teacher posts
-
వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 13,497 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకం 16,347 టీచర్ పోస్టుల భర్తీపై చేసినట్టు వివరించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో నోటిఫికేషన్ జారీచేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. అభ్యర్థుల వయోపరిమితి పెంచే ఆలోచన చేస్తున్నామన్నారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ఆలోచనచేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఉపాధ్యాయులు ధర్నా చేసినప్పుడు అనేక కేసులు పెట్టారని, త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పారు. ఉన్నత విద్యపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో సంస్కరణలు తెస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ఇంటర్లో 15 వేల అడ్మిషన్స్ పెరిగాయని చెప్పారు. తాము నారాయణ విద్యాసంస్థలతో పోటీపడేలా పనిచేస్తున్నామని, 9వ తరగతి నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి స్కూల్స్‌కు ర్యాంకింగ్స్ ఇస్తామన్నారు. నాడు–నేడుతో ప్రయోజనం లేదు గత ప్రభుత్వం టీచర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఘనంగా మోసం చేసిందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా చాకరీ చేయించిందని విమర్శించారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు చెప్పడంతో వారు పాఠాలు చెప్పలేకపోతున్నారని, దీంతో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రావాలన్నారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంతో ఎలాంటి ప్రమోజనం లేదని, దీనివల్ల చాలా నష్టం జరిగిందన్నారు.. పాఠశాలలు శిథిలమైపోయాయన్నారు. విద్యారంగానికిరూ.29 వేల కోట్లు కేటాయించడం హర్షించతగ్గ విషయమన్నారు. -
కొత్త టీచర్లకు నేడు నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు 10 వేల మంది వరకూ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా చేరబోతున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి బుధవారం నియామక ఉత్తర్వులు నేరుగా అందించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎంపికైన కొత్త టీచర్లకు సంబంధిత జిల్లా కేంద్రాల డీఈవోల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఉదయం డీఈవో ఆఫీసుకు రావాలని కోరారు. జిల్లాల నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతర టీచర్లు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ ఆన్లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహించారు. సెపె్టంబర్ 30న డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ప్రతి పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, జిల్లా సెలక్షన్ కమిటీకి పంపారు. వారం రోజుల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ముగ్గురిలో ఒకరిని జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరికి నియామక పత్రాలను అందించబోతున్నారు. 10,006 పోస్టుల భర్తీ.. మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం 10,006 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగతా పోస్టుల్లో కొన్ని బ్యాక్‌లాగ్‌లపై నిర్ణయం తీసుకోలేదు. కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల ఆగిపోయాయి. కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థి దొరకలేదని అధికారులు తెలిపారు. ఎస్జీటీ, ఎస్ఏ రెండు ఉద్యోగాలు వచ్చిన వాళ్లు 700 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి, ఏదైనా ఒకదానిలో కొనసాగేందుకు ఐచ్ఛికం ఇచ్చారు. ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారికి టీచర్ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశారు. -
‘డీఎస్సీ’కి నకిలీల బెడద!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ నెల 9న నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.అడ్డదారిలో సర్టిఫికెట్లు..: టీచర్ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్ట్‌ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది. కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులనుబట్టి తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.మోసాల్లో మచ్చుకు కొన్ని ..∙ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.ఆదిలాబాద్ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చ దువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.వరంగల్ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. -
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
త్వరలో 13 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం
నార్కట్‌పల్లి: త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టుల ను భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రా హ్మణవెల్లంల గ్రామంలో నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో ఆయన పాల్గొ ని విద్యార్థులకు నోట్‌బుక్స్, యూని ఫాం అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. బాత్రూమ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పా రు. నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల–ఉదయ సముద్రం ప్రాజెక్టులో నీళ్లు నింపి డిసెంబర్‌లోపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నీటి విడుదలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి, డీఈఓ భిక్షపతి, పంచాయతీరాజ్ ఈఈ బీమన్న, డీఈ మహేశ్, ఉదయ సముద్రం ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్‌కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
డీఎస్సీపై దగాకోరు రాతలు
సాక్షి, అమరావతి: ఐదేళ్లు సీఎంగా పనిచేసి కేవలం 300 టీచర్ ఉద్యోగాలిచ్చిన చంద్రబాబును ఇదేమిటని ఎన్నడూ ప్రశ్నించరు ఈనాడు రామోజీరావు. గత ఐదేళ్లలో ఇప్పటికే 15 వేల టీచర్ ఉద్యోగాలిచ్చి పేదల పిల్లలకు చక్కటి చదువులు అందిస్తూ మరో 6,100 మంది ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మాత్రం విషం చిమ్ముతారు అదే రామోజీ. ఎందుకంటే.. రామోజీ, చంద్రబాబు అంటేనే పెత్తందార్ల పెద్దలు. పేదల పిల్లల ఎదుగుదల, అభివృద్ధిని సహించలేరు. అందుకే పేదల చదువులపై ఎప్పుడూ విషం చిమ్ముతుంటారు. అదే క్రమంలో రాష్ట్రంలో తాజా డీఎస్సీపై పక్క రాష్ట్రంతో పోలిక పెట్టి.. మెగా.. దగా.. అంటూ ఓ కుటిల కథనం అచ్చేశారు. అసలు ఈ పోలికే ఓ దగా. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డీఎస్సీ నోటిఫికేషన్స్ పోస్టుల భర్తీ జరగనే లేదు. అలాంటి పోస్టులన్నీ మురగపెట్టి ఇప్పుడు 11వేల పోస్టులకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనినే రామోజీ మెగా డీఎస్సీ అంటున్నారు. కానీ, మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 1998 డీఎస్సీ నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ, మరో 12,00 కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు కలిపి 15 వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేసింది. తాజాగా 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తోంది. ఇవన్నీ కలిపితే సీఎం జగన్ ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాలు 21,108. అంటే తెలంగాణలో భర్తీ చేస్తున్న పోస్టులకంటే ఏపీలో పోస్టులే అధికం. ఈ విషయం చెప్పకుండా రామోజీ పాఠకులను తప్పుదోవ పట్టిస్తూ కథనం ఇవ్వడం దగా కాక మరేమిటి? తాజా డీఎస్సీతో అన్ని ఖాళీల భర్తీ తాజాగా 2024 డీఎస్సీలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఆశ్రం), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ విద్యా సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్స్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి. ఇకపై ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి కొత్త విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి బోధన అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బాబు డీఎస్సీ పెద్ద నాటకం చంద్రబాబు హయాంలో డీఎస్సీ ఓ పెద్ద నాటకం. చంద్రబాబు నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇందులో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు భర్తీ చేసిన పోస్టులు 300 మాత్రమే. కానీ, డీఎస్సీకి చంద్రబాబు పేటెంట్ అన్నట్టు ఈనాడు కలరింగ్ ఇస్తోంది. ఇది సీఎం జగన్ చేసిన మేలు 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఒక్క పాఠశాల కూడా మూత పడకుండా, ఏ ఒక్క టీచర్ అభ్యర్థికి అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాలలో నూరు శాతం టీచర్లను నియమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాత, కొత్త డీఎస్సీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2018 డీఎస్సీలో చంద్రబాబు చేతిలో దగాపడ్డ అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి సుమారు 6,954 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగులు ఇచ్చారు. అంతకు ముందు 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులు కూడా దశాబ్దాలుగా పోస్టింగ్స్ కోసం ఎదురు చూశారు. చంద్రబాబు వీరినీ పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేశారు. ఇలా చంద్రబాబు దొంగ నాటకానికి బలైపోయిన అభ్యర్థులను సీఎం జగన్ చొరవ తీసుకుని టైం స్కేల్ ప్రాతిపదికన నియమించారు. ఇలా 1998 డీఎస్సీలోని 4,059 మంది, 2008 డీఎస్సీలోని 2,193 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చారు. వీటితో పాటు కేజీబీవీల్లో సుమారు 1,200 మంది రెగ్యులర్ టీచర్లను నియమించారు. నిత్యం శుద్దపూస కబుర్లు చెప్పే రామోజీ.. చంద్రబాబు చేతిలో మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ చేసిన ఈ మేలు గురించి ఒక్క అక్షరం రాయరు. ఇది రామోజీ కుటిలత్వం రామోజీ బోడి గుండుకు.. మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఉపాధ్యాయ ఖాళీలను దాచేస్తున్నారంటూ పాతరాగానికి కొత్త ట్యూన్ కట్టారు. ఇక్కడ పాఠశాలల అభివృద్ధిని కాంక్షిస్తూ రుణం వస్తుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తేనే ఆ పాఠశాల బాగుపడుతుంది. విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు దక్కుతుంది. ఈనాడు చెప్పినట్టు కేవలం రుణం కోసం ఖాళీలను దాచేసి పాఠాలు చెప్పేవారు లేకుండా చేసి విద్యాభివృద్ధిని ఎలా సాధిస్తారు? కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరికైనా రామోజీ రాతల్లోని కుటిలత్వం బోధపడుతుంది. తెలంగాణలో ఇవెందుకు లేవు రామోజీ? విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క విద్యా రంగంపైనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశారు. ఏపీలో మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు కళ్లకు కడుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం, టొఫెల్, సీబీఎస్సీఈ సిలబస్, జగనన్న గోరుముద్ద, పేద విద్యార్థులకు ట్యాబ్స్, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి సాయం, ద్విభాషా పాఠ్య పుస్తకం, ఐఎఫ్‌పీలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ బోధనతో పాటు ప్రపంచం మెచ్చిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ మూరుమూల పల్లెలోని ప్రభుత్వ బడుల్లోకి వస్తున్నాయి. మన పిల్లలను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణలో లేవు. అక్కడి పేదల పిల్లలకు ఇలాంటి ఫలాలు దక్కట్లేదని ఈనాడు రాయదు. ఇక్కడ రామోజీ లక్ష్యం ఒక్కటే.. అది సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏదో రకంగా వ్యతిరేకత పెంచడం. -
రాజధానిలోనే ఎక్కువ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో అత్యధిక పోస్టులు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో 379 ఖాళీలున్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు (ఎస్జీటీల) అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా టీచర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్‌ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. -
11,062 పోస్టులతో రేపు డీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియా మకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజులపాటు పరీక్ష నిర్వహించే వీలుందని... ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒకరోజు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. ఎస్జీటీ పోస్టులే ఎక్కువ.. విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నట్లు లెక్కగట్టారు. వాటిల్లో ఎస్జీటీలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డీఎస్సీలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలే ఉండే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్జీటీలతో 70 శాతం వరకూ భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండటంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500–2,000 వరకూ ఎస్ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు, పీఈటీలు ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండే వీలుందని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులొచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా అధికారులు డీఎస్సీపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్వర్డ్స్, ఆన్లైన్ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. -
11 వేల పోస్టులతో డీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డీఎస్సీ ద్వారా మొత్తం 11 వేల టీచర్ పోస్టుల భర్తీ ఉండొచ్చని అధికార వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెండ్రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు.. టీచర్ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీ విధానం, న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డీఎస్సీలో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించారు. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్‌ను పంపింది. దానికి అనుమతి రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని, వెనువెంటనే ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్... గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్ తేదీలు రావడంతో డీఎస్సీని రద్దు చేయాల్సి వచ్చింది. అదీగాక.. డీఎస్సీలో ప్రకటించిన 5,089 పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీల్లేని పరిస్థితి తలెత్తింది. నాన్–లోకల్ జిల్లా కోటాలో డీఎస్సీకి వెళ్లేందుకూ పోస్టులు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది. లోపాల్లేకుండా చూడాలి.. నిరుద్యోగుల్లో డీఎస్సీ నిర్వహణ ఆనందం నింపు తోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాల్లే కుండా చూడాలి. వీలైనంత త్వరగా టీచర్ల పదోన్నతులు చేపట్టి.. ఖాళీలను భర్తీ చేయాలి. – రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఖాళీలు ఎన్ని?.. భర్తీ చేసేవి ఎన్ని? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు సహా మొత్తం టీచర్ పోస్టులు 21 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కలి్పంచడం ద్వారా 1,974 హెచ్ఎం పోస్టులను, ప్రమోషన్ల ద్వారా 2,043 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,200 వరకూ ఖాళీలు ఉండగా వాటిలో 70 శాతం ప్రమోషన్ల ద్వారా మిగిలిన 30 శాతం పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులున్నాయి. కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డీఎస్సీ పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయుల పోస్టుల్లో 6,775 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. పండిట్, పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తంగా 11 వేలకుపైగా పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. -
రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు..
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి ఏడు ప్రభుత్వ కాలేజీల ప్రారం¿ోత్సవం, వచ్చే సంవవత్సరానికి మరో ఏడు జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ఇది సాకారం అయితే దేశంలోనే ప్రతిజిల్లాలోనూ మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కుతుంది. సాగునీటిరంగంలో కాళేశ్వం ప్రాజెక్టు లోపాలు పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. పింఛన్లు పెంపు ఆసరా లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కారణంగా ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది. వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది సాధించిన ప్రధాన విజయాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడంగా చెప్పవచ్చు. 2023–24 సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే మెడికల్ విద్యార్థులు వాటిల్లో చేరారు. ఇక 2024–25 సంవత్సరంలోనూ జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుంది. అంటే 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకాగా, తాజాగా అనుమతించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. ఇవి పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య మొత్తం 34కు చేరుతుంది. తాజా నిర్ణయంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. అంటే మొత్తంగా రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. పీఆర్ అండ్ ఆర్డీ పింఛన్ రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికొస్తే..ప్రధానంగా ఆసరాలో భాగంగా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 నుంచి రూ. 4,016కు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. పెంపునకు అనుగుణంగా 5,11,656 మందికి నెలకు రూ.205.48 కోట్లు అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ♦ జీపీలు, సర్పంచ్‌లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదలలో జాప్యం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పలు జీపీల్లో సర్పంచ్‌లు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వివిధ పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనూ నిధుల సమస్య ఉపాధి హామీ అమల్లో భాగంగా... తెలంగాణలో నియమ,నిబంధనలు, మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపేసింది. అయితే కేంద్రం పక్షపాతం ప్రదర్శిస్తూ సకాలంలో నిధులు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ సర్కార్ విమర్శలు సంధించింది. ఇదిలా ఉంటే...ఈ పథకంలో భాగంగా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్, ఔట్సోర్సింగ్–కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత రెండు, మూడు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మా‘స్టార్’ ఏదీ? ♦ సాగని పదోన్నతులు... ఆగిన బదిలీలు ఆఖరులో తప్పని ♦ టెట్ చిక్కులు.. టీచర్ పోస్టులకూ బ్రేకులు ♦ ఉన్నత విద్యామండలిలో మహా నిశ్శబ్దం దీర్ఘకాలిక డిమాండ్ అయిన బదిలీలు, పదోన్నతులుపై ఆశలు రేకెత్తిందీ ఈ ఏడాదే. 10 వేలమంది టీచర్లు ప్రమోషన్లపై కలలుగన్నారు. దాదాపు 50 వేలమంది స్థానచలనం ఉంటుందని ఆశించారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ఊరట ఎంతోకాలం నిలవలేదు. అడ్డుపడ్డ కోర్టు వ్యాజ్యాలు టీచర్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ప్రమోషన్లకూ బ్రేకులు పడటం 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకమే. ఉపాధ్యాయ కొలువుల భర్తీపై నిరుద్యోగుల గంపెడాశలకు 2023 నీళ్లు చల్లింది. విద్యాశాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా, 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ రావడం, అదీ అర్ధంతరంగా ఆగిపోవడం నిరుద్యోగులకు 2023 అందించిన ఓ పీడకల. జాతీయ ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయాల వెనుకబాటు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం జరిగిన ఉద్యమాలు దూరమయ్యే కాలంలో కని్పంచిన దృశ్యాలు. బాసర ట్రిపుల్ ఐటీలో వెంటవెంట జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థిలోకాన్ని కలవరపెట్టాయి. టెన్త్ పరీక్షల సరళీకరణ, ఇంటర్ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం 2023లో కనిపించిన కొత్తదనం. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలిలో కుదుపులకు గతించే కాలమే సాక్షీభూతమైంది. మండలి చైర్మన్, వైస్‌చైర్మన్ తొలగింపుతో కార్యకలాపాలే మందగించిపోవడం ఈ ఏడాదిలో ఊహించని పరిణామమే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యార్థులు పోటెత్తడం ఈ సంవత్సరంలో కనిపించిన విశేషం. కరోనా కాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జేఈఈ మెయిన్ కాస్తా గాడిలో పడింది. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ♦ 2022–23 సీజన్లో వరి ఉత్పత్తి ♦ 2.58 కోట్ల టన్నులు రికార్డులు బద్దలు కొట్టిన తెలంగాణ వ్యవసాయరంగం రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ధాన్యం 2.58 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. వానాకాలం సీజన్లో 1.38 కోట్ల టన్నులు, యాసంగిలో 1.20 కోట్ల టన్నులు ఉంది. ఈ మేరకు తుది నివేదికను ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉత్పాదకత ఎకరానికి 2,124 కిలోలు వచ్చింది. కాగా, ఈ యాసంగిలో 57.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పాదకత ఎకరానికి 2,091 కిలోలు వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో 1.22 కోట్ల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎకరానికి 2,108 కిలోల ఉత్పాదకత వచ్చింది. ఆ మేరకు 2.58 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 15వ తేదీన విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది వరకు 11 విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం రూ. 72,815 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం 12వ విడత సొమ్మును కొత్త ప్రభుత్వం అందజేసే ప్రక్రియ చేపట్టింది. అందులో ఒక ఎకరాలోపు రైతులకు రైతుబంధు సొమ్ము అందజేస్తున్నారు. కాళేశ్వరం ‘కుదుపు’ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మసకబారిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను కుంగదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బయటపడిన లోపాలు.. 2023 చివరి త్రైమాసికంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపివేశాయి. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పియర్లు గత అక్టోబర్ 21వ తేదీన కుంగిపోగా, కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని పియర్లు కుంగినట్టు ..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. 7వ బ్లాక్‌ను పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సిఫారసు చేసింది. ఇతర బ్లాకులూ విఫలమైతే బ్యారేజీని పూర్తిగా పునర్నిర్మించక తప్పదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించడంతో భవిష్యత్‌లో వాటికి సైతం ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. అన్నారం బ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీకి బుంగలు ఏర్పడినట్టు ఎన్డీఎస్ఏ బృందం మరో నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను సొంత ఖర్చులతో చేస్తామని గతంలో హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయం ఎవరు చేపట్టాలని అన్న అంశంపై ఎల్అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదు. మిల్లుల్లోనే రూ. 22 వేల కోట్ల విలువైన బియ్యం పేదలకు ఉచిత బియ్యం పంపిణీతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించే బృహత్తర బాధ్యత నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ 2023లో కొన్ని తప్పటడుగులు వేసింది. తద్వారా కార్పొరేషన్‌కు అప్పులు గుదిబండగా మారాయి. 2022 రబీ(యాసంగి)లో రైతుల నుంచి సేకరించిన సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడంతో ఆ భారం సంస్థపై పడింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల బియ్యం విరిగి తమకు నష్టం వస్తుందని, అందుకే మిల్లింగ్ చేయలేమని రైస్‌మిల్లర్ల వాదనను అంగీకరించింది. మిల్లర్ల పట్ల ఉదారత చూపి, ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో మిల్లుల్లోనే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటితో పాటు అంతకు ముందు లెక్క తేలని ధాన్యం కలిపి సుమారు రూ. 22వేల కోట్ల విలువైన 83 ఎల్ఎంటీ ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు మిల్లర్లు చూపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఈ లెక్కలు తీసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఏకంగా రూ.56వేల కోట్ల అప్పులు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా రూ. 11వేల కోట్లు సంస్థ నష్టపోయినట్లు తేల్చారు. మిల్లర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 2023లో ఆ సంస్థ ప్రజల్లో పలుచనైపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. -
మెగా డీఎస్సీనేనా?
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మెగా డీఎస్సీ ప్రస్తావన రావడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు చిగురిస్తున్నాయి. 22 వేల ఖాళీలున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అధికారులు 18 వేల పోస్టులే ఉన్నట్టు సర్కారుకు నివేదించారు. మెగా డీఎస్సీ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందిదాకా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క 2017లోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, 8,792 పోస్టులు భర్తీ చేశారు. అప్పటికే 2.5 లక్షల మంది టెట్‌కు అర్హత సాధించి ఉన్నారు. కొత్త నియామకాలపైనే దృష్టి ఉపాధ్యాయ ఖాళీల్లో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. స్కూల్ అసిసెంట్లు(ఎస్ఏ)గా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేసి, 30 శాతం స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ నేరుగా నోటిఫికేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కొన్ని స్కూళ్లలో టీచర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య లేదు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులున్నా, టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్దీకరణ చేయాలని విద్యాశాఖ 2016 నుంచి చెబుతూనే ఉంది. ఈ సమస్యల కార ణంగానే 2022లో డీఎస్సీ ద్వారా కేవలం 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు పదోన్నతులు కల్పించి, హేతుబద్దీకరణ చేపట్టి వాస్తవ ఖాళీలను భర్తీ చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే జరిగితే గత ఏడాది ఆగిపోయిన డీఎస్సీ నోటిఫికేషన్ స్థానంలో కొత్త నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అడ్డంకులెన్నో... ఉపాధ్యాయ నియామకాల ప్రస్తావన వచ్చి నప్పుడల్లా లక్షలాదిమంది కోచింగ్‌ల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. కొంత మంది ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నా, వాటిని విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్లీ కనిపించనుంది. అయితే, విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలుస్తాయి. టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు దీనిని చేపట్టాల్సి ఉంటుంది. వరుసగా స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలున్నాయి. దీనివల్ల కాలయాపన జరిగే వీలుంది. ఇవేవీ అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలి విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయి. లక్షల మంది టెట్ ఉత్తీర్ణులై టీచర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో నియామకాలు చేపడితేనే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి. – రావుల రామ్మోహన్‌రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) -
ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీపై కొత్త ప్రభుత్వం ఆరా తీసింది. నిలిచిపోయిన నియామకాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై వాకబు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దీంతో పాటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వివరించారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాలు, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన డీఎస్సీ పరీక్షను నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. దీంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. డీఎస్సీ రీ షెడ్యూల్? ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. రోస్టర్ విధానాన్ని స్పష్టం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఆగిపోయిన డీఎస్సీని ముందుకు తీసుకెళ్ళడమా? కొత్త షెడ్యూల్ ఇవ్వడమా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోస్టర్ విధానం వెల్లడించిన తర్వాత కొన్ని జిల్లాల్లో సాధారణ కేటగిరీల్లో పోస్టులు లేకుండా పోయాయి. స్థానికేతరులకూ కేవలం 15 శాతమే అర్హత ఉండటంతో డీఎస్సీపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పట్లోనే కొన్ని పో స్టులు కలపాలన్న ఆలోచన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. 20 వేలకుపైగానే ఖాళీలు విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు లెక్కగట్టారు. 2022లో ప్రభుత్వం 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో పేర్కొంది. పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30 శాతం ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విషయాన్ని సూచించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం ఐదు జిల్లాలకే ఉన్నారని, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు 467 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటిల్లో ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు తెలిపారు. -
మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తోందంటూ బోడ శ్రీనివాసులు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘డీఎస్సీలో మహిళలకు 33.33 శాతానికి బదులు 51శాతం పోస్టులను కేటాయించారు. గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను విద్యా శాఖ పాటించడం లేదు. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
టెట్‌లో తగ్గిన రిజల్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 15న జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టెట్ రెండు పేపర్లకు కలిపి 4,13,629 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 1,11,562 మంది అర్హత పొందారు. పేపర్–1ను 2,23,582 మంది రాస్తే 82,489 (36 .98%)మంది అర్హత పొందగా పేపర్–2లో మేథ్స్, సైన్స్ సబ్జెక్టులను 1,01,134 మంది రాస్తే 18,874 మంది (18.66%), సోషల్ స్టడీస్‌సబ్జెక్టును88,913 మంది రాస్తే 10,199 మంది (11.47%) అర్హత సాధించారు. పేపర్–2లో 1,90, 047 మందికి గాను 29,073 (15.30%) మంది అర్హత పొందారు. టెట్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://cgg.gov.inÌలో తుది ‘కీ’తోపాటు ఫలితాలు అందుబాటులో ఉన్నాయని టీఎస్ టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పడిపోయిన ఫలితాలు...: ఉమ్మడి రాష్ట్రంలో 2011లో టెట్ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకూ ఐదుసార్లు పరీక్ష జరిగింది. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మంది టెట్ అర్హులు రాష్ట్రంలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది టెట్ ఫలితాలు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా పేపర్–1లో 2022లో మినహా అంతకు ముందు రెండేళ్లలో 50 శాతానికిపైగా రిజల్ట్ వచ్చింది. పేపర్–2లో మొదట్నుంచీ రిజల్ట్ తగ్గుతున్నా ఈసారి అతితక్కువగా 15.30 శాతమే నమోదైంది. గతేడాది ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు ఇవ్వడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామనే ప్రకటనతో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్‌కు సన్నద్ధమయ్యారు. ఈసారి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసినా పోస్టులు తక్కువగా ఉండటం, రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఏమాత్రం ఖాళీలు లేకపోవడంతో ఎక్కువ మంది టెట్‌కు ప్రిపేర్ కాలేదు. టీఆర్టీ దరఖాస్తుకు అర్హులు తాజాగా టెట్ ఉత్తీర్ణులు ప్రస్తుతం ప్రభుత్వం నియమించే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలు వెల్లడవ్వడంతో ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. టీఆరీ్టకి ఇప్పటివరకు పెద్దగా దరఖాస్తులు రాలేదు. కొన్ని జిల్లాల్లో స్థానికత ఉన్నప్పటికీ పోస్టులు లేవని, పోస్టులు ఉన్న చోట నాన్–లోకల్ కోటాలో వెళ్లినా, ఆ కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయని అభ్యర్థులు టీఆర్టీకి వెనకడుగు వేస్తున్నారు. తాజా టెట్ అర్హులు టీచర్ పోస్టులకు ఎక్కువగా దరఖాస్తు చేసే వీలుందని భావిస్తున్నారు. -
ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ డిగ్రీ చేసి, బీఈడీ పూర్తి చేసిన వారూ ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తు విధానంలో స్వల్ప మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియెట్ చదవకుండా గతంలో డైరెక్ట్ డిగ్రీ (దూర విద్య ద్వారా) చేసినవారు తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామకాల దరఖాస్తు ఫారంలో ఇంటర్ విద్య వివరాలను పొందుపరచాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై విద్యాశాఖ సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. -
మెగా డీఎస్సీని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సరికాదన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట బీఈడీ, టీఆర్టీ అభ్యర్థులు భారీగా ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులు... మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విద్యా శాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ నుంచి కొంతమంది, అబిడ్స్ నుంచి కొంతమంది అభ్యర్థులు ఏకకాలంలో దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నా రు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో వాగ్వాదం, తోపు లాట జరగడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
టెట్‌పై పట్టు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా.. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మాత్రం చాలా మంది ఫెయిలవుతున్నారు. బీఎడ్ విద్యార్హతతో రాసే పేపర్–2లో 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క 2022లో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత 30% కూడా దాటకపోవడం గమనార్హం. ప్రభు త్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తా మని గతేడాది ప్రకటించడంతో.. ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్నవారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్ కోసం సిద్ధమయ్యారు. అయినా పాస్ శాతం తక్కువే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌తోపాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేవారని.. టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో టెట్‌పై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సీరియస్‌గా ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందని అర్హత గీటురాయి: టెట్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కు లు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. పేపర్–1 (డీఎడ్ అర్హతతో రాసేది)తో పోలిస్తే, పేపర్–2 (బీఎడ్ అర్హతతో రాసేది) కష్టంగా ఉంటోందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు. మేథ్స్, ఇంగ్లిష్ పై పట్టు ఉంటే తప్ప కనీసం 90 మార్కులు సాధించడం కష్టమేనని.. ముఖ్యంగా మేథ్స్‌లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. కనీసం 6 నెలల పాటు మోడల్ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నా రు. ఇక ఇంగ్లిష్‌లో ప్రధానంగా జాతీయాలు, మోడ్రన్, అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారని.. వీటికి తగ్గ ప్రిపరేషన్ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. అదే పేపర్–1 ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటోందని.. బోధన మెళకువలు, మోడ్రన్ టీచింగ్ మెథడ్స్‌పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. నాలుగున్నర లక్షల మందిలో.. రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్ ఉత్తీర్ణులు, 4.5 లక్షల మంది బీఎడ్ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికిపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణత సాధించగలిగారు. టెట్‌లో పేపర్–1 పాసైతే.. 1–5 వరకూ బోధించే ‘సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)’ పోస్టులకు.. పేపర్–2 పాసైతే పదో తరగతి వరకు బోధించే ‘స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)’ పోస్టులకు పోటీపడే వీలు ఉంటుంది. డీఎడ్ పూర్తిచేసినవారు పేపర్–1 మాత్రమే రాసే వీలుండగా.. బీఎడ్ వారు పేపర్–1, పేపర్–2 రెండూ రాయవచ్చు. అయితే పేపర్–1 కాస్త సులువుగా ఉంటుండటంతో.. చాలా మంది బీఎడ్ వారు పేపర్–1పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇదికూడా పేపర్–2లో అర్హత శాతం తగ్గడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇంగ్లిష్, మేథ్స్‌కు కష్టపడాలి కేవలం 45 రోజుల్లోనే టెట్‌కు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇంగ్లిష్, మేథ్స్‌లో మంచి మార్కులు సాధిస్తేనే అర్హత సాధించవచ్చు. దీనికి ప్రత్యేక సన్నద్ధత అవసరం. టీచర్ పోస్టులు వస్తాయనే ఆశతో కోచింగ్ కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాం. కానీ టీచర్ నోటిఫికేషన్ రాకపోవడం నిరాశగా ఉంది. – స్వాతి, టెట్ అభ్యర్థి, భూపాలపల్లి నియామకాలుంటేనే ఉత్సాహం టెట్ ఉత్తీర్ణులు లక్షల్లో ఉన్నారు. టీచర్ పోస్టులు వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ ఏటా నిరాశే ఎదురవుతోంది. నియామక నోటిఫికేషన్ వస్తేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. ఈసారైనా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. – ఇఫ్రాన్ పాషా, టెట్ అభ్యర్థి, ములుగు జిల్లా -
తగ్గిన పోస్టులు..పెరిగిన ఆందోళన
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చేసిన ప్రకటనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగులు ఆందోళన బాట పడుతుంటే, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు తప్పడం లేదు. 2017 తర్వాత ఇప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్ ఉంటుందంటే నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విద్యాశాఖ దాదాపు 22 వేల ఖాళీలున్నాయని లెక్కగట్టడం దీనికి ఓ కారణం. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ కలిపి దాదాపు 6,612 పోస్టుల భర్తీకే సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది టెట్ అర్హులు టీచర్ నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో సగం పోస్టులు కూడా లేకపోవడంతో వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లలో అసంతృప్తి ఇప్పటికే స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. వేరే సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తున్నారు. గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధ న చేపట్టారు. దీంతో టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉన్న రెండు సెక్షన్లకూ బోధన చే యాల్సి వస్తోంది. ఈ కారణంగా తమపై పని భారం పెరిగిందని టీచర్లు అంటున్నారు. రా ష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 22 వేల వరకూ ఖాళీలున్నాయని విద్యాశాఖ గత ఏడా ది లెక్కలు వేసింది. ఇందులో 13,086 పోస్టు లు భర్తీ చేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం కూడా 9,370 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్ర త్యేక అవసరాల పిల్లలకు బోధించే టీచర్లను కలుపుకొంటే 6,612 మందిని మాత్రమే నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో భారీ ఎత్తున చేపట్టాల్సిన నియామకాల జాడే కన్పించలేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ లో ఎక్కువగా సైన్స్, సోషల్ సబ్జెక్టు టీచర్ పో స్టులే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంగ్లిష్, మా థ్స్ సబ్జెక్టులకు భారీగా కోత తప్పదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. దీనివల్ల ఉన్న టీచర్లపై పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు వస్తే తప్ప మి గతా ఖాళీలు భర్తీ చేయడానికి వీల్లేదని ప్రభు త్వం అంటోంది. న్యాయ వివాదం కొన్నేళ్లుగా నలుగుతోంది, దీంతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆందోళన బాటలో నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాలపై టెట్ ఉత్తీర్ణులు ఎన్నో ఆశ లు పెట్టుకున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్ల సమయంలో కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని మరీ కోచింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎలాగైనా మంచి ర్యాంకు సాధించాలని అప్పులు చేసి, హాస్టళ్లల్లో ఉండి సిద్ధమయ్యారు. కానీ టీచర్ల పదోన్నతులు ఇస్తేనే స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ పోస్టుల ఖాళీలు తెలుస్తాయి. వాటిని భర్తీ చేయడానికి వీలుంటుంది. ఇవేవీ జరగకపోవడంతో నిరుద్యోగులు ఏడాదిగా నలిగిపోతున్నారు. తాజాగా 6,612 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించడంతో వారు ఆందోళనలకు దిగుతున్నారు, 13,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. -
6,612 టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆమె గురువారం ఎస్సీఈఆర్టీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, 1,523 పోస్టులు ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం నిర్దేశించినవి. వీటిని త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. 2017లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. దీనితో గతంలో నిర్వహించినట్టుగా డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టనున్నాం..’’ అని మంత్రి సబితారెడ్డి వివరించారు. 9,979 పోస్టులకు పదోన్నతులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. వీటిలో 1,03,343 పోస్టుల్లో టీచర్లు పనిచేస్తున్నారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 6,612 పోస్టులను భర్తీ చేస్తుండగా.. పదోన్నతుల ద్వారా మరో 9,979 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన కేటగిరీలో గెజిటెడ్ హెచ్ఎం ఖాళీలు 1,947 ఉన్నాయని, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు 2,162 ఉన్నాయని.. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతుతో వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎస్జీటీ టీచర్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 15న టెట్ డీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాలకు టెట్ కీలకమని.. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తామని సబితారెడ్డి ప్రకటించారు. టెట్ ఫలితాలను వచ్చేనెల 27వ తేదీన ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతోందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తక్షణమే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇటీవల కేజీబీవీల్లో 1,264 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని.. కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుతో మరో 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. వీటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా విద్యాశాఖలో 3,896 మందికి లబ్ధి చేకూరిందని, ఇందులో అత్యధికులు విద్యాశాఖ వారే ఉన్నారని మంత్రి చెప్పారు. గురుకుల విద్యాసంస్థల్లో కూడా పలువురు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. మొత్తంగా విద్యాశాఖ పరిధిలో 8,792 పోస్టులు, కాలేజీల్లో 3,149 పోస్టుల భర్తీ ప్రక్రియలు టీఎస్పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు. భర్తీ చేసే టీచర్ పోస్టులు ఇవీ.. మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు: 6,612 జనరల్ టీచర్లు: 5,089 వీరిలో స్కూల్ అసిస్టెంట్లు: 1,739 సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575 భాషా పండితులు: 611 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 164 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523 వీటిలో ప్రాథమిక స్థాయిలో 796 పోస్టులు – ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులు ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ’ ఇలా.. ప్రతి జిల్లాకు ఒక ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)’ ఉంటుంది. దీనికి సదరు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (జెడ్పీ సీఈఓ) వ్యవహరిస్తారు. గతంలో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది. -
Fact Check: వాస్తవాలకే ఉరి!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యకు ఉరి బిగిసింది చంద్రబాబు హయాంలోనే. ఆయన అధికారంలో ఉండగా ఏనాడు విశ్వవిద్యాలయాలను పట్టించుకోలేదు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఒక్క ప్రొఫెసర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. 2017–18లో తప్పుల తడకగా ఇచ్చిన నోటిఫికేషన్‌తో కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఫలితంగా ఆచార్యుల పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. ఇదీ వాస్తవం. రామోజీరావు మాత్రం ఈనాడు ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం చొరవ చూపుతుంటే పదేపదే నిస్సిగ్గుగా అసత్యాలు వల్లె వేస్తున్నారు. కనీసం ఇంగితం లేకుండా.. ఇది టెక్నాలజీ యుగం.. అత్యధికంగా కంప్యూటర్, కృత్రిమ మేథ రంగాల వైపు అంతా ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ మార్పు దేశవ్యాప్తంగా ఉంది. సహజంగానే అన్ని చోట్లా ఈ ప్రభావం తప్పదు! ఈనాడు మాత్రం ఇతర రాష్ట్రాల్లో పీజీ విద్యార్థులు, అడ్మిషన్లు తగ్గిపోవడాన్ని ప్రస్తావించకుండా ఇదంతా ఒక్క ఏపీలోనే జరిగిపోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. సెంట్రల్ వర్సిటీల్లో సీట్ల భర్తీ గురించి ఈనాడు ఎందుకు ప్రస్తావించలేకపోయింది? పీజీ కౌన్సెలింగ్ జాప్యానికి, అడ్మిషన్లు తగ్గిపోవడానికి అసలు సంబంధమే లేదు. అన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీ పరీక్షలు ఆగస్టుకి పూర్తవుతాయి. అందుకే సెప్టెంబర్‌లో ప్రవేశాల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చారు. డిగ్రీ ఫలితాలు రాకుండానే వర్సిటీలో అడ్మిషన్లు ఎలా ఇస్తారనే జ్ఞానం లేకుండా ఇష్టమొచ్చినట్టు రాయడం ఈనాడుకే చెల్లింది. 2021–22లో తొలిసారిగా పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తున్న సందర్భంలో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఉన్నత విద్యా మండలి వీడియోలు, పోస్టర్లను రూపొందించింది. దీన్ని అపహాస్యం చేస్తూ సీట్లు ఇస్తామని విద్యార్థులను బతిమిలాడుతున్నట్టు ఈనాడు కథనాలు ప్రచురించడం హేయం. నకిలీ అడ్మిషన్లకు అడ్డుకట్ట టీడీపీ హయాంలో ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కై కాగితాలపై పీజీ అడ్మిషన్లు చూపించి ఫీజురీయింబర్స్‌మెంట్ దోచిపెట్టారు. యూజీలో సున్నా అడ్మిషన్లు ఉన్న కాలేజీల్లో సైతం పీజీకి వచ్చే సరికి నూటికి నూరు శాతం అడ్మిషన్లు ఉండేవి. యూజీలోనే పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు లేని చోట పీజీ విద్యను నడిపించేశారు. వీటికి ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వర్సిటీల్లో పీజీ విద్యకు ఫీజురీయింబర్స్ ఇస్తోంది. ప్రతిభ ఆధారంగా అన్ని వర్గాల విద్యార్థులకు విద్యను అందిస్తోంది. అప్పుడు ఆర్ట్స్ గుర్తు రాలేదా? రామోజీ దృష్టిలో దార్శనికుడైన చంద్రబాబు ఆర్ట్స్, హిస్టరీ సబ్జెక్టులే అవసరం లేదని తేల్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు?లేడీ శ్రీరామ్, లయోలా చెన్నై, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లాంటి విద్యా సంస్థలు రాష్ట్రంలో ఒక్కటైనా లేవని శోకాలు పెడుతున్న రామోజీకి గతంలో ఈ విషయం గుర్తు రాలేదా? అధికారం దూరమైందనే అక్కసుతో అజ్ఞానపు విమర్శలు చేయడం సిగ్గు అనిపించట్లేదా? ద్రవిడ వర్సిటీలో ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పుడేదో కొత్తగా తగ్గిపోయినట్టు ఈనాడు చిత్రీకరించింది. నిజానికి 2014 నుంచే తగ్గిపోయాయా? చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆ వర్సిటీ ఉంది కాబట్టే నాడు గుర్తు లేదేమో? పెరిగిన ప్లేస్మెంట్లు.. ప్రవేశాలు గత ప్రభుత్వ హయాంలో సాధారణ డిగ్రీలో 37 వేలుగా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పుడు లక్షకు పైగా పెరిగాయి. సాధారణంగా డిగ్రీ తర్వాత ఉద్యోగాల్లో చేరే విద్యార్థులు పీజీపై ఆసక్తి చూపరు. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు దాదాపు 3 రెట్లు పెరగడంతో సహజంగానే పీజీ అడ్మిషన్లు తగ్గుతాయి. ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో పీజీ చదువుతారు. ఇంటర్ తర్వాత డిగ్రీ కంటే ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కారణం.. ప్రభుత్వం విద్యా దీవెన కింద పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద మెస్ చార్జీలను కూడా అందించడమే. అందుకే 2018–19లో ఇంజనీరింగ్‌లో చేరికలు 87 వేలు ఉంటే ఇప్పుడు 1.20 లక్షలకు చేరుకున్నాయి. అంటే 30 వేల మందికిపైగా డిగ్రీలో చేరాల్సిన విద్యార్థులు సాంకేతిక విద్య వైపు వెళ్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇంటర్ తర్వాత డ్రాపవుట్లు 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గాయి. ఇదంతా విద్యావ్యవస్థ బలోపేతం కాదా రామోజీ? ఇవి మార్పులు కాదా? గత నాలుగేళ్లలో సీఎం జగన్ దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు, రీజనల్ క్లస్టర్ గ్రూపులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఏ కోర్సు అభ్యసించినా విద్యార్థికి కచ్చితంగా ఉపాధి లభించేలా ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా సింగిల్ మేజర్ సబ్జెక్టును ప్రవేశపెట్టింది. వీటికి తోడు 100కిపైగా మైనర్ సబ్జెక్టుల్లో విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్లో నైపుణ్య కోర్సులు, ఇంటర్న్‌షిప్, కమ్యూనిటీ డెలప్మెంట్ ప్రోగ్రామ్‌లను తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలు ఈనాడుకు కనపడవా? యూజీసీ చర్యలూ తప్పేనా? యూజీసీ సైతం సెంట్రల్ వర్సిటీలకు కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తోంది. తెలంగాణ కూడా స్టేట్ వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. చాలా రాష్ట్రాల్లో వర్సిటీలు ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి. మరి రామోజీకి తాను నివాసం ఉంటున్న తెలంగాణలోని వర్సిటీలు కనిపించట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలపై మాత్రం వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారు. ఇది కడుపు మంటతో వచ్చిన కపట ప్రేమే కదా! గతంలో ఒక విద్యార్థి వివిధ విశ్వవిద్యాలయాలకు విడివిడిగా ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సి వచ్చేది. ప్రతి వర్సిటీకి ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఒకే టెస్టుతో అర్హత సాధించి ఇష్టమైన వర్సిటీలో చేరే వెసులుబాటు కలిగింది. దీని ద్వారా టాలెంట్ కలిగిన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు ఉన్న వర్సిటీలో తొలి ప్రాధాన్య సీటు పొందుతున్నారు. -
ఏడేళ్ల ‘బడి ’కల.. 4 లక్షల మంది ఎదురు చూపు.. నోటిఫికేషన్ జాడేది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తుండటం నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ల్లో ఉత్తీర్ణులైన వారూ గంపెడాశలు పెట్టుకున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని భావించారు. కానీ కల నెరవేరకపోవడంతో, నోటిఫికేషన్ వెలువడే సూచనలు లేకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఇప్పటివరకు మూడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు నిర్వహించింది. 2016, 2017ల్లో నిర్వహించిన టెట్లలో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. తాజాగా 2022 జూన్‌లో నిర్వహించిన టెట్‌లో మరో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. మూడు పరీక్షల్లో నాలుగు లక్షల మందికి పైగా అర్హత సాధించినా ఇప్పటివరకు ప్రయోజనం లేకుండా పోయింది. ఏడేళ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయని టెట్ ఉత్తీర్ణులు వాపోతున్నారు. పదోన్నతులకు, నియామకాలకు ముడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. కానీ ఈ ప్రక్రియ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావిడి చేసినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వివాదాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేయడం లేదనే విమర్శలున్నాయి. కోర్టు వివాదాలకు దారి తీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్ళడం లేదనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి బదిలీలు, ప్రమోషన్స్ పేరిట కాలయాపన చేయడం వల్ల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో 4 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మేమంతా టీచర్ పోస్టులు వస్తాయని ఉన్న ఉద్యోగాలు మానేసి, పోటీ పరీక్షకు రూ.వేలు ఖర్చు పెట్టాం. అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం, టీఆర్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక శాఖకు అనుమతివ్వాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చాలి రాష్ట్రంలో 60 శాతానికి పైగా గెజిటెడ్ హెచ్ఎంలు, వేలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యాశాఖ ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాలయాపన చేయకుండా తక్షణమే బదిలీలు, పదోన్నతుల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి. – ఎం చెన్నయ్య (పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు) వ్యయప్రయాసలకోర్చి శిక్షణ తీసుకుని.. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రభుత్వ టీచర్ పోస్టునే లక్ష్యంగా పెట్టుకుంటారు. అవకాశం వచ్చే వరకు ప్రైవేటు స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తుంటారు. కొందరు ఇతర ఉద్యోగాలూ చేస్తుంటారు. టెట్ పరీక్ష నిర్వహించే కొన్ని నెలల ముందు వీరంతా తాము అంతకుముందు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, వ్యయప్రయాసలకోర్చి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. ఇదే క్రమంలో గత ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్‌కు హాజరయ్యారు. గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షల మంది వరకు పరీక్ష రాశారు. 1–5 తరగతులకు బోధించేందుకు డీఎడ్ అర్హతతో టెట్ పేపర్–1 రాస్తారు. గతంలో ఈ పరీక్ష రాయడానికి బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులు కారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు పేపర్–2తోపాటు, పేపర్–1 రాసేందుకూ వీలు కల్పించారు. దీంతో అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరీక్షలో ఏకంగా 2 లక్షల మందికి పైగా అర్హత సాధించడంతో మొత్తం అర్హుల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మొదలవడంతో, తమకూ టీచర్ అయ్యే అవకాశం వస్తుందని వీరంతా ఎదురుచూశారు. -
44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖమంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తాత్కాలిక ఉపాధ్యాయుల ద్వారా కాకుండా శాశ్వత ఉపాధ్యాయుల భర్తీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిమెట్టు.. తీసికట్టు!
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచే ‘తొలిమెట్టు’ అమలు కాగితాలకే పరిమితమైంది. కరోనా తీవ్రత నేపథ్యంలో వరుసగా రెండేళ్లు స్కూళ్ల మూత, ఆన్లైన్ బోధనలతో విద్యార్థుల సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు బేసిక్స్ కూడా మరిచిపోవడంతో వారిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ప్రైమరీ స్కూల్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సామర్థ్యాల పంపు ప్రక్రియ మాత్రం కనిపించడం లేదు. షెడ్యూలు ఇలా.. విద్యార్థులకు మౌలిక భాష, గణితంలో సామర్థ్యం పెరిగేలా బోధించడం కోసం తొలిమెట్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు బేస్ లైన్ టెస్ట్‌లు నిర్వహించి అభ్యసన స్థాయిలను గుర్తించాలి. అనంతరం విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ షెడ్యూలు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కనీసం ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నెలకోసారి పిల్లల ప్రగతిని నమోదు చేసి కాంప్లెక్స్ స్థాయిలో ప్రతి నెలా 26న టీచర్లతో, 28న మండలాలవారీగా, 30న జిల్లాలవారీగా సమీక్షలు జరగాలి. ఆచరణలో మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. టీచర్ల కొరతతోనే.. సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత కారణంగానే తొలిమెట్టు సక్రమంగా అమలు కావడం లేదు. కరోనాకు ముందు విద్యా వలంటీర్లతో కొంత సర్దుబాటు జరిగినా...ఆ తర్వాత వలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. దీంతో బోధన కుంటుపడుతోంది. పలు సబ్జెకుల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం పర్యవేక్షణకు ప్రధానోపాధ్యాయులు లేక ఇన్చార్జిలతో కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఏళ్లుగా టీచర్ల ఖాళీలు భర్తీ లేక బోధనకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు జరగడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దాకా బోధనకు ఆటంకం కలగకుండా వలంటీర్లను నియమించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. (చదవండి: ఎన్ఐఏ విస్తృత తనిఖీలు)