మెగా డీఎస్సీనేనా?  | Hopes for filling teacher posts with Governors speech | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీనేనా? 

Published Sat, Dec 16 2023 4:34 AM | Last Updated on Sat, Dec 16 2023 1:57 PM

Hopes for filling teacher posts with Governors speech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభలో గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో మెగా డీఎస్సీ ప్రస్తావన రావడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు చిగురిస్తున్నాయి. 22 వేల ఖాళీలున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అధికారులు 18 వేల పోస్టులే ఉన్నట్టు సర్కారుకు నివేదించారు.

మెగా డీఎస్సీ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందిదాకా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క 2017లోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, 8,792 పోస్టులు భర్తీ చేశారు. అప్పటికే 2.5 లక్షల మంది టెట్‌కు అర్హత సాధించి ఉన్నారు. 

కొత్త నియామకాలపైనే దృష్టి  
ఉపాధ్యాయ ఖాళీల్లో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. స్కూల్‌ అసిసెంట్లు(ఎస్‌ఏ)గా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేసి, 30 శాతం స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ నేరుగా నోటిఫికేషన్‌ ద్వారా చేయాల్సి ఉంటుంది. కొన్ని స్కూళ్లలో టీచర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య లేదు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులున్నా, టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్దీకరణ చేయాలని విద్యాశాఖ 2016 నుంచి చెబుతూనే ఉంది. ఈ సమస్యల కార ణంగానే 2022లో డీఎస్సీ ద్వారా కేవలం 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పుడు పదోన్నతులు కల్పించి, హేతుబద్దీకరణ చేపట్టి వాస్తవ ఖాళీలను భర్తీ చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే జరిగితే గత ఏడాది ఆగిపోయిన డీఎస్సీ నోటిఫికేషన్‌ స్థానంలో కొత్త నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.  

అడ్డంకులెన్నో... 
ఉపాధ్యాయ నియామకాల ప్రస్తావన వచ్చి నప్పుడల్లా లక్షలాదిమంది కోచింగ్‌ల కోసం హైదరాబాద్‌ బాట పడుతున్నారు. అప్పులు చేసి మరీ కోచింగ్‌ తీసుకుంటున్నారు. కొంత మంది ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నా, వాటిని విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్‌ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్లీ కనిపించనుంది.

అయితే, విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు తెలుస్తాయి. టెట్‌ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు దీనిని చేపట్టాల్సి ఉంటుంది. వరుసగా స్థానిక సంస్థలు, పార్లమెంట్‌ ఎన్నికలున్నాయి. దీనివల్ల కాలయాపన జరిగే వీలుంది. ఇవేవీ అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలి 
విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయి. లక్షల మంది టెట్‌ ఉత్తీర్ణులై టీచర్‌ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో నియామకాలు చేపడితేనే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి.   – రావుల రామ్మోహన్‌రెడ్డి (డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement