
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు రెండో దశ పనులను జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మన బడి నాడు–నేడు కింద రూ.8,000 కోట్ల అంచనా వ్యయంతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ స్కూళ్లల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం పనులు మినహా పై కప్పు, సీలింగ్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల మరమ్మతులు, నిర్మాణాలు, ఫర్నీచర్ సరఫరా–ఏర్పాటు, పెద్ద, చిన్న రిపేర్లను జూన్ 12లోగా పూర్తి చేసి స్కూళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే బాధ్యతలను సంబంధిత హెడ్‌మాస్టర్లకు అప్పగించాలని సూచించారు. నాడు–నేడు కోసం కొనుగోలు చేసిన మెటీరియల్‌ను హెడ్‌మాస్టర్లతో పాటు తల్లిదండ్రుల కమిటీలు తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు.
కొనుగోలు చేసిన మెటీరియల్ నాణ్యత లేకపోయినా, తక్కువ సరఫరా చేసినా హెడ్‌మాస్టర్ తిరస్కరించాలని ఆదేశించారు. స్కూళ్ల పై కప్పుల మరమ్మతుల ఫొటోలను దశల వారీగా హెడ్‌మాస్టర్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. తరగతి గదుల్లో మెటీరియల్ నిల్వ ఉంచినప్పుడు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
మెటీరియల్‌ను సురక్షితంగా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అదనపు వ్యయం అయినా హెడ్‌మాస్టర్లు లేదా సంబంధిత అధీకృత ప్రతినిధి జీతాల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ హెడ్‌మాస్టర్లకు తెలియజేసి అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment