సీనియారిటీ తెలియక.. పదోన్నతుల తికమక | Seniority list released without DSC ranks | Sakshi
Sakshi News home page

సీనియారిటీ తెలియక.. పదోన్నతుల తికమక

Published Sun, Mar 9 2025 5:58 AM | Last Updated on Sun, Mar 9 2025 5:58 AM

Seniority list released without DSC ranks

ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియలో అన్నీ అనుమానాలే 

ఎస్జీటీల సబ్జెక్టు వారీ సీనియారిటీ చూపని వైనం 

డీఎస్సీ ర్యాంకులు లేకుండానే సీనియారిటీ జాబితా విడుదల  

కేటాయించిన ర్యాంకులపైనా అనేక అనుమానాలు 

రేపటిలోగా అభ్యంతరాలు చెప్పాలని అల్టిమేటం 

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులకు రాష్ట్ర విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. జిల్లాలు, క్యాడర్‌ వారీగా సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి పాత జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈవో) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఆదేశించింది. వాటిపై ఉపాధ్యాయులు అభ్యంతరాలను సైతం చెప్పాలని, ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించింది. అయితే, సీనియారిటీ జాబితాలో తాము ఎక్కడున్నామో తెలియక ఉపాధ్యాయలు గందరగోళానికి గురవుతున్నారు. 

ఆన్‌లైన్‌లో చూస్తే జిల్లాల్లోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాకు బదులు ఒక్క ఉపాధ్యాయుడి వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాలను ప్రకటించారు. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయ పోస్టుకు సబ్జెక్టు వారి సీనియార్టీ జాబితాలను టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (టీఐఎస్‌) ఆధారంగా వెబ్‌సైట్‌లో ఉంచారు.

అయితే, ఇప్పటికే ప్రకటించిన పదోన్నతుల సీనియార్టీ జాబితాల్లో పలు రకాల సమస్యలు ఉత్పన్నమైనట్టు సమాచారం. పలు జిల్లాల్లో కులాల కేటగిరీ నమోదులో అనేక తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల డీఎస్సీ ర్యాంకులు కూడా అందుబాటులో లేకుండానే ర్యాంకులు ప్రకటించినట్టు చెబుతున్నారు. ఇలా అయితే చాలామంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది.  

డీఎస్సీ ర్యాంకులు లేకుండానే.. 
పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సీనియార్టీని నిర్ణయించాలంటే వారి డీఎస్సీ ర్యాంకు కీలకం. అయితే, పలు జిల్లాల్లో కొన్ని బ్యాచ్‌ల టీచర్లకు చెందిన ర్యాంకుల వివరాలు లేవని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ ర్యాంకులను నమోదు చేయడంలోను, డీఎస్సీ ర్యాంకులు భద్రపరచడంలోను అలసత్వం చూపడంతో ఇప్పుడు ఆ ప్రభావం కనిపిస్తోంది. ఒక్క ర్యాంకు తేడా ఉన్నా ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే అవకాశం ఉంది. 

తద్వారా పదోన్నతి కూడా కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం సబ్జెక్టు వారీగా పదోన్నతులు ఇచ్చే పోస్టుల సంఖ్య కూడా తెలియజేయకుండా సీనియార్టీ జాబితాను ప్రకటించాలని జిల్లా స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పదోన్నతులు కల్పించే పోస్టుల సంఖ్యకు మూడు రెట్లు ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించి, అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. కానీ.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వివరాలను సీనియార్టీ జాబితాలో పొందుపరచడం గమనార్హం. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయుల కలబోతగా సీనియార్టీ ప్రకటించాల్సి ఉండగా.. సబ్జెక్టుల వారీగా ప్రకటించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు సబ్జెక్టుల వారీగా పదోన్నతులకు అర్హులైన ఎస్జీటీల జాబితా ప్రకటించాల్సి ఉండగా.. అన్ని సబ్జెక్టులకు అర్హులైన ఉపాధ్యాయులతో జాబితాను ప్రకటించారు. దీనివల్ల పదోన్నతి పొందాల్సిన ఉపాధ్యాయుడు సబ్జెక్టు సీనియారీ్టలో ఎక్కడున్నారో.. తనకంటే ముందున్న వారు అసలైన సీనియర్లు అవునో కాదో తెలుసుకునే అవకాశం లేదు.  

సీనియారిటీ ర్యాంకుల్లో గందరగోళం  
ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ 1984 నుంచి జరిగిన డీఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. నాటి డీఎస్సీల్లో వారు సాధించిన ర్యాంకు ఆధారంగా సీనియారిటీని నిర్ణయించాలి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో ర్యాంకులు లేకుండానే జిల్లా స్థాయిలో నచి్చన నంబర్లను కేటాయించి, అదే సీనియర్‌ నంబర్‌గా చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదముంది. 

ఉదాహరణకు 2002లో జరిగిన డీఎస్సీలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు 128 ర్యాంకు సాధించి ఎస్జీటీగా సరీ్వసులో చేరగా, ఇప్పుడు అతనికి సీనియారిటీ జాబితాలో 1,356 ర్యాంకు కేటాయించారు. అదే డీఎస్సీలో మొదటి ర్యాంకు ఉపాధ్యాయునికి 1,384 సీనియార్టీ నంబర్‌ చూపించారు. డీఎస్సీ మొదటి ర్యాంకు ఉపాధ్యాయునికి ఏమైనా రిమార్కు ఉంటే చూపించాలి. 

కానీ అదీ చేయలేదు. దీంతో ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలను డీఎస్సీ ర్యాంకులు ఆధారంగా పూర్తిగా పరిశీలించాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ లోగా చెప్పాలని ఆదేశించడం తగదని, పారదర్శకంగా ర్యాంకులు ప్రకటించి, అప్పుడు అభ్యంతరాలు కోరాలని పేర్కొంటున్నారు.  

సీనియారిటీ జాబితాలో తప్పులు  
సీనియారిటీ జాబితాలో అనేక తప్పులున్నాయి. 1984 డీఎస్సీ నుంచి అన్ని డీఎస్సీల రోస్టర్‌ కమ్‌ మెరిట్‌ ఎంపిక జాబితాలు జిల్లాల వారీగా వెబ్‌సైట్‌లో ఉంచాలి. కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా ర్యాంకులు కేటాయించారు. లిస్టు బహిర్గతం చేస్తేనే జాబితాలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుంది.   – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, కోశాధికారి, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ 

ఇచ్చిన ర్యాంకుల్లో పొంతన లేదు  
టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టంలో ఉంచిన ప్రమోషన్‌ సీనియారిటీ జాబితా సరిగా లేదు. డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ వారికి, ప్రమోషన్లు తీసుకున్న వారికి ర్యాంకులు చూస్తే చాలా తేడా కనిపిస్తోంది. అలాగే, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40గా ఉండాలి. అప్పుడే ఎక్కువ మందికి పదోన్నతులు వస్తాయి.   – లెక్కల జమాల్‌రెడ్డి, అధ్యక్షుడు, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 

డీఎస్సీ ర్యాంకుల జాబితా ప్రకటించాలి  
సీనియార్టీ జాబితాలో ఉపాధ్యాయులకు ర్యాంకుల వివరాలు ఇచ్చినప్పటికీ స్పష్టత లేదు. అన్ని డీఎస్సీల బ్యాచ్‌లకు సంబంధించి ఉపాధ్యాయుల మెరిట్‌ ర్యాంకుల జాబితా ప్రకటించాలి. డీఎస్సీ మెరిట్‌ ర్యాంకుతో పాటు మార్కుల వివరాలు తెలపాలి. రోస్టర్‌ ర్యాంకు, మెరిట్‌ ర్యాంకు వివరాలపై స్పష్టత ఇవ్వాలి.   – సీవీ ప్రసాద్, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్‌ అమరావతి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement