చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్‌.. ఒక్కరికే వందనం.. అందరికీ ఎగనామం! | Chandrababu Alliance Govt U Turn On Amma Vodi Scheme Implementation | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్‌.. ఒక్కరికే వందనం.. అందరికీ ఎగనామం!

Published Fri, Jul 12 2024 4:24 AM | Last Updated on Fri, Jul 12 2024 10:46 AM

Chandrababu Alliance Govt U Turn On Amma Vodi Scheme Implementation

‘తల్లికి వందనం’ పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ 

ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఎన్నికల్లో హామీ  

స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు చొప్పున జమ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటన

జీవో నంబర్‌ 29లో ఒక్క తల్లికి మాత్రమే ‘తల్లికి వందనం’ అని స్పష్టీకరణ

కోటి మంది పిల్లలను నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు 

ఇంట్లో పిల్లలందరికీ కాకుండా ఒక్కరికే అంటూ మెలిక.. అదీ ఎప్పుడిస్తారో తెలీదు  

ఐదేళ్ల డేటా ఉన్నా లబ్ధిదారుల ఎంపిక పేరుతో తాత్సారం చేస్తున్న సర్కారు

ఇన్నాళ్లకు కేవలం గైడ్‌లైన్స్‌ మాత్రమే జారీ.. అందులోనూ ప్లేటు ఫిరాయింపు

ఏటా జూన్‌ నెలలోనే అమ్మఒడి జమ చేసిన జగన్‌ ప్రభుత్వం 

వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండుంటే ఈ పాటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా అందేవి..

ఎన్నికల ప్రచారంలో..
తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి ఒక్క బిడ్డకూ 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా.

‘నేను హామీ ఇస్తున్నాను.. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకూ (విద్యార్థిని, విద్యార్థులు) 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా’ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊరూరా లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా మాట ఇచ్చారు. బాబుతో పాటు టీడీపీ నేతలంతా ఇంటింటా ఇవే మాటలు చెప్పారు. ఇలా మాయ మాటలు చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు. మరీ ఇంత దుర్మార్గమా.. అని ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే దబాయించి నోరు మూయించడం ఆయన నైజం. సూపర్‌ సిక్స్‌లో మిగతా హామీలన్నింటిలో కోతలు.. దాటవేతలేనని బాబు వాలకం చెబుతోంది.

సాక్షి, అమరావతి: మాట మార్చడంలో డబుల్‌ పీహెచ్‌డీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి తన నైజాన్ని చూపించారు. ‘తల్లికి వందనం’ పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామన్న అంశంపై మాట తప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి.. ఒక్కరుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తామని లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా ఇచ్చిన మాటను గాలికి వదిలేశారు. ఇప్పుడు ఈ పథకాన్ని చదువుకునే పిల్లల్లో ఒక ఇంట్లో ఒక్కరికే అమలు చేస్తామని ప్రకటించారు. ఆధార్‌ అనుసంధానం పేరుతో అనేక కొర్రీలు వేసి లబ్ధిదారులను తగ్గించే పనిలో ఉన్నారు. 

అందుకే ఏటా జూన్‌ నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన పథకంపై కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జీవో నం.29 విడుదల చేసి.. పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అంటే గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన 42.62 లక్షల మంది లబ్ధిదారుల కంటే తక్కువ మందికే ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. 

ఆ మొత్తం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటిస్తే.. ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ పథకం గురించి తనదైన శైలిలో ‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు..’ అంటూ చిన్న పిల్లలను చూపిస్తూ ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఇన్ని ఆధారాలు ఉన్నా ఇప్పుడు ‘వందనం ఒక్కరికే’ అనడంపై తల్లులు మండి పడుతున్నారు.  



కోటి మంది పిల్లల్లో భారీగా కోత  
రైతులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి రాగానే అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను తగ్గించండంతో పాటు రుణ మాఫీని సైతం భారీగా కుదించేశారు. ఇప్పుడు తల్లికి వందనం పైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభ్వుం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తూ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చేసిన ప్రకటనకు విరుద్ధంగా ముందుకెళుతోంది. అందుకు అనుగుణంగానే జీవో నం.29లో జారీ చేసింది. 

పిల్లలు అందరికీ ఇస్తామన్న పథకాన్ని ‘తల్లికి మాత్రమే రూ.15000’ అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంటే రాష్ట్రంలో దాదాపు కోటి మందికి పైగా పిల్లలున్నారు. ఇందులోనూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఆధార్‌తో లింక్‌ అయ్యి ఉన్న అన్ని ఆస్తుల వివరాలను తీసుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విధించిన నిబంధనలను కాకుండా మరిత కఠినంగా నిబంధనలు రూపొందిస్తోంది. గత ప్రభుత్వంలో ప్రతి బిడ్డా చదువుకునేందుకు బడికి వెళ్లడమే లక్ష్యంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. 

అన్ని మేనేజ్‌మెంట్ల స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో చదివే పిల్లలను ప్రోత్సహించేందుకు వారి తల్లులకు ఏటా రూ.15 వేలు జమ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఒకటి నుంచి ఇంటర్‌ వరకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లో చదివే పిల్లలకు మాత్రమే పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీరిలోనూ వివిధ ఆదాయ మార్గాలను సాకుగా చూపి పిల్ల సంఖ్యను భారీగా తగ్గించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే గతంలో అమ్మ ఒడి అందుకున్న 42.62 లక్షల మందిలో చాలా మంది ఈ పథకానికి దూరమవుతారు. 

మూడుసార్లు మాట మార్చిన కూటమి 
చదువుతో సంబంధం లేకుండా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు  ప్రజలకు మాట ఇచ్చారు. ‘స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఆర్ధిక సాయం’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌లో హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదివే పిల్లలున్న తల్లికే ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అంటే ఒకే అంశంపై మూడుసార్లు మాట మార్చారు. 

గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కాలేజీలు, ప్రయివేట్‌ ఎయిడెడ్, ప్రయివేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్, జూనియర్‌ కాలేజీల్లో చదివే పిల్లలు గల తల్లులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల్లో ఎక్కడా స్కూళ్లు, కాలేజీల ప్రస్తావన చేయలేదు. సర్వే పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేసి, అనంతరం తీరిగ్గా మార్గదర్శకాలు విడుదల చేస్తే తాము అర్ధికంగా నష్టపోతామని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

పిల్లల డేటా ఉన్నా కాలయాపన 
స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్యపై రాష్ట్రాలు ఏటా ‘యూనిఫైడ్‌ డి్రస్టిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌’ (యూడైస్‌ ప్లస్‌) ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఈ ఏడాది నుంచి విద్యార్థుల చేరికలు, బదిలీలు నేరుగా ‘యూడైస్‌ ప్లస్‌’ ద్వారానే చేయాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. యూడైస్‌ ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు మొత్తం 82,29,858 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్నారు. కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య కూడా దీనికి జత చేయాలి. 

విద్యార్థుల చేరిక సమయంలోనే ఆధార్‌తో పాటు కుటుంబ నేపథ్యం, ఆర్ధిక స్థాయి కూడా నమోదు చేస్తున్నారు. ఇదంతా ఆన్‌లైన్‌లో జరిగేదే. పైగా గతేడాది కూడా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పిల్లల వివరాలను ప్రభుత్వానికి అందించారు. ఈ వివరాలు ప్రభుత్వం వద్ద నూరు శాతం ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం విద్యార్థుల డేటా ఆధారంగా గత ప్రభుత్వం తొలి ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. 2020లోనూ ముందు సంవత్సరం విద్యార్థుల సంఖ్య (డేటా) ఆధారంగా పథకాన్ని అందించింది. 

ఇలా నాలుగు విద్యా సంవత్సరాల్లో ముగిసిన ఏడాది డేటా ఆధారంగా అమ్మ ఒడి జమ చేసింది. దీంతో పాటు 75 శాతం హాజరు శాతం తప్పనిసరి అన్న నిబంధన విధించినా, పేద కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదన్న మానవతా దృష్టితో హాజరు సరిపడినంత లేకున్నా ఇతర అర్హతలు గల ప్రతి తల్లికీ అమ్మఒడి అమలు చేశారు. పది, ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యి, తిరిగి ప్రవేశం పొందిన విద్యార్థులు, మధ్యలో స్కూల్లో చేరిన అర్హత గల పిల్లలకు కూడా పథకాన్ని అమలు చేశారు. కానీ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్యను సర్వే చేసి తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వం వద్ద పూర్తి డేటా ఉన్నా కేవలం పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా దాట వేయడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.  

ఆ ప్రభుత్వమే ఉండి ఉంటే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కొనసాగుతూ ఉండిఉంటే ఈ పాటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా పథకాలు అమలై ఉండేవి. గత ఐదేళ్లలో ఈ పథకాలన్నీ చెప్పిన రోజు చెప్పినట్లు అర్హత గల లబ్ధిదారులందరికీ అందాయి. అర్హత ఉండీ కూడా ఏ కారణం వల్లనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి మరీ మేలు చేసింది. 

ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నిజంగా పిల్లలపై ప్రేమ ఉంటే జూన్‌ నెలలోనే తల్లికి వందనం (అమ్మ ఒడి) పథకాన్ని అమలు చేసి ఉండేది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో ఎలా కోత పెట్టాలా.. అని నెల రోజులకు పైగా ఆలోచించి ఇప్పుడు తీరిగ్గా గైడ్‌లైన్స్‌ మాత్రమే జారీ చేసింది. పిల్లలందరికీ అని చెప్పి ఇప్పుడు ఒక్కరికే అంటూ ప్లేటు ఫిరాయించింది. అది కూడా ఎప్పుడిస్తారో చెప్పక పోవడం గమనార్హం.  

ఆశ పెట్టి.. మాట మార్చకూడదు 
మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకరు ఈపూరు యూపీ పాఠశాలలో, మరొకరు అనంతవరం జెడ్పీ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పదో తరగతి చదువుతున్న మా మేనకోడలిని కూడా మేమే పెంచుతున్నాం. గత ప్రభుత్వంలో మా బిడ్డలతోపాటు, మా మేనకోడలికి సైతం మా బ్యాంక్‌ ఖాతాలో అమ్మ ఒడి సొమ్ము జమైంది. ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికి రూ.15 వేల చొప్పున అందజేస్తామన్న హామీని నిలుపుకోవాలి. అధికారంలోకి వచ్చాక టీడీపీ హామీని విస్మరించడం మంచిది కాదు. మాలాంటి కుటుంబాలను ఆశ పెట్టి.. ఇలా ఏమార్చి కష్టాల్లోకి నెట్టడం తగదు.     
– బూసే జోత్న్స, ఈపూరు, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా  

ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు? 
మాకు నలుగురు పిల్లలున్నారు. ప్రభుత్వం ‘తల్లికి వదనం’ ద్వారా సాయం చేస్తుందని అందరినీ ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తున్నాం. వారి ఫీజులు, పుస్తకాలు, డ్రస్సులు, బూట్లు ఇలా అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా ఖర్చు అవుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలు పాఠశాలకు వెళితే వారందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలి. ఈ మొత్తాన్ని త్వరగా మంజూరు చేయాలి. ఇప్పటికే ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పథకంలో కొర్రీలు వేయాలని చూడటం మంచిది కాదు. ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు..? 
    – షాఫియా భాను, హస్నాబాద్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా

మరీ ఇంత మోసమా!? 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి సంవత్సరం చెప్పిన తేదీన బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ పథకం అర్హతకు కొత్త నిబంధనలు పెట్టడం ఆందోళనకరంగా ఉంది. నాకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఐదో తరగతి, రెండో కొడుకు నాలుగో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కూతురు అంగన్‌వాడీ చదువు పూర్తి చేసుకుంది. పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.45 వేలు వస్తుందని ఆశించాం. కూతుర్ని ప్రయివేటు స్కూల్లో చేరుద్దామనుకున్నాం. హామీ ఇచ్చి మరీ ఇంత మోసం చేస్తారనుకోలేదు.  
– ఎం.పూజిత నాగలక్ష్మి, ఎనికేపాడు, విజయవాడ రూరల్‌ మండలం

రూ.60 వేలు వస్తాయని ఎదురు చూస్తున్నాం  
మేము విశాఖ జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాది దరి కె1 కాలనీలో నివాసం ఉంటున్నాం. మాకు నలుగురు పిల్లలు. పెద్దబ్బాయి రుషిత్‌ సింగ్‌ 10వ తరగతి, రెండవ అబ్బాయి సౌమిత్రి సింగ్‌ 6వ తరగతి, మూడవ అబ్బాయి హేమంత్‌ సింగ్‌ మూడవ తరగతి, నాలుగవ అబ్బాయి ప్రకృత్‌ సింగ్‌ నర్సరీ చదువుతున్నాడు. గతంలో ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో, ఒక అబ్బాయిని ప్రైవేట్‌ పాఠశాలలో చదివించే వాళ్లం. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రతీ విద్యార్ధికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని చెప్పడంతో నలుగురినీ ప్రైవేట్‌ పాఠశాలలో చేరి్పంచాం. పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం మాపై ఒత్తిడి తెస్తున్నాయి. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తల్లికి వందనం పథకం కింద రూ.60 వేలు ఇవ్వాలి.     
– లక్ష్మీ కౌర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement