తల్లి సుశీలతో ఏడుకొండలు
కందుకూరు రూరల్: ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. తల్లి కష్టపడి చదివించింది. అతను ఇటీవల విడుదలైన ఎస్సై ఫలితాల్లో 398వ ర్యాంక్ సాధించాడు. వివరాలిలా ఉన్నాయి. వలేటివారిపాళెం మండలం పోలినేనివారిపాళెం గ్రామానికి చెందిన నేలకూరి వెంకటేశ్వర్లు, సుశీల కుమారుడు ఏడుకొండలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 8 నుంచి 10 వరకు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీటీసీ సింగరాయకొండ పీఎన్‌సీఏలో పూర్తి చేశాడు.
ఉపాధ్యాయ పోస్ట్ సాధించాలని కోచింగ్ తీసుకొని రెండుసార్లు డీఎస్సీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం దక్కలేదు. అనంతరం ఆర్థిక పరిస్థితులతో చదువు కొనసాగించలేక, ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాధ్యతంతా తల్లి మీదే పడింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకుని కాకినాడలో కోచింగ్‌కు వెళ్లాడు. తల్లి ప్రతి నెలా కోచింగ్, మెస్ ఫీజులకు నగదు పంపేది. ఏడుకొండలు పరిస్థితిని గమనించి గ్రామానికి చెందిన అనుమోలు రవీంద్ర, మాదాల లక్ష్మీనరసింహం ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు.
చదువే ఆయుధం
కష్టాలు ఉన్నాయని కుంగిపోతే చదువుకోలేం. ఇష్టపడి చదవాలి. తల్లి రెక్కల కష్టం నాకు తెలిసొచ్చింది. అందుకే పట్టుదలతో చదివి ఎస్సై పోస్టు సాధించాను. పేదలకు చదువే ఆయుధం.
– నేలకూరి ఏడుకొండలు
Comments
Please login to add a commentAdd a comment