Teacher promotion
-
తగ్గేదే లే! టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ముందుకే...
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గకూడదని విద్యాశాఖ తీర్మానించుకుంది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో విద్యాశాఖ నిస్తేజంగా ఉందని ఆమె అనేక సందర్భాల్లో ఉపాధ్యాయ సంఘాల వద్ద అభిప్రాయపడ్డారు. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఈ కేసు విచారణకు రాగా, బదిలీలు, పదోన్నతులపై న్యాయస్థానం అధికారుల తీరును ప్రశ్నించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడుతుందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. కోర్టు పరిణామాల తర్వాత పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నతాధికారులను కలుస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్ ఓపికగా వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు అభ్యంతరాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిసింది. ఇప్పటికే మల్టీజోన్–1 పరిధిలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పూర్తయ్యాయి. మల్టీజోన్–2 పరిధిలో ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనేక మంది టీచర్లు బదిలీలు, పదోన్నతులు పొందారు. ప్రక్రియను నిలిపివేస్తే ఈ విద్యా సంవత్సరంలో బోధన సాగడం కష్టమని అధికారులు సీఎంకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అంతా పకడ్బందీగానే.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల పేరెత్తితే తరచూ కోర్టు వివాదాలు వెంటాడుతుంటాయి. 2023లోనూ విద్యాశాఖ ఇలాంటి అనుభవాలే చూసింది. స్పౌజ్‌లు, పండిట్లు, పీఈటీలు, సీనియారిటీ వ్యవహారం అనేక చిక్కుముడులు వెంటాడాయి. దీంతో గత ఏడాది షెడ్యూల్ ఇచ్చినా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాశాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. టెట్ అర్హత ఉన్న టీచర్లకు మాత్రమే పదోన్నతి కల్పించాలన్న కేంద్ర నిబంధనలపై గత ఏడాది కొంతమంది కోర్టుకెళ్లారు. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. ఈసారి ఇలాంటి చిక్కులు తలెత్తకుండా అధికారులు ముందే న్యాయ సలహాలు తీసుకున్నారు. ఏయే అంశాలపై ఇబ్బందులు వచ్చే వీలుందని, వాటిని ఎలా ఎదుర్కొనాలనే విషయాలపై దేవసేన కసరత్తు చేశారు. అయినప్పటికీ టెట్ అర్హతపై సింగిల్ జడ్జి తీర్పు, డివిజన్ బెంచ్‌కు వెళ్లడం, అక్కడ పాఠశాల విద్య కమిషనర్ సమాధానం చెప్పాల్సి రావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, డివిజన్ బెంచ్ ఇప్పటివరకూ ప్రక్రియను నిలిపివేయాలని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో అనుకున్న ప్రకారం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి మల్టీ జోన్–2లో... మల్టీజోన్–1 పరిధిలో 10వేల మంది టీచర్లకు పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీలు, పీఈటీలు, భాషా పండితులు దాదాపు 10 వేల మంది బదిలీ అయ్యారు. కొన్నిచోట్ల ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు గురువారం నుంచి మల్టీజోన్–2 పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌తో కలుపుకొని మొత్తం 14 జిల్లాలు మల్టీజోన్–2 పరిధిలో ఉన్నాయి. ముందు స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాక, ఎస్జీటీలకు పదోన్నతి కల్పిస్తారు. ఆ తర్వాత వీళ్లను బదిలీ చేస్తారు. ఈ జోన్ పరిధిలో 10 వేల మంది ప్రమోషన్లు పొందుతారు. ఇదేస్థాయిలో బదిలీలు కూడా జరుగుతాయి. అయితే, రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రక్రియపై కోర్టు వివాదం ఉండటంతో ప్రక్రియ ఆగిపోయింది. ఏదేమైనా కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బదిలీలు, పదోన్నతులపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అర్హులైన టీచర్లకు మెసేజ్‌లు పంపండి: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బదిలీకి అర్హత గల ప్రతి ఉపాధ్యాయుడికీ బదిలీల సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్సీఈఅర్టీ కార్యాలయంలో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. పదోన్నతుల తర్వాత ఖాళీల భర్తీ పదోన్నతులు, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) పూర్తయిన తర్వాత విద్యాశాఖలో ఉండే ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని సమావేశానంతరం మంత్రి మీడియాకు తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయతి్నస్తున్నదని, ఈ సమయంలో అన్ని పారీ్టలు, అన్ని వర్గాలు సహకరించాలని మంత్రి కోరారు. ఇది కూడా చదవండి: నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు -
నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అధికారిక కసరత్తు ఊపందుకుంది. విద్యాశాఖ మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకూ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే వీలుంది. వెంట వెంటనే ఎడిట్ ఆప్షన్లు, జాబితాల తయారీ చేపట్టి, సెప్టెంబర్ నెలాఖరుకు ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లుండగా ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియనే ప్రధాన ఆయుధంగా ప్రభుత్వం భావిస్తోంది. డీఈవోలతో డైరెక్టర్ టెలీకాన్ఫరెన్స్ జిల్లా విద్యాశాఖాధికారులతో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సక్రమంగా చేపట్టేందుకు సన్నద్ధమవ్వాలని కోరారు. అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. బదిలీలకు కటాఫ్ డేట్‌ను గతంలో ఫిబ్రవరి 1గా నిర్ణయించారని, ఇప్పుడు ఆ తేదీని సెప్టెంబర్ 1గా నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో బదిలీల కోసం దాదాపు 78 వేల దరఖాస్తులు అందాయి. ఇందులో 58 వేలు అర్హమైనవిగా గుర్తించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. టీచర్లు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసినట్లయితే బదిలీకి అర్హులవుతారు. కటాఫ్ తేదీని పొడిగించడంతో సెప్టెంబర్ 1 నాటికి 8, 5 ఏళ్ళు నిండే వాళ్ళ జాబితాను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన టీచర్లు సర్వీస్ కాలాన్ని ఆన్లైన్లో పొందు పర్చడమా? డీఈవోలే ఈ డేటాను అప్డేట్ చేస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఖాళీల విషయంలో సమగ్ర వివరాలను మాత్రం డీఈవోలు అందించాల్సి ఉంటుంది. మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. కటాఫ్ తేదీ పొడిగించడంతో ఇప్పుడు ఖాళీల సంఖ్యలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. చిక్కుముడిగా దివ్యాంగుల వ్యవహారం అంగ వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం 70 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అయితే ఇటీవల న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలని ఓ కేసులో తీర్పు ఇచి్చంది. దీంతో బదిలీల్లోనూ దీన్నే కొలమానంగా తీసుకోవాలని దివ్యాంగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర వివరాలు అందజేయాల్సిందిగా మంత్రి సబిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 317 జీవో ద్వారా బదిలీ అయిన వారికి సర్వీస్ పాయింట్లలో అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నేతలు హన్మంతరావు, నవాత్ సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా షెడ్యూల్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేయడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ విమర్శించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అన్ని స్థాయిల నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలని పీఆర్టీయూటీఎస్ నేతలు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు సూచించారు. సంఘాల హల్చల్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవ్వడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు అధికారులను, మంత్రి సబితను కలుస్తున్నారు. పలు సలహాలు సూచనలతో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. సప్టెంబర్ 1ని కటాఫ్‌గా నిర్ణయించాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మంత్రి సబితకు వినతి పత్రం సమర్పించారు. ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని టీఎస్‌యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావా రవి అధికారులను కోరారు. ఇది కూడా చదవండి: సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి -
AP: టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల టీచర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్, గ్రేడ్–2 హెడ్మాస్టర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ విడుదల చేశారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్స్ ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 7వ తేదీన వెబ్సైట్లో ఉంచుతారు. చదవండి: అలా.. చక్కబడి! వీటిపై ఉన్న అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా ఈ నెల 8వ తేదీలోగా తెలపాల్సి ఉంటుంది. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఈ నెల 9వ తేదీన పరిశీలించి తుది సీనియారిటీ జాబితాను 10న విడుదల చేస్తారు. గ్రేడ్–2 పోస్టుల ప్రమోషన్లను ఈ నెల 11న, స్కూల్ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల పదోన్నతులను ఈ నెల 12, 13 తేదీల్లో విడుదల చేస్తారు. -
టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, అమరావతి: పునాది స్థాయి నుంచే అత్యుత్తమ ప్రమాణాలతో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టి 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అందుబాటులోకి తెస్తోంది. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం 8 వేలకుపైగా పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనుంది. 3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ఉండే ప్రీహైస్కూళ్లలో విద్యార్థులు నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే వాటిలోనూ సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం 1,000 వరకు ఎస్ఏ పోస్టులను గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఎస్‌ఏలకు వీటిలో పదోన్నతి కల్పిస్తారు. ఈమేరకు పదోన్నతుల విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ మువ్వా రామలింగం శుక్రవారం సర్క్యులర్ రూపంలో విడుదల చేశారు. + 10లోగా సీనియార్టీ జాబితాలు.. ఎస్ఏ, గ్రేడ్–2 హెడ్మాస్టర్ పోస్టులలో పదోన్నతులకు సంబంధించి జిల్లాలవారీగా సీనియార్టీ జాబితాలను ఈనెల 10వ తేదీలోగా రూపొందించాలని రీజినల్ జాయింట్ డైరక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించారు. ఇప్పటివరకు రకరకాలుగా అన్వయించి పదోన్నతులు చేపట్టడం న్యాయ వివాదాలకు దారి తీసినందున ఏకరూప నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేస్తూ సర్క్యులర్‌లో పొందుపరిచారు. ఎస్ఏ, హెడ్మాస్టర్ పోస్టులకు సంబంధించి నిబంధనలున్నాయని, అలాగే కొన్ని వర్గాలకు ఇతర అర్హతలను పరిగణలోకి తీసుకొని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించి పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు. – ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు జోన్, జిల్లాల ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీని గుర్తించేటప్పుడు ఏపీఎస్‌ఎస్‌ఎస్–1996లోని 33, 34 నిబంధనలను అనుసరించాలి. – పదోన్నతులలో ఏపీ సబార్డినేట్ సర్వీస్ నిబంధన రూల్ 22 పాటించాలి. – టీచర్ల సీనియార్టీకి పోస్టులో చేరిన తేదీని పరిగణలోకి తీసుకోవడంతో పాటు క్రమబద్ధీకరణ లేదా ప్రొబేషన్ పీరియడ్ ఆమోదం ఆధారంగా చేపట్టాలి. – ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతి కోసం కేటాయించాలి. వీటిలో మూడింట ఒక వంతు పోస్టులు డైరెక్ట్ ›రిక్రూట్మెంటు కోసం మినహాయించాలి. – ప్రమోషన్ ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా కొత్త పోస్టులో చేరాలి. – గతంలో పదోన్నతి వదులుకున్న టీచర్లు జీవో 145 నిబంధనల ప్రకారం పదోన్నతులకు పరిగణిస్తారు. – కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన సీనియార్టీ జాబితాలు రూపొందించాలి. ఆగస్టు 10వ తేదీలోగా దీన్ని పూర్తి చేయాలి. ఇది కూడా చదవండి: రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరాలి.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచుదాం: సీఎం జగన్ -
వివాదాలు పరిష్కరించి.. పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చిన తర్వాతే టీచర్ల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని యూనియన్లతో రెండు రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి భావిస్తున్నారు. సోమవారం తనను కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆమె ఇదే విషయాన్ని చెప్పారు. భిన్నాభిప్రాయాలపై చర్చించి, వివాదాలను పరిష్కరిద్దామని ఆమె పేర్కొన్నట్టు సంఘాల నేతలు వెల్లడించారు. అంతా ఒప్పుకుంటే 10 రోజుల్లో పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారికి మంత్రి వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పటికే 2 దఫాలుగా మంత్రి సమక్షంలో చర్చలు జరిగినా పెద్దగా ప్రయోజనం కన్పించలేదు. పర్యవేక్షణ పోస్టులైన ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టులపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నవాదనలతో పట్టుబడుతున్నాయి. మరోవైపు కోర్టు సమస్యలూ పదోన్నతులకు అడ్డంకిగా ఉన్నాయి. ముందు షెడ్యూల్ ఇవ్వాలి పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రభుత్వమే చొరవ చూపాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) పట్టుబడుతోంది. ఇదే అభిప్రాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న 80 వేల మంది ఉపాధ్యాయుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. తక్షణమే షెడ్యూల్ ఇవ్వాలని, ఆ తర్వాత సమస్యలుంటే పరిష్కరించుకోవాలని సూచించారు. పదోన్నతులు ఇవ్వకపోతే ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. అర్హత ప్రకారమే పదోన్నతులు ప్రభుత్వం నేరుగా నియమించిన ఉపాధ్యాయ సంఘం సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసింది. ఆ సంఘం అధ్యక్షుడు కాసం ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, అసోసియేట్ అధ్యక్షుడు కె.దశరథ్ తదితరులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పర్యవేక్షణ పోస్టుల భర్తీపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వీటిని అర్హత, నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకే ఇవ్వాలన్న అంశాన్ని మంత్రి ముందు ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మాతృ సంస్థల్లోనే పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. అధికారులతో మంత్రి సంప్రదింపులు రాష్ట్రవ్యాప్తంగా 8,500 మంది ఎస్జీటీలు, 2 వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలి. అదేమాదిరి ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులను మంత్రి అడిగినట్టు తెలిసింది. అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన తర్వాతే షెడ్యూల్ ఇవ్వాలని అధికారులు సూచించినట్లు సమాచారం. -
నోటు కొట్టు..ప్రమోషన్ పట్టు!
► ఎయిడెడ్ టీచర్ల పదోన్నతుల వ్యవహారంలో చేతులు మారుతున్నడబ్బు ► విద్యాశాఖలో పోటెత్తిన దిగువస్థాయి సిబ్బంది చేతివాటం ► అధికారుల పేరుతో అడ్డగోలు వసూళ్లు ► చేయి తడిపిన ఫైళ్లకు వెంటనే మోక్షం ఒంగోలు : ఎయిడెడ్ పాఠశాలల్లోని పదోన్నతుల వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు చేతివాటం ప్రారంభించారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి డి.వి సుప్రకాష్ అవినీతి అధికారుల ఉచ్చులో చిక్కి సస్పెన్షన్‌కు గురికావడంతో కొంతకాలం పాటు చేతివాటానికి బ్రేక్ పడినట్లైంది. ఈ నేపథ్యంలో పదమూడు సంవత్సరాలుగా పదోన్నతుల కోసం వేచి ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థలోని సిబ్బంది ఆతృతను సొమ్ము చేసుకునేందుకు విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని అంతా విమర్శస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పదోన్నతులను నిలుపుదల చేస్తూ 2004 అక్టోబరు 10న 18836 నంబరు పేరుతో మెమో విడుదలైంది. దీంతో 2005లో ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెంబర్ 40 విడుదలైంది. దీని ప్రకారం ఈనెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పదోన్నతులు భర్తీచేయాలి. అయితే ఒక ప్రభుత్వ, స్థానిక విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ బదిలీల ప్రక్రియ తెరపైకి రావడంతో ఎయిడెడ్ ప్రక్రియ మందగించింది. దీంతో తిరిగి ఎటువంటి ఉత్తర్వులు వస్తాయో అనే ఆందోళన ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయుల్లో నెలకొంది. దీంతో త్వరితగతిన ఫైలును ఆర్జేడీ కార్యాలయానికి పంపేందుకు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఇది చివరకు విద్యాశాఖ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులకు వరంగా మారింది. చేతివాటం ఇలా.. తొలుత ఈ ఫైలు ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయానికి చేరాలి. దీనికోసం ఉప విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లోని ఉద్యోగులు కనీసం రూ. 5వేల చొప్పున వసూళ్లకు దిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ నుంచి ఫైలు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుతుంది. ఇక్కడ కొంతమంది దళారీలు తయారయ్యారని, వారు ఉపాధ్యాయులను ఆకట్టుకొని ఫైలును వేగవంతం చేపిస్తామంటూ ఆశచూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే ఒక పాఠశాలలో నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను కూడా ప్రలోభ పెట్టేందుకు యత్నించారు. అయితే ఆయన మాత్రం తనకు పదోన్నతి వల్ల వచ్చే లాభం కంటే మీరు అడుగుతున్న మొత్తమే ఎక్కువుగా ఉంటుందని.. వారి డిమాండ్‌ను తిరస్కరించినట్లు చర్చ జరుగుతోంది. అయితే కొంతమంది మాత్రం అడ్డదారిలో ఆశచూపించి ఫైళ్లను ఇప్పటికే వేగవంతం చేయించుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేవలం ఒత్తిళ్లు, చేతివాటం కలిగిన వారికి సంబంధించి ఫైళ్లు మాత్రమే ఎక్కువ శాతం ఆర్జేడీ కార్యాలయానికి వెళుతున్నాయని, లేకుంటే డీఈఓ కార్యాలయంలోనే ఉండిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు వందమంది వరకు పదోన్నతుల కోసం వేచి ఉన్న దశలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్రీమెన్ కమిటీ? ఇది పలు ఉపాధ్యాయ సంఘాలకు కూడా తలనొప్పిగా మారింది. ఈనెల 23వ తేదీలోపు అన్ని ఫైళ్లు తప్పనిసరిగా ఆర్జేడీ కార్యాలయానికి వెళతాయని, ఎందుకు మీలోమీరు పోటీపడి చేతివాటం ప్రదర్శిస్తున్నారంటూ అడిగినట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు త్రీమెన్ కమిటీగా ఏర్పడి జిల్లా విద్యాశాఖ కార్యాలయంతోపాటు ఆర్జేడీ కార్యాలయంలో చేతివాటంకు సంబంధించి ఎంత చెల్లించాలో ముందస్తుగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క రూపాయి ఇవ్వవద్దు: ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ఎవ్వరూ ఒక్కరూపాయి కూడా చెల్లించవద్దు. పదోన్నతుల ప్రక్రియ ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నా మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. అందరికీ న్యాయం జరిగేలా ఏపీ టీచర్స్గిల్డ్ కృషి చేస్తుంది. – సీహెచ్.ప్రభాకరరెడ్డి: ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం: ఎయిడెడ్ పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి జాప్యానికి కారణం ఇటీవలి వరకు జరిగిన కౌన్సెలింగ్. ఈ ప్రక్రియకు సంబంధించి ఇంతవరకు నావద్దకు ఎటువంటి ఫిర్యాదురాలేదు. నాకు రాతపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు ఇస్తే తక్షణ చర్యలు తీసుకుంటా. దాంతోపాటు ఈ ఆరోపణలకు సంబంధించి కూడా తక్షణమే దృష్టిసారించి నిజానిజాలను నిగ్గు తేలుస్తా. – జిల్లా విద్యాశాఖ అధికారి బి.విజయభాస్కర్