School Education Department
-
మార్చి 15 నుంచి పది పరీక్షలు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు తెలిసింది. ఇతర పరీక్షల షెడ్యూళ్లు కూడా పరిగణనలోకి తీసుకుని.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. టైమ్ టేబుల్‌తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మెనేజ్‌మెంట్లలోని ఉన్నత పాఠశాలలకు పంపించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించాలని.. ఈనెల ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా స్లిప్ టెస్టులు నిర్వహించాలని.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 7న జరిగే పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో దీనిపై చర్చించాలని.. ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పనిచేసినందుకు ప్రత్యేక సీసీఎల్ మంజూరు చేస్తామని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు అదనపు అభ్యాసాలు ఇవ్వాలని.. అభ్యసన ప్రణాళికలను తల్లిదండ్రులకు కూడా వివరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సెలవు రోజులను మినహాయించాలి.. పదో తరగతి యాక్షన్ ప్లాన్ షెడ్యూల్లో సెలవు రోజులను మినహాయించాలని విద్యా శాఖను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఇంకా సిలబస్ పూర్తి కానందున కార్యాచరణ ప్రణాళికను సమ్మేటివ్–1 పరీక్షల అనంతరం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలని.. సగటు విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రతి సబ్జెక్టుకూ ముఖ్య ప్రశ్నలను రూపొందించి పుస్తకాలు అందించాలని కోరారు. -
మున్సిపల్ స్కూళ్లలో ఉత్తుత్తి పదోన్నతులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యతో కూటమి సర్కారు చెడుగుడు ఆడుతోంది. ప్రభుత్వ మేనేజ్మెంట్లోని జెడ్పీ తదితర పాఠశాలల్లో సర్దుబాటు పేరుతో సబ్జెక్టు టీచర్లను లేకుండా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మున్సిపల్ స్కూళ్ల ఉపాధ్యాయులతో ఆటలు ప్రారంభించింది. పదోన్నతులు కల్పిస్తామంటూ నెల రోజుల క్రితం చేపట్టిన ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాకపోగా ఉత్తుత్తి పదోన్నతులతో పాత పోసు్టల్లోనే కొనసాగాలని ఆదేశించడం గమనార్హం.మున్సిపల్ స్కూళ్ల ఉపాధ్యాయుల్లో 350 మంది ప్రమోషన్లకు అర్హులని తేల్చిన ప్రభుత్వం చివరకు 200 మందికే పోస్టింగ్ ఇచ్చింది. చట్టప్రకారం ఖాళీలను 70 శాతం పదోన్నతులతోను, మరో 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా అందుకు పూర్తి విరుద్ధంగా చర్యలు చేపట్టింది. పదోన్నతులు 30 శాతానికే పరిమితం చేసింది.ఇటీవల కల్పించిన పదోన్నతుల్లో 50 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా అవకాశం కల్పించి కొత్త పోస్టింగ్ కూడా ఇచ్చాక ఒక్క రోజులోనే వారిని పాత పోసు్టల్లోనే కొనసాగాలని ఆదేశించడం విస్మయం కలిగిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టాల్సిన పదోన్నతులు సగం ఏడాది పూర్తయ్యాక చేపట్టడం.. గందరగోళంగా మార్చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ ప్రకటించకుండా నిర్లక్ష్యంగా ప్రక్రియ పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ గతనెల 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 28న సీనియారిటీ లిస్టు ప్రకటిస్తామని, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు ఈనెల 6న కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొంది. అయితే సీనియారిటీ లిస్టు ప్రకటించేందుకు దాదాపు 10 రోజులు సమయం పట్టింది. తప్పుల తడకగా విడుదల చేయడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొన్నిచోట్ల పదోన్నతులు నిలిపివేశారు. దాదాపు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా పదోన్నతులకు 350 మందే అర్హులని తేల్చారు. అయితే వారికీ పదోన్నతులు కల్పించడంలో పాఠశాల విఫలమైంది. ఆయా మున్సిపాలిటీల వారీగా గతంలో పదోన్నతులు కల్పించినప్పుడు రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్ ఎక్కడ ఆగిందో ప్రకటించాలి. కానీ ఇవేమీ లేకుండా నిర్లక్ష్యంగా నెల రోజుల ప్రక్రియను సాగదీసి గందరగోళంగా మార్చేశారు. అర్థంపర్థం లేని పదోన్నతులు.. విద్యా సంవత్సరం మధ్యలో పదోన్నతులు కల్పించటమే తప్పుడు విధానమైతే.. ఆ పోస్టులో చేరాక తిరిగి వారిని పాత పోస్టులోనే పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 200 మంది మున్సిపల్ టీచర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో 50 మందికి స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా అవకాశం లభించింది. ప్రధానోపాధ్యాయలుగా పదోన్నతి పొందిన వారు కౌన్సెలింగ్‌లో మరో స్కూల్లో హెచ్ఎంగా చేరి బాధ్యతలు తీసుకున్నారు. అయితే వారిని వచ్చే విద్యా సంవత్సరం వరకు పాత పోస్టులోనే కొనసాగాలని అధికారులు ఆదేశించారు. వీరికి పదోన్నతి వేతనం ఇస్తారా..? లేక స్కూల్ అసిస్టెంట్ వేతనం ఇస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. మరోపక్క ఆయా హెచ్ఎం పోస్టుల్లో ఇన్‌చార్జి్జలుగా పనిచేసేందుకు ఉపాధ్యాయులు సుముఖత చూపడం లేదు. ఈ క్రమంలో ఈ నెలాఖరులో టీచర్ల వేతనాలు బిల్లులు ఎవరు రూపొందిస్తారో తెలియని పరిస్థితి తలెత్తింది. -
పాఠశాల విద్యలో పైరవీల రాజ్యం!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆరు జిల్లాలకు మెమో..ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్‌గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి లేఖ ఇచ్చారు. విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఏఏఐ చైర్మన్‌గా విపిన్ కుమార్
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బిహార్‌లో జిల్లా మెజి్రస్టేట్‌గా, బిహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్ తాత్కాలిక చైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
కుల, మత రహిత కాలమ్ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సర్టిఫికెట్లు, పాఠశాలలో చేరే ముందు సమర్పించే దరఖాస్తులో కుల, మత రహిత కాలమ్ ఉండాల్సిందేనని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. కులం, మతం వద్దనే హక్కు ప్రజలకు ఉందని అభిప్రాయపడింది. కుల, మత విభాగాలను దరఖాస్తులో నింపనంత మాత్రాన అవి తిరస్కరణకు గురికావని పాఠశాల విద్యాశాఖ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌ను పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. 2010, 2021లోనూ రిట్ పిటిషన్లు దాఖలు చేసి కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఇప్పటికే ఉపశమన ఆదేశాలు పొందారని పేర్కొంది. బాధిత వ్యక్తులు అవసరమైతే తదుపరి నష్టపరిహారాన్ని కోరే హక్కు కలిగి ఉంటారని వ్యాఖ్యానించింది. పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన వైఖరితో తదుపరి చర్యలు అనవసరమని పేర్కొంటూ పిల్లో విచారణ ముగిస్తున్నామని చెప్పింది. జనన ధ్రువపత్రం నుంచి మరణ ధ్రువపత్రం వరకు అన్నింటిలో ‘కులం, మతం లేదు’ అనే స్టేటస్ కోరుకునే వారిని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ డీవీ రామకృష్ణారావు, ఎస్ క్లారెన్స్ కృపాళిని తదితరులు 2017లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇలాంటి పిటిషన్లు గతంలో దాఖలయ్యాయని, కులం, మతాన్ని పేర్కొనడం, వదులుకోవడంపై స్వేచ్ఛ ఉందని పాఠశాల విద్య డైరెక్టర్ అండ్ కమిషనర్ తరఫున దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారని చెప్పింది. మతం, కులం వివరాలు పేర్కొననంత మాత్రాన పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశం నిరాకరించబడదని స్పష్టం చేసింది. దీంతో విచారణ ముగిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. -
సర్కారు చదువులు చట్టుబండలు!
సాక్షి, అమరావతి: సజావుగా సాగుతున్న పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను, అందులోనూ ప్రాథమిక దశ నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను దూరం చేసేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళుతోంది. తాజాగా జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను నిర్దయగా రద్దు చేస్తోంది. పిల్లల్లో విద్యా నాణ్యత పెంచేందుకు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన అందించేందుకు తీసుకొచ్చిన జీవో 117ను రద్దుచేసి, వచ్చే ఏడాది నుంచి ఆ తరగతులను ప్రాథమిక పాఠశాల్లోకి మార్చాలని నిర్ణయించింది. ఏపీ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ‘ప్రభుత్వాలు మారడం సహజం. కానీ.. పాలన మాత్రం మారకూడదు. మంచి ఏ ప్రభుత్వంలో జరిగినా దాన్ని కొనసాగించాలి’ అని ఇటీవల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులనూ పరిశీలించారు. గత ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, వాటిని అలాగే కొనసాగిద్దామని ఉన్నతాధికారుల వద్ద కూడా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రే బాగున్నాయని చెప్పిన సంస్కరణలను రద్దు చేయడం విస్మయం కలిగిస్తుంది. జీవో 117 రద్దు చేస్తే విద్యార్థులకు అన్యాయం పలు సర్వేల అనంతరం విద్యారంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చి0ది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల్లోను ఒకేవిధమైన విధానాలు అనుసరించాలని, పిల్లలు నేర్చుకునే దానికి, వస్తున్న ఫలితాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని సూచించింది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పతి్తని తగ్గించాలంది. ఎన్ఈపీ–2020 విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో–117 జారీ చేసింది. దీనిప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు.అంతేగాక ఉపాధ్యాయులపై బోధనా ఒత్తిడి తగ్గించేందుకు ప్రాథమిక విద్యార్థుల బోధనను ఒక టీచర్‌కు 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎంతో ఉన్నతమైన ఆశయంతో తీసుకొచ్చిన జీవో 117ను ఉపాధ్యాయులు సైతం మెచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే చట్టాన్ని రద్దు చేయడమంటే పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేయడమేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బెడిసికొట్టిన టీచర్ల సర్దుబాటు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో సర్దుబాటు పేరిట ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ బెడిసికొట్టింది. పాఠశాలలు తెరిచిన తర్వాత దాదాపు 2 నెలల పాటు కసరత్తు చేసి, ఒక యూనిట్ పరీక్షలు పూర్తయ్యాక ప్రారంభించిన బదిలీలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన నిబంధనలను మునిసిపల్, ఎయిడెడ్ స్కూళ్లలోనూ అమలు చేయడంతో అక్కడ ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న జూనియర్ ఉపాధ్యాయులను పదో తరగతి సిలబస్ బోధించేందుకు బదిలీ చేయడం గమనార్హం.సర్దుబాటుకు ముందు ప్రాథమిక పాఠశాలల్లో సీనియర్లు, అర్హత గల ఉపాధ్యాయులను సబ్జెక్టు టీచర్లుగా నియమించడంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఈ సర్దుబాటు ప్రక్రియతో ప్రస్తుతం హైస్కూళ్లలో బోధిస్తున్న సీనియర్ ఎస్జీటీలను తిరిగి ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లలోని జూనియర్లను హైస్కూళ్లకు పంపించారు. సబ్జెక్టుపై అవగాహన లేనివారిని హైస్కూళ్లకు పంపడంతో పాటు కొన్ని సబ్జెక్టులకు అసలు టీచర్లనే నియమించలేదు. దీంతో ఉత్తమ ఫలితాల సాధన అటుంచి, విద్యార్థులను పాస్ కూడా చేయలేమని మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్నప్పుడు గత ప్రభుత్వం అర్హతలున్న దాదాపు 8 వేల మంది ఎస్జీటీలను సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టు టీచర్లు (స్కూల్ అసిస్టెంట్)గా పదోన్నతి కలి్పంచింది. విద్యా సంవత్సరం మధ్యలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు రిటైరైతే వారిస్థానంలో అర్హత గల సీనియర్ ఎస్జీటీని డిప్యుటేషన్‌పై నియమించింది. తద్వారా పదో తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధ్యమైంది. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లకు ఇదే విధానం అనుసరించింది.మునిసిపల్ హైస్కూళ్లలో 8 ఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో దాదాపు 2,800 సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. మునిసిపల్ ఉపాధ్యాయ సరీ్వస్ రూల్స్‌పై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో సబ్జెక్టు టీచర్ల కొరతను తొలగించేందుకు ప్రాథమిక పాఠశాలల్లోని సీనియర్లు, సబ్జెక్టు నిపుణులను డిప్యుటేషన్‌పై నియమించి పదో తరగతి సిలబస్ బోధించేవారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన “సర్దుబాటు’ ప్రక్రియలో నిబంధనల ప్రకారం విద్యారి్థ, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా చూపి బదిలీ చేశారు. ఇదే నిబంధనను మునిసిపల్ స్కూళ్లకు వర్తింపజేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల్లో అత్యంత జూనియర్‌ను హైస్కూళ్లలో సర్దుబాటు చేసి, ప్రస్తుతం ఇక్కడ డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సీనియర్లను ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించారు. మరోపక్క హిందీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై తీవ్రంగా చూపనుంది. -
ప్రతి విద్యార్థికీ ప్రత్యేక నంబర్
సాక్షి, అమరావతి: ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ’ (అపార్) పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్‌తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ‘వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ ఆదేశించడంతో రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ కూడా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 9 నుంచి 12 (ఇంటర్) తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికను సిద్ధంచేసింది. దసరా సెలవుల్లో ఆయా తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే అందించారు. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. అధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయడాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే అపార్ నమోదు ప్రక్రియ చేపట్టారు.చదువు పూర్తయ్యే వరకూ ఇదే నెంబరు..నిజానికి.. విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికీ ‘పర్మినెంట్ ఎన్రోల్మెంట్ నంబర్’ (పెన్)ను కేటాయించి యూడైస్ ప్లస్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నంబర్‌కు అదనంగా 12 అంకెలతో కూడిన ‘అపార్’ నంబర్ కేటాయిస్తారు. ఇదే నంబరును విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు అన్ని సర్టిఫికెట్లపైనా, ఐడీ కార్డుపైనా ముద్రిస్తారు. ఈనెల 14న అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల నుంచి ధ్రువపత్రాలు తీసుకుని వాటిని కేంద్ర విద్యాశాఖ యూడైస్ ప్లస్ వెబ్సైట్లో నమోదు చేస్తారు.9–12 తరగతుల్లో 18 లక్షల విద్యార్థులు..అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2022లోనే ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాలు దీనిని పాటించాలని కోరింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగా, ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవుల తర్వాత ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సుమారు 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలి విడతలో వీరి వివరాలు నమోదు చేస్తారు. తర్వాత మిగిలిన విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడతారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, అందుకోసం దసరా సెలవుల అనంతరం నిర్వహించే తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)లో చర్చించాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. దీంతో అన్ని పాఠశాలల్లోను మంగళవారమే విద్యార్థులకు దరఖాస్తు పత్రాలను అందించారు. వాటిపై తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని సూచించారు.అపార్‌తో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట..ఇక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ ‘అపార్’.. హైస్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల చదువుకు సంబంధించి సమగ్ర డిజిటల్ సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. వివిధ బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీచేసే ప్రతి సర్టిఫికెట్ పైనా ఈ అపార్ నంబరును ముద్రిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లపై అనేక ఫిర్యాదులు రావడం, అవి అసలువా లేక నకిలీవా అనేది తేల్చేందుకు జాప్యం జరుగుతుండడంతో అభ్యర్థికి నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో విద్యలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్–వన్ స్టూడెంట్ ఐడీ’ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడ చదువుతున్నా సదరు విద్యార్థిని సులభంగా గుర్తించేందుకు, గత అకమిక్ వివరాలు తెలుసుకునేందుకు ఈ ‘అపార్’ ఉపయోగపడుతుంది. అంతేగాక.. ఇదే నంబరును డిజీ లాకర్‌తో అనుసంధానం చేయడంతో పాటు వాటిపై ఇదే నంబర్ ముద్రించడం ద్వారా విద్యా సంబంధమైన అన్ని పత్రాలు అసలైనవిగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. -
టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష..
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం టెట్ అభ్యర్థుల వడపోతకు దిగింది. టెట్ పరీక్షలు రాయకుండా ఆది నుంచే వడపోత చేపట్టింది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టెట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సెంటర్లను మార్చేసింది. బీఈడీ, డీఈడీల అర్హతలు ఉన్నవారికి, డీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హతలు గల అభ్యర్థులు ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్నా.. రెండు పేపర్లకు వేర్వేరు జిల్లాల్లో సెంటర్లు ఇచ్చి ఒక పేపర్ రాసే అవకాశాన్ని లేకుండా చేసి వారికి అగ్ని పరీక్ష పెట్టింది. ఫిబ్రవరిలో గత ప్రభుత్వం టెట్ పరీక్ష పూర్తి చేయగా.. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం టెట్–2024 (జూలై) పేరుతో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) విభాగంలో పేపర్–1(ఏ)కి 1,82,609 మంది, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–1(బీ)కి 2,662 మంది, స్కూల్ అసిస్టెంట్ పేపర్–2(ఏ) లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా, సోషల్ స్టడీస్‌లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–2(బి)కి 2438 దరఖాస్తులు అందాయి. వీరిలో చాలా మంది రెండు పేపర్లకు అర్హత గలవారు ఉన్నారు. అయితే, పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21 నుంచి జారీ చేసిన హాల్ టికెట్లు చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. రెండు పేపర్లకు ఒకే జిల్లా, ఒకే సెంటర్‌ను ఆప్షన్‌గా ఇస్తే ఒక్కో పేపర్‌కు సెంటర్‌తో పాటు జిల్లాలను కూడా మార్చేశారు. మరికొందరికి రాష్ట్రాన్నే మార్చేసి బెంగళూరులో సెంటర్ కేటాయించడం విద్యాశాఖ మాయాజాలానికి నిదర్శనం.జిల్లాలు దాటి సెంటర్ల కేటాయింపు ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కాలేజీలు, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఉన్న సెంటర్లలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21న సాయంత్రం నుంచి ఆన్లైన్లో ఉంచింది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రెండు పరీక్షల హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని చూస్తే రెండు పరీక్షలకు వేర్వేరు సెంటర్లు ఉండడం చూసి హతాశులయ్యారు. ఏలూరు జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పేపర్–1, పేపర్–1బీ జిల్లా కేంద్రాంలోనే రాయాల్సి ఉన్నా.. ఇద్దరికి ఉదయం ఏలూరులోను మధ్యాహ్నం పేపర్–1బి కాకినాడలోను సెంటర్ ఇచ్చారు. మరొకరికి రెండో పేపర్‌ను విజయవాడలో సెంటర్ ఇచ్చారు. గత నెలలో విద్యాశాఖ ‘దరఖాస్తు ఎడిట్’ అవకాశం ఇవ్వడంతో మీడియం ‘తెలుగు’ అని మార్చినా హాల్‌టికెట్‌లో మాత్రం ‘ఇంగ్లిష్’ అనే ఇచ్చారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇప్పుడు ఇంగ్లిష్‌లో పేపర్ ఎలా రాయగలమని ఆందోళన చెందుతున్నారు.నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యమాఏపీ టెట్ నిర్వహణలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పరీక్ష సెంటర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్నా వందల కిలోమీటర్ల దూరంలోని మరో జిల్లాలో కేటాయించారు. అలాగే పేపర్–1ఏ ఒక జిల్లాలోను, పేపర్–1బీ మరో జిల్లాలో సెంటర్లు కేటాయించడంలో అంతర్యం ఏమిటి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలోనే సెంటర్లు ఇచ్చేలా మార్పులు చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడియం అని హాల్ టికెట్లో ఇవ్వడంతో అనేకమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి మరోసారి ‘ఎడిట్’ అవకాశం కల్పించి న్యాయం చేయాలి. – ఎ.రామచంద్ర, ఏపీ నిరుద్యోగ ఐక్య సమితి – ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిశెట్టి వెంకట మహేష్‌బాబు ఎస్జీటీకి పేపర్–1ఏ రాయాల్సి ఉంది. ఈ అభ్యర్థికి కేంద్రం ఒంగోలులో కాకుండా 110 కి.మీ. దూరంలోని గుంటూరు జిల్లాలో సెంటర్ ఇచ్చారు. – తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీహెచ్.దినేష్ అనే అభ్యర్థికి విజయవాడలో సెంటర్ కేటాయించారు. – అనంతపురం జిల్లాకు చెందిన దాసప్పగారి సింధూజ స్కూల్ అసిస్టెంట్ పేపర్–2ఏ (మ్యాథమెటిక్స్, సైన్స్) పేపర్ రాసేందుకు తెలుగు మీడియం ఆప్సన్ ఇచ్చారు. కానీ.. హాల్ టికెట్లో మాత్రం ఇంగ్లిష్ మీడియం అని ఇచ్చారు.– ఏలూరు జిల్లాకు చెందిన కె.భువనేశ్వరి ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 6న రెండు పేపర్లు రాయాలి. రెండు పరీక్షలకు ఏలూరు సెంటర్ ఇస్తే.. ఉదయం జరిగే పరీక్ష ఏలూరులోను, మధ్యాహ్నం పరీక్ష ఏలూరుకు సుమారు 155 కి.మీ. దూరంలోని కాకినాడలోను సెంటర్ కేటాయించారు. ఇదే జిల్లాకు చెందిన పి.జయలక్ష్మికి కూడా ఏలూరు, కాకినాడ సెంటర్లను ఒకేరోజు రెండు పరీక్షలకు కేటాయించారు. -
సీబీఎస్ఈకీ మంగళం!
సాక్షి, అమరావతి: మొన్న టోఫెల్.. నిన్న ఐబీ.. నేడు సీబీఎస్ఈ.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఉన్నతాశయంతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలుచేస్తే.. ఆయన మీద అక్కసుతో చంద్రబాబు సర్కారు పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా.. జగన్ అమలుచేసిన ఒక్కో అంశానికీ స్వస్తి చెబుతోంది. టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఊసెత్తడంలేదు. తాజాగా.. సీబీఎస్ఈ బోధనకూ తూచ్ అంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది.విద్యా సంవత్సరంలో మధ్యలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోను, విద్యార్థుల్లోను వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దుచేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దుచేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయనిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే, విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ శిక్షణను అధికారంలోకి వచ్చీరాగానే జూన్‌లో రద్దుచేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సీబీఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సీబీఎస్ఈ బోధనను రద్దుచేశారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుళ విధానాల కారణంగా.. ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది.జగన్‌పై కోపంతోనే విద్యపై అక్కసు..‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’.. అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. పేదల పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఉదా.. గతంలో తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే, 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్ జగన్‌పై కోపంతో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు.విద్యా సంస్కరణలకు జగన్ శ్రీకారం..పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్ జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లిష్ మీడియం అమలుచేశారు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. మరోపక్క.. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘టోఫెల్’ను సిలబస్‌లో అంతర్భాగం చేశారు. మరోపక్క.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువమంది విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందించేందుకు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023–34 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక యూనిట్ పరీక్షలు కూడా ముగిసిన తర్వాత ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షా విధానం రద్దుచేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది.అంధకారంలోకి 84 వేల సీబీఎస్ఈ విద్యార్థుల భవిష్యత్తు..నిజానికి.. గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లిష్ మీడియం అమలుచేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్‌లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడీ స్కూళ్లల్లో దాదాపు 84 వేల మంది టెన్త్ విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే, ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్–పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దుచేసింది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దుచేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ‘రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.తల్లికి వందనం ఎగనామం!మరోవైపు.. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రకటించింది. దీంతో.. తల్లికి వందనం కింద వచ్చే రూ.15 వేలకు అదనంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని ప్రైవేటు స్కూళ్లు ఆకర్షిస్తుండడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లారు. కానీ, అధికార పగ్గాలు చేపట్టాక మాటమార్చి వచ్చే విద్యా సంవత్సరంలో చూద్దామని శాసనసభ సాక్షిగా ఆ శాఖా మంత్రి లోకేశ్ ప్రకటించి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లారు.నిర్దాక్షిణ్యంగా ‘టోఫెల్’ రద్దు..ఇక పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరం జగన్ సర్కారు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీలు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికిగాను 4,17,879 మంది (92 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.ఐబీ శిక్షణకూ అదే గతి..‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’.. అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది. అలాగే, అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి.. ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లుచేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది. -
ఫీజుల దరువుకు బ్రేకులెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించిన నేపథ్యంలో, పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై కసరత్తుకు సిద్ధమవుతోంది. ఫీజుల నియంత్రణకు 2017లో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలికవసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్ళు ప్రతి ఏటా ఏకంగా 25 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నాయి. దీనిపై కొన్నేళ్లుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై దృష్టి సారించింది. మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు! ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 35 లక్షల మందికిపైగా చదివే 11 వేల ప్రైవేటు స్కూళ్లను దీని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా స్కూళ్లలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతించేలా నిబంధనలు రూపొందించే యోచనలో ఉంది. అవసరం లేని ఖర్చును అభివృద్ధిలా..! ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా చేయాలని పాఠశాల విద్య అధికారులకు ఉప సంఘం సూచించింది. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 15 శాతం ఫీజులు పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జీవోలిచ్చారు. వాటిని ఆధారంగా చేసుకుని పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును చేస్తూ ఆ పనులను అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఓ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక స్కూలు ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కల్లో చూపింది. ఫీజులు 25 శాతం పెంచేసింది. ఇలా స్కూళ్లు ఫీజులు అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. వీటిని క్రమబధ్ధికరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు 10 శాతం దాటితే పక్కా లెక్క ఉండాలి స్కూళ్ల మూడేళ్ల ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించవచ్చని తిరుపతిరావు కమిటీ సూచించింది. ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటి ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులకు బ్యాంకు ద్వారానే చెల్లింపులు ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ఈ దిశగానూ కొన్ని సిఫారసులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టనున్నారు. -
జీవో 317పై అభ్యంతరాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317కు అనుగుణంగా చేపట్టిన ఉద్యోగ కేటాయింపులపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. జీవో 317 ద్వారా నష్టపోయిన, ఇబ్బందులకు గురైన వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక ఆయా ఉద్యోగుల నుంచి ఆన్లైన్లో వినతులను స్వీకరించింది. ఈ క్రమంలో 33 ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వానికి ఏకంగా 52,235 మంది ఉద్యోగులు వినతులు సమర్పించడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్రంలో నూతన జోనల్ విధానంలో భాగంగా జరిపిన కేటాయింపుల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో స్థానచలనం కలిగిన ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు నష్టపోయామని అంటున్నారు. వీరికి న్యాయం చేస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యి క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించింది. ఈ కమిటీ ఈ నెల 18న మరోమారు సమావేశం కానుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. విద్యాశాఖ నుంచి అత్యధిక వినతులు జీఓ 317 కేటాయింపులతో అన్యాయం జరిగిందంటూ వచ్చిన వినతుల్లో అత్యధికులు విద్యాశాఖ నుంచే ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 20,209 దరఖాస్తులు రాగా.. 11,417 దరఖాస్తులతో హోంశాఖ ఆ తర్వాతి స్థానంలో ఉంది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి 4,833 దరఖాస్తులు, రెవెన్యూ శాఖ నుంచి 2,676 దరఖాస్తులు, పంచాయతీరాజ్ నుంచి 2,390 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి 1,797, అటవీ, పర్యావరణ శాఖ నుంచి 1,235, గిరిజన సంక్షేమ శాఖ నుంచి 1,140 వినతులు వచ్చాయి. పది శాఖల నుంచి వందలోపు, మిగతా శాఖల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ వెయ్యిలోపు ఉన్నాయి. మొత్తం వినతుల్లో జిల్లా స్థాయి కేడర్‌లో 36,982 మంది ఉద్యోగులు ఉండగా, జోనల్ స్థాయిలో 12 వేల మంది ఉద్యోగులు, మల్టీ జోనల్ స్థాయిలో 3,253 మంది ఉన్నారు. ఈ దరఖాస్తులను శాఖల వారీగా పరిశీలించిన అధికారులు సాధ్యాసాధ్యాలపై ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. 18న కేబినెట్ సబ్ కమిటీ ముందుకు... శాఖల వారీగా జీఓ 317 వినతుల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఈనెల 18న సచివాలయంలోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్లో భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఆదేశించింది. ఈనెల 16 నాటికి శాఖల వారీగా వచ్చిన వినతుల సంఖ్య, ఇందులో పరిష్కరించినవి, పరిష్కరించనివి, తిరిస్కరించినవి, కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నవి, శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నవి, కోర్టు తీర్పు వెలువడినవి, శాఖలో కేడర్ స్ట్రెంగ్త్, కేటగిరీ వారీగా కేడర్ తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలని జీఏడీ ఆదేశించింది. ఈమేరకు జీఏడీ రూపొందించిన ఫార్మాట్‌తో కూడిన నోట్‌ను సాధారణ పరిపాల విభాగం కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు జారీ చేశారు. -
ఇంటర్ బోర్డు చొరవతో దివ్యాంగ విద్యార్థులకు మేలు
సాక్షి, అమరావతి: సాంకేతిక కారణాలతో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చినా చేరలేకపోయిన దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ఇంటరీ్మడియట్ బోర్డు సకాలంతో స్పందించడంతో వారికి మేలు జరిగింది. రాష్ట్రంలో ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులు పరీక్షల్లో ఒక సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంది. దీంతో విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం భాషల్లో (లాంగ్వేజ్ పేపర్) రాయడం లేదు. దీంతో విద్యార్థులు నాలుగు సబ్జెక్టులకే పరీక్షలు రాస్తున్నారు. అయితే, ఈ ఏడాది మద్రాస్ ఐఐటీ ప్రవేశాలకు ఐదు సబ్జెక్టుల విధానం తప్పనిసరి చేసింది. దీంతో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్లోను ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో పాటు పలు ఎన్ఐటీల్లోను సీట్లు సాధించారు. కానీ కౌన్సెలింగ్‌లో మార్కుల లిస్టును పరిశీలించిన అధికారులు ‘నాలుగు’ సబ్జెక్టులకే మార్కులుండటంతో వారి ప్రవేశాలను తిరస్కరించే పరిస్థితి తలెత్తింది. దీంతో గత నెలలో పలువురు దివ్యాంగ విద్యార్థులు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా మండలికి చేరుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు మద్రాస్ ఐఐటీ అధికారులను సంప్రదించి, ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సబ్జెక్టు వెసులుబాటును వివరించారు. అయితే, ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే చేర్చుకుంటామని చెప్పడంతో ఇంటర్ బోర్డు అధికారులు మార్గాలను అన్వేíషించారు. 1992లో పదో తరగతి దివ్యాంగ విద్యార్థుల కోసం జారీ చేసిన జీవో నం.1161 ప్రకారం ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు మేలు చేయవచ్చని ప్రభుత్వానికి ఫైల్ పంపారు. నాలుగు పేపర్లలో వచ్చిన మార్కుల సరాసరి ఆధారంగా పరీక్ష రాయని సబ్జెక్టుకు మార్కులు కేటాయించవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నం.255 ఇవ్వడంతో దాదాపు 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందే అవకాశం దక్కింది. -
నెరవేరిన టీచర్ల కల
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల కోసం దాదాపు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కల ఎట్టకేలకు నెరవేరింది. రంగారెడ్డి జిల్లా మినహా రెండు జోన్లలోనూ పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. చివరిసారిగా 2015లో పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రమోషన్ల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. టీచర్ల హేతుబదీ్ధకరణ చేపట్టాలని కొన్నాళ్లు భావించారు. కోర్టు కేసుల కారణంగా మరికొంత జాప్యం జరిగింది. 2023లో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మల్టీజోన్–1లో కొంత వరకూ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్లింది. అంతలోనే స్పౌజ్ కేసుల కారణంగా ఇది ఆగిపోయింది. పండిట్లు తమ పోస్టులు తమకే ఇవ్వాలన్న డిమాండ్‌తో కోర్టును ఆశ్రయించారు. వీటిని పక్కనబెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని భావించారు. ఈ సమయంలో ప్రమోషన్లకు టెట్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను కొంతమంది టీచర్లు ముందుకు తెచ్చారు. న్యాయస్థానం స్టే కారణంగా 2023లో ఇది ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యూహాత్మకంగా న్యాయ పరమైన చిక్కులు తొలగించారు. దీంతో 18,942 మందికి ఒకేసారి పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, కొంతమంది, స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంలుగా మరికొంతమంది ప్రమోషన్లు పొందారు. వీళ్లందరినీ బదిలీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖాళీలు 22 వేల పైనే... బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలు అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా... వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదో చరిత్ర : ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత పెద్ద మొత్తంలో టీచర్లకు పదోన్నతులు కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయమని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, చట్టపరమైన చిక్కులను అధిగమించడంలో ప్రభుత్వం చూపిన చొరవను ఉపాధ్యాయ సంఘాలు ప్రశంసిస్తున్నాయని తెలిపింది. టీచర్ల కష్టాన్ని, శ్రమను ప్రభుత్వం గుర్తించిందని, సముచిత రీతిలో గౌరవించిందని, ఈ కారణంగా టీచర్లు మరింత కంకణబద్దులై పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీఎంవో వ్యక్తం చేసింది. ఖాళీలు 22 వేల పైనే...బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలను అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా.. వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
మోగనున్న బడిగంట.. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు గురువారం తెరుచుకోనున్నాయి. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954 పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలలు మినహా మిగిలినవి నేడు (గురువారం) ప్రారంభమవుతాయి. ఇక కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల 21న, నవోదయ విద్యాలయాలు 30న ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి బుధవారమే బడులు తెరుచుకోవాల్సి ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌ను అధికారులు గురువారానికి మార్చారు. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పీఎం–పోషణ్ గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)ను సైతం అదే రోజు విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతానికి గతేడాది వరకు అనుసరించిన విధానంలోనే విద్యార్థులకు భోజనం అందించనున్నారు. కొత్త విద్యాశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పూర్తవగా, ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.20 తర్వాతే విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత విద్యా సంవత్సరం వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పాఠశాల తెరిచిన మొదటిరోజే అందజేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్ –తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్‌ను ఇచ్చేవారు. 2024–25 విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే రూ.1,042.53 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, సరఫరాదార్ల నుంచి పూర్తిస్థాయిలో వస్తువులు స్టాక్ పాయింట్లకు చేరలేదు. దీంతో వీటిని ఈనెల 20 తర్వాతే విద్యార్థులకు అందించే అవకాశం ఉంది. కాగా, ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు నూతన విద్యా సంవత్సరం కేలండర్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించేది. అయితే, ఈసారి 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లు కూడా ఉండడంతో ఈ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీబీఎస్ఈ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు నూతన కేలండర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో మరో వారం రోజుల్లో విద్యా కేలండర్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ప్రతి విద్యార్థికీ ‘పెన్’
సాక్షి, అమరావతి: కాకినాడ నగురంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలకృష్ణ కుటుంబం చెన్నైకి వలస వెళ్లింది. బాలుడు ఇక్కడ టీసీ తీసుకోలేదు. అయితే, ఆ విద్యార్థి అక్కడ బడిలో చేరినట్టు ఎక్కడా వివరాలు లేవు. ఇలాంటి పరిస్థితి విద్యాశాఖకు సవాలే. బడి ఈడు పిల్లలు ఎంతమంది బడిలో ఉంటున్నారు, ఎంతమంది బడికి వెళ్లడంలేదో తెలుసుకునేందుకు ఇంటింటికీ సర్వే చేయడం తప్ప ఇప్పటివరకు మరో మార్గం లేదు. ‘పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)’తో దీనికి పరిష్కారం లభిస్తుంది. నూతన జాతీయ విద్యావిధానం–2020 (ఎన్ఐపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య పెన్ను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో ఈ విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఇదే తరహా విధానం అమలు చేస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసింది.’పెన్’ అంటే..ప్రి ప్రైమరీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఇంటి అడ్రస్ వంటి అన్ని వివరాలను డిజిటలైజ్ చేసి కేంద్ర పాఠశాల విద్య మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలోని ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)’లో నమో దు చేస్తారు. ఒకటో తరగతిలో విద్యార్థుల వివరాలు నమోదు చేసే సమయంలోనే ప్రతి ఒక్కరికీ డిజీ లాకర్‌ను ఓపెన్ చేసి, అన్ని సర్టిఫికెట్లను అందులో ఉంచుతారు. ఆ తర్వాత 11 అంకెల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ వస్తుంది. ఈ నంబరు ఆధార్ నంబరులాగానే విద్యార్థికి జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ఒక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలు నుంచి మరొక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలుకు బదిలీ అయినప్పు డు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోని స్కూలు లేదా కాలేజీలో చేరే సమయంలో టీసీ లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు అవసరం లేకుండా చేరొచ్చు. ఈ పెన్ నంబరు ఇవ్వగానే ఆన్లైన్లో ఆ విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికె ట్లు అందులో వస్తాయి. దీనిద్వారా విద్యార్థి ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు సులభంగా ట్రాన్స్ఫర్ అవ్వొచ్చు. చదువు పూ ర్తయిన అనంతరం వారు ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఆధార్ నంబర్ నమోదు చేసేవారు. అయితే, ఈ వివరాలు ఆ జిల్లా, రాష్ట్రం వరకే తెలిసేవి. ఒకవేళ విద్యార్థి రాష్ట్రం వెలుపల మరోచోట చదువుతున్నా తెలుసుకోవడం కష్టం. అయితే పెన్ ద్వారా విద్యార్థి ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. చిరునామా వంటి వివరాలు మారినప్పుడు పెన్ నంబర్‌కు కూడా అప్డేట్ చేస్తారు. దాంతో దేశవ్యాప్తంగా విద్యార్థి ఎక్కడున్నా సులువుగా తెలుసుకోవచ్చు.పత్రాలు లేకుండానే బదిలీరాష్ట్రంలో ప్రస్తుతం స్కూల్ స్థాయి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 86 లక్షల మందికి, ఈ విద్యా సంవత్సరం ప్రి ప్రయిమరీలో చేరే విద్యార్థులకు కూడా ‘పెన్’ కేటాయిస్తారు. దీని ద్వారా జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే 2024–25 విద్యా సంవత్సరంలో ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే విద్యార్థులు, ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలలో చేరే విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకప్పటి నిబంధనల ప్రకారం ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలలో చేరే విద్యార్థికి టీసీ, స్టడీ సర్టిఫికెట్ కుల ధ్రువీకరణ పత్రం.. ఇలా అనేక సర్టిఫికెట్లను సమర్పించాలి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ల అవసరం లేకుండా విద్యార్థి ‘పెన్’ నంబర్‌తో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక్క క్లిక్‌తో విద్యార్థిని బదిలీ చేయొచ్చు.పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్వచ్చే నెలలో ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ సులభతరం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5, 7 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను పై తరగతులు ఉన్న పాఠశాలలకు ట్యాగింగ్ చేస్తారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థికి అవసరమైన స్కూళ్లను ఆన్లైన్లో చూపిస్తే తల్లిదండ్రులు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి విద్యార్థులందరినీ మ్యాప్ చేసిన తర్వాత ఆ డేటాను విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలకు బదిలీ చేస్తారు. విద్యార్థి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు సమర్పించా ల్సిన అవసరం ఉండదు. ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఇదే విధానం అనుసరిస్తారు. అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలల్లో ఇదే తరహా విధానం అనుసరిస్తారు. గత ఏడాది వరకు పాఠశాలలో ప్రవేశానికి తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, నివాస «సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ విధానానికి స్వస్తి పలకనున్నారు. ‘పెన్’పై అవగాహన ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి ‘పెన్’ నంబర్ కేటాయించాలని పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ జిల్లా, మండల విద్యా శాఖాధికారులు, పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో పర్మినెంట్ నంబర్‌పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, సర్టిఫికెట్ల పేరిట తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. -
పిల్లల మార్కులు నేరుగా తల్లిదండ్రులకే
సాక్షి, అమరావతి: విద్యార్థి ఒక్క రోజు బడికి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ (ఎస్ఎంఎస్లు)ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. మరో వినూత్న ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులను, నెలలో ఎన్నిరోజులు బడికి వచ్చారో చెబుతూ ‘హోలిస్టిక్ రిపోర్టు కార్డు’ లను తల్లిదండ్రులకు పంపిస్తోంది. ఫార్మేటివ్ (యూనిట్), సమ్మేటివ్ (అర్ధ, వార్షిక) అసెస్‌మెంట్స్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను నేరుగా తల్లిదండ్రులకే చేరవేస్తోంది.గతంలో వార్షిక పరీక్షల ఫలితాలను మాత్రమే ప్రోగ్రెస్ కార్డుల్లో ఇవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్లకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9 తరగతుల పిల్లలకు ఈ నూతన విధానం ప్రవేశపెట్టింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేనేజ్మెంట్స్లోని బడుల్లో 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 61.81 లక్షల మంది విద్యార్థుల మార్కులు, బడికి హాజరైన రోజుల సమాచారాన్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 55,71,173 మందికి (90.13 శాతం) ఎస్ఎంఎస్లు పంపారు. పిల్లల ప్రగతి తల్లితండ్రులకు తెలిసేలా.. గతంలో విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను ప్రోగ్రెస్ రిపోర్టుగా ఏప్రిల్/ మే నెలల్లో పంపించేవారు. అయితే 2023–24 విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్ఏ పరీక్షలు, రెండు ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఎన్ని రోజులు బడికి హాజరయ్యారో కూడా వివరిస్తూ తల్లిదండ్రులకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను వారి ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నారు. కార్డులను డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. దీనిద్వారా తమ పిల్లలు ఏ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించారు, ఎన్ని రోజులు బడికి వెళ్లారో తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయో గుర్తించి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్లను అడిగేందుకు అవకాశముంటుంది. దీనిద్వారా తల్లిదండ్రుల్లో బాధ్యత పెరుగుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురే‹Ùకుమార్ ‘సాక్షి’కి తెలిపారు.100 శాతం పూర్తిచేసిన ప్రభుత్వ బడులు విద్యార్థుల మార్కులు, హాజరు వివరాలను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి పాఠశాల (ప్రాథమిక, ఉన్నత) ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత హాజరు, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం పూర్తి చేయగా, ప్రైవేటు పాఠశాలలు 89 శాతం మాత్రమే నమోదు చేశాయి. బడులు తెరిచేలోగా అన్ని స్కూళ్లూ ఈ వివరాలను నమోదు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.డిజీ లాకర్లో 8, 9 తరగతుల మార్కులు ఇప్పటికే డిగ్రీ, ఇంటర్మీడియట్‌తో పాటు పదో తరగతి మార్కుల జాబితాలను ‘డిజీ లాకర్’లో నమోదు చేస్తుండగా.. 2023–24 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతుల మార్కుల జాబితాలను సైతం డిజీ లాకర్లో అందుబాటులో ఉంచారు. బడులు తెరిచాక పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో డిజీ లాకర్‌పై అవగాహన కల్పించనున్నారు. -
ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియం బోధనను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) వంటి అధునాతన పద్ధతుల్లో విద్యా బోధన చేస్తోంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటివి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను అందిస్తోంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి కూడా ఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. మరోపక్క 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లోనూ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు–ఇంగ్లిష్ మీడియంలో వర్క్‌బుక్స్‌తో కలిపి మొత్తం 391 టైటిళ్లను పీడీఎఫ్ రూపంలో పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచింది. గతేడాది ఆన్లైన్లో ఉంచిన పుస్తకాలను దాదాపు 18 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1,72,482 పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ అవడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పుస్తకాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. త్వరలో ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ వంటి మైనర్ మీడియం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను సైతం వెబ్సైట్లో ఉంచనున్నారు. పాఠాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా అర్ధం చేసుకొని, సామరŠాధ్యలను మెరుగుపరుచుకొనేందుకు ఆన్లైన్ పీడీఎఫ్‌లోని ప్రతి పాఠానికి ఎస్సీఈఆర్టీ ‘క్యూఆర్’ కోడ్‌ను జత చేసింది. ఆ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే పుస్తకంలోని పాఠాన్ని ‘దీక్ష’ పోర్టల్‌లో వీడియో రూపంలో చూసే అవకాశం కూడా కల్పించారు. పీడీఎఫ్ పాఠ్య పుస్తకాలను https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్–2 బోధన అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.ఈసారి పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోగత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది. జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. బైలింగ్యువల్‌లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్ బుక్స్ డైరెక్టర్ కొండా రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్‌ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్‌లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్‌లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్‌లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
పదో తరగతి హాల్‌టికెట్లు సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్‌తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. -
టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్టీ), ఏపీ టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదంది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదన్నారు. టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్‌ను ఖరారు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
27 నుంచి ఏపీటెట్–2024
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్‌టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్లైన్లో ఉంచింది. కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్‌కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది. నిర్వహణ ఇలా.. పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం) పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం) 120 కేంద్రాల్లో ఏపీటెట్ ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు. పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.