Government of Andhra Pradesh
-
కాంతి లేని కూటమి పాలన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది. పాలనపై తనదైన ముద్ర వేయ డానికి ఇది సరిపడ సమయంగానే భావించ వచ్చు. అందునా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి 7 నెలలు గణనీయమైన సమయంగానే పరిగణించాలి. ముందుగా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. ‘నీకు 15,000... నీకు 15,000’గా పాపులర్ అయిన ‘తల్లికి వందనం’ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తామని తాజగా ప్రకటించి మరో వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పథకం మునుపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’కి పేరు మార్పు పథకం. అంటే, ఉన్న పథకానికి తిలోదకాలు ఇచ్చి కొత్త పథకం ఇవ్వకుండా ‘అప్పు రేపు’ తరహా గోడ మీద రాత గారడీ చేయడమే! ‘దీపం’ పథకాన్ని చంద్రబాబు మార్కు చాకచక్యంతో ముందుగానే అరకొరగా అమలు చేసే ప్రణా ళిక సిద్ధం చేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న హామీపై నోరు మెదపట్లేదు. అలాగే, ప్రతి మహిళకూ సంవత్సరానికి రూ. 18,000 ఇస్తా మంటూ చేసిన వాగ్దానమూ అటకెక్కినట్టే ఉంది. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉగాదికి అని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో వేచి చూడాలి. రైతులకు వాగ్దానం చేసిన సంవత్సరానికి 20 వేల రూపాయల పథకం రేపో మాపో అని దాటేస్తున్నారు – ఇది కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పథకమే అయినప్పటికీ వారు ఇచ్చిన రూ. 13,500 కూడా గడచిన సంవత్సరానికి ఇంకా ఇవ్వనేలేదు. వెరసి, ‘సూపర్ సిక్స్’ హమీలలో ఒక్కటి కూడా చిత్త శుద్ధితో అమలు చెయ్యలేదు అనేది సుస్పష్టం.‘నాడు–నేడు’ పథకం ద్వారా పెక్కు ప్రభుత్వ బడులను జగన్ ప్రభుత్వం ఆధునీకరించి, మరుగుదొడ్ల నిర్వహణకై ప్రత్యేక నిధులు కేటాయించి, పిల్లలకి స్వచ్ఛమైన వాతావరణం కల్పిస్తూ అధ్యాపకులకీ, పిల్లల తల్లి–తండ్రులకీ పర్యవేక్షణ అప్పజెబితే, లోకేష్ అధ్యాపకులకు ఉపశమనం పేరిట పర్యవేక్షణ పద్ధతికి తూట్లు పొడిచారు. పేద పిల్లలకు ఇంగ్లీషు చదువు చెప్పించి విప్లవాత్మకమైన మార్పులు జగన్ తెస్తే, మాతృ భాష పేరుతో సదస్సులు పెట్టి తమ అస్మదీయులైన మాజీల నోటితో ఆ పథకానికి తెర దించే కార్యక్రమం మొదలు పెట్టారు. బుడమేరు వరద తీవ్రతను ముందుగానే అంచనా వేయలేక పోవటం, ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించలేకపోవటంలో ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార లెక్కల ప్రకారంగానే 45 మంది చనిపోయారంటే ధన, ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే అత్యంత సున్నితమైన తిరుపతి లడ్డూ వివాదానికి తెరలేపటం చాలా దిగజారుడు చర్యగా నిలిచిపోతుంది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ హావభావ కేళి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది.పవన్ కల్యాణ్ ప్రతి విషయానికీ గత ప్రభుత్వానిదే బాధ్యత అనడం ఒక రివాజుగా పెట్టుకున్నారు. అది ఎంత చవకబారు స్థాయికి చేరిందో ఇటీవల జరిగిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్‌కి వచ్చి రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇద్దరు యువకుల ఉదంతం చెబుతుంది. కనీసం ఆ కుర్రాళ్లు చనిపోయిన రహదారి తీరు ఎలా ఉందో తెలుసుకోకుండా జగన్ రోడ్లు బాగు చేయకపోబట్టే వారు చనిపోయారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటు. మరుసటి రోజు స్వయానా ఆయనే వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్రాలలో చక్కని రోడ్డు కనిపిస్తూనే ఉంది. పై పెచ్చు యువతను బైక్ స్టంట్లు చేయమని, సైలెన్సర్లు తీసేసి రచ్చ చేయమని ఒక సినీ వేదిక పైనుంచి పిలుపు నివ్వడం అత్యంత హేయమైన చర్య. రాష్ట్రంలో జరిగిన ప్రతిపక్ష కార్య కర్తల బహిరంగ హత్యలు, నేతల అరెస్టులు ఒక ఎత్తయితే, సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన వేల కొలది కేసులు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగం. చంద్రబాబు వాగ్దానాలు నీటిమూటలనే విషయం ఇప్పుడు కళ్ళు తెరిచి పరిశీలించగలిగే ఎవరికైనా అర్థమవుతుంది. ‘సూపర్ సిక్స్’ అని హమీ ఇచ్చిన వారికే వాటిపై విశ్వాసం లేదు అనేది ఇప్పుడు అందరికీ విదితమయ్యింది. అయితే, ఇవన్నీ తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా? సామాజిక సమీకరణాలే తప్ప ప్రభుత్వ పనితీరు కానీ, వాగ్దానాల అమలుపై నమ్మకం గానీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత సంత రించుకోవా? రానున్న కాలం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com -
బడికి ఉరి!.. ముంచుకొస్తున్న ప్రమాదం
ప్రతి గ్రామంలో రెండు, మూడు వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే.. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యా శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 3–5 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపేస్తున్నట్టు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే.. తెచ్చిన మార్పు ఓ ఐదేళ్లపాటు కొనసాగాలి, తర్వాత దానిలోని లోటుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి. కానీ.. ఇక్కడ జీవో117 ద్వారా 2022 జూన్‌లో తెచ్చిన విధానాలను కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ.. జీవో–117లో ఉన్న మంచి పోయి.. కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది.కొత్త విధానంతో 10 వేల సబ్జెక్టు టీచర్ల మిగులుజీవో–117 రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దుచేసి, ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి. లేదా 117 జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి. లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసురావాలి. కానీ.. ఈ మూడు విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు.. ఏలూరు జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో 27 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ నమోదైంది. ఆరో తరగతిలో 19 మంది, 7వ తరగతిలో 17 మంది, 8వ తరగతిలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత తరగతులు ఉన్నందున ఇక్కడ ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు బోధన అందిస్తున్నారు. అయితే, 6, 7, 8 తరగతుల్లో మొత్తం 50 మంది విద్యార్థులే ఉన్నందున కొత్త మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడ యూపీ స్కూల్‌ను రద్దు చేస్తారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులు 27 మంది 2025–26 విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో కొనసాగితే అప్పుడు 6, 7, 8 తరగతుల్లో 63 మంది, 9వ తరగతిలో 14 మంది మొత్తం 77 మంది ఉన్నందున ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తారు. కానీ.. అక్కడ బోధనకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను రద్దు చేసి, ఎస్జీటీలను మాత్రమే ఇస్తుంది. అంటే హైస్కూల్‌గా మారినా పరిస్థితి మెరుగుపడకపోగా.. ఉన్న పోస్టులు సైతం వెళ్లిపోయి అప్‌గ్రేడ్‌కు బదులు డౌన్‌గ్రేడ్ అయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,760 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఇలాగే మారే ప్రమాదముంది. ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవో–117 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. దీంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు 8 సెక్షన్లు కొనసాగుతున్నాయి. 180 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కరు చొప్పున.. గణితం, ఇంగ్లిష్‌కు ఇద్దరు చొప్పున 12 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపిస్తే ఉన్నత తరగతుల్లో 140 మంది విద్యార్థులతో 5 సెక్షన్లే మిగులుతాయి. దీంతో ఒక గణితం, ఒక ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, మరో రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు తగ్గిపోతాయి. ఇలానే జీవో–117 ద్వారా 3–5 తరగతులు విలీనమైన 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతమున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సగటున మూడు చొప్పున 10 వేల పోస్టులు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో 10 వేల స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఉంటాయి. ఇంత భారీగా మిగులుతున్న స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు.34 వేల ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావంప్రస్తుతం జీవో–117 ప్రకారం ఉన్నత, యూపీ స్కూళ్లకు కి.మీ. పరిధిలో ఉన్న 4,731 ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. వీరికి సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నారు. అలాగే, 1, 2 తరగతుల్లో 10 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్నా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 117 జీవోను రద్దు చేసి, 3–5 తరగతులను తిరిగి వెనక్కి తెస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతేగాక, 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగించకుండా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం కి.మీ. పరిధిలో 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులనే విలీనం చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 34 వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో విలీనం చేస్తారు. దీని ప్రకారం మూడో తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం 5 కి.మీ. దూరం దాటి వెళ్లాలి. లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఇక 1, 2 తరగతుల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన అప్పటి టీడీపీ సర్కారు.. తాజాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది ఒక ఎత్తయితే ప్రస్తుతం మారుమూల గ్రామాలు, పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాల్లో (హేమ్లెట్స్) దాదాపు 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1–5 తరగతులు చదివే విద్యార్థులు తరగతికి నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు. కూటమి కొత్త మోడల్ ప్రకారం ఇకపై వీటిలో 3 నుంచి 5 తరగతులు చదివే వారు ఇకపై గ్రామం దాటిపోవాల్సిందే.ఆ హైస్కూళ్లకు హెచ్ఎం పోస్టు ఉండదుప్రస్తుతం రాష్ట్రంలో 6,700 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. కూటమి సర్కారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే అక్కడ ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే దాదాపు రెండు వేల హైస్కూళ్లకు హెచ్ఎం, పీఈటీలు ఇకపై ఉండరు. కాగా.. 297 ఉన్నత పాఠశాలల్లో 75 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 297 స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్వస్తి పలకనున్నారు. అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోనూ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను బదిలీ చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లు లెక్కించి ఆమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. దాని ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ఎన్రోల్మెంట్ మొదటి 53 మంది వరకు ఒక సెక్షన్, 54 నుంచి 88 వరకు రెండో సెక్షన్, 89 నుంచి 123 వరకు మూడో సెక్షన్‌గా గుర్తించి టీచర్లను ఇచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 54 మంది విద్యార్థుల వరకు ఒక సెక్షన్, 55 నుంచి 94 వరకు రెండో సెక్షన్, 95 మంది నుంచి 3వ సెక్షన్‌గా నిర్ణయించారు. కొత్త దానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్ మంజూరు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని, ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధ్యాయుల మిగులతో డీఎస్సీపై ప్రభావం కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. 7 నెలలు దాటినా ఇప్పటివరకు నోటిఫికేషన్ జాడ లేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపు 15 వేలకు పైగా పోస్టులు మిగులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో స్కూల్ అసిస్టెంట్లే దాదాపు 5 వేలకు పైగా, ఎస్జీటీలు మరో 10 వేలు మిగిలే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీలో ఖాళీలను ఎక్కడ నుంచి చూపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి: ఏపీటీఎఫ్ అమరావతిఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. జీవో–117 రద్దు చేస్తున్నందున అంతకు ముందున్న వ్యవస్థను పునరుద్ధరించి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వారానికి 10 పీరియడ్లు గణితానికి కేటాయించాలని, 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టని పక్షంలో జీవో–117 రద్దు వల్ల హైస్కూల్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉన్నత పాఠశాల విద్య నిర్వీర్యం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సందడి లేని సంక్రాంతి
చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి ప్రజల దిగాలుపండగంటే కొత్త దుస్తులు, పిండి వంటలు, కొత్త వస్తువుల కొనుగోళ్లు, ఇంటికొచ్చిన బంధువులకు కానుకలు, చుట్టుపక్కలోళ్లకు పెట్టుబతలు.. గ్రామస్తులంతా తలో చేయి వేసి నిర్వహించే సామూహిక సంబరాలు.. ఇలా కోలాహలం కళ్లకు కట్టేది. ఈ ఏడాది ఏ ఊళ్లో అయినా ఇలాంటి సందడి కనిపిస్తుందేమోనని దివిటీ పట్టుకుని వెతికినా కనిపించని దుస్థితి. అన్ని వర్గాల ప్రజల్లో అదో నిర్లిప్తత, నైరాశ్యం. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై ‘సాక్షి’ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించాయి. ‘ఆనందంగా పండుగ చేసుకోవాలని ఉంది. అయితే అందుకు చేతిలో నాలుగు డబ్బులుంటేనే కదయ్యా..’ అని అంటున్నారు ఊరూరా జనం. పండగ అంటే గత ఐదేళ్లలోనే అని గుర్తు చేసుకున్నారు. ‘ఊళ్లో పరిస్థితి బాగోలేదు.. ఇంట్లోనూ అందుకు భిన్నంగా లేదు’ అని పెద్దలు వాపోయారు. ‘స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ ఆగిపోయాయి.. సచివాలయాల్లో పనులు కావడం లేదు.. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి.. ఇంటికొచ్చి పని చేసి పెట్టే వలంటీర్లు కనిపించడం లేదు.. నెలకు రెండుసార్లొచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారో తెలీదు.. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా లేదు.. మత్స్యకార భరోసా లేదు.. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం.. ఇళ్లకు పంపించేస్తున్నారు.. పరిస్థితి ఇట్లా ఉంటే ఏంది పండుగ చేసుకునేది?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో ఊరారా ఇదే దుస్థితి కనిపించింది. అందరి నోటా ఇదే మాట వినిపించింది. మొత్తానికి రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ కళ తప్పింది.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘అవసరానికి అందివచ్చే డబ్బులు.. కష్టకాలంలో ఆదుకునే పథకాలు.. వెరసి ప్రతి రోజూ పండుగ రోజే’ అన్నట్లుగా గత ప్రభుత్వ పాలనలో ప్రతి పేద ఇంటిలో సంతోషం కనిపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతో ‘అవసరానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. కష్టకాలంలో పట్టించుకునే నాథుడే కరువు.. పెద్ద పండుగ వస్తున్నా కన్పించని సందడి’ అన్నట్లు ప్రతి ఇల్లూ మారిపోయింది. రాష్ట్ర ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి సందడి ఈ ఏడాది ఊళ్లల్లో కనిపించడం లేదు. గడిచిన ఏడు నెలల్లో సంక్షేమాభివృద్ధి ఆగిపోవడమే ఇందుకు కారణం. దేశంలోనే సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన ‘నవరత్నాలు’ ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల గడపకు చేరడం లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ (డీబీటీ పద్దతి) చేస్తూ గత సర్కారు అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కనీసం కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ సైతం అమలు చేయక పోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఐదేళ్లు మహోజ్వల వైభవంగత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, చెప్పిన నెలలో చెప్పిన సమయానికి ఆయా వర్గాలకు ఆర్థిక లబ్ధిని వారి ఖాతాలకు (డీబీటీ పద్దతి) నేరుగా జమ చేసేవారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి రోజువారీ అవసరాలకు చేతిలో డబ్బులు ఉండేలా చేశారు. తద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. విద్యార్థులు, లాయర్లు, ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లతోపాటు పొదుపు మహిళలు, రైతులకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఆర్థిక లబ్ధిని కలిగించే సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించడంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రజలు ఆర్థిక ఇక్కట్లను అధిగమించి కొనుగోలు శక్తి కొనసాగేలా చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పర్వదినాల్లో కొత్త దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సామగ్రి, పిండి వంటలకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునేలా చేశారు. ప్రధానంగా విద్య, వైద్యం పరంగా దిగుల్లేకుండా చేశారు. సచివాలయ–వలంటీర్ వ్యవస్థతో ఉన్న ఊళ్లోనే పనులన్నీ జరిగేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి మార్పుల దిశగా గత 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ అడుగులు పడలేదు. అలాంటి మార్పులను.. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో సాకారం చేసింది. తద్వారా ఉన్నత వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా పండుగలను ఆనందంగా జరుపుకొనేలా ఆర్థిక ఊతం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లలో కోత పెట్టేందుకు కుయుక్తులు పన్నుతుండటంతో పాటు మరో పథకాన్ని ప్రజలకు అందివ్వలేదు. ఏడు నెలలైనా ఒక్క పథకాన్ని కూడా అందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. గతంలో తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు చేతికి వచ్చేవని, ఆ డబ్బులతో కావాల్సినవి కొనుక్కుని ఇంటిల్లిపాది పెద్ద పండుగను గొప్పగా జరుపుకొనేవాళ్లమని గతం గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. కూటమి సర్కారు రాకతో తమ పరిస్థితి తారుమారైందని వాపోతున్నారు. గత సర్కారే కొనసాగి ఉంటే గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలు పథకాల ద్వారా దాదాపు 2.63 కోట్ల మందికి రూ.20,102 కోట్లçకుపైగా లబ్ధి చేకూరేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పథకాలు అందక పోవడంతో పండుగ పూట పస్తులు తప్పడం లేదని పేదలు ఆవేదన చెందుతున్నారు.అసంపూర్తి గదిలో పాఠాలుఇది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇందులో దాదాపు 220 మంది చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిది తరగతి గదుల నిర్మాణానికి రూ.1,93,88,511 మంజూరయ్యాయి. భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వంలోనే రూ.75,42,872 ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిగిలిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గదులకు కిటికీలు, డోర్లు, టైల్స్ అమర్చాల్సి ఉంది. బయటి వైపు ప్లాస్టింగ్ చేయాలి. గదుల కొరత కారణంగా అసంపూర్తిగా ఉన్న నూతన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్ధులకు ఎండ తగలకుండా ఉండేందుకు యూరియా సంచులు అడ్డు పెట్టారు. బంధువులను పిలవలేకపోతున్నాంగత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల ఫీజు కట్టే వాళ్లం. ఈసారి ‘తల్లికి వందనం’ సాయం అందలేదు. పంటలో వచ్చిన డబ్బులన్నీ స్కూల్ ఫీజులకే చాలడం లేదు. పండుగ వచ్చినా మా ఇంట్లో ఎలాంటి సంబరాలూ చేసుకోలేని స్థితి. మా చుట్టుపక్కల ఏ గ్రామంలో చూసినా సంక్రాంతి సందడి కనిపించడం లేదు. చాలా మందితో ఫోన్లో మాట్లాడితే ఇదే సమాధానం చెబుతున్నారు. బంధువులను కూడా ఇళ్లకు పిలవలేని పరిస్థితి నెలకొంది.– రైతు గోవిందప్ప, సంతేబిదనూరు, హిందూపురంఇప్పుడు ఆ సందడి లేదువిజయనగరం పట్టణం మూడు రాష్ట్రాలకు వాణిజ్య కేంద్రం. గత ఐదు సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కంటే ఉమ్మడి విజయనగరం ప్రజల నుంచి మార్కెట్లో కొనుగోలుదారులు పెరిగారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ వ్యాపారం తగ్గింది. ముఖ్యంగా బడుగు మధ్యతరగతి ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. గతంలో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి వ్యాపారాలు ఉండేవి. అటు హోల్‌సేల్ ఇటు రిటైల్ వ్యాపారాలతో పట్టణం కళకళలాడేది. ఇప్పుడా సందడి కనిపించడం లేదు.– కాపుగంటి ప్రకాష్, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్కొనుగోలు శక్తి తగ్గిందిగత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో కరోనా వచ్చినప్పటికీ సంక్రాంతంటే మార్కెట్ కళకళలాడేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవడానికి అండగా నిలుస్తాయి. ఇప్పుడు ఏ పథకాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోళ్లు లేక ఈ సంక్రాంతి కళ తప్పింది. – షేక్ చాంద్‌బాషా, మండీ మర్చంట్, పాత మార్కెట్, కడప సంక్రాంతి పండగలానే లేదుఈ ఏడాది సంక్రాంతి కళ మా గ్రామంలో కనిపించడం లేదు. వ్యాపారాలు పడిపోయాయి. గ్రామస్తుల దగ్గర డబ్బులు లేవు. రొటేషన్ లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది. గ్రామంలో మా కిరాణా షాపు గత ఏడాది వరకు రోజుకు రూ.15 వేలు అమ్మకం జరిగేది. ప్రస్తుతం రూ.5 వేలు కూడా అమ్మకం జరగడం లేదు.– లావుడియా శ్రీనివాసరావు, సర్పంచ్, కనిమెర్ల, ఎన్టీఆర్ జిల్లాసంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డాంపశువులు, వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గత ఆర్నెల్లుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కనీసం సంక్రాంతి కానుకైనా ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. అది కూడా లేకుండా చేశారు. పెరిగిన పప్పులు, నూనెల ధరలు చూస్తుంటే పండుగకు పిండి వంటలు మానుకోవడమే ఉత్తమంగా కన్పిస్తోంది. ఈ ఏడాది మాలాంటోళ్లందరూ ఇలానే అంటున్నారు. – ఎస్.భవాని, కొత్తవలస, విజయనగరం జిల్లాపంట మునిగినా పైసా ఇవ్వలేదు.. ఇంక పండగెక్కడ?వైఎస్సార్ హయాంలో కాలనీ ఇల్లు వచ్చింది. అందులోనే ఉంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి అమ్మ ఒడి పడేది. పదో తరగతి పూర్తయింది. మాకు 30 సెంట్లు భూమి ఉంది. గత ఏడాది వరకు జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడిసాయం ఇచ్చేది. రైతులం పంటలు పండించుకునేవాళ్లం. ఈసారి ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పోసప్పో చేసి పంట వేశాం. మొన్న అక్టోబర్‌లో వర్షాలకు పొలం మునిగిపోయింది. పంట నష్టం ఇస్తామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాను. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంక మా బతుకులకు పండగొకటి. అన్నిటికీ ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. – పల్లా రాము, రైతు, టి.నగరపాలెం, భీమిలి నియోజకవర్గంగత ప్రభుత్వంలోనే ఎంతో మేలుప్రస్తుతం ఏ కుటుంబమూ సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఓ వైపు ఆర్థిక సమస్య, మరోవైపు ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ఉంటే పిండి వంటలు ఎలా వండుకుంటాం? సంతోషంగా పండగ ఎలా జరుపుకుంటాం? గత ప్రభుత్వ హయాంలోనే ఎంతో మేలు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మా బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేది. ఖర్చులకు, అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్య తరగతి ప్రజలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – సీహెచ్ భారతి, గృహిణి, నెల్లూరుచేతిలో లెక్కేదీ?వైఎస్సార్ జిల్లా అనిమెల గ్రామంలో సుమారు 2,500 జనాభా ఉంది. ఈ గ్రామంలో గత ఐదేళ్లు సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కళ తప్పింది. పండుగ ఆనందం ఏ ఒక్క ఇంట్లోనూ కనిపించలేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లు దిగుబడులు లేకపోగా, వచ్చిన అరకొర దిగుబడికి ఆశించిన ధరలు లేక రైతులు ఆవేదనతో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఒక్క గ్రామానికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.1.8 కోట్లు లభించింది. ఈ లెక్కన ప్రజల చేతుల్లో డబ్బు ఏ రీతిన రొటేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని గ్రామస్తులు అన్నారు. ఏం ఉందని జరుపుకోవాలి?బాపట్ల జిల్లా రాజుబంగారుపాలెంలో 3,200 కుటుంబాలుంటున్నాయి. ఈ ఊళ్లో దాదాపు అందరూ సామాన్యులే. ‘ఏమ్మా.. పండుగ ఎలా చేసుకుంటున్నారు..’అన్న ప్రశ్నకు రైతులు, కూలీలు, చిరువ్యాపారులు, ఆటోవాలాలు, కూరగాయలమ్ముకునే మహిళలు.. ఇలా అందరూ కూడబలుక్కున్నట్లు ఒకే సమాధానం చెప్పారు. అమ్మ ఒడి రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. చేయూత రాలేదు. ధాన్యం పండిస్తే మద్దతు ధర ఇవ్వలేదు.. అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ఊరిని నమ్ముకొని చికెన్ కొట్టు పెట్టుకుంటే జనం దగ్గర డబ్బులు లేక కొట్టు మూయాల్సి వచ్చిందని వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. పిల్లోళ్లకు బట్టలు కొందామంటే డబ్బులు లేక ఉప్పుకయ్యల్లో పనికెళుతున్నానని జొన్నలపావని కన్నీటి పర్యంతమైంది. జగనన్న లాగా నెలనెలా డబ్బులు ఇచ్చివుంటే అందరం సంతోషంగా పండుగ చేసుకునేవారమని సరస్వతి పేర్కొంది. పింఛన్లు తీసేశారని కొందరు, రైతు భరోసా ఇవ్వలేదని ఇంకొందరు వాపోయారు. ఇలాంటి కష్టాల్లో పండుగ ఎలా జరుపుకోగలమని ఊరు ఊరంతా ఎదురు ప్రశ్నిస్తోంది. సాయం అందితే కదా..కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం (వీకే రాయపురం) గ్రామంలో ఎవరిని కదిపినా చేతిలో డబ్బులు లేకుండా పండుగ ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సుమారు 2,600 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ వీధిలో ఎవరిని పలకరించినా జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, అర్హులందరికీ పథకాలు రావడంతో గత ఏడాది సంక్రాంతిని ఊరు ఊరంతా హుషారుగా పండగ చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక వరుస తుపానులతో పంటలు నష్టపోయినా సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక మినీ రైస్‌మిల్లు గత సంక్రాంతికి ముందు కస్టమర్లతో కిక్కిరిసిపోయేదని, ఈ సంక్రాంతికి రోజుకు ఐదుగురు రావడమే గగనమైపోయిందని యజమాని రేలంగి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మద్యం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గ్రామంలోకి వచ్చేయడంతో రోజంతా కష్టపడ్డ రెక్కల కష్టంలో సగం సొమ్ము మద్యానికే వెచ్చించడం కుటుంబాల్లో చిచ్చు రేపుతోందని మహిళలు అంటున్నారు. నాడు వలంటీరు వ్యవస్థతో ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు ఏ పని కావాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడు చేపల కథ!
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్ ఆఫ్ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్‌ను కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్‌టైమ్ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్ సర్కారే కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్ సర్కార్‌లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్ టెక్’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్సెన్స్ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్ మాఫ్! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్ కల్యాణ్ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్‌తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్ స్కీమ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
క్షమార్హం కాని నేరం!
కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో బుధవారం ఒక మహాపరాధం జరిగిపోయింది. కేవలం పాలకుల చేతగానితనంవల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. శతాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో ఎన్నడూ ఇటువంటి దారుణ ఉదంతం చోటుచేసుకున్నట్టు నమోదు కాలేదు. రాచరికం మొదలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ ఎందరెందరో పాలకులొచ్చారు. కానీ ఎప్పుడూ ఎవరూ ఇంత చేటు నిర్లక్ష్యం ప్రదర్శించిన దాఖలా లేదు. ఇదే దారుణమనుకుంటే... దుర్ఘటన జరిగింది మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసబెట్టి బాహాటంగా ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలు ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గురువారం బైరాగిపట్టెడ దగ్గర కెమెరాల కోసం ‘ప్రజాకోర్టు’ నిర్వహించి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడటమైనా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి క్షతగాత్రులు కోలుకోకుండానే ఆదరాబాదరాగా ఆస్పత్రినుంచి వారిని పంపటానికి ప్రయత్నించిన తీరైనా బాబు వంచనాత్మక విన్యాసాలకు పరాకాష్ట. ఇవే కాదు... జరిగిన ఘోరంపై టీటీడీ చైర్మన్ మొదలుకొని మంత్రుల వరకూ ఒక్కొక్కరు వినిపిస్తున్న కథలు విస్తు గొలుపుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే సమాచారం ఉన్నదని చైర్మన్‌గిరీ వెలగ బెడుతున్న బీఆర్ నాయుడు చెబుతున్నారు. మరి వీరంతా కలిసి చేసిందేమిటి?అసలు ఏమైంది ఈ ప్రభుత్వానికి? ఎందుకింత చేష్టలుడిగిపోయింది? వైకుంఠ ఏకాదశి పర్వ దినం మొదలు వరసగా పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమేకాదు... దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారని తెలుసు. అందుకోసం సీఎం కార్యాలయం మొదలుకొని టీటీడీలో అట్టడుగు సిబ్బందివరకూ పకడ్బందీ సమన్వయంతో ముందుకు సాగాలనీ తెలుసు. అంతక్రితం కేవలం రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాన్ని భక్తుల సంఖ్య నానాటికీ పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పదిరోజులకు పెంచింది. భక్తులు సజావుగా దర్శనం చేసుకుని తరించటానికి వీలుగా 9 కేంద్రాల్లో పదేసి కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. 24 గంటలముందే తెల్లారుజామున అయిదు గంటలకు టోకెన్ల జారీ మొదలయ్యేది. కానీ దీన్నంతటినీ తలకిందులు చేసి ముందురోజు అర్ధరాత్రి నుంచీ వేచి వున్న భక్తులను ఒకచోట చేర్చి రాత్రి ఎప్పుడో టోకెన్లు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెల్లారుజాము నుంచి రాత్రి వరకూ సిబ్బంది ఏం చేసినట్టు? కనీసం టోకెన్ల కోసం ఆరుబయట పడిగాపులు పడుతున్న భక్తుల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారన్న స్పృహ... వారికి తిండీ నీళ్లూ అందించాలన్న ఇంగితజ్ఞానం ఉండొద్దా? వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూలైన్లలో పంపి, వెంటవెంటనే టోకెన్లు జారీ చేయొద్దా? ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి గనుక జిల్లాల్లోనే ఆన్లైన్లో టోకెన్లు అందించే ప్రక్రియ అమలుచేయొచ్చు. అదే జరిగితే భక్తులందరూ స్వామివారిని తనివితీరా వీక్షించి, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకునేవారు. కానీ పక్షవాతం వచ్చిన చందంగా ఎవరికివారు చేష్టలుడిగి ఈ ఘోర ఉదంతానికి కారకులయ్యారు.దీన్నంతటినీ కప్పిపుచ్చుకోవటానికి జిల్లా ఎస్సీని బదిలీ చేశారు. ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈవో, జేఈవోను వదిలేశారు. మరి శాంతిభద్రతల విభాగం దగ్గరుంచుకుని బాబు చేసిందేమిటి? ప్రమాణస్వీకారానికి ముందే తమ కనుసైగలతో ఊరూ వాడా దాడులూ, దౌర్జన్యాలూ, సామాన్య పౌరుల ఇళ్లు నేలమట్టం చేయించి మాఫియాలను తలపించే పాలనకు శ్రీకారం చుట్టిన పర్యవసానం కాదా ఈ ఉదంతం? తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచా రానికి పాల్పడలేదా? ఈ నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నారా? ఎన్ని కేసులుంటే అంత గొప్పగా నెత్తెక్కించుకుంటామని అధికారంలోకి రాకముందు టీడీపీ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచిన ఘనత వీరిది. ఇప్పుడు పోలీసులకూ అదే రంధి పట్టుకుంది. ఎంతమందిపై అక్రమ కేసులు పెడితే అంతగా నజరానాలు పొందొచ్చన్న దురాశ పుట్టింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈమూలనుంచి ఆ మూలకు తిప్పుతున్నారు. ఇక శాంతిభద్రతలు ఎటుపోతేనేం... పర్వదినాలకు వచ్చే భక్తులు ఏమై పోతేనేం! దేవుడంటే భయ భక్తుల్లేవు... ప్రజలంటే వెరపు లేదు! ఈ దుఃస్థితికి ఎన్డీయే కూటమి పాలకులు సామూహికంగా సిగ్గుపడాలి. విశాఖలో స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మెప్పు పొంద టానికి బాబు, పవన్, లోకేశ్‌లు అగచాట్లు పడితే... అక్రమ కేసుల పరంపరతో ఆ ముగ్గురి దగ్గరా మార్కులు కొట్టేద్దామని అధికార యంత్రాంగం పాట్లు పడుతోంది. వెరసి ఇలాంటి దారుణాలు రివాజయ్యాయి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది. 2015లో తన ఏలుబడిలో, తన వల్ల, తన సమక్షంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మరణానికి దారితీసిన ఉదంతాన్ని బాబు సోమయాజులు కమిషన్‌తో కప్పెట్టటాన్ని ఎవరూ మరిచిపోరు. కనుక తిరుపతి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. టీటీడీ చైర్మన్‌తో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -
జగన్ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్మోహన్రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
ఇంగ్లిష్ మీడియంపై అక్కసు ఎందుకు?
ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరం. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగు వర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. కానీ దళిత బహుజనులు ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేయడం న్యాయం కాదు. తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తీర్మానం సామాజిక న్యాయానికి విరుద్ధమైనది, నిజాయితీ లోపించినది.తెలుగు నేలలో ఈ నాలుగు దశాబ్దాల్లో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యా, భాషా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు హరిత విప్లవం తరువాత సంపన్న వర్గాలుగా మారాయి. ఒకనాడు జమీందారీ విధానం మీద పోరాడిన ఈ వర్గాలు ఆ తరువాత అవకాశ వాదంగా బ్రాహ్మణవాద కులాధిపత్యాన్ని స్వీకరించాయి. భూమి పంపకాన్ని నిరాకరిస్తూ భూస్వామ్య గుత్తాధిపత్యంతో రాజ్యాధి కారాన్ని చేపట్టాయి. అంతకుముందు వీళ్లు తెలుగు భాషకు పట్టం గట్టారు. కానీ తెలుగు విద్య వల్ల తమ పిల్లలకు ఉద్యోగ వసతి రాదనీ, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపా దించాలంటే ఇంగ్లిష్ విద్య అవసరమనీ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ విద్యను దెబ్బతీశారు. ఎవరైతే తమ పిల్లలకు, మనవళ్ళకు బుద్ధిపూర్వకంగా తెలుగు రాకుండా చేసి వారి దేశీయత మీద గొడ్డలివేటు వేశారో, వారే మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కానీ దీన్ని తెలుగు మీద ప్రేమ అనలేము. ‘భూస్వామ్య ఆధిపత్యానికి కూలీలు ఎవరు దొరుకుతా’రనే భావనతోనే బడుగులకు తెలివిగా ఆంగ్ల మాధ్యమ నిరాకరణ జరుగుతోంది.నిజానికి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ లాంటివాళ్లు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక వహించడానికి వారి ఇంగ్లిష్ విద్యే కారణం. అంబేడ్కర్. భారత రాజ్యాంగంతో పాటు, వేలాది పేజీలు వివిధ అంశాలపై రాయడం ఆయన ఆంగ్ల భాషా అధ్యయనం వల్లే జరిగింది. ఆంగ్ల భాషాధ్యయనం వల్లే రాజా రామ్మోహన్ రాయ్ సతీసహగమన దురాచారానికి ఎదురు తిరగగలిగారు. రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతనం స్థాపించి, నోబెల్ బహుమతి గ్రహీత కాగలిగారు. దీని వెనుక ఇంగ్లిష్ పునరుజ్జీవన ఉద్యమ అధ్యయనం ఉంది. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరమనే విషయం అందరూ తెలుసుకోవాలి. దాన్ని అందిపుచ్చుకుంటూ దళిత బహుజనులు కూడా ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. నిజానికి పోయిన ఐదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలోని స్కూళ్ళల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగువర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే, చదువుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. ఒక సబ్జెక్టుగా తెలుగు అన్ని పాఠశాలల్లో ఉంది. తెలుగును ఆ సబ్జెక్టు నుండి అభివృద్ధి చేయవచ్చును. ప్రతి విద్యార్థికి నూరు పద్యాలు కంఠతా వస్తేనే ఆ విద్యార్థికి పదో తరగతి సర్టిఫికెట్ ఇవ్వండి అని ‘దళిత మహాసభ’ సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భాషోద్ధరణకు సభలు పెట్టినవాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళను, కార్పొరేట్ స్కూళ్ళను నెలకొల్పారు. అందులో రెండవ భాషగా సంస్కృతాన్ని పెట్టి అసలు పిల్లలకు తెలుగే రాకుండా చేశారు. తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసిన ఈ పాలకులే తెలుగు భాషోద్ధరణకు పూనుకుంటున్నామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దళిత బహుజన వర్గాలు ఆంగ్ల విద్య నేర్చుకుని వారు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే అర్హతను సంపా దిస్తారేమో అనే భయం వీరిని వెంటాడుతున్నట్టుంది.ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వంలోనే 56 సంస్కృత కళాశాల లను రద్దుచేసి ఆ కళాశాలల్లోని తెలుగు పండితుల పొట్ట కొట్టారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలను నిర్వీర్యం చేసి తెలుగు భాషా సాహితీ కవితా పరిశోధనల వెన్ను విరిచారు. ఆధిపత్య కులాలు ఏ సబ్జెక్టును చదవడం లేదో గుర్తించి వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఒక్క తెలుగునే కాకుండా వృక్షశాస్త్రాన్ని, జంతుశాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాలను దెబ్బ తీసి ఐటీ సెక్టారుకు ఉపయోగపడే బీటెక్, ఎంటెక్లకే ప్రాధాన్యం ఇచ్చారు. మానవ వ్యక్తిత్వంలోని జీవశక్తిని దెబ్బతీశారు. కుటుంబ సంబంధాలన్నీ నాశనం అయినాయి. తమ సామాజిక వ్యవస్థలను గుర్తించ కుండా దేశం అంతా నాశనం అయిపోయిందని గగ్గోలు పెడు తున్నారు. నిజానికి ఇది స్వీయ వ్యక్తిత్వ దహనం నుండి వస్తున్న ఆక్రోశం. దళిత బహుజనుల వికాసంపైన ద్వేషానలం. ఈ హిపో క్రసీని అర్థం చేసుకోలేనంత అవిద్యలో దళిత బహుజనులు లేరు. ఏ పోరాటానికైనా నిజాయితీ ఉండాలి. అన్ని వర్గాల అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని కాంక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండాలి. తమ కులాలే పైకి రావాలి అనేవారు సామాజిక సంస్కర్తలు కాలేరు. ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా ఆలో చనల్లో విస్తృతి, సామాజిక విప్లవ భావన లేకపోతే వేదికలు మాత్రమే పెద్దవిగా ఉంటాయి; ఆలోచనలు సంకు చితంగానే కనబడతాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి అందరూ సంతాపం తెలపడమే కాక ఆయన తీసుకొచ్చిన ‘సరళీకరణ’ దేశాభివృద్ధిని పొగిడారు. ఈ సరళీ కరణలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలంటే ‘ఇంగ్లిష్ విద్య అందరికీ రావాలి’ అనే భావన అందులో దాగివున్న విషయం మరచిపోయారా? కొన్ని సామాజిక వర్గాల్లో సంస్కర్తలు, సామాజిక విప్లవకారులు తగ్గుతున్నారు. కారణం అట్టడుగు వర్గాల జీవన వ్యవస్థల అభివృద్ధే దేశాభి వృద్ధి అని తెలుసుకోలేక పోతున్నారు. మానవ పరిణామశాస్త్రం అన్ని జీవుల్లో మానవజాతే గొప్పదని నిగ్గుతేల్చింది. మౌఖిక జీవన వ్యవస్థలన్నీ లిఖిత జీవన వ్యవస్థలుగా పరిణామం చెందుతున్న దశ ఇది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోతోంది. విద్య అనేది జ్ఞానం, సంస్కృతి, నాగరికత, చరిత్ర, ఉత్పత్తి, ఉత్పిత్తి పరికరాలను సృష్టించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు విస్తరించి ఉన్నారు. ఆయా వృత్తుల్లో ఆ యా జీవన వ్యవస్థల్లో, ఆ యా దేశ పాలనల్లో వీరు భాగస్వాములౌతున్నారు. దానికి ఆంగ్ల విద్య ఎంతో తోడ్పడిందనేది చారిత్రక సత్యం. అందుకే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, బడుగు వర్గాలకు ఆంగ్ల విద్యను నేర్పడం అవసరం. దీనివల్ల వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంతిమంగా దేశానికే మేలు కలుగుతుంది. జీడీపీ పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశీయ ఎగు మతులు పెరుగుతాయి. ఏ ప్రభుత్వానికైనా పోయిన ప్రభుత్వాల విధానాలనన్నింటినీ రద్దు చేయాలనే భావన మంచిది కాదు. పాలకులు మారుతూఉంటారు. కానీ మంచి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రజల్లో ఎంతో చైతన్యం ఉన్న కాలం ఇది. ఇంగ్లిష్ మీడియంపై ప్రభుత్వం చర్య తీసుకొనే పక్షంలో, అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళను ఒకే విధానంలోకి తేగలరా? ఒకసారి సామాజిక న్యాయ కోణంలో, దళిత, బహుజనుల మేలును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. తెలుగు భాషాభివృద్ధి ఒక జీవన సంస్కృతి. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళడమే దళిత బహుజన సామాజిక తాత్విక ఆలోచన క్రమం. ఇది ఫూలే, అంబేడ్కర్ బాట. ఆ బాటలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్‌లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్‌తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) బి.రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్‌కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
సాక్షి, అమరావతి: వారం.. వారం అప్పులే! బడ్జెట్లోనూ.. బడ్జెట్ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్! చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మూడు నెలల ముందే..మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్ బ్యాంకర్‌ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ సిక్స్, సెవెన్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. అటు అప్పులు.. ఇటు అమ్మకాలుఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అప్పులతోనే అమరావతి!రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే'
సాక్షి, అమరావతి: కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి! పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. పేదింటి తల్లిదండ్రుల ఆరాటం, పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యా రంగాన్ని సమున్నతంగా మార్చాలని తపన పడ్డారు. మునుపెన్నడూ చూడని విద్యా సంస్కరణలు తెచ్చారు. విద్యా బోధనలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకోకుండా మూస విధానాలతో వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు అంతులేని నష్టం జరుగుతుందని గుర్తించారు. పేద కుటుంబాల్లో మరో తరం అణగారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ఓ మేనమామలా అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు. ఐరాస వేదికపై మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా రూ.72,919 కోట్లు వెచ్చించారు. కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు? ఏ ఒక్కరైనా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా? పిల్లల్లో బలమైన ఆసక్తి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరీక్షలు సైతం ఆంగ్లంలోనే రాస్తూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆరాట పడుతున్నారు. గతేడాది 9వ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో 91.33 శాతం మంది పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు 2.20 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయడం.. 1.94 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. తద్వారా పిల్లలు ఇంగ్లీష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ.. ‘దేశంలో పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యం. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువొక్కటే. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత. పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే అది ఇంగ్లీష్ చదువులతోనే సాధ్యమవుతుంది..’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివీ! అందుకు అనుగుణంగానే ఆయన 2020–21లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024–25 నాటికి టెన్త్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు (మిర్రర్ ఇమేజ్), ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమలు టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనేవైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో 2023 – 24లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల చేరికలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1,50,005 అధికంగా నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2023–24 పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి టాప్ 28 మంది విద్యార్థుల్లో 26 మంది ప్రభుత్వ స్కూళ్లలో చదివి బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాల సహాయంతో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590 నుంచి 594 వరకు మార్కులు సాధించడం గమనార్హం. జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులను గత ప్రభుత్వం సత్కరించి ప్రోత్సహించింది. ఇంగ్లీష్ మీడియంలో కేరళను దాటిన ఏపీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) 2023లో ఇంగ్లీష్ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచింది. ఈమేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు. సర్వేలో జాతీయ సగటు 37.03 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 84.11 శాతంగా నమోదు కావడం గమనార్హం. కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది. ప్రైవేట్ స్కూళ్లకు 2 లక్షల మంది విద్యార్థులు వైఎస్ జగన్‌పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్‌ను రద్దు చేశారు. అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ 1,000 సీబీఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్లను తొలగించారు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులను నీరుగార్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోవడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా నీరుగారుతోందో చెప్పేందుకు నిదర్శనం. 95% తల్లిదండ్రుల కోరిక ఇంగ్లీష్ మీడియంరాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను బలంగా కోరుకున్నారు. అది ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్ బాట పట్టారు. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలు వివిధ దశల్లో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలోప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై అధ్యయనం నిర్వహించిన జగన్ ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం సేకరించింది. రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఫీజులు ఆర్ధికంగా భారమైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నట్లు చెప్పారు. సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో మరో దారి కానరాక ప్రైవేట్‌లో చేర్చినట్లు వాపోయారు. ఈ క్రమంలో పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రేపటి పౌరుల ఉజ్వల భవిష్యత్తు దిశగా జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. తొలుత ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగా 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్లపై పెరిగిన నమ్మకం మనబడి నాడు–నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2019–20లో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. డ్రాపౌట్స్‌ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా అందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2020 జనవరి 1న జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో రుచికరమైన మెనూతో 16 రకాల పదార్థాలు, ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో ఆహారాన్ని అందచేశారు. గోరుముద్దపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్లు వెచ్చించింది.మేధావుల్లారా ఆలోచించండి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని తెలుగు రచయితల మహాసభల్లో వక్తలు, మేధావులు డిమాండ్ చేశారు. కానీ రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వానికి తెలుగు భాషపై నిజంగా ప్రేమ ఉంటే ప్రతి గ్రామం, పట్టణంలో ఒకేచోట తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మీడియం కావాలంటే అందులో చేరుతారు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు అన్యాయం తలపెట్టవద్దు. – ఎస్.రామకృష్ణ, పురపాలక టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుమీ పిల్లలు ఎక్కడ చదివారు?.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, రచయితలు మూకుమ్మడిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే జీవో 85ను రద్దు చేయాలని కోరడం అత్యంత దుర్మార్గం. వారిలో ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని పాలకులపై ఒత్తిడి తేవాలి. మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదుల పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు, తెలుగు భాషా రచయితల పిల్లలు ఏ మాధ్యమంలో చదివారో.. ప్రస్తుతం ఏ దేశాల్లో ఉంటున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. – బి.మనోజ్‌కుమార్, రమేష్, బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుఏపీలో విద్యా విప్లవాన్ని మళ్లీ వెనక్కి తీప్పాలనే..⇒ తెలుగు మీడియంలో చదివి కష్టపడి న్యాయవాద డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లీష్‌లో సమర్థంగా వాదించే నైపుణ్యం లేక ఎంత డిప్రెషన్‌కు గురవుతున్నారో నేను చూశా. ⇒ ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అంటున్న తెలుగు భాషకు సివిల్ సర్వీస్‌లో ప్రశ్నాపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ⇒ కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లను కన్నడలో బోధించాలని జీవో ఇచ్చినప్పుడు తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్టే చెప్పింది కదా! ⇒ చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది. ఆయన మనవడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కాబోతున్నాడు? ⇒ మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువదించి నోబెల్ ప్రైజ్ పొందే పుస్తకాలు రాయాలిగానీ దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా! ⇒ ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో లేదా రచించాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! ⇒ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. ⇒ ఇంగ్లీష్ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే గానీ అది బతకదు. పోరాటం చేస్తేగానీ ఈ తిరోగమన రథ చక్రం ఆగదు. – ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక విశ్లేషకుడు, ప్రముఖ రచయిత -
సీఎస్‌గా విజయానంద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్‌గా నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు. -
వాన కాటు.. సర్కారు పోటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేయడం రైతులకు ఆశనిపాతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాకం వల్ల మద్దతు ధర దక్కక గగ్గోలు పెడుతున్న రైతులు.. తాజాగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదేలవుతున్నారు. మరో వైపు కళ్లాల్లోని పంట నేలకొరిగి ముంపునకు గురవుతుంటే.. ఇంకో వైపు కోసిన ధాన్యం రాసులన్నీ తడిసి ముద్దవుతున్నాయి. కళ్లెదుటే ధాన్యం మొలకలెత్తి.. రంగు మారిపోతూ.. తేమ శాతం అంతకంతకు పెరిగిపోతుండడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వరుస వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట ఏపుగా ఎదిగే వేళ జూలైలో కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రెండోసారి విత్తుకున్నారు. పంట ఏపుగా ఏదిగే వేళ సెప్టెంబర్‌లో వరదలు, భారీ వర్షాలు దెబ్బతీస్తే.. కోత కోసే సమయంలో ఫెంగల్ తుపాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమేస్తున్నాయి. కృష్ణా డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ఇంకా పంట పూర్తిగా చేనుపైనే ఉంది. ఉత్తరాంధ్ర మొదలు పల్నాడు వరకు 8 లక్షల ఎకరాల్లో పంట చేలల్లోనే ఉంది. శ్రీకాకుళంలో 70 వేల ఎకరాలు, అనకాపల్లిలో 65 వేలు, కృష్ణా డెల్టాలో 80 వేలు, గుంటూరులో 30 వేల, బాపట్లలో 1.82 వేల ఎకరాలు, పల్నాడులో 50 వేల ఎకరాల్లో పంట చేనుపై ఉంది. ఆయా జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట ముంపు నీటిలో చిక్కుకుని నేలకొరిగింది.మొలకెత్తుతున్న ధాన్యం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఆయా జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా కప్పుకునేందుకు టార్పాలిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అద్దెకు తెచ్చుకొని మరీ కప్పుకుంటున్నారు. మరొక వైపు ఒబ్బిడి చేసుకునేందుకు, చేనుపై వరిగిన పంటను కాపాడుకునేందుకు కూలీలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరొక వైపు రైతుల వద్ద సిద్ధంగా ఉన్న 3–4 లక్షల టన్నుల ధాన్యం రంగుమారి, మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర లభించక అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖాధికారులు.. దళారీలు, మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో 75 కేజీల బస్తాకు 300–400 వరకు నష్టపోతున్నారు. వరుస వైపరీత్యాలతో తేమ 20–25 శాతం మధ్య నమోదవుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాలు, మంచు ప్రభావంతో అది 25–30 శాతం వరకు వెళ్లొచ్చని వాపోతున్నారు. 16 లక్షల టన్నుల ధాన్యం మాటేంటి?రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా, 34.92 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 84.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు తొలుత 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించగా, దాన్ని 36–37 లక్షల వరకు పెంచినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే 22.80 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టుగా ప్రభుత్వం చెబుతుండగా, ప్రొక్యూర్మెంట్ వెరైటీస్‌కు సంబంధించి 16 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది. అత్యధికంగా శ్రీకాకుళం, కృష్ణ జిల్లాల్లో 2.50 లక్షల టన్నుల చొప్పున, విజయనగరం జిల్లాలో 1.50 లక్షల టన్నులు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో లక్ష టన్నుల చొప్పున ధాన్యం ఉంది. నాన్ ప్రొక్యూర్మెంట్ వెరైటీస్‌కు సంబంధించి మరో 3–4 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
బాలికా విద్యపై ఇంకా వివక్షా?
భారతదేశ వ్యాప్తంగా దళిత, బహుజన స్త్రీ విద్యపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. నిజానికి గురుకుల హాస్టల్స్‌లోనూ, జనరల్ హాస్టల్స్‌లోనూ విద్యార్థినులు నిరంతరం అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీనికి కారణం పౌష్టికాహార లోపం, శుభ్రతగా ఉండే పరిస్థితుల లేమి, సరైన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడం. అందుకే పిల్లలు రక్త హీనతతో శక్తి లేక కళావిహీనంగా ఉంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంరక్షణ విషయంలో సరైన బడ్జెట్‌ను రూపొందించ లేకపోతున్నాయి. వీరిపట్ల ఎంతో అశ్రద్ధ కనబడుతోంది. వార్డెన్స్‌ను శాశ్వతంగా నియమించకపోవడం, హాస్టల్స్‌కు సొంత భవనాలు లేకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు తగినట్లుగా గదులు లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు బాలికలకు మెరుగైన చదువును నిరాకరిస్తున్నాయి.తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్తుండగా, ఇంట్లో ఆలనా పాలనా లేని జీవన వ్యవస్థలో దళిత బాలికలు ఎంతో సంక్షోభాన్ని అనుభవి స్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల దోపిడీ విధానాలు కూడా పిల్లల నోటికాడి కూడును దొంగిలించే పరిస్థితులు వచ్చాయి. ఇస్తున్న కొద్దిపాటి సామాన్లనే వార్డెన్లు పరిగ్రహించటం, రాత్రుళ్లు కనీసం గర్ల్స్ హాస్టల్స్‌లో కూడా వార్డెన్లు నిద్రించకపోవడం, విద్యార్థులను సొంత పనులకు వాడుకోవడం లాంటి ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గన్‌మెన్ వెంట తిరుగుతూ ఉంటారు. బాలికల హాస్టల్స్‌కు కనీసం ఒక గార్డ్ కూడా కాపలా ఉండడు.సౌకర్యాలు కల్పించకూడదా?విద్యకు ఆహారం, వసతి ముఖ్యం. ప్రభుత్వం ప్రతి మూడు జిల్లాలకైనా ఒక స్పెషల్ కలెక్టర్‌ను వెయ్యాల్సి ఉంది. ఆయనకు కొన్ని టాస్క్ ఫోర్స్ టీములను అప్పగించాల్సి ఉంది. ఈ సంవత్సరం హాస్టళ్ళలో అత్యాచారాల సంఖ్య పెరిగింది. ప్రతి మహిళా పోలీస్ స్టేషన్‌కు ఆ ప్రాంతంలో వున్న బాలికల హాస్టల్ రక్షణ బాధ్యతను అప్ప గించాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నిసార్లు గురుకుల విద్యార్థినులు కలుషిత ఆహారంతో ఆసుపత్రుల పాలయ్యారు? రెండు రాష్ట్రాల లోనూ నాసిరకం బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు సరఫరా చేస్తు న్నారు. దీనికి కారణం వీళ్ళలో గూడుకుట్టుకున్న కులతత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి దళిత విద్యార్థుల్లో విద్య పెరుగుతుందనే ఆ పథకం మీద గొడ్డలివేటు వేశారు. అమరావతి నిర్మాణం, పోలవరం అనే పాట పాడుతూ, ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు తెస్తూ మహా నగరాన్ని నిర్మిస్తాననే మాటతో ఏపీ ముఖ్యమంత్రి ప్రజల్ని నమ్మి స్తున్నారు. దళిత బహుజన విద్యార్థుల్ని విద్యాశక్తికి పనికిరాకుండా మానసిక దౌర్భల్యానికి గురిచెయ్యాలనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. దళిత బహుజనుల జీవన వ్యవస్థల మీద దెబ్బ కొట్టాలనే ప్రయ త్నంతోనే ‘అమ్మఒడి’కి ‘తల్లి దీవెన’ అని పేరు పెట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని రోజుకొక ప్రకటన చేస్తున్నారు. గిరిజనుల హాస్టళ్ళకు ఆహార, ఆహార్య, రక్షణలను కలిగించకుండా, తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించాలనే ఆసక్తిని పోగొడుతున్నారు. నిజానికి ఇది ఒక పద్ధతి ప్రకారమే అగ్రకులాధిపత్యం చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వగలిగి కూడా ఇవ్వలేకపోవడా నికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఆటోలో 25 మంది వరకు ఎక్కి, ప్రమాదాల్లో చనిపోయి, పిల్లలు అనాథలవుతున్న స్థితి మనకు కనబడుతుంది. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బహుజన స్త్రీలలో మొబిలిటీ పెరుగుతుందనీ, వారు దూర ప్రాంత పనులకు వెళ్ళగలుగుతారనీ అంచనా వేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని దాటవేస్తోంది.కుటుంబాల్లో సంక్షోభంఈ సందర్భంగా దళితవాడల పరిస్థితిని ఒకసారి చూద్దాం. రెండు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో దళితవాడలు మురుగు నీరుతో, జబ్బులతో కునారిల్లుతున్నాయి. గ్రామ రాజ్యాన్ని పునరుద్ధరిస్తానంటున్న ఏపీ ఉపముఖ్యమంత్రి దళితవాడలకు ఇంతవరకు ఇళ్ళ స్థలాల విషయంగానీ, ఉపాధిని ఇచ్చే కుటీర పరిశ్రమల విషయంగానీ ఎత్తడం లేదు. దళిత వాడల్లో మద్యపానంతో పురుషులు ఎక్కువ మంది మరణిస్తూ స్త్రీలు విధవరాళ్లు అవుతున్నారు. గ్రామాలు సంక్షో భంలో, కుటుంబాలు వైరుధ్యాలతో కొట్టుమిట్టాడుతుంటే నోరు మెదపడం లేదు. దళిత బహుజన విద్యార్థినులు పేరెంట్స్ మీటింగ్‌కు పిలిస్తే సగంమంది విడిపోయిన భార్యాభర్తలు వస్తున్న విషయాలు వీరికి తెలిసి కూడా, ఈ కుటుంబ సంక్షోభం విద్యార్థుల భవిష్యత్తుపై గొడ్డలి వేటు అని తెలుసుకోలేకపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరగడం ఎంత బాధకరమో అర్థం చేసుకోలేకపోతున్నారు.ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా స్త్రీ ఆర్థికాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం జీవగర్ర. మగవాళ్లు తాగి జుట్టు పట్టుకొని ఆడవాళ్లను, ఆఖరికి తల్లిని కూడా కొట్టి ఇళ్ళల్లోంచి తరుముతున్న దారుణాలు చూస్తున్నాం. ఈ సామాజిక సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించడానికి ప్రయత్నించడం లేదు. పైగా అనేక రకాల మత్తు పదార్థాలను విచ్చల విడిగా పాఠశాల పరిసర ప్రాంతాల్లోనూ, దళిత వాడల్లోనూ అమ్ముతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు కళ్ళప్పగించి చూడటం ఆశ్చర్యం వేస్తుంది.ఫూలే ఆశయాలు మరిచారా?తెలంగాణలో అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం హాస్టళ్లలోని దుర్భ రమైన పరిస్థితులను ఎత్తిచూపినా ప్రభుత్వం దాటవేసే చర్యలను చేస్తున్నదే తప్ప వాటిని నిజంగా నివారించే చర్యలు చేపట్టడం లేదు. అసలు హాస్టల్స్‌లో రగ్గులు పంచి, పిల్లలను చలి నుండి కాపాడాలనే ఉద్దేశం కూడా లేకుండా జీవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం భారతదేశంలోనే దళిత బహు జన విద్యపైన గొడ్డలివేటు పడుతోంది. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తిన వారున్నారు. కనీసం తమ నియోజక వర్గాల్లో కూడా విద్యార్థులకు దుప్పట్లు పంచడం గానీ, శక్తిమంతమైన ఆహారాన్ని కల్పించడం కోసం పాలు, గుడ్లు, పండ్లు, పప్పులు వంటివి పంచిపెట్టడం గానీ చెయ్యడం లేదు. దీనికంతటికీ కారణం వీళ్లు స్వార్థ పూరితమైన జీవితంతో మహాత్మ ఫూలే జీవితానుసరణను, ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను మరచిపోయి అగ్రవర్ణాలతో సంపాదనలో పోటీ పడటమే.మహాత్మా ఫూలే 1848లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి బహుజన స్త్రీల మీదే కాక మొత్తం స్త్రీలకే విద్య రావాలనే విషయం మీద ఎన్నో ఉత్తరాలు రాశారు. అంబేడ్కర్ తన జీవితం మొత్తం దళిత బహు జనుల విద్యకోసం పోరాడారు. ఆనాడు ఎలాగైతే అగ్రవర్ణాల్లో దళిత బహుజనులు చదువుకోకూడదనే దురుద్దేశం ఉండిందో, అది ఇప్పటికీ కొనసాగుతోందని అర్థం అవుతోంది. ఒక పదవ తరగతి విద్యార్థిని ఏడు సబ్జెక్టులు చదవాలంటే, పాఠాలు వినాలంటే, పరీక్షలు రాయా లంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఆహారం తినాలి అని ప్రభుత్వాలకు తెలియదా! మహాత్మా ఫూలే చెప్పినట్లు మన గ్రామాలను మనమే పునర్ నిర్మించుకునే సందర్భం వచ్చింది. అంబేడ్కర్, పెరియార్ రామ స్వామి నాయకర్ స్వీయ వ్యవస్థల ద్వారా విద్య సంస్కరణలను చేసు కోవాలనీ, విద్యా వ్యవస్థలను నిర్మించుకోవాలనీ చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుకు మనమే మార్గం వేసుకోవాలి. ముఖ్యంగా చర్చిల్లో కేవలం ప్రార్థనలే కాకుండా విద్యా బోధనలకు అవకాశం కల్పించాలని కోరాలి. దళిత బహుజన సామాజిక సంఘాలు, స్వీయ సామాజిక విద్యా పునర్జీవనం కోసం పాటుపడాలి. ఆత్మ గౌరవ పోరాటాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యం. విద్యే జీవన వ్యవస్థలకు సోపానం. విద్య మానవ వ్యక్తిత్వ వికాసానికి పునాది. విద్య మానవాభ్యుదయానికి నాంది. విద్యా పునాదుల మీదే నూత్న సమాజం రూపొందుతుంది. అందుకే అంబే డ్కర్ దళితులకు విద్యా విప్లవ నినాదాన్ని ఇచ్చారు. అందునా బాలికా విద్య సామాజిక భవితవ్యానికి వారధి. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. నూత్న సమాజాన్ని నిర్మిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్‌కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్‌లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో ఎగ్జామినేషన్ గ్లౌజ్‌లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్‌సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్‌సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్‌తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్‌లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్‌కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్..!
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. సీఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణల పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్దస్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన రెండు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55 శాతం మేర పెంచింది. అంటే.. అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి రూ.10 వేల కోట్ల మేర పెంపు చూపడంపై నిర్మాణరంగ నిపుణులే నోరెళ్లబెడుతున్నారు. ఐదేళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు.ధరలు పెద్దగా పెరగకపోయినా..గత టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏలో 2017–18 మధ్య ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని వారంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టిపెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని.. పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దుచేసి పారేశారు. అలాగే, గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దుచేసి, ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంప్సమ్ విధానం అనుసరించడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5వేల కోట్ల మేర పనులు పూర్తిచేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా.. 41, 42 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు. ఇందులో రూ.11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీఓ సైతం జారీచేశారు. తాజాగా.. మరో రూ.8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28 శాతం వరకు పెంచగా, భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55 శాతం పెంచడం విశేషం. -
6 నెలల్లో తారుమారు.. హామీలకు చంద్రబాబు తూట్లు
ఓ నాయకుడు మాట ఇస్తే... ఆరు నూరైనా నూరు ఆరైనా కట్టుబడి ఉండాలంటారు! కానీ సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఏరు దాటాక తెప్ప తగలేశారు! ఆర్నెళ్ల పాలనలో కనిపించేదంతా ఉత్త ‘గ్యాసే’!ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకపోగా ఇసుకలో దోపిడీ.. మద్యంలో దోపిడీ.. రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల బాదుడుతో ప్రజలను గుల్ల చేస్తున్నారు. మరోవైపు కొత్త పథకాలు లేకపోగా ఉన్నవాటినే రద్దు చేస్తూ రెడ్‌బుక్ పాలనతో ప్రశ్నించే గళాలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. రెడ్‌బుక్, మాఫియా రాజ్యంతో స్కామ్‌ల పాలన సాగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడు నెలలు తరువాత.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్నెళ్లు గడిచాక ఇదీ పరిస్థితి!!సాక్షి, అమరావతి: అలవి మాలిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత ఐదేళ్లూ అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన ‘తల్లికి వందనం’ ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఎటు పోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి లేదంటే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన పేదలను ధనికులుగా మార్చే ‘పూర్ టు రిచ్’ కాన్సెప్ట్ కాగితాలకే పరిమితం! ‘యువగళం’, ‘ఆడబిడ్డ నిధి’ పథకాలు కనుచూపు మేరలో లేవు. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు ఆశగా పడిగాపులు కాస్తున్నారు. అయితే కనీసం వాటిని అమలు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వ పెద్దల్లో కానరాక పోవడంతో మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరవేశారు. రాజకీయ వేదికలుగా ప్రభుత్వ విద్యా సంస్థలు..అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలో 16 వేలకుపైగా పోస్టులతో మెగా డీఎస్సీని పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన తొలి సంతకం మురిగిపోయింది! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆర్నెళ్లుగా ప్రభుత్వ పాఠశా>లలపై అనేక ప్రయోగాలు చేసి ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఐబీ, సీబీఎస్ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకం అమలుపై మాత్రం చేతులెత్తేసింది. ఇంగ్లీషు మీడియం చదువులు, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు ట్యాబ్‌లపై చేతులెత్తేసింది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌కు లబ్ధి చేకూరుస్తోంది. రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ ఇస్తామన్న హామీ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లల్లో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చిందే గానీ ఒక్క విద్యా సంస్కరణను అమలు చేసింది లేదు. మెగా పీటీఎం పేరుతో ఉపాధ్యాయులను ఉరుకులు పెట్టించి ప్రభుత్వ విద్యా సంస్థలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లకు మోకాలడ్డిన కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు మన విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. అన్ని విధాలా దగా పడిన రైతన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.1000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. గత ఆర్నెళ్లలో 70 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1.80 కోట్ల మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్కపైసా విదల్చక పోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది.వైఎస్ జగన్ హయాంలో ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే లో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టారు.సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర ముఖ్యమైన హామీలు⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం.⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెళ్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు.⇒ ఉచితంగా ఇసుక అంటూ దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు.ఆసరా, చేయూత అసలే లేవువైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికే అందాల్సిన మత్స్యకార భరోసాగానీ, వాహనమిత్ర లాంటి పథకాలుగానీ అందలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది. కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఉచిత గ్యాస్‌లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారంఅధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. ఇంకా తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని వినియోగదారులపై మోపిన కూటమి ప్రభుత్వం మరో రూ.9,412 కోట్ల భారం కూడా మోపేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్నెళ్లలో వేసిన మొత్తం విద్యుత్ చార్జీల భారం రూ.15,485.36 కోట్లకు చేరింది.మద్యం సిండికేట్లతో లూటీప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసిన సీఎం చంద్రబాబు టీడీపీ సిండికేట్ దోపిడీకి రాచబాట పరిచారు. ప్రైవేటు మద్యం దుకాణాలను నెలకొల్పారు. టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించి టీడీపీ సిండికేట్‌కే అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసు యంత్రాంగంతో బెదిరించి అడ్డుకున్నారు. మాట వినకుంటే దాడులకు పురిగొల్పారు. తద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది. ప్రతి మద్యం దుకాణం పరిధిలో 4 నుంచి పది వరకు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఊరూవాడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.15, బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డగోలుగా దోపిడీకి తెర తీశారు. మద్యం విక్రయాల ద్వారా టీడీపీ సిండికేట్ ఏటా రూ.41,850 కోట్ల చొప్పున ఐదేళ్లలో 2.09 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నింది.పాలనా వైఫల్యాలు.. డైవర్షన్ రాజకీయాలుఆర్నెళ్ల పాలన అంతా వైఫల్యాల మయంగా మారడంతో డైవర్షన్ రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్‌లో రుషికొండ భవనాల పేరుతో బురద చల్లి మభ్యపుచ్చేందుకు యత్నించారు. ఆగస్టులో కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. సెప్టెంబర్‌లో ప్రకాశం బ్యారేజీని వైఎస్సార్సీపీ నేతలు బోట్లతో ఢీకొట్టి ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారంటూ ఏమార్చే కుతంత్రాన్ని రచించారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమలను రాజకీయాలకు వాడుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. అక్టోబర్‌లో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాలను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేశారు. నవంబర్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులపై కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియా కేసులు పెట్టారు. అమెరికాలో అదానీపై కేసుల వ్యవహారాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టి దుష్ప్రచారానికి కుట్ర పన్నారు. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేసి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు.ఇది అప్పుల కుప్ప ప్రభుత్వంసంపద సృష్టిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిరంతరం అప్పుల ఊబిలోకి దించుతున్నారు. ఇప్పటివరకు రూ.67,237 వేల కోట్ల మేర కొత్త అప్పులు చేసి రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చలేదు.ఉచితం అంటూ.. ఇసుక దోపిడీఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం యార్డుల్లో 80 లక్షల టన్నులను నిల్వ చేయగా కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రజాప్రతినిధులు మాయం చేశారు. 108 రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద అయిన వారికి అప్పగించేశారు. ఇసుక లేక నిర్మాణ రంగం స్తంభించి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు అల్లాడుతున్నారు. భూ సమస్యలు మళ్లీ మొదటికిల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ వివాదరహితంగా మార్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములపై ఆంక్షలు తొలగిస్తే ఇప్పుడు టీడీపీ మళ్లీ ఆంక్షలు పెట్టి రైతులను కష్టాల్లోకి నెడుతోంది. -
Andhra Pradesh: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం నుంచి గురువారం వరకు జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చిస్తారని, స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ఈ సదస్సులో 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు పాల్గొంటారని, వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకుని, రానున్న నాలుగున్నరేళ్లలో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తారని తెలిపింది. తొలి రోజు ఉదయం ఆర్టిజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై, మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, శాంతిభద్రతలు వంటి అంశాలపై చర్చిస్తారని వివరించింది. -
రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు చెల్లదు
సాక్షి, అమరావతి: రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్డీడ్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక, ఏకపక్ష అధికార వినియోగమేనని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన నిబంధన ఏదీ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో నిర్ధిష్టంగా లేకపోయినప్పటికీ, అది రూల్స్‌లో ఉన్నట్టుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ‘ఏపీ రిజిస్ట్రేషన్ రూల్స్ 26(కె)(1) ప్రకారం సేల్డీడ్లను రద్దు చేయాలంటే.. సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు ప్రభుత్వ/అసైన్డ్/దేవదాయ లేదా రిజిస్టర్ చేయడానికి వీల్లేని భూములు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉండాలి. అప్పుడే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సివిల్ కోర్టు/ప్రభుత్వ అధికారి సంబంధిత ఆస్తుల సేల్డీడ్లను రద్దు చేయడం సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు పైన పేర్కొన్న కేటగిరీలో ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే, సేల్డీడ్ల రద్దుకు రూల్ 26(కె)(1) వర్తించదు. ఈ రూల్‌లో ఎక్కడా ఆస్తి స్వభావంపై అధికారులు విచారణ చేపట్టాలని లేదు. సేల్డీడ్లలోని భూమి ఫలానా భూమి అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే.. దాని ఆధారంగా అధికారాన్ని ఉపయోగించవచ్చని మాత్రమే ఉంది. సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేదు కాబట్టి, దానిని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో సమాధానం చెప్పింది. నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్‌లో లేకుంటే.. ఆ రూల్స్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేకపోయినా.. అది రూల్స్‌లో ఉన్నట్లే భావించాలి’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.సేల్డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తనకు ఇరువాడ, అసకపల్లి గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 4.90 ఎకరాల భూమిని జి.నాగేశ్వరరావు, ఎన్.రమణ, షేక్ ఆసీఫ్ పాషాలకు 2013లో విక్రయించారు. సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అధికారులు సేల్డీడ్లు కూడా జారీ చేశారు. 2014లో ఆ సేల్డీడ్లను అధికారులు రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందన్‌రావు తుది విచారణ జరిపి పైవిధంగా తీర్పు వెలువరించారు. -
ఫీజు బకాయిలు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు
గుడివాడ టౌన్: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ వీకేఆర్, వీఎన్‌బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదివే సుమారు 275 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. అందులో కొంతమంది ఏదోవిధంగా ఫీజు బకాయిలు చెల్లించగా.. 30 మందికి పైగా చెల్లించలేకపోయారు. దీంతో వారికి హాల్ టికెట్ ఇచ్చేది లేదని సోమవారం యాజమాన్యం బయటకు పంపేసింది. వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో స్పందించిన ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా నిర్ణీత సమయంలోగా బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని హాల్ టికెట్లు ఇచ్చారు. -
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న
సాక్షి, అమరావతి: అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొని ఆదుకోండి మహాప్రభో.. అంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కంకులతోనే నిరసనలకు దిగారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయల ఎదుటే సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. తుపాను ప్రభావంతో కురిసిన వరా్షలకు తడిసి ముద్దయిన ధాన్యం రాసుల వద్దే నిరసనలతో తమ ధైన్య స్థితిని తెలియజేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని, వర్షాల వల్ల రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేయాలని, జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలంటూ నినాదాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.గింజ ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర దక్కలేదురాష్ట్రంలో ఏ ఒక్క రైతు నుంచి కనీస మద్దతు ధరకు గింజ కూడా ఈ ప్రభుత్వం కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజా కనీస మద్దతు ధరకు కొంటామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దళారులు, మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాధికారులు కూడా దళారుల అవతారమెత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారంటూ ఆరోపించారు. 25 శాతం తేమ ఉన్నా కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపాటుతుపాను వస్తుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. కళ్లాలపై ఉన్న పంటను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తేమ శాతం పేరుతో ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా, రైతు సేవా కేంద్రంలోనే రూ.1,450కు మించి రాదని చెబుతున్నారని తెలిపారు. పైగా తరుగు రూపంలో 15 నుంచి 20 బస్తాలు తగ్గించి రశీదులిస్తున్నారని, ఎందుకిలా కోత విధిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేరని చెప్పారు. గతంలో రైతు భరోసా కేంద్ర (ఆర్బీకే) – మిల్లులకు మధ్య మ్యాపింగ్ ఉండేదని, ప్రస్తుతం పొరుగు జిల్లాలకు కూడా ఇష్టమొచ్చినట్టు తోలుతున్నారని ఆరోపించారు. రవాణా చార్జీల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, దానినీ రైతుల నెత్తిన వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే సరఫరా చేసిన ఎంటీయూ 1262 రకం విత్తనాన్ని సాగు చేస్తే, ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరూ కొనడంలేదని వాపోయారు. బీపీటీ, ముతకలు మాత్రమే కొనమని చెప్పారని, మధ్యస్తంగా ఉండే ఎంటీయూ 1262 కొనలేమని చెబుతున్నారని, దీంతో దళారులకు 75 కేజీల బస్తా రూ.1,250 నుంచి రూ.1,350కు అమ్ముకోవల్సి వస్తోందని వాపోయారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి ఆర్బీకే పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని, ఇక మీదట కొనేది లేదంటూ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సగం కూడా కొనకుండానే లక్ష్యం పూర్తయిందని చెప్పడంలో అర్థం ఏమిటని మండిపడుతున్నారు.గింజ కొనే వారు లేరు..కృష్ణా జిల్లా మొవ్వ మండలం అవురుపూడికి చెందిన ఈ రైతు పేరు ఎం.హరిబాబు. 5.30 ఎకరాల్లో వరి సాగు చేసి గత నెల 24న కోసి 25న నూర్చారు. 29న రైతు సేవా కేంద్రానికి వెళితే 24 శాతం తేమ వచ్చింది. 30 కాటా వేశారు. తేమ 25 శాతం ఉన్నా మద్దతు ధరకు కొంటామని 4 రోజుల క్రితం మంత్రి మనోహర్ చెప్పారు. నిన్నటికి నిన్న తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే బస్తాకు 5 కిలోల తరుగుతో ధాన్యం తెనాలిలో చెప్పారు. ఆ లెక్కనైనా అదనంగా ఉన్న తేమ శాతానికి తరుగు మినహాయించుకొని మద్దతు ధర లెక్కగట్టి ఇవ్వాలని అడుగుతుంటే.. మిల్లర్లు రూ.1,450కు మించి ఇవ్వబోమంటున్నారని అధికారులు చెబుతున్నారని హరిబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంట కోసి ఆరబెట్టేందుకు కూలీలకు రూ.3 వేలు, టార్పాలిన్ల అద్దె రూ. 8 వేలు ఖర్చయిందని తెలిపారు. ధాన్యం తరలించకపోతే మొలకలొస్తాయని మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడంలేదని, తూర్పు గోదావరి నుంచి లారీలు వస్తే పంపిస్తామని అంటున్నారే తప్ప ఎంత రేటుకు కొంటారో చెప్పడం లేదని హరిబాబు వాపోతున్నారు.ఇదేనా 48 గంటల్లో డబ్బులేయడమంటే..ఈ రైతు పేరు వేమూరి నాగేశ్వరరావు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం. ఒకటిన్నర ఎకరాల్లో వరి పంటను కోసి గతనెల 20న కాటా వేశారు. 40 కిలోల చొప్పున 96 బస్తాలు రైతుసేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్ మిల్లుకు ఈ నెల 21వ తేదీన పంపారు. అదే రోజున ఎఫ్‌టీవో 906200015240005 జనరేట్ అయ్యింది. కానీ 81 బస్తాలకే రశీదు ఇచ్చారు. 24న రూ.74,520 రైతు ఖాతాలో జమైనట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంకులో చూసుకుంటే సొమ్ములు పడలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ లింక్ అయి ఉండకపోవచ్చని చెప్పారు. రెండ్రోజులు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరిగి ఆధార్ లింక్ చేశారు. 26 నుంచి రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు రాలేదు. అడిగితే కంగారెందుకు.. నాలుగు రోజులాగండంటూ చిరాకు పడుతున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 96 బస్తాలకుగాను 81 బస్తాలకే రశీదు ఇచ్చారని వాపోయారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. -
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్‌ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్‌రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్‌పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్‌ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్‌కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్‌రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్‌ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చారిత్రక నిర్ణయాలతో.. సంపద సృష్టించాం: వైఎస్ జగన్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ.. ఏపీ ప్రభుత్వం, డిస్కంల మధ్య ఒప్పందం జరిగితే.. ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది? రేపు అమెరికా కంపెనీ వ్యాపారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిందనుకుందాం. ప్రభుత్వం భూములు, సౌకర్యాలు కల్పిస్తుంది. జీఎస్టీ మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇస్తుంది. అలాగని అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ప్రోత్సాహకాలు ఇప్పించారని అంటారా? అలా అనొచ్చా? వాస్తవాలు తెలియకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ముగింపు ఉండట్లేదు. – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే.. మరో వైపు చంద్రబాబు సంపద సృష్టి అంటున్నారు.రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఏవైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకుని, రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచించి, ఆచరణలో పెట్టింది వైఎస్సార్సీపీ హయాంలోనే. మూడు కొత్త పోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటి వల్ల జీఎస్డీపీ పెరుగుతుంది. ఉద్యోగాలొస్తాయి. అభివృద్ధి కనిపిస్తుంది. దీనినే సంపద సృష్టి అంటారు. ఈ పోర్టులు, మెడికల్ కాలేజీలు రేపు రూ.లక్షల కోట్ల విలువ చేస్తాయి.అంతర్రాష్ట్ర ట్రాన్స్‌విుషన్ చార్జీలు (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపుతో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు సౌర విద్యుత్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ(సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదో చరిత్రాత్మక ఒప్పందం.. చారిత్రక ఘట్టం గతంలో రాష్టంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.10 కాగా మేం దాని కంటే యూనిట్ రూ.2.61 తక్కువకు కొనుగోలు చేశాం. దీనివల్ల ఏడాదికి రూ.4,400 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. ఈ లెక్కన 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతుంది. సంపద సృష్టించడమంటే ఇదీ చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు చేస్తూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. మేం సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా?– వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంపద సృష్టిలో భాగంగా విప్లవాత్మక అడుగులు వేశామని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నిజమైన సంపద సృష్టి జరిగింది, రాష్ట్రానికి అదనపు ఆదాయాలు పెరిగింది, అదనపు ఆస్తులు సమకూరింది వైఎస్సార్ సీపీ హయాంలోనేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించామన్నారు. అధిక ధరలతో పీపీఏల ఒప్పందాల గుదిబండ వల్ల సీఎం చంద్రబాబు రూ.87,500 కోట్లు ఆవిరి చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు రూ.13 వేల కోట్లతో మూడు కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపట్టామని.. వైద్య కళాశాలలు, పోర్టులు భవిష్యత్తులో రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల సంపద సృష్టించే ఆస్తులుగా మిగులుతాయని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.చరిత్రలో నిలిచే ఒప్పందం..సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా, రైతుల జీవనోపాధులు పెంచడమే ధ్యేయంగా వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న మా ప్రభుత్వ ఆశయాన్ని కేంద్రం సైతం అభినందించింది. రైతులకు మంచి చేస్తూ మీరు తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి మా వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పింది. ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ యూనిట్ విద్యుత్ అత్యంత చౌకగా రూ.2.49కే సరఫరా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ కేంద్ర సంస్థ సెకీ లేఖ రాసింది. నాడు ఆ ప్రతిపాదనకు నేను ఒప్పుకోకుండా ఉంటే ఇదే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడిన ఎల్లో బ్యాచ్ నాపై ఏరకంగా దుమ్మెత్తిపోసేవారో అందరూ ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి నాపై ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? ఇంత తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఏ ఒక్కరూ చేయలేనిదాన్ని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. ఒక చరిత్ర సృష్టించాం. చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది.రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్ లక్ష్యంగా..రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మీద భారం పడకుండా.. మరో 25 ఏళ్ల పాటు రైతన్నలకు ఢోకా లేకుండా ఉచిత విద్యుత్తు అందించడంలో భాగంగా గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఆలోచన చేశాం. 2020 నవంబర్‌లో 6,400 మెగావాట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీఈసీఎల్) ఆధ్వర్యంలో సోలార్ పార్కులు రాష్ట్రంలో నెలకొల్పేందుకు టెండర్లు పిలిచాం. రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున విద్యుత్ సరఫరా చేయడానికి ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అందులో పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కారణంగా న్యాయ వివాదాలు తలెత్తి ఈ ప్రక్రియ ఆగిపోయింది.మేం సంపద సృష్టించాం.. ఆవిరి చేసింది చంద్రబాబేమాట్లాడితే సంపద సృష్టిస్తానంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు తన హయాంలో సంపద ఏ విధంగా ఆవిరి చేశాడో ఒక్కసారి మీరే చూడండి. 2,500 మెగావాట్ల సోలార్ పవర్,, 3,494 మెగావాట్ల విండ్ పవర్ కోసం చేసుకున్న పీపీఏలను.. మా హయాంలో యూనిట్ రూ.2.49కే సరఫరా చేసేందుకు చేసుకున్న పీపీఏతో పోల్చి చూస్తే ఎవరు సంపద సృష్టించారన్నది అందరికీ అర్థమవుతుంది. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతుంది. చంద్రబాబు హయాంలో 3,494 మెగావాట్ల పవన విద్యుత్ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే సగటున యూనిట్ రూ.4.84 చొప్పున చేసుకున్నారు. మా హయాంలో అదే విద్యుత్ యూనిట్ రూ.2.49కే వచ్చింది. మా హయాంతో పోలిస్తే బాబు హయాంలో చేసుకున్న ఒప్పందాల వలన రూ.2.35 అదనంగా భారం పడుతుంది. 3,494 మెగావాట్లు అంటే 9 వేల మిలియన్ యూనిట్లు! యూనిట్ రూ.2.35 చొప్పున చూస్తే ఏడాదికి రూ.2 వేల కోట్లు అదనపు భారం పడింది. ఆ లెక్కన 25 ఏళ్లకు అక్షరాల రూ.50వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇక 2,500 మెగావాట్ల సోలార్ పవర్ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే.. సగటున యూనిట్ విద్యుత్ రూ.5.90 చొప్పున కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2,500 మెగావాట్లు అంటే 4,200 మిలియన్ యూనిట్లు. మన హయాంలో చేసుకున్న పీపీఏల ప్రకారం యూనిట్ రూ.2.49లతో పోల్చి చూస్తే.. చంద్రబాబు హయాంలో సోలార్ పవర్ యూనిట్ విద్యుత్ రూ.3.41 పైసల చొప్పున అదనంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏడాదికి రూ.1,500 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రూ.37,500 కోట్ల అదనపు భారం పడుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా ఆ మేరకు నేను సంపద సృష్టిస్తే.. అదే చంద్రబాబు హయాంలో చేసుకున్న సోలార్, విండ్ పీపీఏల వల్ల 25 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.87,500 కోట్ల భారం పడటం వల్ల ఆ మేరకు సంపద ఆవిరి అయిపోతుంది. ఈ తేడా గమనించాలని అందరినీ కోరుతున్నా.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం జరిగితే.. యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్ దొరుకుతుంటే.. పైగా స్పెషల్ ఇన్సెంటివ్‌గా అంతర్రాష్ట్ర ట్రాన్స్ విుషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్ మోడల్ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు సెకి ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సిందిపోయి బురదజల్లుతారా? ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం సమంజసమేనా? సంపద సృష్టించింది నేనా? చంద్రబాబా ? మీరే ఆలోచించండి. నేను సంపద సృష్టిస్తే.. చంద్రబాబు సంపద ఆవిరి చేశాడు. ధర్మం..న్యాయమనేది ఉండాలి కదా..! మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు, మిడిమిడి జ్ఞానంతో సగం తెలిసి సగం తెలియక..చంద్రబాబును మోయాలన్న తపన, తాపత్రయంతో, జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?అడ్డగోలు రాతలు.. వక్రీకరణలువాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా రాయడం వక్రీకరణ కాదా? ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా యూనిట్ రూ.2.49కే అత్యంత చౌకగా కొంటున్నప్పుడు ఇదే ఈనాడు రూ.5.73కు కొంటున్నామని ఎలా రాస్తారు. ఇది అబద్ధం కాదా? వక్రీకరణ కాదా? మనం యూనిట్ రూ.2.49కే కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. అది కూడా కోవిడ్ సమయంలో. ఈ ఏడాది మార్చిలో గుజరాత్లో సెకీ టెండర్లు పిలిస్తే యూనిట్ రూ.2.62 నుంచి రూ.2.67 చొప్పున ఖరారయ్యాయి. గుజరాత్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గుజరాత్‌లోనే సరఫరా చేసేందుకు ఈ ధర నిర్ణయించారు. టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగా పవర్ ఉత్పత్తి రేట్లు కూడా తగ్గాలి అంటూ మరో వక్రీకరణ చేశారు. 55 అంగుళాల టీవీ గతంలో రూ.2 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.55 వేలకే వస్తుంది కదా..! ఆ లెక్కన విద్యుత్ ధర కూడా ఇప్పుడు తగ్గాలి అంటూ వాదిస్తున్నారు. ఈనాడు వాదన ప్రకారమైతే.. ఇదే సోలార్ పవర్‌ను మా హయాంలో రూ.2.49 చొప్పున కొనుగోలు చేశాం. అంటే ఇప్పుడు అది రూ.1.50కే రావాలి కదా..? మరి గుజరాత్లో రూ.2.67 చొప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? వాస్తవాలను వక్రీకరించి ఏ విధంగా అడ్డగోలుగా అబద్ధాలు అచ్చేస్తారో.. మాట్లాడుతున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ!!తియ్యటి కబురుతో కేంద్రం లేఖ..చంద్రగ్రహణం పట్టిన సోలార్ బిడ్ల వ్యవహారంపై దాదాపు 10 నెలలు కోర్టుల్లో పోరాటాలు చేస్తుండగా.. 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి తియ్యటి కబురు మాదిరిగా సెకీ నుంచి లేఖ వచ్చింది. రైతులకు పగటి పూటే ఉచితంగా 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించింది.సెకీ రాసిన ఆ లేఖలో యూనిట్ రూ.2.49 కే ట్రేడింగ్ మార్జిన్‌తో కలిపి ఇస్తామని ఉంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మీ ఉద్దేశాన్ని అభినందిస్తూ ఈ ప్రతిపాదన చేస్తున్నామని ఆ లేఖలో సెకీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటివ్ కింద ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌విుషన్ సిస్టం(ఐఎస్టీఎస్) చార్జీలు 25 ఏళ్ల పాటు మాఫీ అవుతాయని లేఖలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తంగా 9 వేల మెగావాట్లు సౌర విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెకీ తెలిపింది. తమ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా స్పందన తెలియచేయాలని సెకీ లేఖలో కోరింది.డిస్కంలను బాబు సంక్షోభంలోకి నెడితే.. మేం నిలబెట్టాం..రైతన్నలకు దాదాపుగా 18 లక్షల వ్యవసాయ పంపు సెట్ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్‌ను రైతన్నలకు ఇచ్చేందుకు ఏటా దాదాపు రూ.9 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. పెట్టుబడి ఖర్చు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత విద్యుత్ ప్రధాన భూమిక పోషిస్తుంది. దీనివల్ల ప్రతి రైతన్నకు ఏటా దాదాపు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ప్రయోజనం చేకూరుతుంది. డిస్కంల పరిస్థితి చూస్తే చంద్రబాబు అధికారంలోకి రాకముందు అంటే 2014 నాటికి రూ.29 వేల కోట్లు అప్పులు, బకాయిలు ఉండగా ఆయన దిగిపోయే నాటికి అంటే 2019కి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపుగా 23.88 శాతం వార్షిక అప్పు పెరుగుదల (సీఏజీఆర్)తో చంద్రబాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా ఉంది. డిస్కంలను ఆదుకునేందుకు ఆయన చేసిన సాయం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే వైఎస్సార్సీపీ హయాంలో రూ.47,800 కోట్లు డిస్కంలకు అందించి ఆదుకున్నాం.రూ.6.99కు కొన్న బాబు గొప్పా..? రూ.2.49కు నేను కొంటే తప్పా?చంద్రబాబు హయాంలో పవన విద్యుత్(విండ్ పవర్)కు సంబంధించి 2014–19 మధ్య 3,494 మెగావాట్ల విద్యుత్ కోసం 133 పీపీఏలు చేసుకున్నారు. సగటున యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో మాత్రం రూ.4.70 చొప్పున కొన్నారు. సోలార్ విద్యుత్ సంబంధించి 2014–19 మధ్య 2,500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం 35 పీపీఏలు చంద్రబాబు చేసుకున్నారు. యూనిట్ రూ.5.25 నుంచి రూ.6.99 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో 649 మెగావాట్ల కోసం 30 పీపీఏలు చేసుకోగా యూనిట్ రూ.6.49కు కొన్నారు. 2015లో రూ.5.96కు, 2016లో వరుసగా యూనిట్ రూ.6.80కు, రూ.5.99, రూ.4.61,రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే చంద్రబాబు హయాంలో సోలార్ విద్యుత్‌ను సగటున యూనిట్ రూ.5.90 చొప్పున కొన్నారు. 2019–20లో ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ సగటు ధర యూనిట్ రూ.4.63, సోలార్ పవర్ సగటు ధర యూనిట్ రూ.5.90కు కొనేందుకు అనుమతినిస్తే.. మా హయాంలో రూ.2.49 చొప్పున అత్యంత చౌక ధరకు 7 వేల మెగావాట్లు సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటే నాపై బురద జల్లడం ఎంతవరకు సమంజసం? ఆత్మనిర్భర్ కింద సోలార్ ప్యానళ్ల తయారీని ప్రోత్సహించేందుకు దేశంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద కేంద్రం గొప్ప అడుగు వేసింది. రాష్ట్రానికి మంచి చేయాలన్న తపనతో చరిత్రలో ముందెన్నడూ లేనంత చౌక ధరకు విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం చేసుకున్న నేను మంచోడినా? లేక అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచోడా?సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందంయూనిట్ రూ.2.49కే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి లెటర్ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 16న కేబినెట్ మీటింగ్ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించాం. అయితే ఆ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలపలేదు. కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ నాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలిచ్చాం. దీనిపై విద్యుత్ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం 2021 అక్టోబర్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్ 28న కేబినెట్ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసుకోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. ఐఎస్టీఎస్ చార్జీలు, ఆ విధమైన ఇతర చార్జీలు ఏవీ కూడా వర్తించవంటూ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పంద పత్రంలో స్పష్టంగా పేర్కొన్న భాగం నవంబర్ 11న ఏపీఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్ పార్టీ ఎవరూ లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ 3.2 క్లాజ్‌లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు నుంచి మినహాయింపు ఇస్తామని స్పష్టంగా పేర్కొంది.గుజరాత్, రాజస్థాన్‌లలో పీఎల్ఎఫ్ అధికంచంద్రబాబు ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఓ విచిత్రమైన లాజిక్ తీసుకొచ్చారు. గుజరాత్లో రూ.1.99 విద్యుత్ వస్తుంటే... సెకీతో రూ.2.49కు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని అడు గుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! గుజరాత్, రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు. అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్(పీఎల్ఎఫ్) 23.5 శాతం నమోదైతే, మన రాష్ట్రంలో 17–18 శాతం దగ్గర నమోదవుతాయి. ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే, గుజరాత్, రాజస్థాన్‌లో సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వాళ్లకు యూనిట్‌కు రూ.0.50 అడ్వంటేజ్ (తక్కువ) ఉంటుంది. దీనిపై మాట్లాడుతున్న వీళ్లు ట్రాన్స్మిషన్ వ్యయంపై ఎందుకు మాట్లాడడం లేదో తెలియడం లేదు. ఐఎస్టీఎస్ ధర ప్రతీ యూనిట్‌కు దాదాపు రూ.2 అదనంగా పడుతుందన్న విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. -
వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు: సుప్రీం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు మార్గదర్శకాలపై 2005లో జారీ చేసిన జీవోలను సైతం రద్దు చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, జర్నలిస్టులను ‘ప్రత్యేక వర్గం’గా పేర్కొంటూ వారి హౌసింగ్ సొసైటీలకు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హౌసింగ్ సొసైటీలు చెల్లించిన సొమ్మును రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీతో సహా వడ్డీతో కలిపి వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సొసైటీలకు అనుకూలంగా లీజు డీడ్లు ఏవైనా ఇచ్చి ఉంటే అవన్నీ రద్దు అవుతాయని తెలిపింది. అలాగే సొసైటీలు చెల్లించిన డెవలప్మెంట్ చార్జీలను కూడా వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.సంజయ్ కుమార్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిల సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను కొట్టేస్తూ 2010లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ప్రభుత్వం ఆ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకుంటే వాటి సభ్యులకు అర్హతలు నిర్ణయించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీబీ చెలికాని తదితరులు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పలు తరగతులతో పోలీస్తే ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు మంచి స్థానంలో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సామాన్యులకు ఒకే రకమైన హక్కులను తిరస్కరించడం ఎంత మాత్రం సహేతుకం కాదంది. తాము ఎన్నో త్యాగాలు చేశామని, అందువల్ల తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్న అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వాదనను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, చట్టసభలకు ఎన్నికైన వారు, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ జర్నలిస్టులు ‘వెనుకబడిన వర్గాల’కిందకు రారని స్పష్టం చేసింది.