మున్సిపల్‌ స్కూళ్లలో ఉత్తుత్తి పదోన్నతులు | Confused teacher promotion process | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ స్కూళ్లలో ఉత్తుత్తి పదోన్నతులు

Published Mon, Nov 25 2024 4:56 AM | Last Updated on Mon, Nov 25 2024 4:56 AM

Confused teacher promotion process

గందరగోళంగా టీచర్ల పదోన్నతుల ప్రక్రియ  

350 పోస్టులకు అర్హులను ప్రకటించి 200తో సరి 

నెల రోజులు గడిచినా కొలిక్కిరాని వైనం  

హెచ్‌ఎంగా ఒక్క రోజే.. మళ్లీ స్కూల్‌ అసిస్టెంట్‌గానే విధులు 

రోస్టర్, నిబంధనలు పాటించని పాఠశాల విద్యాశాఖ  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యతో కూటమి సర్కారు చెడుగుడు ఆడుతోంది. ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లోని  జెడ్పీ తదితర పాఠశాలల్లో సర్దుబాటు పేరుతో సబ్జెక్టు టీచర్లను లేకుండా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మున్సిపల్‌ స్కూళ్ల ఉపాధ్యాయులతో ఆటలు ప్రారంభించింది. పదోన్నతులు కల్పిస్తామంటూ నెల రోజుల క్రితం చేపట్టిన ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాకపోగా ఉత్తుత్తి పదోన్నతులతో పాత పోసు­్టల్లోనే కొనసాగాలని ఆదేశించడం గమనార్హం.

మున్సిపల్‌ స్కూళ్ల  ఉపాధ్యాయుల్లో 350 మంది ప్రమోషన్లకు అర్హులని తేల్చిన ప్రభుత్వం చివరకు 200 మందికే పోస్టింగ్‌ ఇచ్చింది. చట్టప్రకారం ఖాళీల­ను 70 శాతం పదోన్నతులతోను, మరో 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా అందుకు పూర్తి విరుద్ధంగా చర్యలు చేపట్టింది. పదోన్నతులు 30 శాతానికే పరిమితం చేసింది.

ఇటీవల కల్పించిన పదోన్నతుల్లో 50 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా అవకాశం కల్పించి కొత్త పోస్టింగ్‌ కూడా ఇచ్చాక ఒక్క రోజులోనే వారిని పాత పోసు­్టల్లోనే కొనసాగాలని ఆదేశించడం విస్మయం కలిగిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టాల్సిన పదోన్నతులు సగం ఏడాది పూర్తయ్యాక చేపట్టడం.. గందరగోళంగా మార్చేయడంతో  ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

రోస్టర్‌ ప్రకటించకుండా నిర్లక్ష్యంగా ప్రక్రియ  
పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ గతనెల 26న నోటిఫి­కేషన్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 28న సీనియారిటీ లిస్టు ప్రకటిస్తామని, గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు ఈనెల 6న కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొం­ది. 

అయితే సీనియారిటీ లిస్టు ప్రకటించేందుకు దాదాపు 10 రోజులు సమయం పట్టింది. తప్పు­ల తడకగా విడుదల చేయడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొన్నిచోట్ల పదోన్నతులు నిలిపివేశారు. దాదాపు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా పదోన్నతులకు 350 మందే అర్హులని తేల్చారు. అయితే వారికీ పదోన్నతులు కల్పించడంలో పాఠశాల విఫలమైంది. 

ఆయా మున్సిపాలిటీల వారీగా గతంలో పదోన్నతులు కల్పించినప్పుడు రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్‌ పాయింట్‌ ఎక్కడ ఆగిందో ప్రకటించాలి. కానీ ఇవేమీ లేకుండా నిర్లక్ష్యంగా నెల రోజుల ప్రక్రియను సాగదీసి గందరగోళంగా మార్చేశారు.  

అర్థంపర్థం లేని పదోన్నతులు..  
విద్యా సంవత్సరం మధ్యలో పదోన్నతులు కల్పించటమే తప్పుడు విధానమైతే.. ఆ పోస్టులో చేరాక తిరిగి వారిని పాత పోస్టులోనే పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 200 మంది మున్సిపల్‌ టీచర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో 50 మందికి స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా అవకాశం లభించింది. ప్రధానోపాధ్యాయలుగా పదోన్నతి పొందిన వారు కౌన్సెలింగ్‌లో మరో స్కూల్లో హెచ్‌ఎంగా చేరి బాధ్యతలు తీసుకున్నారు. 

అయితే వారిని వచ్చే విద్యా సంవత్సరం వరకు పాత పోస్టులోనే కొనసాగాలని అధికారులు ఆదేశించారు. వీరికి పదోన్నతి వేతనం ఇస్తారా..? లేక స్కూల్‌ అసిస్టెంట్‌ వేతనం ఇస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. మరోపక్క ఆయా హెచ్‌ఎం పోస్టుల్లో ఇన్‌చార్జి్జలుగా పనిచేసేందుకు ఉపాధ్యాయులు సుముఖత చూపడం లేదు. ఈ క్రమంలో ఈ నెలాఖరులో టీచర్ల వేతనాలు బిల్లులు ఎ­వరు రూపొందిస్తారో తెలియని పరిస్థితి తలెత్తింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement