు అవుతున్న ఖర్చు కూడా రావడం లేదు. అందుకే కోకో తోటల లీజును రద్దు చేసుకున్నాను. ఇప్పుడు అదే తోటను రైతు తొలగిస్తున్నారు. – సీహెచ్ సూర్యనారాయణరాజు, రైతు, మాగాం, అయినవిల్లి మండలం చదవండి: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్ మాత్రం.. గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
కోకో.. కోటి కష్టాలు
తూర్పుగోదావరి ,అమలాపురం: ఒకప్పుడు కాసులు కురిపించి.. కొబ్బరి సంక్షోభ సమయంలో రైతులకు కొండంత అండగా నిలిచిన అంతర పంట కోకో ఇప్పుడు చేదు ఫలితాలను మిగులుస్తోంది. గిట్టుబాటు ధర కూడా లేక రైతులు ఢీలా పడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా.. గింజలు కొనుగోలు చేసే ఒక కంపెనీ గుత్తాధిపత్యం కారణంగా రైతులు అయినకాడకు అమ్ముకుని నష్టపోతున్నారు. పెరుగుతున్న కూలీ ఖర్చులు, పెట్టుబడులు కోకో రైతులకు నష్టాలు వస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు సాగుతోంది. ఇందులో 25 శాతం అంటే సుమారు 44 వేల ఎకరాల్లో కోకో అంతర పంటగా సాగుతోందని అంచనా. కొబ్బరిలోనే కాకుండా ఆయిల్ పామ్ తోటల్లో సైతం కోకోను సాగు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో 50 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అంచనా. కొబ్బరి ధర తగ్గిన ప్రతిసారి కోకో ఆదాయం రైతులను ఆదుకుంటుంది. వాతావరణం సహకరించి దిగుబడులు ఆశాజకంగా ఉన్నప్పుడు కోకో ద్వారా రైతుకు ఎకరాకు రూ.50 వేల వరకు ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏడాది కాలం నుంచి ఈ రైతులకు నష్టాలు వస్తున్నాయి. ఏటా తగ్గుతున్న ఆదాయం ఏటా పెట్టుబడులు పెరుగుతుంటే ఆదాయం తగ్గిపోతోంది. కోకో గింజల ధర తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కోకోకు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే ధర మాత్రం తగ్గిపోతోంది. కేవలం ఒకటి రెండు కార్పొరేట్ కంపెనీలు మాత్రమే కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ధరను వారి ఇష్టానుసారం తగ్గిస్తున్నారు. 2014, 2015ల్లో సగటు కోకో గింజల ధర కేజీ రూ.192 కాగా 2016లో రూ.200కు పెరిగింది. ఇక 2017 వచ్చే సరికి సరికి రూ.191.25కు తగ్గింది. ఈ ఏడాది రూ.175కు పడిపోయింది. దీనికి తోడు పెరుగుతున్న తెగుళ్లు కోకో దిగుబడిని దెబ్బ తీస్తోంది. ఇటీవల పిందెలు నల్లగా మారడం, ఎలుక, ఉడతల దాడి సైతం పెరిగింది. దీని వల్ల గతంలో ఎకరాకు సగటు దిగుబడి ఎకరాకు 800ల నుంచి వెయ్యి కేజీల వరకు రాగా, ప్రస్తుతం ఇది కాస్తా 400 కేజీలకు పడిపోయింది. ఇవన్నీ రైతులకు వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించి వేస్తున్నాయి. కూలీలతోనే అసలు ఇబ్బంది కోకో సాగుకు అవుతున్న పెట్టుబడిలో కూలీలకు ఇచ్చేదే ఎక్కువగా ఉంది. కోత, గింజలు ఎండ బెట్టడం, మడులు కట్టడం, కలుపుతీత, ఫ్రూనింగ్ వంటి పనులకు రైతుకు ఎకరాకు 225 పనిదినాలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సగటు రూ.250 అనుకున్నా కూలీలకే రూ.56,250 ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కూలి పనులకు వచ్చే వారు తగ్గిపోతుండడం రైతులకు మరింత ఇబ్బందిగా మారింది. కేజీ రూ.250 ధర ఉండాలి కోకో సాగులో ఏటా పెట్టుబడి పెరుగుతోంది. గతంలో వచ్చిన దిగుబడి రావడం లేదు. కోకో సాగు రైతుకు గిట్టుబాటు కావాలంటే గింజల ధర కేజీ రూ.250 వరకు ఉండాలి. అలా అయితేనే ఈ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది.– అబ్బిరెడ్డి రంగబాబు, రైతు, అమలాపురం -
చాకొలేట్ ధరలకు రెక్కలు..!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చాకొలేట్ ప్రియులకు చేదువార్త. చాకొలేట్ తయారీలో వినియోగించే ప్రధాన ముడిసరుకు కోకో సరఫరాలకు విఘాతం ఏర్పడటంతో సమీప భవిష్యత్తులో చాకొలేట్ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో కోకోను అధికంగా ఉత్పత్తిచేసే ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాపించిన కారణంగా చాకొలేట్ ముడి సరుకు సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో కోకో ధర ఇటీవలకాలంలో రికార్డు గరిష్టస్థాయికి చేరింది. కోకో ఉత్పత్తి పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్, ఘనా దేశాల నుండే వస్తోంది. ప్రపంచంలోని మొత్తం కోకో ఉత్పత్తిలో 70 శాతం వాటా ఈ రెండు దేశాలదే. ఈ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాపించినందున, ఉత్పత్తి క్షీణిస్తుందని, ఆ ప్రభావం చాకొలేట్ ధరలపై పడుతుందని శాంప్రే న్యూట్రిషన్ చైర్మన్ గుర్బానీ సాక్షి ప్రతినిధికి చెప్పారు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో కోకో టన్ను ధర దాదాపు రికార్డు గరిష్టస్థాయి 3,723 డాలర్లకు (రూ. 2, 23,380) చేరింది. ఎబోలా వైరస్ ప్రభావంతో కోకో సరఫరా సమస్యలు ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు ధరలు 100 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐవరీ కోస్ట్, ఘనా దేశాల నుండి సరఫరా అయ్యే కోకో నాణ్యతలో ఎంతో మెరుగైనదని, మిగతా ఏ దేశాల నుండీ ఆ స్థాయి నాణ్యతకల ఉత్పత్తి దిగుమతి చేసుకోవడం సాధ్యపడదని గుర్బానీ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలైన క్యాడ్బరీ, నెస్లే, పర్ఫెట్టీలాంటి సంస్థలకు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా చాకొలేట్లు ఉత్పత్తి చేస్తున్న శాంప్రే సంస్థ జస్ట్కాఫీ, క్యాండీ న్యూట్రీ, ఎక్లైర్స్ లాంటి స్వంత బ్రాండులనూ మార్కెట్ చేస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చేతినిండా ఆర్డర్లున్నాయని, మూడు షిప్టుల్లో ఉత్పత్తి చేస్తున్నామని గుర్బానీ చెప్పారు. 2014 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సారానికి సంస్థ రూ. 3.76 కోట్ల విలువైన ముడిసరుకు వినియోగించింది. అంత క్రితం సంవత్సరం ముడి సరుకు వినియోగం రూ. 1. 1 కోటిగా నమోదైంది. తాజా పరిణామాలతో ముడి సరుకు ధరలు పెరిగితే శాంప్రే లాంటి సంస్థలు ముడి సరుకు కొనుగోలుపై అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. కోకో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడ్డ హైదరాబాద్‌కు చెందిన మరో చాక్లెట్ తయారీ సంస్థ లోటస్ చాక్లెట్ లిమిటెడ్. కోకోను పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు చాకొలేట్ తయారీలోనూ వినియోగిస్తోంది. కోకో మాస్, పౌడర్, బట్టర్, చాక్లెట్, ప్లైన్ చాకోపేస్ట్, క్రీం కవరింగ్స్, డ్రింకింగ్ చాక్లెట్, సాస్ లాంటి ఉత్పత్తులను తయారుచేస్తోంది. 2012-13లో సంస్థ రూ 33 కోట్లు ముడిసరుకును వినియోగించగా 2013-13 ఆర్థిక సంవత్సరానికి అది రూ. 43 కోట్లుకు పెరిగింది. కోకో ఉత్పిత్తి -సరఫరా.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 3.5 మిలియన్ టన్నుల కోకో ఉత్పత్తి అవుతోంది. చైనా, ఇండియా, అమెరికా దేశాల్లో సంపన్న వర్గాల ఆదాయం పెరుగుతుండటంతో కోకో వినియోగం 2020 నాటికి 4.5 మిలియన్ టన్నులకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోకో ధరలపై వాతావరణం, చీడపీడలు, ఉత్పాదక దేశాల్లో రాజ కీయ స్థిరత్వం వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి. ఐవ రీ కోస్ట్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా 2011లో కోకో టన్ను ధర అత్యధికంగా 3,775 డాలర్లు (రూ. 1, 88, 750) పలికింది. డాలర్ల రూపేణా అప్పటి ధరకు మరో 50 డాలర్ల తక్కువగా ఇప్పటి ధర వున్నప్పటికీ, రూపాయి క్షీణించిన ప్రభావంతో భారత్ దిగుమతిదారులు ప్రస్తుతం టన్నుకు రూ. 2.23 లక్షలు వెచ్చించాల్సివస్తోంది. అధిక బరువు కోకోవాదే... చాకొలేట్ తయారీలో కోకోవాతో పాటు నట్స్, జామ్, ప్రూట్లను వాడుతారు. అయితో చాక్లెట్ మొత్తం బరువులో 25 శాతం బరువు కోకోదే. ఇక డార్క్ చాకొలెట్లయితే70 నుండి 80 శాతం చాక్లెట్ బరువు కోకోదే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డార్క్ చాకొలేట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.