Open School
-
పాఠశాల విద్యలో పైరవీల రాజ్యం!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆరు జిల్లాలకు మెమో..ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్‌గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి లేఖ ఇచ్చారు. విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఎస్ఎస్సీ, ఇంటర్ ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఫలితాలను సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి 8 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 15,058 విద్యార్థులు హాజరు కాగా, 9,531 మంది (63.30 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మిడియట్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా 18,842 మంది (69.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్ https://apopenschool.ap.gov.in/ చూడవచ్చని ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వర్రావు తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.200, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఓపెన్ స్కూల్ చదివితే డీఎస్సీకి చాన్స్ లేనట్టే
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. వీళ్లు గతంలో టెట్ పాసయినా ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 25 వేల మంది డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించింది. వీటిని రెగ్యులర్ డీఎడ్ కోర్సులతో సమానంగా భావించారు. ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌కు హాజరయ్యారు. టెట్ దరఖాస్తులో అర్హత కాలంలో డీఎడ్‌కు బదులు ‘ఇతరులు’అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేసేవాళ్లు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది. రెగ్యులర్ డీఎడ్‌తో ఇది సమానం కాదని పేర్కొంది. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్తో కేవలం ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగానే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది. టెట్‌కు, డీఎస్సీకి ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా, వెరిఫికేషన్‌లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఏపీలో ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్
సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట సమయంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ స్కూల్ విధానంలో చదువుతున్న టెన్త్, ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 1.68 లక్షల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాస్ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్ స్కూల్ విద్యార్థులను పైరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్) -
ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. దీంతో 72 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో చదువుతూ ఏప్రిల్/మే నెలల్లో పరీక్షలు రాయాల్సిన వారిని కరోనా నేపథ్యంలో పాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తరహాలోనే రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 42 వేల మంది ఓపెన్ ఎస్సెస్సీ, 30 వేల మంది ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ కానున్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి కిందటి తరగతుల్లో (వారు పాసైంది ఏదైతే అది) 4 సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకొని అందులో మంచి మార్కులు వచ్చిన మూడింటి యావరేజ్ మార్కుల ఆధారంగా ప్రతి సబ్జెక్టుకు మార్కులను కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ విద్యార్థులు తమ మార్కులను పెంచుకోవాలనుకుంటే తర్వాత నిర్వహించే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. -
32 ఏళ్ల తర్వాత మళ్ళీ స్కూల్‌కు..
చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తోంది మేఘాలయకు చెందిన 50 ఏళ్ల అమ్మమ్మ, అమ్మ లకింటివు. ప్రతిరోజూ యూనిఫాం ధరించి పాఠశాలకు వెళ్లి 12వ తరగతిలో ఇతర పిల్లలతో కలిసి చదువుకుంది. ఇటీవల మేఘాలయ బోర్డు నుంచి 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఆటుపోట్ల వైవాహిక జీవితం.. లకింటివు 32 సంవత్సరాల క్రితం స్కూల్ చదువును వదిలేసింది. స్కూల్ రోజుల్లో ఆమెకు మ్యాథ్స్ అంటే భయంగా, అనాసక్తంగా ఉండేది. ఈ కారణంగా 1989లో పాఠశాల నుంచి తప్పుకుంది. 21 ఏళ్ళ వయసులో వివాహం జరిగింది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. పిల్లలను పెంచుతూ.. ఒంటరి తల్లిగా పిల్లల పెంపకంలో తీరక లేకుండా ఉండేది లకింటివు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసిన లకింటివు అమ్మమ్మ కూడా అయ్యింది. ఖాసీ వర్గానికి చెందిన పిల్లలకు జీవనోపాధి అవకాశాలు నేర్పిస్తోంది ప్రభుత్వం. దీంతో 2015 లో మళ్ళీ స్కూల్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఓపెన్ స్కూల్ ద్వారా తన పేరును నమోదు చేసుకుంది. దీనితో పాటు తన పనులనూ యధావిధిగా కొనసాగించింది. 50 ఏళ్ల వయసులో విద్య పట్ల ఆమెకున్న అంకితభావాన్ని మేఘాలయ విద్యాశాఖ మంత్రి లాహ్మెన్ రింబుయ్ ప్రశంసించారు. కుమార్తె సహాయంతో.. పిల్లలు చదువుతుంటే తల్లిదండ్రులు సపోర్ట్‌గా ఉండటం తెలిసిందే. లకుంటివు విషయంలో ఇది రివర్స్ అయ్యింది. ఇంట్లో చదువుకుంటున్నప్పుడు లకింటువు కుమార్తె తల్లికి మద్దతుగా నిలిచింది. తల్లికి అర్థం కాని పాఠ్యాంశాలను వివరంగా చెప్పేది. వాటిని తల్లి శ్రద్ధగా వినేది. చదువు పట్ల అంత మక్కువ ఉన్న తల్లిని ప్రశంసిస్తూ ‘మా అమ్మను చూసి గర్వపడుతున్నాను. ఇంతటి పట్టుదల మా పిల్లల్లోనూ రావాలని కోరుకుంటున్నాను’ అంటోంది కుమార్తె. కొనసాగించాలనుకుంటున్న చదువు.. ‘నా తల్లి ప్రేరణతో చాలా మంది మహిళలు చదువుకోవడానికి ముందుకు వస్తారు. చదువుకు వయసు అడ్డంకి కాదని, వృద్ధాప్యంలోనైనా కోరుకున్న జీవితాన్ని పొందవచ్చని నిరూపిస్తుంది మా అమ్మ’ అంటోంది లకింటివు కూతురు. తల్లి తన చదువును మరింత కొనసాగించాలని కోరుకుంటుంది. ఖాసి భాషలో గ్రాడ్యుయేట్ చేయడమే ఇప్పుడు లకింటివు లక్ష్యం. చదువు విలువ అంటే ఏమిటో నాకు తెలుసు. చదువు లేకుండా జీవితంలో ఏమీ లేదు’ అంటోంది లకింటివు. క్లాస్‌మేట్స్‌తో లకింటివు -
అంతా ఓపెన్
పాలకొల్లు సెంట్రల్: ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో జరుగుతున్న పదవ తరగతి, ఇంటర్మీ డియట్ పరీక్షలు ప్రహసనంగా మారాయి. ఈ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు లంచాలతో మరీ ఓపెన్ అయిపోయాయని ప్రతిభ గల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ఈ పరీక్షల నిర్వాహకులు ఇంటర్ విద్యార్థి నుండి రూ. 4 వేలు, పదవ తరగతి విద్యార్థి నుండి రూ.3,500 పైనే అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు నిర్వహించడానికి ఓపెన్ స్కూల్ నుండి నిధులు సమకూరుస్తారని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. కాని ఇక్కడ విద్యార్థుల నుండి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షల నిమిత్తం పాలకొల్లులో 3 సెంటర్లను కేటాయించారు. బీవీఆర్‌ఎం గరల్స్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు, ఏవీఎస్ఎన్ఎం, బీఆర్ఎంబీ హైస్కూల్లో ఇంటర్ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో అంతా ఓపెన్ మే 1వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా ఇంటర్ విద్యార్థులకు 2వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3, 4 తేదీలలో జరగాల్సిన పరీక్షలను ఫొని తుఫాను కారణంగా వాయిదా వేసినట్లు విద్యార్థులు తెలిపారు. 10వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడు కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు నిర్వాహకులు తమకు అనుకూలమైన వ్యక్తులనే ఇన్విజిలేటర్లుగా నియమించుకున్నారు. పరీక్షకు హాజరైన పదవ తరగతి విద్యార్థి నుంచి రూ.100, ఇంటర్ విద్యార్థి నుండి రూ.200 ఎగ్జామ్ రూంలోనే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ షీటును ఇస్తున్నారు. దాంతో వాటిలోని సమాధానాలను చూసి రాస్తున్నారు. బుధవారం నుండి ఇప్పటి వరకూ జరిగిన ఈ ఓపెన్ పరీక్షలకు ఓ రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలకు రాగా ముడుపులు అందించి మమ అనిపించారని విశ్వసనీయ సమాచారం. ఈ ఓపెన్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా జరుగుతున్నట్లు లేదని వీటిని నిర్వహించే వారి జేబులు నింపుకోవడానికే జరుగుతున్నట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి. -
కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు
ప్రకాశం, గిద్దలూరు: ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని సిట్టింగ్ స్క్వాడ్ అధికారి, కొమరోలు ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ల సహకారంతో మాస్‌కాపీయింగ్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి కొమరోలు ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లును సిట్టింగ్ స్క్వాడ్‌గా నియమించారు. దీంతో గురువారం పలు పరీక్ష కేంద్రాలను వెంకటేశ్వర్లు సందర్శించి పర్యవేక్షించారు. గురువారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 285 మంది విద్యార్థులకుగానూ 40 మంది గైర్హాజరయ్యారని, 245 మంది హాజరయ్యారని స్థానిక పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ప్రేమ్‌సాగర్ తెలిపారు. కంభంలో పరీక్ష కేంద్రాల తనిఖీ... కంభం: గురువారం జరిగిన ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి పలు కేంద్రాలను స్క్వాడ్ అ«ధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీ చేశారు. బుధవారం ప్రారంభమైన ఓపెన్ పరీక్షల్లో భాగంగా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జోరుగా మాస్‌కాపీయింగ్ జరిగిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. కంభంలో గురువారం పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా, కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల, జేఆర్ఆర్ బీఈడీ అండ్ డీఈడీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఒంగోలు నుంచి వచ్చిన రెండు ప్రత్యేక బృందాల స్క్వాడ్ అధికారులు సందర్శించి పరిశీలించారు. కాగా, కంభం తహసీల్దార్, కంభం, అర్ధవీడు, మార్కాపురం ఎంఈఓలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మిగిలిన పరీక్షల్లోనైనా కాపీయింగ్ జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు ఇదే పద్ధతిని కొనసాగిస్తారో.. లేదో వేచిచూడాలి. నేడు, రేపు జరగాల్సిన ఓపెన్ పరీక్షలు వాయిదా... ఒంగోలు టౌన్: ఉత్తర కోస్తా జిల్లాలకు ఫణి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రెండురోజులు వాయిదా వేస్తూ ఏపీఓఎస్ఎస్ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3, 4 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను 9, 10 తేదీలకు వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు తెలిపారు. రెండు రోజుల పరీక్షలను వాయిదా వేసిన విషయాన్ని జిల్లాలోని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు తమ పరీక్ష కేంద్రాల వద్ద డిస్ప్లే చేయాలని ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ బండి గోవిందయ్య తెలిపారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్ పరీక్ష, 10వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇంటర్మీడియెట్ మ్యాథ్స్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని పరీక్ష రాసే అభ్యర్థులకు తెలియజేయాలని జిల్లా కో ఆర్డినేటర్ కోరారు. ‘ఓపెన్’ విధుల నుంచినలుగురు తొలగింపు జిల్లాలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో అక్రమాలను సరిదిద్దుకునే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. బుధవారం జిల్లాలోని 21 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్లు దగ్గరుండి చూచిరాత రాయించడం, కొన్నిచోట్ల బోర్డుపై సమాధానాలు రాయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కంభంలో జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు గురువారం తెలిపారు. కంభం పరీక్ష కేంద్రంలోని ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను తొలగించినట్లు చెప్పారు. ఒంగోలులోని బండ్లమిట్టలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి గురువారం తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనివాసరావు... కంభంలో తొలిరోజు జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనపై సమగ్ర నివేదిక అందించేందుకు కందుకూరు మండలం పలుకూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించినట్లు జిల్లా విద్యాశాధికారి సుబ్బారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం తనకు అందించాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌కు పంపించనున్నట్లు డీఈఓ తెలిపారు. -
‘ఓపెన్’ విద్యార్థులకు జూలైలోనే సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను అక్టోబర్‌లో కాకుండా జూలైలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు సంవత్సరం వృథా కాకుండా ఉంటుంది. అడ్మిషన్ నెంబరు ఆధారంగా పరీక్ష ఫీజు మీసేవా, ఏపీఆన్‌లైన్‌లో చెల్లించాలని డీఈఓ జనార్దనాచార్యులు, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు తెలిపారు. థియరీ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.150, ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతికి రూ.50, ఇంటర్‌కు రూ.100 చెల్లించాలన్నారు. ఈనెల 11 నుంచి 16 వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. రూ.25 అపరాధ రుసుంతో 17, 18 తేదీల్లో, రూ.50 అపరాధ రుసుంతో 19, 20 తేదీల్లో చెల్లించవచ్చన్నారు. -
58 ఏళ్ల తండ్రి.. 30 ఏళ్ల కొడుకు ఒకే క్లాస్..!
భువనేశ్వర్: చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ చదువుకు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని నిరూపించారు ఓ తండ్రి కొడుకులు. చదువుకు స్వస్తి చెప్పిన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్ బీజ్(58), అతని కొడుకు కుమార్ బిస్వాజిత్ బీజ్(30) ఇద్దరూ ఒకే సారి పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. కాగా తండ్రి కొడుకులకి ఒకే విధమైన మార్కులు(342) రావడం విశేషం. అరుణ్ కుమార్ ఓ సీనియర్ బీజేపీ లీడర్. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏడో తరగతి చదువుతుండగా తండ్రి చనిపోవడంతో చదువు మానేశాడు. రాజకీయంగా ఎదిగినా చదువుకోలేదన్న బాధ ఎపుడూ తనను వెంటాడేదని అరుణ్ తెలిపారు. ‘2014 ఎన్నికల సమయంలో అఫిడవిట్లో ఎడ్యుకేషన్ కాలమ్ ఖాళీగా వదిలేయడం వల్ల సిగ్గుతో తలదించుకున్నాను. అప్పుడే పదో తరగతి ఎలాగైనా పాస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఓపెన్ స్కూల్లో చేరి పదో తరగతి పాస్ కావడం సంతోషంగా ఉంది. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నా ఎడ్యుకేషన్ కాలమ్‌ని గర్వంగా పూర్తి చేస్తా’ అని అరుణ్ కుమార్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బిస్వాజిత్ పదోతరగతి మధ్యలోనే మానేశాడు. అనంతరం బిజినెస్ చూసుకుంటూ మళ్లీ పరీక్షలకు హాజరు కాలేదు. ‘ఇంట్లో అందరూ చదువుకున్న వారే. నేను నాన్న మాత్రమే పదోతరగతి పాస్ కాలేదు. పదో తరగతి ఎలాగైనా చదువాలనే పట్టుదలతో ప్రతి ఆదివారం నేను, నాన్న తరగతులకు హాజరయ్యేవాళ్లం. మా పెద్ద అన్నయ్య కూడా చదువు విషయంలో అండగా నిలిచాడు. పదో తరగతి పాస్ అయినందుకు సంతోషంగా ఉంద’ని బిస్వాజిత్ తన ఆనందాన్ని పంచుకున్నారు. -
ఓపెన్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దీన్ తనిఖీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఈఓ లక్ష్మీనారాయణ, ఆర్ఐఓ సురేష్‌ను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచర్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటర్ పరీక్షకు 585 మంది విద్యార్థులకు గాను 438 మంది హాజరయ్యారు. పదో తరగతి పరీక్షకు సంబంధించి ఐదుగురుకు గాను గాను ముగ్గురు హాజరైనట్లు వివరించారు. -
నేటి నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పెనుకొండలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇంటర్æ పరీక్షలకు 2,463 మంది, పదో తరగతి పరీక్షలకు 1,551 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ప్రశ్నపత్రాలను కట్టుదిట్టమన బందోబస్తు మధ్య తరలించారు. సమీప పోలీస్స్టేషన్లలో భద్రపరిచి పరీక్ష రోజు కేంద్రానికి తీసుకెళ్తారు. పరీక్షల్లో కాపీయింగ్ ప్రోత్సహించవద్దని డీఈఓ లక్ష్మీనారాయణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని.. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశ్నాపత్రాలను నిర్ణీత సమయంలో మాత్రమే తెరవాలని సూచించారు. -
ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దూర విద్యా విధానంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు ప్రవేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారాలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య గురువారం విడుదల చేశారు. వచ్చే నెల 14 వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించి కోర్సుల్లో చేరవచ్చని వివరించారు. మరిన్ని వివరాలను telanganaopenschool. org వెబ్సైట్లో పొందవచ్చన్నారు. -
రేపు ఓపెన్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్
వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: దూర విద్యా విధానంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను ఈ నెల 17 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిం చనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ వెల్లడించింది. అభ్యర్థులు మీసేవా/టీఎస్ ఆన్లైన్/ఏపీ ఆన్లైన్లో ఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాన్ని అప్లోడ్ చేయాలని సూచించింది. వచ్చే నెల 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఆలస్య రుసుముతో వచ్చే నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, వారంతా మీసేవా ద్వారా మాత్రమే వచ్చే నెల 21వ తేదీలోగా దరఖాస్తులను పంపించాలని వెల్లడించింది. పూర్తి వివ రాలు జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలు లేదా telanganaopenschool.org వెబ్సైట్లో పొందవచ్చని వివరించింది. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
జిల్లాకు ఇంటర్లో మూడు, పదిలో 5వ స్థానాలు భానుగుడి(కాకినాడ): ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఆపాస్) ద్వారా పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు శుక్రవారం విడుదలయినట్లు జిల్లా కో ఆర్డినేటర్ కొమ్మన జనార్దనరావు తెలిపారు. జిల్లాలో పదోతరగతికి సంబంధించి 7,355 మంది పరీక్షలు రాస్తే 4,690 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 63.77 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచిందన్నారు. ఇంటర్‌వీుడియట్‌లో 9,089 మంది పరీక్షలకు హాజరవగా 6,440 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. 70.85 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 3వ స్థానంలో నిలిచిందన్నారు. పదోతరగతి రీకౌంటింగ్‌కు రూ.100, ఇంటరీ్మడియట్ రీకౌంటింగ్‌కు రూ.200 చెల్లించాలని, రీవెరిఫికేషన్, ఫొటోస్టాట్ కాపీ ఇచ్చేం దుకు రూ.1000 ఏపీ ఆ¯ŒSలై¯ŒS ద్వారా ఈ నెల 5 నుంచి 15 లోగా చెల్లించాలని సూచించారు. సెప్టెంబరులో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు పదోతరగతి సబ్జెక్టు ఒక్కింటికి రూ.100, ఇంటరీ్మడియట్ సబ్జెక్టు ఒక్కింటికి రూ.150, ఇంటరీ్మడియట్ ప్రాక్టికల్ పేపర్ ఒక్కింటికి రూ.100 చొప్పున ఏపీ ఆ¯ŒSలై¯ŒS ద్వారా ఫీజులు చెల్లించే జూలై 6నుంచి 20 వరకు చెల్లించవచ్చన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతిలో 34,362 మంది, ఇంటరీ్మడియట్‌లో 31,961 మంది ఉత్తీర్ణులైనట్లు డీఈవో ఎస్.అబ్రహం పేర్కొన్నారు. 6 నుంచి 9 వరకు డీఈఈ సెట్ భానుగుడి(కాకినాడ సిటీ) : డీఈఈ సెట్–2017 ఈ నెల 6 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ ఎంట్ర¯Œ్స టెస్ట్‌గా(సిబెట్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఈవో ఎస్.అబ్రహాం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ’డీఈఈసీఈటీఏపీ.జీవోవీ.ఇ¯ŒS’ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్ల ఈనెల 1నుంచి పొందవచ్చన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సూరంపాలెం, రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యానికేతన్, రాజమండ్రి సీఎస్ఆర్ ఆ¯ŒSలై¯ŒSఅకాడమీ, భట్లపాలెం బీవీసీ ఇ¯ŒSస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ అండ్ సై¯Œ్స, రైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, భూపాలపట్నం, రాజమండ్రి, బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల ఓడలరేవులలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 11582 మంది పరీక్ష రాస్తున్నారన్నారు. ఉదయం రాసే అభ్యర్థులు 9 గంటలకు, మధాహ్నం రాసే అభ్యర్థులు 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల వద్ద హాజరవ్వాలన్నారు. -
56 ఏళ్ల వయస్సులో ఎస్సెస్సీ పరీక్ష
చెన్నారావుపేట(నర్సంపేట): చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ మోడల్ స్కూల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వర్ధన్నపేట మండలం చెన్నారాం గ్రామానికి చెందిన 56 ఏళ్ల అరూరి ఎల్లయ్య పరీక్షలు రాస్తుండగా పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. చెన్నారం హైస్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న ఎల్లయ్యకు రూ.1.600 వేతనం వస్తోంది. పదో తరగతి విద్యార్హత ఉంటే వేతనం పెరుగుతుందని తెలియడంతో పరీక్షలకు హాజరవుతున్నానని ఎల్లయ్య ఈ సందర్భంగా తెలిపారు. -
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలకు మార్చి 8లోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది. ఒక్కో పేపరుకు రూ. 25 ఆలస్య రుసుముతో 9 నుంచి 13వ తేదీ వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొంది. ఫీజును మీసేవా/ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్సెస్సీ పరీక్ష కోసం ఒక్కో పేపరుకు రూ. 100, ఇంటర్‌కు ఒక్కో పేపరుకు రూ. 150 చెల్లించాలని సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరవర్మ వెల్లడించారు. -
టు ఇన్ వన్
ఈ ఫొటోలో కన్పిస్తున్న వారు ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు.. ఏంటీ ఓకే తరగతి గదిలో టెన్త్, ఇంటర్ అని అలోచిస్తున్నారా..! మీ ఆలోచన నిజమే.. వీరు వేరువేరు తరగతులైనా ఒకే గదిలో కూర్చోబెట్టి అందరికీ ఒకే పాఠం చెబుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓపెన్‌స్కూల్ విధానం అమలు తీరుకు నిదర్శనం. మిర్యాలగూడ : బడికి వెళ్లకుండా నేరుగా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకు ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పేరుతో చేపట్టిన కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. కేవలం సెలవు రోజుల్లో మాత్రమే నిర్వహించే ఈ తరగతులు అడపాదడపా జరుగుతున్నాయి. విద్యార్థులు వచ్చినా బోధించడానికి ఉపాధ్యాయులు రావడంలేదు. ఒక వేళ వచ్చినా టెన్త్, ఇంటర్ విద్యార్థులను ఒకే గదిలో ఉంచి పాఠాలు బోధిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓపెన్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతికి 74 కేంద్రాలు, ఇంటర్మీడియట్‌కు 69 కేంద్రాలు ఉన్నాయి. కాగా పదో తరగతిలో 3200 మంది , ఇంటర్లో 2400 మంది అడ్మిషన్లు పొందారు. వీరికి 2016 సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పొందిన వారికి సెలవు రోజుల్లో మాత్రమే విద్యాబోధన చేస్తారు. ఏడాదికి 30 రోజుల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉంది. కాగా విద్యార్థులు కనీసం 24 రోజుల పాటు తరగతులకు హాజరుకావాల్సి ఉంది. ఇందులో పాఠాలు బోధించే రెగ్యులర్ ఉపాధ్యాయుడికి మాత్రం టెన్త్‌కు ఒక తరగతికి 60 రూపాయలు, ఇంటర్‌కు 120 రూపాయలు చెలిస్తున్నారు. కాగా విద్యార్థులు హాజరు కావడంలేదు. అదే సాకుతో ఉపాధ్యాయులు కూడా తరగతులు నిర్వహించడం లేదు. ఒక వేళ విద్యార్థులు వచ్చినా ఒకే తరగతి గదిలో బోధిస్తున్నారు. నేటికీ అందని పాఠ్యపుస్తకాలు ఓపెన్ స్కూల్లో చదివే పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అడ్మిషన్ల సమయంలో పదో తరగతి విద్యార్థులు 800 రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 1100 రూపాయలు చెల్లించారు. కానీ వీరికి ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది విద్యార్థులు గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద ఉన్న పాత పుస్తకాలు తీసుకుని చదువులు కొనసాగిస్తున్నారు. సమీపిస్తున్న పరీక్షలు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా సాధారణ పరీక్షల సమయంలోనే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మార్చి మాసంలోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందక పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయులు రావడం లేదు బకల్వాడ పాఠశాలలో ఓపెన్ టెన్త్ చదువుతున్నాను. నాలుగు వారాలుగా ఉపాధ్యాయులు బోధించడం లేదు. పాఠశాలకు వచ్చి ఖాళీగా వెళ్తున్నాము. ఉపాధ్యాయులు వస్తే ఇంటర్, టెన్త్ వారికి కలిపి ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. టెన్త్ ఇంటర్‌కు అవసరం లేకున్నా కూర్చోవాల్సి వస్తోంది. – చాంద్‌పాష, విద్యార్థి, ఓపెన్ టెన్త్, మిర్యాలగూడ పరీక్షలు సమీపించాయి పరీక్షలు మరో రెండు మాసాల్లో జరగనున్నాయి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులను అడిగితే పుస్తకాలు రాలేదని చెబుతున్నారు. పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల ఏమి చదవాలో అర్థం కావడం లేదు. – మౌనిక, విద్యార్థిని, ఓపెన్ ఇంటర్, మిర్యాలగూడ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నాము. అవి కూడా పూర్తిగా లేవు. పుస్తకాలు లేకుండా పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఉపాధ్యాయులను పాఠ్యపుస్తకాల గురించి అడిగినా రాలేదనే సమాధానం చెబుతున్నారు. – ఇందిరాప్రియదర్శిని, విద్యార్థిని, ఓపెన్ టెన్త్, మిర్యాలగూడ -
ఒపెన్ స్కూల్లో చేరేందుకు మరో అవకాశం
కర్నూలు సిటీ: జిల్లాలోని ఒపెన్ స్కూళ్లలో ఎస్ఎస్సీ, ఇంటర్లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వతేదీలలోపు డీఈఓ లాగిల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 8008403639, 9640331168 నంబర్లను సంప్రదించాలని డీఈఓ తెలిపారు.. -
పదిలో ‘ప్రయివేట్ స్టడీ’ ఆవుట్
– సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల ఫలితం – ఇకపై ప్రయివేట్ విద్యార్థులకు ఓపెన్ స్కూల్ విధానమొక్కటే మార్గం – ఈ నెల 30వరకు ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తుల స్వీకరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్ కంటిన్యూవస్ ఎవాల్యూషన్(సీసీఈ)) ఫలితంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీకి పులిస్టాప్ పడింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఇకపై ఓపెన్ స్కూల్ విధానం ఒక్కటే మార్గం. సీసీఈ ఎఫెక్ట్.. ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో అంతర్గత, బహిర్గత మూల్యాంకనాలున్నాయి. బహిర్గత మూల్యాంకనంలో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. విద్యార్థికి ఏడాది పొడవునా నిర్వహించే ఫార్మెటీవ్, సమ్మేటీవ్ పరీక్షలు, రికార్డులు, ప్రాజెక్టులు, ఇతర బోధనంశాల నుంచి అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ అభ్యర్థులకు ఇంటర్నల్ మార్కులు వేసేందుకు వీలు పడదు. వీరు ఏకంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతుండడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీ విధానాన్ని రద్దు చేసింది. ఓపెన్ స్కూలే దిక్కు.. జిల్లాలో ఏటా 3500 నుంచి 4000 మంది విద్యార్థులు పదో తరగతిని ప్రయివేట్ స్టడీ విధానంలో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఒక్కటే దిక్కుగా మారింది. లేదంటే రెగ్యులర్‌గా చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిని చదివేందుకు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాలు, డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు. అవును ఆ విధానం రద్దయింది: రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ ఈ ఏడాది నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రయివేట్ స్టడీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు తలెత్తిన ఇబ్బందుల కారణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు విద్యార్థులంతా ఇకపై ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్ పూర్తి చేసుకోవాల్సిందే. రెగ్యులర్, ఓపెన్‌స్కూల్ సర్టిఫికెట్‌కు ఎలాంటి తేడా ఉండదు. -
ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు పంపిణీ
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా ఈనెల 28 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు, స్కూల్ నామినల్ రోల్స్ ఆయా స్టడీ సెంటర్లకు పంపిణీ చేసినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఆయా స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లను సంప్రదించి హాల్‌టికెట్లు పొందాలని సూచించారు. -
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పెంపు
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమకు దగ్గరలోని స్టడీసెంటర్ల కో–ఆర్డినేటర్లను సంప్రదించాలన్నారు. -
‘ఓపెన్’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఓపెన్ స్కూల్ విధానంలో అక్టోబర్‌లో నిర్వహించే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసేందుకు గాను దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ నజీమొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్ పరీక్షలు రాసేందుకు గాను ప్రతి సబ్జెక్టుకు రూ.100, ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా రూ.50 చెల్లించాలని, ఇంటర్ విద్యార్థులకు ప్రతిసబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్ పరీక్షకు రూ.100 అదనంగా చెల్లించాలన్నారు. విద్యార్థులు ఈ నెల 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం. 8008403635లో డీఈఓ సూచించారు. -
ఓపెన్‌స్కూల్ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌స్కూల్) ద్వారా 2016–17 సంవత్సరంకు గాను పదవ తరగతి మరియు ఇంటర్ ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 15లోపు ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు అపరాధరుçసుంతో చెల్లించవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ రామసుబ్బన్న నెం: 9492587172 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఓపెన్ స్కూల్ గురించి గ్రామాలయందు ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, వయోజన విద్య మండల కన్వీనర్లు, ప్రేరక్‌లు, ఉపాధిహామీ పథక సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించి పదవ, ఇంటర్ ప్రవేశాల సంఖ్యను పెంచాలని డీఈఓ సూచించారు. -
‘ఓపెన్’ దందా
► పాస్ గ్యారెంటీ పేరుతో డబ్బు వసూలు ► జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లు ► ఉన్నతాధికారి సహకారం ► విద్యార్థులపై ఆర్థిక భారం సాక్షి, కర్నూలు: వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి జాతీయ సార్వత్రిక(ఓపెన్) స్కూలు ఓ వరంలా మారితే.. అభ్యర్థుల పరీక్షలు కొందరికి ఆదాయ మార్గంగా మారాయి. పరీక్ష రాసే అభ్యర్థులకు పాస్ గ్యారెంటీ పేరుతో జిల్లా వ్యాప్తంగా కొందరు అక్రమ వసూళ్లకు తెర తీశారు. ఇప్పటికే రూ. 2 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. జిల్లాలో నేషనల్ ఓపెన్ స్కూల్లో భాగంగా నిర్వహించే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు 2,449 మంది, ఇంటర్‌కు సంబంధించి 3,524 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పది పరీక్షలకు 11, ఇంటర్ పరీక్షలకు 14 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దఫా సార్వత్రిక ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలకు నంద్యాల కీలకంగా మారింది. ఇదే విధంగా కల్లూరు, బనగానపల్లెలో కొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో కొందరి ఆధ్వర్యంలో పరీక్షల మాటున దందా కొనసాగుతోంది. వీరికి జిల్లాలోని మరికొందరి సహకారం అందుతోంది. ఫలితంగా జిల్లా కేంద్రమైన కర్నూలుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్నారు. నేషనల్ ఓపెన్ స్కూలులో భాగంగా నంద్యాల, బనగానపల్లె, ఆలూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలకు చెందిన వారితో ఫీజులు కట్టించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తే భవిష్యత్తులో ఏవైనా అవకాశాలు వస్తాయన్న ఆశతో చాలా మంది వీళ్ల మాటలు నమ్మి భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. పరీక్ష ఫీజు గడువు సమయంలో కొందరు.. అనంతరం మరికొందరు ఒక్కో పేపర్‌కు రూ. 3 వేల వరకు గరిష్టంగా అన్ని పేపర్లకు కలిపి రూ. 15 వేల వరకు చెల్లించినట్లు చెబుతున్నారు. తెలిసిన వారితో కలిస్తే రూ. 10 వేల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇలా సార్వత్రిక పరీక్షల పేరుతో సుమారు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రం నుంచి సహకారం? ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ ప్రోత్సహించడానికి జిల్లా కేంద్రంలో ఉండే ఓ అధికారి సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారంతా క్షేత్రస్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి డబ్బు వసూలు విషయం తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. డబ్బు వసూలు సంగతి తమకు తెలియదని బుకాయించే అధికారులు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, మాస్‌కాపీయింగ్ లేకుండా చూస్తే బాధితులు బయటకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓపెన్ విద్య పాస్ గ్యారెంటీ కోర్సు కాదు. దళారులను, ఇతరులను ఎవరూ నమ్మొద్దు. కష్టపడి చదివి పరీక్ష రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. డబ్బు వసూలు విషయమై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే భాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడా మాల్‌ప్రాక్టిస్ జరగడం లేదు. ప్రతిరోజూ మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతున్న విద్యార్థులను డిబార్ చేస్తూనే ఉన్నాం. స్టడీ సెంటర్ల యజమానులెవరైనా విద్యార్థులతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వాటిని రద్దు చేస్తాం. - రవీంధ్రనాథ్‌రెడ్డి, డీఈఓ -
అంతా ఓపెన్
► సార్వత్రిక పరీక్షల్లో చూచిరాతలు ► నిర్వహణ కమిటీలు పనిచేయడం లేదనే ఆరోపణలు ► మెటీరియల్ వెంట తెచ్చుకుని రాస్తున్న విద్యార్థులు సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు చూచి రాతలుగా తయారయ్యాయి. చదువు మధ్యలో మానేసిన వారికి, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, గృహిణులు కనీస విద్యార్హతను పెంచుకునేందుకు వీలుగా పరీక్షలకు హాజరవుతున్నారు. పబ్లిక్ పరీక్షల్లో పొందే ఉత్తీర్ణత సర్టిఫికెట్తో సమానంగా దీనికి కూడా విలువ కల్పించారు. నాల్గవ తరగతి ఉద్యోగులుగా కొనసాగుతూ పదోన్నతులు పొందాలనుకునేవారు, అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు, ఇతరత్రా ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి ఈ ధ్రువీకరణ పత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో పరీక్షలకు 7,838 మంది అభ్యర్థులు జిల్లాలో ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఓపెన్‌స్కూల్ పరీక్షలు 19 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌కు-11, పదవ తరగతికి- 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌కు 4,120 మంది, పదవ తరగతికి 3,715 మంది హాజరు కావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులను అభ్యర్థులు సానుకూలపరచుకొని వారు కోరిన విధంగా నగదు సమర్పించి ఏ మాత్రం భయపడకుండా మెటీరియల్ వెంట తెచ్చుకొని పరీక్షలకు హజరౌతున్నారు. పాస్ కావాలంటే తప్పదు ఓపెన్‌స్కూల్ నిబంధనల ప్రకారం ఇంటర్‌కు ప్రవేశ ఫీజు రూ. 3వేలు, పరీక్ష ఫీజు రూ. 750 చెల్లించాలి. పదవ తరగతికి ప్రవేశ ఫీజు రూ. 2 వేలు, పరీక్ష ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో అభ్యర్థి నుంచి ఇంటర్‌కు రూ. 12 వేలు, పదవ తరగతికి రూ.10 వేలు చొప్పున ఒక మొత్తంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఇస్తే అన్నీ తామే చూసుకుంటామని, ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావచ్చని ముందే చెప్పి వసూళ్ళకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అందినకాడికి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు కూడా ఏదో విధంగా ఉత్తీర్ణత అయితే చాలన్నట్లు వేలకు వేలు అందజేస్తున్నారు. ఉన్నతాధికారుల తనిఖీలు సత్తెనపల్లిలో ఇంటర్‌కు ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇప్పటికి వరుసగా మూడు రోజుల పాటు 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. మొదట ఓపెన్ స్కూల్ డెరైక్టర్, గుంటూరు ఆర్జేడీ పి.పార్వతి తనిఖీలు చేపట్టి 12 మందిని మాల్ ప్రాక్టీస్ కింద పట్టుకున్నారు. దీంతో విద్యాశాఖాధికారుల్లో భయాందోళన మొదలై మరుసటి రోజు ఆరుగురిని, మంగళవారం ఒకరిని పట్టుకున్నారు. మొదటి రోజు నలుగురు ఇన్విజిలేటర్లు, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ ఆఫీసర్‌పై చర్యలకు సిఫార్స్ చేశారు. మిగిలిన రెండు రోజలు పర్యవేక్షకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది సమాచారం. ఇంత జరిగినా మార్పు లేకపోగా ఇంకా చూచిరాతలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అంతా ‘ఓపెన్’
► ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో చూచిరాతలు ► ఒకరికి బదులుగా మరొకరు రాస్తున్న వైనం కదిరి టౌన్:- ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తెరలేపారు. ఈ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, హిందూపురం రోడ్డులోని మునిసిపల్ ఉన్నతపాఠశాల, సరస్వతీ విద్యామందిరం కేంద్రాల్లో సుమారు 1,500 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటిరోజే చూచిరాతలను తలపించాయి. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. విద్యార్థులు పుస్తకాలను పక్కనే పెట్టుకుని పరీక్ష రాశారు. ఒక బెంచీపై ముగ్గురు కూర్చొని ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటూ రాయడం కన్పించింది. ఒకరికి బదులు మరొకరు కూడా రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధ్యయన కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసి..‘పాస్ గ్యారంటీ’ పేరుతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. వారే సమాధాన పత్రాలు తయారు చేసి పంచుతుండటం గమనార్హం. ఈ తంతును చిత్రీకరించేందుకు కెమెరాలతో వెళ్లిన పాత్రికేయులను కొందరు ఇన్విజిలేటర్లు, అధికారులు అడ్డుకున్నారు. కెమెరాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. మరి కొందరు పరీక్ష కేంద్రంలోకి మీడియాకు అనుమతి లేదని బుకాయించారు. ఇదే సమయంలో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అలర్ట్ అయ్యి..విద్యార్థులను వరుస క్రమంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. పరారైన నకిలీ విద్యార్థులు గుత్తి: పట్టణంలోని మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బుధవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో పది మంది నకిలీ అభ్యర్థులు పరారయ్యారు. పుట్లూరు హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మినారాయణను ఇక్కడ స్క్వాడ్‌గా వేశారు. ఈయన విద్యార్థులను చెక్ చేస్తుండగా సుమారు పది మంది నకిలీలు పరీక్ష కేంద్రం నుంచి పరుగులు తీశారు. జి.సంధ్యరాణి (హాల్ టికెట్ నం:1512169558) డి.విశ్వనాథ్(1512169607), శ్యామ్‌లాల్(1512169626), కట్టుబడి సాబ్(1512169629),చక్రవర్తి(1512169642),సురేష్‌బాబు(1512169683)తో పాటు మరో నలుగురి స్థానాల్లో ఇతరులు పరీక్ష రాయడానికి వచ్చారు. స్క్వాడ్ రావడంతో భయపడి పరీక్ష హాల్లో నుంచి పరారయ్యారు. -
టెన్త్ పరీక్షలకు 5.61 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం చివరిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వీటిని నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 5,61,600 మందికి పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇక గతేడాది 2,56,353 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలకు హాజరుకాగా... ఈసారి ఆ సంఖ్య బాగానే పెరుగుతుందని, మొత్తం విద్యార్థుల్లో సగానికిపైగా ఇంగ్లిష్ మీడియం వారే ఉంటారని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు పాత సిలబస్‌లో ఫెయిలైన 11,600 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ పరీక్షలతోపాటే ఓపెన్ స్కూల్ పరీక్షలను కూడా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే ఒకే సమయంలో నిర్వహణ సాధ్యమా, కాదా అన్నదానిపై పరిశీలన జరుపుతోంది. వీలయితే అవే తేదీల్లో ఉదయం సాధారణ పరీక్షలు, మధ్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక జిల్లాకు రెండు చొప్పున సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఆధార్ అనుసంధానం? పదో తరగతి విద్యార్థుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంపై సాధ్యాసాధ్యాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల్లో 85 శాతం మంది ఆధార్ నంబర్ ఇచ్చారు. తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొనకపోవడంతో మిగతావారు ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం మిగతావారి ఆధార్ నంబర్లను కూడా తీసుకోనున్నారు. పరీక్షలు పూర్తయి ఫలితాల వెల్లడి నాటికి విద్యార్థులందరి ఆధార్ నంబర్లు అందితే... పదో తరగతి మెమోల్లో ఆధార్ నంబర్‌ను ముద్రించాలని విద్యాశాఖ యోచిస్తోంది. తద్వారా విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సులువుగా అందుబాటులోకి తేవచ్చని పేర్కొంటోంది. ఒకసారి పదో తరగతి మెమోలో ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా ఇంటర్, డిగ్రీ, ఇతర కోర్సుల మెమోల్లోనూ ఆధార్ నంబర్‌ను ముద్రించవచ్చని... తద్వారా నకిలీల బెడదను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పొరపాట్ల సవరణకు అవకాశం పరీక్ష ఫీజు చెల్లించి, వివరాలను అందజేసిన విద్యార్థుల మెమోల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఫీజు చెల్లించిన విద్యార్థులందరి సమాచాన్ని ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా పాఠశాలలు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి తమ విద్యార్థుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని విద్యార్థులకు చూపి, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసి డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. ఇందుకు మూడు రోజులు సమయం ఇస్తామని, విద్యార్థుల మెమోల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల వివరాలు.. రెగ్యులర్ 5.13,000 వొకేషనల్ 9,900 ప్రైవేటు 38,700 మొత్తం 5,61,600 ఓపెన్ స్కూల్‌కు వెళ్లే పాత సిలబస్ విద్యార్థులు 11,600 -
ఉందిలే చదివే కాలం..
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్లలో ప్రవేశానికి అవకాశం సెప్టెంబరు 19 వరకు గడువు రాయవరం : అనుకోని అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసిన వారు.. వివాహమైన తర్వాత.. పెద్దవయసు వచ్చేసిన తర్వాత చదువుకోలేకపోయామే అని దిగులు పడేవారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారి చింత తీర్చేందుకే ఓపెన్‌స్కూల్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఓపెన్ యూనివర్శిటీ ద్వారా పది, ఇంటర్లలో చేరేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేనెల 19వరకు అవకాశం ఎటువంటి అపరాధ రుసుం లేకుండా వచ్చేనెల 19 వరకు ఓపెన్స్కూల్లో చేరేందుకు అవకాశం ఉంది. అక్టోబరు 10 వరకు అపరాధ రు సుంతో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. ఎటువంటి విద్యార్హత లేనప్పటికీ 14 ఏళ్ల వయస్సు పైబడిన వారందరూ పదో తరగతిలో ప్రవేశం పొందవచ్చు. 2015 ఆగస్టు 31కి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ఇంటర్లో ప్రవేశానికి 2015 ఆగస్టు 31 నాటికి 15 ఏళ్లు నిండి, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. దీంతో ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాలూ పొందొచ్చు. భాషా మాధ్యమం ఎంపికకు అవకాశం.. ఓపెన్ స్కూల్ ద్వారా 10, ఇంటర్లో చేరే సమయంలో మనం చదివే మీడియం(మాధ్యమం)ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. సెలవు దినాల్లో స్టడీ సెంటర్లలో తరగతులు నిర్వహిస్తారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేస్తారు. విద్యార్థులు వృత్తి విద్యా సబ్జెక్టును గ్రూపు-సీ నుంచి ఆప్షన్‌గా ఎంచుకోవ చ్చు. ఒకేసారి అన్ని సబ్జెక్టుల పరీక్షలు రాయాలనే నిబంధన లేదు. ఒకటి, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులను సౌలభ్యం ప్రకారం రాసుకోవచ్చు. ప్రవేశం పొందాక ఐదేళ్లలోపు ఎప్పుడైనా ఉత్తీర్ణులు కావచ్చు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణులైనప్పుడే సర్టిఫికేట్, మెమో ఇస్తారు. ప్రవేశ రుసుం ఇలా.. పదో తరగతిలో ప్రవేశానికి ప్రతిఒక్కరూ రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ప్రవేశ రుసుం జన రల్ విభాగం పురుషులు రూ.1,300, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, డిజేబుల్డ్ పర్సన్లు అయితే రూ.900 చెల్లించాలి. ఇంటర్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 200 చెల్లించాలి. ప్రవేశ రుసుం జనరల్ విభాగం పురుషులకు రూ.1,400, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, డిజేబుల్డ్ పర్సన్లు రూ.1,100 చెల్లించాలి. ప్రవేశ దరఖాస్తులు జిల్లాలో ఉన్న స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. ఏటేటా ప్రవేశాలు పెరుగుతున్నాయి ఓపెన్ స్కూల్ ప్రవేశాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొత్తగా అడ్మిషన్ పొందగోరే అభ్యర్థులు నిర్ణీత గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - కొమ్మనాపల్లి జనార్దనరావు, ఏపీ ఓపెన్ స్కూల్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, కాకినాడ -
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
విజయనగరం అర్బన్: సార్వత్రిక విద్యాపీఠ్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పదోతరగతిలో 47.54 శాతం, ఇంటర్మీడియెట్‌లో 59.9 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతి విద్యార్థులు 2,516 మంది పరీక్షకు హాజరుకాగా, 1,196 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియెట్‌లో 2,109 మందికి గాను 1,264 మంది ఉత్తీర్ణులయ్యారు. పది పరీక్షా పత్రాల రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకి రూ. 100, రీ వాల్యూయేషన్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇంటర్మీడియెట్ పరీక్షా పత్రాల రీకౌంటింగ్ కోసం రూ.1000, రీవాల్యూయేషన్ కోసం రూ.600 ఫీజును ఈ నెల 11 నుంచి 23వ తేదీ మధ్య ఏపీ ఆన్లైన్లో చెల్లించుకోవచ్చని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. పరీక్ష ఫలితాలను ‘ఏపీఓపెన్‌స్కూల్.ఆర్గ్’ వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. -
నిజంగా పరీక్షే..
- పుస్తకాలివ్వకుండానే ‘ఓపెన్’ ఎగ్జామ్స్ - ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అరకొరగానే విద్యాబోధన - ఇంగ్లిష్ మీడియంలో అసలే రాని పుస్తకాలు - ఉర్దూ మీడియంలో ఒకేఒక్క టైటిల్ - కాపీయింగ్‌కు సహకరిస్తే సస్పెన్షన్: డీఈఓ చంద్రమోహన్ విద్యారణ్యపురి : తెలంగాణ విద్యాశాఖ ద్వారా నడుస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడాది గడిచినా పాఠ్యపుస్తకాలు అందలేదు. కానీ.. షెడ్యూల్ ప్రకారం వార్షిక పరీక్షలను సోమవారం నుంచి 12వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 107 ఓపెన్ స్కూల్ కేంద్రాల్లో ఫీజులు చెల్లించి వేలాది మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి నిబంధనల ప్రకారం పాఠ్య పుస్తకాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ మీడియం టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అసలే పుస్తకాలు రాలేదు. ఇక ఉర్దూ మీడియం విద్యార్థులకు ఒకే ఒక టైటిల్ పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలు కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపోను రాలేదు. టెన్త్‌లో తెలుగు మీడియంలో ఒకే ఒక సోషల్ స్టడీస్ టైటిల్ పుస్తకం వచ్చింది. మిగతా పాఠ్య పుస్తకాలు రాలేదు. ఇంటర్లో మ్యాథ్స్ పుస్తకాలు, ఇతర సైన్స్ పుస్తకాలు రాలేదు. ఆర్ట్స్‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు 50 శాతం వరకు వచ్చాయి. దీంతో అడ్మిషన్లు పొందిన వారిలో ఆర్ట్స్‌లోని వివిధ సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు కొందరికే ఇవ్వగలిగారు. ఇలా ఏడాది గడిచినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోయేసరికి పలుమార్లు సంబంధిత ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. కోఆర్డినేటర్ సంబంధిత రాష్ట్ర అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అయినా పుస్తకాలు మాత్రం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను సకాలంలో ముద్రించలేకపోయిందని సమాచారం. దీంతో జిల్లా అధికారులు కూడా చేతులెత్తేశారు. టెన్త్‌కు 30 కాంట్రాక్ట్ క్లాస్‌లు, ఇంటర్‌కు 30 చొప్పున కాంట్రాక్ట్ క్లాస్‌లు ఉంటాయి. హ్యాండ్‌బుక్స్ ద్వారా టీచర్లు పాఠాలు చెప్పారని అధికారుల చెబుతున్నప్పటికి అవి కూడా మొక్కుబడిగానే జరిగాయనే అరోపణలున్నాయి. ఒకవేళ చెప్పినా మళ్లీ చదువుకునేందుకు విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు లేవు. ఫలితంగా ఎక్కువశాతం మంది విద్యార్థులు కాపీయింగ్‌పై ఆధారపడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొన్ని చోట్ల విద్యార్థులకు కాపీయింగ్ సహకారం అందించేందుకు పరీక్షల విధులను నిర్వహించే ఉపాధ్యాయులు కూడా లేకపోలేదు. పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వని విషయమై సాక్షి ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్రావును ఆదివారం వివరణ కోరగా ఈ పరిస్థితి ఒక్క వరంగల్‌లోనే లేదని, తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వివరణ ఇచ్చారు. -
ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌స్కూల్) పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. పరీక్షలు ప్రారంభమైన శనివారం రోజే ఈ ప రిస్థితి కనిపించింది. జిల్లా కేంద్రం లోని పలు కేంద్రాలను డీఈఓ నాంపల్లి రాజేష్ తనిఖీ చేశారు. షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో పరీక్ష జరుగుతున్న విషయాన్ని పరిశీలించారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు అభ్యర్థులను మాల్‌ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేశారు. తెలుగు పరీక్ష రోజే మాస్ కాపీయింగ్ జరపడమేంటని ప్రశ్నించా రు. మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్నీ తనిఖీ చేస్తానని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న ఇన్విజిలేటర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. పదవ తరగతి పరీక్షలకు 10మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 8మంది హాజరయ్యారు. ఇంటర్లో 937మంది అభ్యర్థులకు గాను 776 మంది హాజరయ్యారు. డబ్బులు తీసుకొని ఇన్విజిలేటర్లే మాస్‌కాపీయింగ్‌కు ప్రొత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘ఓపెన్’గా చదువుకోండిలా
చదువు మధ్యలో ఆపేసినా.. ఇతర పనుల కారణంగా ఇంటి వద్దే ఉండి చదువుకోవాలనుకున్నా.. ఓపెన్ స్కూల్‌తో సాధ్యమే.. పదో తరగతి... ఓపెన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రభుత్వం 1991వ సంవత్సరంలో ప్రారంభించింది. 2008-09 విద్యా సంవత్సరంలో ఈ స్కీము ద్వారా నూతనంగా పదో తరగతి కోర్సును ప్రవేశపెట్టింది. ఇది నియత పాఠశాలలో పదోతరగతికి సమానం. ఇంటర్మీడియట్... ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్‌లో ఉత్తీర్ణులైన వారితోపాటు నియత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసి వివిధ కారణాలతో ఇంటర్మీడియట్ చదువుకోలేని విద్యార్థులకు సార్వత్రిక విధానంలో కూడా ఇంటర్మీడియట్ కోర్సు అందించాలనే ఉద్దేశంతో ఓపెన్ ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించింది. ప్రత్యేకతలు... ►సార్వత్రిక దూర విద్యా విధానం ►స్వేచ్ఛాయుత విద్యా విధానం ►అధ్యయన కేంద్రాల్లో సెలవు రోజుల్లో మాత్రమే తరగతుల నిర్వహణ. ►ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ లేక ఓపెన్ స్కూల్ ప్రత్యేకంగా రూపొందించిన స్వయం అధ్యయన సామగ్రి పంపిణీ. ►అభ్యాసకులు వృత్తి విద్యా సబ్జెక్టును గ్రూప్ (సి) నుంచి ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం. కనీస ప్రవేశ వయస్సు/అర్హత ►టెన్త్‌లో చేరేందుకు కనీస వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ►ఇంటర్మీడియెట్‌కు కనీస వయస్సు 15 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి లేదు. ►టెన్త్ కోర్సుకు కనీస విద్యా నైపుణ్యాలు కలిగి ఉండాలి. ►ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. భాషలు.. ► టెన్త్ తెలుగు ,ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో... ► ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో.. బోధనా విషయాలు... ►టెన్త్/ఇంటర్మీడియట్-ఓపెన్ స్కూల్లో బోధనా విషయాలను మూడు గ్రూపులుగా విభజిస్తారు. ►గ్రూపు(ఎ) భాషలు, గ్రూపు(బి) మెయిన్ సబ్జెక్టులు, గ్రూపు(సి) వృత్తి విద్యా కోర్సులు ► అభ్యాసకులే స్వయంగా బోధన విషయాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. కోర్సుల కాలపరిమితి ఓపెన్ స్కూల్లో నమోదైన విద్యా సంవత్సరం చివరిలో (ఏప్రిల్/ మే)లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్లో అన్ని పరీక్షలు (5 లేక 6 సబ్జెక్టులు) రాయడానికి టెన్త్ ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఇంటర్మీడియట్ తుది పరీక్షల వరకు కనీసం రెండు సంవత్స రాల కాల వ్యవధి ఉండాలి. అభ్యాసకులకు తరగతులు... ఓపెన్ స్టడీ సెంటర్లో సెలవు రోజులతోపాటు రెండో శనివారం, ప్రతి ఆదివారాల్లో అభ్యాసకులకు 30 కాంట్రాక్ట్ తరగతులు, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు అదనంగా 48 రోజులు తరగతులు నిర్వహిస్తారు. టెన్త్ ప్రవేశ రుసుం ►పదో తరగతి: రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100(అందరికీ) ►అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులు రూ.1000. ►ఇతరులు: స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలకు, వికలాంగులకు రూ.600. ఇంటర్‌కు... ►రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 200(అందరికీ) ►అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులకు రూ.1,100. ► ఇతరులు: స్త్రీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలు, వికలాంగులకు రూ.800. దరఖాస్తు ఎక్కడ పొందాలి? ఓపెన్ స్కూల్ అప్లికేషన్ ఫారం, ప్రాస్పెక్టస్‌ను నిర్ణీత తేదీల్లో ప్రతి మండలంలోని స్టడీ సెంటర్లలో, విద్యాధికారి కార్యాలయంలో పొందవచ్చు. ఎక్కడ సమర్పించాలి? మీ సేవ కేంద్రంలో నిర్ణీత ఫీజు చెల్లించాలి. స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ధ్రువీకరించిన అప్లికేషన్, సంబంధిత పత్రాలను మీసేవలో ఆన్లైన్ చేయడం ద్వారా ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు.. మండల, జిల్లా విద్యాధికారుల వద్ద నుంచి పొందవచ్చు. -
టెన్త్ ‘ప్రైవేటు’కు నో
* పదో తరగతి పరీక్షల్లో సర్కారు సంస్కరణలు * ప్రైవేటుగా పరీక్ష రాసే విధానానికి స్వస్తి * గుర్తింపు లేని స్కూళ్ల విద్యార్థులకు నో చాన్స్ * ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం * పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఖరారు * అపరాధ రుసుం లేకుండా వచ్చే నెల 5 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. స్కూలుకు వెళ్లి చదువుకోకపోయినా.. ప్రైవేటుగా ఫీజు కట్టి పరీక్ష రాసే విధానానికి స్వస్తి చెప్పింది. దీంతో గుర్తింపు లేని పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు అభ్యర్థులుగా పదో తరగతి బోర్డు పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే గుర్తింపు లేని పాఠశాలలకు చెక్ పెట్టేందుకు పదో తరగతి పరీక్షల దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విధానంలో షెడ్యూల్‌ను శుక్రవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. దీని ప్రకారం విద్యార్థులు వచ్చే నెల 5లోగా అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. కాగా, ఇప్పటివరకు ఆఫ్‌లైన్(ఐసీఆర్ షీట్) పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించిన అధికారులు.. ఈ ఏడాది ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ పద్ధతిలోనూ దరఖాస్తులను తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందుగా http://bsetelangana.org వెబ్సైట్లో ఎస్ఎస్సీ పరీక్షల లింక్‌ను తెరిచి.. తమ పాఠశాల కోడ్‌ను నమోదు చేయగానే లాగిన్ కాగలుగుతారు. ఆ తర్వాత తమ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో సమర్పించవచ్చు. అయితే, ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం విద్యాశాఖ కట్టుదిట్టంగా వ్యవహరించనుంది. ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు తొలుత స్థానిక ఉప విద్యాశాఖాధికారి(డీఈవో)ని సంప్రదించి తమ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా, స్కూళ్లు నడుస్తున్నాయా లేదా వంటి విషయాలను డీఈవోలు పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటే, సంబంధిత ప్రైవేటు పాఠశాల గుర్తింపు సంఖ్య, పదో తరగతి సెక్షన్ల సంఖ్య, విద్యార్థుల సంఖ్యను వెబ్సైట్లో డీఈవో నమోదు చేస్తారు. తర్వాతే ఆ పాఠశాల పేరుతో పరీక్షల దరఖాస్తులను సమర్పించేందుకు లాగిన్ అకౌంట్ తెరుచుకుంటుంది. దీని కోసం ఎస్ఎస్సీ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ ఆన్లైన్ విధానంపై అవగాహన కల్పించేందుకు వెబ్సైట్లో ‘డెమో’(దరఖాస్తులను నింపే విధానం నమూనా)ను చూసే వీలు కల్పించింది. రెగ్యులర్ వితౌట్ వొకేషనల్, ఫెయిల్డ్ ఇన్ జూన్ 2014, రెగ్యులర్ విత్ వొకేషనల్, ఓఎస్ఎస్సీ రెగ్యులర్, ఓఎస్ఎస్సీ ప్రైవేటు, ఫెయిల్డ్ ప్రియర్ టు 2014 పేర్లతో ఆరు వేర్వేరు కేటగిరీల కింద సంబంధిత విద్యార్థుల దరఖాస్తులను సమర్పించేలా ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లింక్‌ను క్లిక్ చేయగానే ఈ ఆప్షన్లు కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం కానున్నాయి. ఇక ఓపెన్ స్కూల్ పరీక్షలే దిక్కు గుర్తింపు లేని పాఠశాలల విద్యార్థులు, బడికి వెళ్లని పిల్లలకు ప్రైవేట్‌గా బోర్డు పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో ఇకపై అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఓపెన్ స్కూల్ విధానమే దిక్కు కానుంది. గుర్తింపు లేని, ఇతర స్కూళ్లకు అనుబంధంగా మారి తమ విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు ఇకపై అవకాశం ఉండదు. దరఖాస్తుల పరిశీలనలోనే అలాంటి వాటిని గుర్తించి ఏరివేస్తారు. ప్రైవేట్ స్కూళ్ల ప్రవేశాల రిజిస్టర్, హాజరు పట్టికలో విద్యార్థుల పేర్లను పరిశీలించిన తర్వాతే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.మన్మథరెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అయితే, గతంలో ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మాత్రమే ఈసారి మళ్లీ ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. -
ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం
శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్లో పదోతరగతి, ఇంటర్మీడియెట్ పూర్తిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి బుధవారం తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకునేవారు ఈ నెల 31 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా, నవంబర్ 29 వరకు పదోతరగతి వారు రూ.100, ఇంటర్మీడియెట్ వారు రూ.200 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. పదోతరగతి జనరల్ కేటగిరీ వారు రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 1000, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ. 150, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ. 150 చెల్లించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, అన్ని వర్గాల మహిళా అభ్యర్థినులు రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 600, ప్రతి అదనపు సబ్జెక్టు రూ.150, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ.150 చెల్లించాలన్నారు. ఇంటర్మీడియెట్ జనరల్ కేటగిరీ వారు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 1100, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ. 200, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ. 150 చెల్లించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, అన్ని వర్గాల మహిళా అభ్యర్థినులు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 800, ప్రతి అదనపు సబ్జెక్టు రూ. 200, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ.150 చెల్లించాలన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్లలో ఉచితంగా దరఖాస్తులు పొంది, దరఖాస్తులు పూర్తి చేసిన తరువాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత హెచ్ఎంకు సమర్పించి దరఖాస్తుపై సంతకం చేరుుంచుకోవాలన్నారు. అనంతరం మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఫీజు చెల్లించి రశీదు పొందాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అభ్యర్థి ఫొటో, సంతకం స్కాన్‌చేసి అప్లోడ్ చేసిన తరువాత దరఖాస్తు ప్రింట్ కాపీని పొందాలన్నారు. మీ సేవా కేంద్రాలకు సర్వీసు చార్జ్‌గా రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు స్టడీ సెంటర్, డీఈవో కార్యాలయం, ఓపెన్ స్కూల్ విభాగాన్ని సంప్రదించాలన్నారు.