SPSR Nellore District News
-
ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
నెల్లూరు (పొగతోట)/రాపూరు: విధి నిర్వహణలో అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఓ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీలో కార్యదర్శులుగా పనిచేసిన టి.రాజశేఖర్, బి.మస్తానయ్యపై నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నివేదికలు అందజేయడంతో వారిని సస్పెండ్ చేశారు. మహిళను లైంగికంగా వేధించిన.. తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన గిరిజన మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడంతో రాపూరు మండలంలోని రాపూరు సిద్ధవరం, జోరేపల్లి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న చెంచయ్యను సస్పెండ్ చేశారు. సిద్ధవరం పంచాయతీ కోటూరుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నాగలక్ష్మి తన తండ్రి శంకరయ్య మరణ ధ్రువీకరణ పత్రం కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా సర్టిఫికేట్ ఇవ్వకుండా లైంగికంగా వేధింపులకు గురి చేయడం, వీడియో కాల్లో చూడాలని, గూడూరుకు రావాలని వేధిస్తుండడంతో ఈ నెల 4వ తేదీ కలెక్టర్‌కు, ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. విచారించిన అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. -
రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తానని మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సృష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ కొన్ని చానల్స్‌లో వస్తున్న ప్రచారాలపై ఆయన ఘాటుగా స్పందించారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన మీద వార్తలు రాసి టీఆర్పీలు పెంచుకోవాలని కొన్ని చానల్స్ అత్యుత్సా హం ప్రదర్శిస్తున్నాయన్నాయని, తద్వారా చానల్స్ రేటింగ్‌లు పెరుగుతాయంటే ఏమైనా రాసుకోవచ్చన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని, నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. పాత కేసుల్లో తన పేరు ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయాలంటూ కొందరు లోకేశ్ వెంట తిరుగుతున్నారన్నారు. అధికారం చేతిలో పెట్టుకుని, తనపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారన్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భరిస్తా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. పల్నాడుకెళ్లి తాను పోటీ చేస్తే ఎమ్మెల్యేల కంటే తనకే 40 వేలు ఓట్లు అధికంగా వచ్చాయన్నారు. అక్కడి వారు తనపై ఎంతో అభిమానం చూపించారని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను అక్కడికి వెళ్లానంటే కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసమే కార్యకర్తలు ఆహ్వానిస్తున్నా వెళ్లలేకపోతున్నానన్నారు. నన్ను ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపి శునకానందం పొందినా, తాను భయపడేది లేదన్నారు. తనపై అలాంటి ఆలోచనలు చేసే వారి వయస్సు తనకంటే పది పదిహేనేళ్లు పెద్దవారేనన్నారు. తాను జైలుకు వెళ్లినా కూడా ఎంతో ఫిట్‌గానే ఉంటానని, తిరిగి మళ్లీ తాము అధికారంలోకి వచ్చినప్పుడు వారంతా వృద్ధాప్యంలో ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. అక్రమ కేసులు బనాయించాలనుకోనే వారు ఒక్కసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తమకు పార్టీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమని, ఆయన కోసం వంద కాదు వెయ్యి అడుగులైనా వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తెచ్చేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేటింగ్‌లు పెరుగుతాయంటే నామీద ఏమైనా రాసుకోండి త్వరలోనే యాక్టివ్ అవుతా అధికారం అడ్డుపెట్టుకుని శునకానందం మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ -
నాటుబాంబు పేలి ఆవుకు తీవ్రగాయం
మనుబోలు: మండలంలోని మడమనూరు సమీపంలో మేత మేస్తున్న ఆవు పొరపాటుగా నాటు బాంబును కొరకడంతో అది పేలింది. దీంతో ఆవుకు తీవ్ర రక్త గాయమైంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన గ్రామంలో సంచలనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన పాడి రైతు అనింగి ద్వారకయ్య రోజూ మాదిరిగానే పశువులు తోలుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. పశువులు మేత మేస్తుండగా వేటగాళ్లు అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన నాటుబాంబును ఓ ఆవు కొరికింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో బాంబు పేలింది. దూరంగా ఉన్న ద్వారకయ్య బాంబు శబ్ధానికి భయపడి దగ్గరుకు వచ్చి చూడగా, ఆవు దవడ భాగం చీలిపోయి రక్తమోడుతూ కనిపించింది. వెంటనే ఆవును పశువైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స అందించారు. అయితే ఆవు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై బాధిత పాడి రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐ–టీడీపీ పేరుతో నీచంగా పెట్టిన పోస్టులు కనబడవా?. ఇటువంటి వారిపై కేసులు ఎందుకు నమోదు చేయరు’ అంటూ రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిలదీశారు. ఇటువంటి కేసులను దీటుగా ఎదుర్కొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే క్యాడర్‌కు అండగా ఉంటామన్నారు. నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లాలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీలతో, నియోజకవర్గ ఇన్చార్జిలతో మిథున్‌రెడ్డి ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు అనేక రకాలుగా పోస్ట్‌లు పెట్టినా కూడా తాము వారిని వేధించలేదన్నారు. చంద్రబాబు మాటలకు ఎంత విలువ ఉంటుందో ప్రజలందరికీ తెలుసని, ఆయన మాటమీద నిలబడే వ్యక్తి కాదని ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక వారి అవసరం లేదంటూ కూటమి మంత్రులే చెబుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరెన్ని యూటర్నులు తీసుకుంటారో వేచి చూడాలన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో, కౌన్సిల్లో నిలదీసేందుకు వెనుకాడమన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే వీలు లేకుండా పోయిందన్నారు. తమ పార్టీ ఓడిపోయినా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న క్యాడర్ ఎక్కడికీ పోలేదని అండగానే ఉందని స్పష్టం చేశారు. అభద్రతా భావం ఎక్కడా లేదని తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ● మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో పెట్టడమే తమ లక్ష్యమన్నారు. అందుకు జిల్లాలో అన్ని స్థానాల్లో మరో సారి వైఎస్సార్సీపీ గెలిచే విధంగా మిథున్‌రెడ్డితో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ● మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుంటూ అందరం కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. సోషల్ మీడియాకు సంబంధించి అరెస్ట్‌లు చేసి ఈ ప్రభుత్వం శునకానందం పొందుతున్నారన్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వారు అనేక పోస్టులు పెట్టారని, అప్పుడు తాము టీడీపీ మాదిరిగా కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. వాటిని పట్టించుకుని ఉంటే ఇంతకు పదింతలు చర్యలు తీసుకునే అవకాశం ఉండేదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ క్యాడర్ భయపడదని తామంతా వైఎస్ జగన్ వెంటే ఉంటామన్నారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు భయపడమని, చదువుకునే పిల్లలు, పార్టీకి మద్దతుగా ఉంటున్న వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. దమ్ముంటే వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థుల మీద కేసులు పెట్టుకోండి. వాటిని తాము ఎదుర్కొంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీతోపాటు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి ఇన్చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా?
● ట్రాక్‌లను పరిశీలించాలని తెలియదా? ● క్లాస్ తీసుకున్న రైల్వే జీఎం నెల్లూరు(సెంట్రల్): ‘రైళ్లలో వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. వారి భద్రత రైల్వేపై ఆధారపడి ఉంది. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా?, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు?’ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ప్రశ్నించారు. నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ సమీపంలోని క్రాసింగ్ ట్రాక్‌ను తనిఖీ చేసి ఇక్కడ కొలతల్లో కొంత తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై సంబంధిత రైల్వే అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన వారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం కాదని, ముందుగా అంతా బాగుందా? లేదా? అని చూడాలని ఆదేశించారు. దీంతో అధికారులు హుటాహుటిన ట్రాక్‌ను పరిశీలించి కొలతలను సరిచేశారు. భవనాల పరిశీలన ప్రధాన రైల్వేస్టేషన్లో రూ.102 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను జీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగు ప్లాట్‌ఫారాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన అండర్ పాస్, అదే విధంగా ఫ్లై ఓవర్‌తోపాటు ఇతర భవనాలను తనిఖీ చేశారు. త్వరతగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
ఎస్టీఓ కార్యాలయం రికార్డుల తనిఖీ
ఉదయగిరి: ఉదయగిరి ఉపఖజానా కార్యాలయం రికార్డులను ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం వరకు నిశితంగా తనిఖీ చేశారు. ఎస్టీఓ సీహెచ్ మమత మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో పెండింగ్ రికార్డులతో పాటు పాస్ చేసిన బిల్లుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్టీఓను నెల్లూరు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దాదాపు పది మంది ఏసీబీ అధికారులు 14 గంటల పాటు రికార్డులు పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. పలు విషయాలకు సంబంధించి ఎస్టీఓను ఏసీబీ డీఎస్పీ శిరీష పూర్తి స్థాయిలో విచారణ చేసినట్లు తెలుస్తోంది. -
మానవత్వమా.. నీ జాడెక్కడ?
● గుండెపోటుతో బెంగాల్ వాసి మృతి ● పట్టించుకోని మేస్త్రి ● ఆస్పత్రి వద్ద మృతదేహంతో కుటుంబసభ్యుల రోదన విడవలూరు: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఓ వ్యక్తి మృతిచెందాడు. కుటుంబసభ్యుల చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఏం చేయలేక మృతదేహాన్ని ఆస్పత్రి బయట పెట్టి కన్నీరుమున్నీరుగా రోదించారు. మానవత్వానికి మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన బుధవారం విడవలూరులో జరిగింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన కొందరు పొలం పనుల కోసం విడవలూరు గ్రామానికి వచ్చారు. బుధవారం పనిచేస్తున్న సమయంలో ఉమిత్ (30) అనే వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతడిని స్థానికంగా విడవలూరు పీహెచ్‌సీకి ట్రాక్టర్లో తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే గుండెపోటు తో ఉమిత్ మృతి చెందాడని నిర్ధారించారు. పనికి తీసుకెళ్లిన మేస్త్రి ఉమిత్ గురించి పట్టించుకోలేదు. వారి వద్దకు రాలేదు. తల్లి, కుటుంబ సభ్యులకు భాష తెలియకపోవడం, చేతిలో డబ్బుల్లేకపోవడంతో ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని పీహెచ్సీ ఆవరణలో ఉంచి గంటల తరబడి కన్నీరుమున్నీరుగా రోదించారు. ఎవరూ సాయం చేయకపోవడంతో బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొందరు చేతులతో మృతదేహాన్ని మోసుకెళ్లారు. పీహెచ్‌సీకి సమీపంలో ఖననం చేశారు. ఉమిత్కు వివాహం కాలేదు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. -
అంత్యక్రియలకు డబ్బుల్లేక..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేక కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద నిరీక్షిస్తున్న హృదయ విదారక ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన దేవుళ్ల వెంకమ్మకు పక్కాగృహం వచ్చింది. దాని నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆమె తన కుమారుడు పెంచలయ్య (49), కోడలు రాజేశ్వరితో కలిసి ఫ్లై ఓవర్ కింద నివాసం ఉంటోంది. పెంచలయ్య బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడికి గుండెనొప్పి రావడంతో తల్లి, భార్య జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పెంచలయ్య మృతి చెందాడని వైద్యులు చెప్పారు. సొంతిల్లు లేదు. అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో వెంకమ్మ, రాజేశ్వరి ఫ్లై ఓవర్ కింద మృతదేహాన్ని పెట్టుకుని రోదిస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కార్పొరేషన్ అధికారులు స్పందించి అంత్యక్రియలు నిర్వహించాలని వేడుకుంటున్నారు. -
కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టుల్లో నియామకాలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులకు నియామకాలు చేపట్టారు. మొత్తం 10 కేజీబీవీల్లో 14 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో ఏపీసీ ఉషారాణి ఆధ్వర్యంలో 13 పోస్టులను భర్తీ చేశారు. వీటిల్లో 8 అసిస్టెంట్ కుక్స్, ఒక స్వీపర్, రెండు స్కావెంజర్లు, రెండు డే అండ్ నైట్ వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి. డీఈఓ ఆర్.బాలాజీరావు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ మమత పాల్గొన్నారు. ఇన్చార్జి ఎస్టీఓ బాధ్యతల స్వీకరణ ఉదయగిరి: ఉదయగిరి సబ్ ట్రెజరీ ఇన్చార్జి అధికారిగా యడవల్లి దయాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం వింజమూరు ఉపఖనాజా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఏసీబీ దాడుల్లో ఉదయగిరి ఎస్టీఓగా పనిచేస్తున్న సీహెచ్ మమత లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా డీడీ గంగాద్రి ఆదేశాల మేరకు ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వికసిత భారత్ నిర్మాణానికి కృషి చేయండి ●● జేసీ కె.కార్తీక్ నెల్లూరు రూరల్: ఆర్థిక అసమానతలు లేని వికసిత భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమని జేసీ కె.కార్తీక్ అన్నారు. ఈ నెల 14 నుంచి జరుగుతున్న 71వ అఖిలభారత సహకార వారోత్సవాల ముగింపు బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వికేంద్రీకరణ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతో దోహదపడుతుందన్నారు. పాడి పరిశ్రమ, మత్స్య సంబంధ రంగాల్లో బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో పారదర్శకత ఉండదనే అపోహను పారదోలేందుకు ఉద్యోగులు కష్టపడి పని చేయాలన్నారు. తొలుత సహకార వారోత్సవాల విశిష్టతను జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప వివరించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి ఐదు స్థానాల్లో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా కంప్యూటరైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వివిధ సహకార సంఘాల సీఈఓలకు జేసీ జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా సహకార ఆడిట్ అధికారి తిరుపతయ్య, డివిజనల్ సహకార అధికారి సుధాభారతి పాల్గొన్నారు. ధాబాల్లో తనిఖీలు నెల్లూరు(క్రైమ్): ధాబాల్లో మద్యసేవనం, అనధికార మద్యం విక్రయాలు సాగుతున్నాయని ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు ఫిర్యాదులు అందాయి. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని ధాబాల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ధాబాల్లో మద్య సేవనానికి అనుమతించడం, అనధికార విక్రయాలు సాగించడం చట్టరీత్యా నేరమని, ఈ తరహా చర్యలకు పాల్పడితే కేసులు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై 112కు ప్రజలు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అఽధికారులు విజ్ఞప్తి చేశారు. -
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బేఖాతర్
● సీఐ బందోబస్తు మధ్య కర్రకొట్టి తరలింపు ఆత్మకూరు: రెండు వర్గాల మధ్య నెలకొన్న భూ వివాదంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులనే బేఖాతర్ చేస్తూ ఓ వర్గానికి కొమ్ము కాస్తూ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చేజర్ల మండలం మడపల్లిలో సుమారు 262 ఎకరాల పినాకిని షీప్ ఫాం పేరుతో రిజిస్టరైన భూముల విషయమై రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఇటీవల ఒక వర్గం జామాయిల్ కర్రను పోలీస్ బందోబస్తు మధ్య కొట్టించి తరలించారు. ఈ రోజు స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో అసలు హక్కుదారులు తామే అయితే తమ ప్రత్యర్థులకు అండగా ఎలా నిలుస్తారని షీప్ ఫాం అధినేత అజయ్‌ఘోష్ అడ్డుకోవడంతో అతనితో పాటు మద్దతుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం జామాయిల్ కర్ర కొట్టేందుకు కూలీలు రాగా అజయ్‌ఘోష్ అనుచరులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న సంగం సీఐ వేమారెడ్డి పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, వారు కర్రకొట్టి తీసుకెళ్లేందుకు ఎవరూ అడ్డు చెప్పరాదని హెచ్చరించారు. అయితే తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (కోర్టు) నుంచి స్టే ఆర్డర్ తెచ్చామని దాని ప్రకారం కర్ర కొట్టేందుకు వీల్లేదని షీప్ ఫాం అధినేత అజయ్‌ఘోష్, అతని అనుచరులు అడ్డు చెబుతున్నా సీఐ వినిపించుకోలేదు. ఆ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం శ్రీనివాసులురెడ్డికే చెందుతుందని, ఆ మేరకు 1బీలు, అడంగళ్లు వారి పేరుతోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమకు ఇచ్చిన రికార్డులను చూపించారు. వారు తమకు తోటలోని కర్ర కొట్టి తరలించేందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరడంతో తాము వచ్చినట్లు తెలిపారు. అజయ్‌ఘోష్, అతని వర్గీయులు స్టే ఆర్డర్, తమ పేరుతో ఉన్న రికార్డులు చూపిస్తున్నా సీఐ పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశారు. ఆరు లారీల కర్రకొట్టి బద్వేల్ ఫ్యాక్టరీకి తరలించడంలో శ్రీనివాసులురెడ్డి వర్గీయులకు సీఐ సహకరించారు. -
ఏసీబీ వలలో ఉప ఖజానా అధికారిణి
ఉదయగిరి: ఉదయగిరి ఉపఖజానా అధికారిణి సీహెచ్ మమత మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపిన సమాచారం మేరకు.. వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగుల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లోకసాని వెంగయ్యకు సుమారు రూ.9 లక్షల వరకు పాత బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఈ బిల్లులు మంజూరు చేయాలని వెంగయ్య ఉప ఖజానా అధికారిణి సీహెచ్ మమతను వారం రోజుల క్రితం కలిశారు. అందుకు పది శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు అంత డబ్బు ఇవ్వలేక వెనుదిరిగాడు. తర్వాత అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీహరిని సంప్రదించి రూ.40 వేలు లంచం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం ఎస్టీఓకు లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లి ఆమెను కలిసి రూ.40 వేలు తీసుకొచ్చానని చెప్పడంతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు ఇవ్వాలని సూచించింది. దీంతో బాధితుడు కార్యాలయం కింద ఉన్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు రూ.40 వేలు లంచం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారుల బృందం పవన్‌ను అదుపులోకి తీసుకొని పైనున్న ఎస్టీఓ వద్దకు తీసుకెళ్లారు. ఎస్టీఓ సూచన మేరకే ఈ నగదు తీసుకున్నట్లు పవన్ ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకొని నగదుకు రసాయన పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్టీఓను, పవన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఆంజనేయరెడ్డి, విజయకుమార్‌తోపాటు మరో పది మంది సిబ్బంది ఉన్నారు. మమత మూడేళ్ల క్రితం ఉదయగిరి ఉప ఖజానా అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సక్రమంగా విధులకు రావడం లేదని, ప్రతి చిన్న బిల్లుకు కూడా పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐసీడీఎస్‌కు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా లంచాలు డిమాండ్ చేసి సకాలంలో బిల్లులు పాస్ చేయలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.లంచం ఇవ్వడం ఇష్టం లేక పట్టించానునాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.8,92,710 పాత బిల్లులు పాస్ చేయాలని ఎస్టీఓను కోరాను. ఆమె పది శాతం లంచం అడిగారు. అంత ఇవ్వలేనని చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఇదే కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నాను. అయినా లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు వ్యవహరించి లంచం నగదు ఇచ్చాను. -
జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా వెంకటలక్ష్మమ్మ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా పి వెంకటలక్ష్మమ్మను నియమిస్తూ బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె కర్నూలు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్నారు. వెంకటలక్ష్మమ్మ సాధారణ బదిలీపై జిల్లాకు రానున్నారు. ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తా ●● ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి నెల్లూరు రూరల్: జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, సంస్థ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి చెప్పారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న ఆర్టీసీ రీజినల్ కేంద్రం నెల్లూరులో తాను జోనల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు సర్వీసులు లేవని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేలా పాటు పడతానన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, మిడతల రమేష్, గడ్డం విజయ్‌కుమార్, బైరి శ్రీనివాసులు, మొగరాల సురేష్, మండ్ల ఈశ్వరయ్య, అశోక్‌నాయుడు, కరణం భాస్కర్ పాల్గొన్నారు. మరుగుదొడ్ల వినియోగం ఆరోగ్యకరం ●● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు (అర్బన్): మరుగుదొడ్లు వినియోగించడం ఆరోగ్యకరమని, గ్రామీణ ప్రజల గౌరవా న్ని కాపాడుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ‘ప్రపంచ టాయిలెట్’ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా తాగునీరు, పారిశుధ్య మిషన్ జిల్లా స్థాయి సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో 100 శాతం మరుగుదొడ్లు ఉండేలా ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు వినియోగించే మహిళల్లో ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్లు వినియోగంపై డిసెంబర్ 10వ తేదీ వరకు అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్ల వినియోగం, పరిశుభ్రతను గుర్తించి పంచాయతీలకు ఉత్తమ పురస్కారాలు అందజేస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైన లబ్ధిదారుల కు కలెక్టర్ మంజూరు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ బాలాజీరావు, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ మోహన్‌రావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి సత్యవాణి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. మంగళవారం నెల్లూరులోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏసీలు, ఏపీఎంలు, టీసీలకు నిర్వహించిన శిక్షణలో పీడీ మాట్లాడారు. వాటర్ ట్యాంక్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్లాస్టిక్ సంచుల్లో వ్యర్థాలను నింపి దూర ప్రాంతాల్లో వేస్తున్నారన్నారు. వాటిని పశువులు తిని అనారోగ్యం పాలవుతున్నట్లు చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రతి ఒక్కరూ వినియోగించాలన్నారు. డయేరియా, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ నిరుపమ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలున్న వారు నిర్లక్ష్యం చేయకుండా పీహెచ్‌సీల్లోని వైద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చంద్రశేఖరశర్మ, డీఆర్డీఏ కో–ఆర్డినేటర్ శైలజ పాల్గొన్నారు. -
శభాష్.. డాక్టర్ పూర్ణిమ
గుడ్లూరు: ‘వైద్యో నారాయణో హరిః’ అనే ఆర్యోక్తి చైన్నెలో రోడ్డు ప్రమాదం జరిగి గాయపడిన క్షతగాత్రుడికి గుడ్లూరు మండలం సాలిపేటకు చెందిన డాక్టర్ మునగాల పూర్ణిమ ఐశ్వర్య వైద్యం చేసి ప్రాణాన్ని కాపాడడంతో నిరూపితమైంది. పూర్ణిమ ఎంబీబీఎస్, ఎంఎస్ (జనరల్ సర్జన్), ఎంఆర్‌సీఎస్ (లండన్) చదివింది. ఈమెకు ఇటీవల లండన్‌లోని జేమ్స్ కుక్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్లో వైద్యురాలిగా ఉద్యోగం వచ్చింది. డిసెంబర్ 2వ తేదీన జాబ్‌లో చేరాలి. వీసా స్లాట్ కన్ఫర్మేషన్కు మంగళవారం సాయంత్రం 3 గంటలకు చైన్నెలో అపాయింట్మెంట్ ఉంది. ఈ క్రమంలో ఆమె ఉదయం పినాకిని ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళ్లి చైన్నె సెంట్రల్లో దిగి ఆటోలో వెళుతున్నారు. అదే సమయంలో అన్నాసాలై రోడ్డులో రద్దీగా ఉండే ఒక ఫ్లై ఓవర్‌పై స్కూటీపై నుంచి పడిన ఓ 25 ఏళ్ల యువకుడికి తల వెనుక భాగంలో తీవ్రగాయమైంది. రక్తం కారుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని వైద్యశాలకు తరలించేందుకు స్థానికులు ఎదురు చూస్తున్నారు. అక్కడే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ పోలీస్, మిలటరీ ఆఫీసర్లు ఉన్నారు. అదే సమయంలో ఆటోలో వెళుతూ ఘటనను గమనించిన పూర్ణిమ ఐశ్వర్య అపస్మారక స్థితిలో పడి ఉన్న క్షతగాత్రుడికి ప్రాథమిక వైద్యం చేసి చలనంలోకి వచ్చి కళ్లు తెరచేలా చేశారు. అటుగా పోతున్న అంబులెన్స్‌ను ఆపి అతన్ని హాస్పిటల్లో చేర్చాలని పోలీస్ అధికారులకు అప్పగించారు. వైద్యురాలిగా స్పందించిన పూర్ణిమ ఐశ్వర్యను అందరూ అభినందించారు. ఆమె తండ్రి మునగాల గోవర్ధన్ గుడ్లూరు ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపల్ పై వేటు
కొడవలూరు: నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ విష్ణుప్రతాప్ శుక్లాపై వేటు పడింది. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఆ స్థానంలో టి.విష్ణుప్రియను నియమిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కూల్లోని 25 మంది విద్యార్థులు కలుషిత నీరు తాగి అస్వస్ధతకు గురైన విషయం తెలిసిందే. స్కూల్లోని మినరల్ వాటర్ ప్లాంట్ ఆరు నెలలుగా మరమ్మతులకు గురైనా ప్రిన్సిపల్ శుక్లా పట్టించుకోలేదు. బురద, కలుషిత నీటినే వంటలకు, తాగేందుకు వినియోగించడంతో విద్యార్థులు డయేరియా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సైతం ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు. అయితే పిల్లలే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగమేఘాల మీద వైద్య సేవలందించారు. ఏకలవ్య స్కూల్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో స్కూల్‌ను సందర్శించారు. ఆ సమయంలోనూ ప్రిన్సిపల్ శుక్లా ఎమ్మెల్యేను లోనికి రానివ్వకుండా అడ్డుకునేందుకు యత్నించారు. శుక్లా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కలుషిత నీరు, నాణ్యత లేని భోజనం పెడుతూ ఇబ్బంది పెడుతున్నా రని ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఆమె ప్రిన్సిపల్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రిన్సిపల్ శుక్లాను ప్రభుత్వానికి సరెండర్ చేసి, గతంలో ఇక్కడి స్కూల్లో ప్రిన్సిపల్‌గా పనిచేసి విద్యార్థులు, తల్లిదండ్రుల మన్ననలు పొందిన టి.విష్ణుప్రియను తిరిగి నియమించారు. మరమ్మతులకు గురైన మినరల్ వాటర్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే ఆదేశాలతో మంగళవారం ఆగమేఘాల మరమ్మతులు చేపట్టారు. యానాదుల సంఘం ధర్నా ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపల్ విష్ణుప్రతాప్ శుక్లా నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్కూల్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆ సంఘ అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ విద్యార్థుల హక్కులను హరించి నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ శుక్లాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితి మెరుగు ఏకలవ్య స్కూల్లో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని డీఎంహెచ్ఓ పెంచలయ్య తెలిపారు. మంగళవారం ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. కలుషిత నీటి వల్లే విద్యార్థులు డయారియాకు గురవ్వడం జరిగిందన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ బ్రిజిత, ఎంపీడీఓ ఏవీ సుబ్బారావు, వైద్యాధికారి ఎం.రామకృష్ణ, హెచ్ఏ షఫీ ఉద్దీన్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి ప్రిన్సిపల్ విష్ణుప్రతాప్ శుక్లా సరెండర్ కొత్త ప్రిన్సిపల్‌గా విష్ణు ప్రియ నియామకం మినరల్ వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు మెరుగు పడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ముత్తుకూరు: టిప్పర్ ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన ముత్తుకూరులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నారికేళపల్లికి చెందిన గంపాల శీనయ్య, సూరం అనసూయమ్మ (60) ముత్తుకూరులోని నగల దుకాణానికి స్కూటీపై బయలుదేరారు. పీహెచ్సీ సమీపంలో టిప్పర్ వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. శీనయ్య గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై విశ్వనాథరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు ఢీకొని.. వెంకటాచలం: మోటార్‌బైక్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వెంకటాచలంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన దాసరి కోటయ్య (70) బైక్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటయ్య తీవ్ర గాయాలై మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికల్ ఏజెన్సీలో అగ్నిప్రమాదం
● ఊపిరాడక మహిళ మృతి నెల్లూరు(క్రైమ్): విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మెడికల్ ఏజెన్సీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగతో ఊపిరాడక వివాహిత మృతిచెందిన ఘటన నెల్లూరులోని కోరంవారి వీధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ట్రంకు రోడ్డు కోరంవారి వీధికి చెందిన రాజ్యలక్ష్మి (43), రామకృష్ణ దంపతులు తమ ఇంటిి కింది భాగంలో శ్రీదుర్గా పేరిట మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఈనెల 18వ తేదీ సోమవారం రాత్రి రాజ్యలక్ష్మి తన సెల్‌ఫోన్‌ను షాపులో మర్చిపోయి ఇంట్లోకి వెళ్లింది. మంగళవారం ఉదయం ఫోన్‌ను తీసుకునేందుకు ఆమె షాపు లోపలికి వెళ్లింది. అప్పటికే అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మందులు, వస్తువులు కాలిపోయి దట్టమైన పొగ ఆవరించింది. దీంతో ఆమెకు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది. భార్య రాలేదని రామకృష్ణ షాపు వద్దకు వెళ్లాడు. కిందపడిపోయి ఉన్న ఆమెను చూసి చికిత్స నిమిత్తం రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజ్యలక్ష్మి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు రామకృష్ణ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ మద్దిశ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. -
మెగా డీఎస్సీ దగా
● తొలి సంతకం.. మోసం నిరుద్యోగులను ఊరించిన మెగా డీఎస్సీ చివరికి దగా డీఎస్సీగా మారింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఏడాది మే నెల తర్వాత అయినా ఉండే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల ప్రచారం నమ్మి మరోసారి ఉద్యోగార్థులు మోసపోయారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం తొలి సంతకం చేసి మోసం చేశారు. వేలకు వేలు ఖర్చులు పెట్టుకుని.. నెలల తరబడి కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ప్రభుత్వ వాయిదాల నిర్ణయాలు శాపంగా మారాయి. నెల్లూరు (టౌన్): భావి ఉపాధ్యాయుల కలలు కరిగిపోతున్నాయి. డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు, ఆదేశాలు చూస్తుంటే వచ్చే ఏడాదైనా డీఎస్సీ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడాదికిపైగా ఉద్యోగార్థులు వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన రోజునే డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం పెట్టిన సీఎం నోటిఫికేషన్ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులను మభ్య పెట్టేందుకు హడావుడిగా టెట్ పరీక్షను నిర్వహించారు. పరీక్ష ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు తేదీలను ప్రకటించి వాయిదా వేశారు. గత ప్రభుత్వం ఫిబ్రవరిలో డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. దానికి ముందు నుంచే నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. అయితే వచ్చే ఏడాది మే నెల నాటికి ఖాళీలు గుర్తించాలని ప్రభుత్వ పెద్దలు చెప్పడం చూస్తే.. ఆ తర్వాతనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏడాదికి పైగా శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు, మరో ఆరు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. 668 పోస్టులు ఖాళీ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో జిల్లాలో ఖాళీ పోస్టుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలో 2025 మే నెల నాటికి ఏర్పడే ఖాళీలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన 668 పోస్టులు మాత్రమే ఖాళీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజీ–1)–37, లాంగ్వేజీ–17, ఎస్ఏ (ఇంగ్లిష్)–83, ఎస్ఏ (మ్యాథ్స్)–62, ఎస్ఏ (పీఎస్)–75, ఎస్ఏ (బీఎస్)–62, ఎస్ఏ (సోషల్)–102, ఎస్ఏ (పీఈటీ)–105, ఎస్జీటీ– 72 కలిపి మొత్తం 615 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి ఎస్ఏ (లాంగ్వేజీ–1)–12, లాంగ్వేజీ–2– 3, ఎస్ఏ (ఇంగ్లిష్–1, ఎస్ఏ (మ్యాథ్స్)–1, ఎస్ఏ (పీఎస్)–5, ఎస్ఏ (పీఈటీ)–1, ఎస్జీటీ – 30 కలిపి మొత్తం 53 ఖాళీ పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపాల్టీల్లో కలిపి 102 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. వీటికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండింటికి చెడ్డ రేవడిలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఫిబ్రవరి, టీడీపీ ప్రభుత్వంలో అక్టోబర్‌లో టెట్ పరీక్ష నిర్వహించారు. రెండు టెట్ పరీక్షల్లో జిల్లా నుంచి సుమారు 12 వేల నుంచి 14 వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరంతా గత ఏడాది అక్టోబరు నుంచే డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి కోచింగ్‌కు రూ.15 వేలు, వసతి, భోజన సదుపాయాలకు మరో రూ.15 వేలు కలిపి మొత్తం నెలకు రూ.30 వేల వంతున ఖర్చు చేస్తున్నారు. కోచింగ్ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారే. వీరంతా సెలవులు పెట్టడంతో వచ్చే అరకొర జీతాలు కోల్పోయి.. మరో వైపు కోచింగ్ పేరుతో భారీగా ఖర్చు పెట్టుకుంటూ రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. ప్రభుత్వం నిర్ణయం చూస్తుంటే.. మరో ఆరు నెలల తర్వాతనే డీఎస్సీ ఉండే అవకాశం ఉంది. నిర్వహణపై నీలినీడలు డీఎస్సీ పరీక్షకు తొలుత ఈ నెల 6న నోటిఫికేషన్ అంటూ ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా వేసి 10న నిర్వహిస్తామని తెలిపారు. అయినా నోటిఫికేషన్‌ను ప్రకటించకపోవడంతో అటు ప్రతిపక్ష నాయకులు, అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాష్ట్ర పాలకులు మాట మార్చారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను నియమించామని, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించామని చెబుతున్నారు. ఆ నివేదికై నా రెండు నెలల్లో ఇస్తారని గ్యారెంటీ లేదు. గతంలో ఇలాంటి నివేదికలను నెలల పాటు వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక వేళ నివేదిక ఇచ్చినా ఎస్సీ వర్గీకరణపై అడుగు పడుతుందా? అనే అనుమానం తలెత్తుతోంది. ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేసినా ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రాలేదంటూ వాయిదా వేస్తారా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. వర్గీకరణపై పలు వర్గాలు కోర్టుకు పోయే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటిని ముందునుంచే గుర్తించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ అంటూ అందరిని మోసం చేశారని అభ్యర్థులు మండి పడుతున్నారు. వచ్చే ఏడాది మే నాటికి ఖాళీలు గుర్తించాలని ఆదేశాలు జిల్లాలో 668 ఖాళీ పోస్టుల గుర్తింపు వీటిల్లో ఎస్జీటీలు 72 మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే రెండు సార్లు వాయిదా వ్యయ ప్రయాసలు పడి కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. డీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పటికే జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు పంపించాం. డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. – ఆర్.బాలాజీరావు, డీఈఓ అభ్యర్థులకు న్యాయం చేయాలి డీఎస్సీ నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేసి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఇప్పటికే వేలాది మంది కోచింగ్ తీసుకుని డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా న్యాయపరమైన చిక్కులు లేకుండా డీఎస్సీ పరీక్షను నిర్వహించాలని ఆశిస్తున్నాం. – ఎం.హరిబాబు, శ్రీహర్ష కోచింగ్ సెంటర్ నిర్వాహకులు -
ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ
● బాధితులకు అండగా మొబైల్ హంట్, సీఈఐఆర్ ● గతేడాది ఫిబ్రవరి నుంచి వీటి సేవలు ● హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు ● ఏడు విడతల్లో రూ.8 కోట్ల విలువైన ఫోన్ల అప్పగింత 3,040 ఫోన్లను రికవరీ చేశాం సెల్ఫోన్లో నిక్షిప్తమైన సమాచారం, వ్యక్తిగత, కుటుంబ ఫొటోలు, వీడియోలు తదితరాలు అసాంఘిక వ్యక్తుల చేతిలో పడితే ప్రమాదం. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ మొబైల్ హంట్ సేవలను, కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి ద్వారా జిల్లాలో వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న ఏడు విడతల్లో రూ.8.08 లక్షల విలువైన 3,040 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. మొబైల్ హంట్, సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – జి.కృష్ణకాంత్, ఎస్పీ నెల్లూరు(క్రైమ్): ప్రస్తుతం సెల్‌ఫోన్ అత్యంత కీలకమైంది. అనేక పనులు దీనితోనే ముడిపడి ఉన్నాయి. నగదు చెల్లింపులు చేయాలన్నా.. దేనికై నా దరఖాస్తు చేయాలన్నా.. ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఫోన్ చాలా ముఖ్యం. ఇది చోరీకి గురైతే పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే కొన్నిసార్లు ఫిర్యాదు తీసుకునేవారు కాదు. దీంతో ఫోన్, అందులో ఉన్న సమాచారం పోయిందని బాధపడాల్సి వచ్చేది. అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫోన్లను వెతికి పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం గతేడాది ఫిబ్రవరిలో మొబైల్ హంట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికి ఏడు విడతల్లో రూ.8 కోట్ల విలువ చేసే మూడువేల సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ విధానం ద్వారా రూ.8 లక్షలు విలువైన 40 సెల్ఫోన్లను రివకరీ చేసి బాధితులకు ఇచ్చారు. మొబైల్ హంట్‌లో ఇలా.. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు ముందుగా మొబైల్ హంట్ సెల్‌ఫోన్ నంబర్ 91543 05600కు వాట్సప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపాలి. వెంటనే జిల్లా పోలీస్ పేరున మీ వివరాల కోసం లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. గూగుల్ ఫారం ఓపెన్ చేసి ఫిర్యాదుదారుడి పేరు, చిరునామా, చోరీ/పోయిన తేదీ, సమయం, పోయిన స్థలం, ఫోన్ మోడల్, కంపెనీ, రంగు, ఐఎంఈఐ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రం, పోయిన ఫోన్లో ఉపయోగించిన నంబర్, సమాచారం కోసం మరో ఫోన్ నంబర్, పోలీసుస్టేషన్ పరిధి తదితర వివరాలను నమోదు చేసిన వెంటనే ఫిర్యాదు నమోదవుతుంది. సైబర్ క్రైమ్ టెక్నికల్ విభాగం వారి వద్దనున్న సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్‌ను ట్రేస్ చేస్తారు. సీఈఐఆర్‌లో నమోదు ఇలా.. కేంద్రం టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (సీఈఐఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు తొలుత స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అనంతరం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఐఆర్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఐఎంఈఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, మొబైల్ కొనుగోలుకు సంబంధించిన బిల్లును అప్లోడ్ చేయాలి. ఎక్కడ పోయింది? తదితర వివరాలు నమోదు చేయాలి. అంతా పూర్తయిన తర్వాత ఐడీ నంబర్ వస్తుంది. ఏ కంపెనీదైనా సీఈఐఆర్ విధానం దానిని పనిచేయకుండా చేస్తుంది. దీంతోపాటు కేసు ఛేదనలో పోలీసులకు ఉపయోగపడుతుంది. సెల్‌ఫోన్ దొరికిన తర్వాత బాధితుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి అన్‌బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్‌పై క్లిక్ చేసి ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్‌బ్లాక్ అవుతుంది.మొబైల్ హంట్ నంబర్ : 91543 05600 700 మొబైల్ ఫోన్ల అందజేత వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న రూ.1.50 కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్లను పోలీసు అధికారులు రికవరీ చేశారు. మంగళవారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జి.కృష్ణకాంత్ చేతుల మీదుగా ఫోన్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు డి.శ్రీనివాసరెడ్డి, ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారం.. అహంకారం
కందుకూరు: అధికార పార్టీ నాయకుల అవినీతికి అంతు లేకుండా పోయింది. తాజాగా వారి కన్ను రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. తమకు అనుకూలం కాని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. మండలంలోని పలుకూరుకు చెందిన సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. మంగళవారం అతడికి చెందిన సర్వే నంబర్ 688, 695లో ఉన్న 4.50 ఎకరాల వెంచర్లో మున్సిపల్ అధికారులు హద్దు రాళ్లు తొలగించారు. ఈ వెంచర్ వేసి దాదాపు మూడు సంవత్సరాలవుతోంది. ల్యాండ్ కన్వర్షన్ కట్టడంతోపాటు, 30 అడుగుల రోడ్లు, విద్యుత్ లైన్ల వంటి అన్ని సదుపాయాలు కల్పించి అప్రూవల్ తీసుకున్నారు. అన్నీ అనుమతులున్నా ఎందుకు రాళ్లు తొలగిస్తున్నారని మున్సిపల్ అధికారులను సురేష్ ప్రశ్నించాడు. తాము ఏమీ చేయలేమని.. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దగ్గర నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేను కలవాలని.. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు కలవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి సురేష్ వేసిన వెంచర్ మహదేపురం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ నుంచి ల్యాండ్ కన్వర్షన్ వరకు అన్ని ఆ పంచాయతీ పరిధిలోనే ఉన్నాయి. ఆ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా దాని పరిధిలోనే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఎకరాకు రూ.10 లక్షలు ఇవ్వాలంట పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే మనుషులకు ఎకరాకు రూ.10 లక్షలు ఇవ్వాలని బేరం పెడుతున్నారు. నేను నగదు ఇవ్వలేదని మూడు సంవత్సరాల క్రితం వేసిన వెంచర్లో రాళ్లు తొలగిస్తున్నారు. – సురేష్, బాధితుడు వైఎస్సార్సీపీ మద్దతుదారులే లక్ష్యం దివివారిపాళెం రోడ్డులోని లేఅవుట్పై దాడి ఎమ్మెల్యేకు డబ్బులివ్వాలంటూ బెదిరింపు -
పెండింగ్‌లో ఉపకార వేతనాల దరఖాస్తులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల దరఖాస్తులను జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఈనెల 30లోపు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 38,295 మంది విద్యార్థులుండగా వారిలో 2,513 మంది డిస్కంటిన్యూ చేశారని మిగిలిన వారిలో 24,182 మంది దరఖాస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అలాగే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కోసం 13,549 మంది ఉండగా వారిలో కేవలం 2,337 మంది మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారన్నారు. ప్రిన్సిపల్ లాగిన్‌లో ఇంకా 12,413 మంది ఆధార్ అథెంటిఫికేషన్, 3,907 మందికి ప్రిన్సిపల్ ఓటీఏ, 12,413 మందికి అటెండెన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. -
కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): భార్యతో గొడవల కారణంగా మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని శ్రామిక నగర్లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శ్రామిక గనర్కు చెందిన దిలీప్ కుమార్ (25), స్వప్నకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్య పొగతోటలోని ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. భర్త వివిధ పనులు చేసేవాడు. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. అనంతరం దంపతుల నడుమ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్వప్న డ్యూటీకి వెళ్లింది. దిలీప్ కుమార్ తన ఇంట్లోనే సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తూ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఇంటికి వచ్చిన స్వప్న భర్త మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేసింది. బాధిత తల్లి చంద్రమ్మ వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిశోర్‌కుమార్ తెలిపారు. -
కలిగిరిలో..
కలిగిరి: కలిగిరిలో బీసీ బాలికల వసతి గృహం, సిద్ధనకొండూరులో ఎస్సీ బాలుర వసతి గృహాలు ఉన్నాయి. కలిగిరిలోని బీసీ బాలికల వసతి గృహంలో 12 మంది విద్యార్థినులున్నారు. అద్దె భవనంలో దీనిని నిర్వహిస్తున్నారు. వింజమూరు బాలికల వసతి గృహం వార్డెన్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. రోజు మార్చి రోజు వచ్చి చూసి వెళుతుంటారు. సిద్ధనకొండూరు బాలుర వసతి గృహంలో 43 మంది విద్యార్ధులు ఉన్నారు. ఇది శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. విద్యార్థులు ఉండే గదులకు తలుపులు, కిటికీలు సక్రమంగా లేవు. స్లాబులు పెచ్చులూడి పడుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా గదులన్నీ ఉరుస్తున్నాయి. ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. బాత్రూములు కొన్నింటికి తలుపులు లేవు. ప్రహరీ లేకపోవడంలో తరచూ పొలాల్లో నుంచి విషసర్పాలు, కిటకాలు వసతి గృహంలోకి వస్తున్నాయి. సిద్ధనకొండూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో తలుపులు లేని మరుగుదొడ్లు -
కాలువ పూడికతీతలో రూ.30 కోట్లకు స్కెచ్
నెల్లూరు(బారకాసు): కనుపూరు కాలువ పూడికతీత పనుల ద్వారా రూ.30 కోట్లు దోచుకునేందుకు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్కెచ్ వేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందంటూ చెబుతున్న సోమిరెడ్డి.. నిస్సిగ్గుగా రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేందుకు తెరతీశారన్నారు. టెండర్లకు కాలపరిమితి ఉన్నప్పటికీ తూతూ మంత్రంగా పనులు ముగించి బిల్లులు సిద్ధం చేస్తున్నారన్నారు. కనుపూరు కాలువ పూడికతీత కోసం రూ.6 కోట్లకు సంబంధించి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిస్తే నాసిరకంగా నామమాత్రంగా పనులు పూర్తి చేశారన్నారు. దీనిని బట్టి చూస్తే ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో ఇట్టే అర్ధమవుతుందన్నారు. కనుపూరు కాలువ పూడిక తీత పనులను సక్రమంగా జరగడం లేదని వాటిని తాము పరిశీలిస్తామని రైతులు చెబితే వారిని వెళ్లనివ్వలేదన్నారు. అంతేకాకుండా తాను పరిశీలించేందుకు వెళ్తానంటే హౌస్ అరెస్ట్ చేయించారన్నారు. నవంబర్ 11వ తేదీ వరకు గడువు ఉంటే సోమిరెడ్డి 7వ తేదీనే కనుపూరు కాలువ వద్దకు వెళ్లి నీటిని విడుదల చేయించి 30 పొక్లెయిన్లు, 15 డోజర్లతో కాలువలో పూడిక తీత పనులు చేపట్టినట్లుగా పత్రికలకు స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. సర్వేపల్లిలో రూ.6 కోట్ల అవినీతితో పాటు మరో రూ.25 కోట్లకు ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. అంటే నీరు పారేటప్పుడే ఆ పనులు చేసినట్లుగా దొంగ బిల్లులు చేసుకోవడానికి మొత్తంగా రూ.30 కోట్లకు స్కెచ్ వేశారని వివరించారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే సరైన సమాధానం చెప్పలేదన్నారు. విచారణలో ప్రజాధనం దుర్వినియోగమైందని రుజువైతే సంబంధిత అధికారులు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సర్వేపల్లిలో అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న మాట వాస్తవమని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే పనైతే సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామన్నారు. ఇటీవల తనను భయపెట్టి రూ.3లక్షలు డిమాండ్ చేశారని ఓ దళితుడు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో చెప్పారని, ఈ విషయంలో సోమిరెడ్డిపై పోలీసులు కేసుపెట్టి విచారించాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కాజేసేందుకు యత్నం తూతూ మంత్రంగా పనులు ముగించి బిల్లులు సిద్ధం చేస్తున్నారు విలేకరులతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
కందుకూరులో..
కందుకూరు: పట్టణంలోని సంతోష్‌నగర్‌లో ఉన్న బీసీ బాలుర వసతి గృహం సొంత భవనంలోనే ఉన్నా.. శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపడుతూ చిన్నపాటి వర్షం కురిస్తే శ్లాబు కారుతోంది. మరుగుదొడ్లు కూడా తలుపు లేకుండా దుర్వాసన వెదజల్లుతోంది. బీసీ బాలుర కళాశాల వసతి గృహం భవనం మొత్తం ఉప్పురిసి సిమెంట్ రాలిపోతోంది. మరుగుదొడ్లు నిరుపయోగంగా మారడంతో అందులోకి ఎవరినీ పోనివ్వకుండా గోతాలు కట్టారు. లింగసముద్రం మండలంలో ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు బహిర్భూమికి పొలాల్లోకి వెళ్తున్నారు.