ఓపెన్ స్కూల్ పది, ఇంటర్లలో
ప్రవేశానికి అవకాశం
సెప్టెంబరు 19 వరకు గడువు
రాయవరం : అనుకోని అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసిన వారు.. వివాహమైన తర్వాత.. పెద్దవయసు వచ్చేసిన తర్వాత చదువుకోలేకపోయామే అని దిగులు పడేవారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారి చింత తీర్చేందుకే ఓపెన్‌స్కూల్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఓపెన్ యూనివర్శిటీ ద్వారా పది, ఇంటర్లలో చేరేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వచ్చేనెల 19వరకు అవకాశం
ఎటువంటి అపరాధ రుసుం లేకుండా వచ్చేనెల 19 వరకు ఓపెన్‌స్కూల్లో చేరేందుకు అవకాశం ఉంది. అక్టోబరు 10 వరకు అపరాధ రు సుంతో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. ఎటువంటి విద్యార్హత లేనప్పటికీ 14 ఏళ్ల వయస్సు పైబడిన వారందరూ పదో తరగతిలో ప్రవేశం పొందవచ్చు. 2015 ఆగస్టు 31కి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ఇంటర్‌లో ప్రవేశానికి 2015 ఆగస్టు 31 నాటికి 15 ఏళ్లు నిండి, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్‌కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. దీంతో ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాలూ పొందొచ్చు.
భాషా మాధ్యమం ఎంపికకు అవకాశం..
ఓపెన్ స్కూల్ ద్వారా 10, ఇంటర్‌లో చేరే సమయంలో మనం చదివే మీడియం(మాధ్యమం)ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. సెలవు దినాల్లో స్టడీ సెంటర్లలో తరగతులు నిర్వహిస్తారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేస్తారు. విద్యార్థులు వృత్తి విద్యా సబ్జెక్టును గ్రూపు-సీ నుంచి ఆప్షన్‌గా ఎంచుకోవ చ్చు. ఒకేసారి అన్ని సబ్జెక్టుల పరీక్షలు రాయాలనే నిబంధన లేదు. ఒకటి, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులను సౌలభ్యం ప్రకారం రాసుకోవచ్చు. ప్రవేశం పొందాక ఐదేళ్లలోపు ఎప్పుడైనా ఉత్తీర్ణులు కావచ్చు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణులైనప్పుడే సర్టిఫికేట్, మెమో ఇస్తారు.
ప్రవేశ రుసుం ఇలా..
పదో తరగతిలో ప్రవేశానికి ప్రతిఒక్కరూ రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ప్రవేశ రుసుం జన రల్ విభాగం పురుషులు రూ.1,300, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, డిజేబుల్డ్ పర్సన్లు అయితే రూ.900 చెల్లించాలి.
ఇంటర్‌లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 200 చెల్లించాలి. ప్రవేశ రుసుం జనరల్ విభాగం పురుషులకు రూ.1,400, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, డిజేబుల్డ్ పర్సన్లు రూ.1,100 చెల్లించాలి. ప్రవేశ దరఖాస్తులు జిల్లాలో ఉన్న స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి.
ఏటేటా ప్రవేశాలు
పెరుగుతున్నాయి
ఓపెన్ స్కూల్ ప్రవేశాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొత్తగా అడ్మిషన్ పొందగోరే అభ్యర్థులు నిర్ణీత గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- కొమ్మనాపల్లి జనార్దనరావు,
ఏపీ ఓపెన్ స్కూల్, డిస్ట్రిక్ట్
కో-ఆర్డినేటర్, కాకినాడ
ఉందిలే చదివే కాలం..
Published Mon, Aug 17 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement