
ఒకవైపు నోటిఫికేషన్ లేదు.. మరోవైపు దొంగ లెక్కలు
రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409
16,347 ఖాళీలే చూపుతున్న కూటమి ప్రభుత్వం
11 వేలకు పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలు
సీఎం తొలి సంతకం ఫైల్‌కీ లభించని మోక్షం.. మెగా డీఎస్సీ అంటూ తొమ్మిది నెలలుగా వంచన
ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల్లో ఆందోళన
టీచర్ పోస్టుల ఖాళీలు 10 శాతం మించరాదని నిబంధన
కానీ రాష్ట్రంలో 13 శాతం దాటిపోయిన ఖాళీలు
టీచర్ల కొరతపై పాఠశాల విద్యశాఖకు బాలల హక్కుల కమిషన్ లేఖ
మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చేస్తా..!
– ఎన్నికల సభల్లో టీచర్ పోస్టుల ఆశావహులకు చంద్రబాబు హామీ
16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం..
– గతేడాది జూన్‌లో సీఎంగా చంద్రబాబు ప్రకటన!
మెగా డీఎస్సీకి మేం కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం..
– తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట! గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇదే మాట చెప్పారు!
సాక్షి, అమరావతి: ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది! అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. త్వరలో.. త్వరలో... అంటూ తొమ్మిది నెలలు గడిచిపోయినా డీఎస్సీపై అతీగతీ లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచించిన టీడీపీ కూటమి సర్కారు టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది!
ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తయితే.. టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పొడవడం మరోఎత్తు!
రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖే వెల్లడించగా.. కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కారు డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఖాళీలపై విద్యాశాఖ వివరాలు..
రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని ‘హెల్ప్ ద పీపుల్’ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ.. రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది.
వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 2,06,393 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందచేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్‌సీపీసీఆర్.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది.
నోటిఫికేషనే లేకుండా భర్తీపై హామీలా?
రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు.
పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కానీ తొమ్మిది నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసన సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకూ నోటిఫికేషన్ ప్రక్రియే చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు.
రాష్ట్రంలో 13.28 శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఎన్‌సీపీసీఆర్ రాసిన లేఖ
నోరు విప్పని సర్కారు
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తాం.
25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు.
అంతేకాకుండా వైఎస్సార్ సీపీ హయాంలో 6,100 పోస్టుతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ గతేడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు.
అనంతరం టెట్, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు.
జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్..
రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10 శాతానికి మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 27,409 టీచర్ పోస్టులు (13.28 శాతం) ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది.
ఇన్ని ఖాళీలు ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా... మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10 శాతానికి మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్య డైరెక్టర్‌కు సూచించింది.
పది లక్షల మంది పడిగాపులు..
దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్ధికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా విద్యాశాఖ మంత్రి కనీసం ఫలానా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులంతా డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాక్షాత్తూ పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను కుదించడం.. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆటలాడటంపై రగిలిపోతున్నారు.
10 లక్షల మంది పిల్లలపై ప్రభావం..
రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1 : 40 ప్రకారం బోధనకు 2,06,393 మంది టీచర్లు అవసరం కాగా, ప్రస్తుతం 1,78,984 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫలితంగా రాష్ట్రంలో 10,96,360 మంది విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంత భారీగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు తగ్గించి చూపడంతో పాటు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తుందో కూడా చెప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment