‘చాక్లెట్‌’ పంట.. ఏపీ వెంట | AP Government plans to increase cocoa cultivation acreage | Sakshi
Sakshi News home page

‘చాక్లెట్‌’ పంట.. ఏపీ వెంట

Published Mon, Apr 26 2021 3:05 AM | Last Updated on Mon, Apr 26 2021 11:23 AM

AP Government plans to increase cocoa cultivation acreage - Sakshi

సాక్షి, అమరావతి: చాక్లెట్‌ పంటగా పిలిచే ‘కోకో’ సాగును రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాలతో పాటు పానీయాలు, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ‘కోకో’కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది. కోకో సాగుతో పాటు ఉత్పాదకతలోనూ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గడచిన రెండేళ్లలో కొత్తగా 8 వేల హెక్టార్లలో విస్తరించిన ఈ సాగును రానున్న మూడేళ్లలో కనీసం 15 వేల హెక్టార్లలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 1990లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా ప్రారంభించిన కోకోను ఆ తర్వాత ఆయిల్‌పామ్‌ తోటల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న ఈ పంట తాజాగా కోస్తా, రాయలసీమ జిల్లాలకూ విస్తరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,199 హెక్టార్లలో ఇది సాగవుతుండగా.. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 22,015 హెక్టార్లలో విస్తరించింది. 

బహుళ ప్రయోజన పంటగా.. 
నాటిన మూడో ఏడాది నుంచి మొదలయ్యే కోకో దిగుబడి కనీసం 40 ఏళ్లపాటు కొనసాగుతుంది. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా సాగు చేసే కోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి రెండు టన్నుల ఆకులు రాలి నేలలో కలిసిపోతాయి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమిపై ఏర్పడే ఆకుల పొర వల్ల కలుపు శాశ్వతంగా నిర్మూలించబడుతుంది. ఇదే సందర్భంలో తోటల్లోని భూమిలో తేమ శాతం నిలిచి ఉండి ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. పైగా కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో పిందె రాలిపోవడాన్ని నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగు చేయడం వల్ల ప్రధాన పంటల్లో 20 శాతం దిగుబడి పెరుగుతుందని సీటీఆర్‌ఐ స్పష్టం చేసింది.  

ఏలూరులో కోకోవా, వెనీలా ప్లాంట్‌ 
రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు సాగు ఖర్చుల కింద మూడేళ్ల పాటు హెక్టారుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. సూక్ష్మ సేద్య పరికరాలపై చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఇదిలావుండగా.. ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు 
చేయబోతోంది. 

మూడెకరాల్లో కోకో వేశా 
ప్రభుత్వం ప్రోత్సాహంతో అంతర్‌ పంటగా గతేడాది 3 ఎకరాల్లో కోకో మొక్కలు నాటాను. ఉద్యాన శాఖ అధికారులు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. 
    – కె.గంగాధర్, రామన్నగూడెం, ప.గోదావరి

రైతుల ఇంటి వద్దే కొనుగోలు 
కోకో సాగు విస్తరణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. రైతులకు అన్నివిధాలుగా సాంకేతిక సహకారం అందిస్తున్నాం. రైతుల ఇంటి వద్దకే వెళ్లి కోకో కాయలను కొనుగోలు చేస్తున్నాం.  
– ఎ.రవీంద్రరావు, అసిస్టెంట్‌ మేనేజర్, క్యాడ్బరీ 

ప్రభుత్వం ప్రోత్సాహం 
కోకో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో పూర్తి స్థాయిలో కోకోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.     
– పావులూరి హనుమంతరావు, జాయింట్‌ డైరెక్టర్, ఉద్యాన శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement