పాఠాలు చెప్పాల్సిన టీచర్లు.. ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా
మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో నియామకం
ఓపెన్ స్కూల్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది.
పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఆరు జిల్లాలకు మెమో..
ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్‌గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి లేఖ ఇచ్చారు.
విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది.
ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment