టెన్త్ పరీక్షలకు 5.61 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం చివరిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వీటిని నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 5,61,600 మందికి పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇక గతేడాది 2,56,353 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలకు హాజరుకాగా... ఈసారి ఆ సంఖ్య బాగానే పెరుగుతుందని, మొత్తం విద్యార్థుల్లో సగానికిపైగా ఇంగ్లిష్ మీడియం వారే ఉంటారని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు పాత సిలబస్‌లో ఫెయిలైన 11,600 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది.
సాధారణ పరీక్షలతోపాటే ఓపెన్ స్కూల్ పరీక్షలను కూడా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే ఒకే సమయంలో నిర్వహణ సాధ్యమా, కాదా అన్నదానిపై పరిశీలన జరుపుతోంది. వీలయితే అవే తేదీల్లో ఉదయం సాధారణ పరీక్షలు, మధ్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక జిల్లాకు రెండు చొప్పున సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.
ఆధార్ అనుసంధానం?
పదో తరగతి విద్యార్థుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంపై సాధ్యాసాధ్యాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల్లో 85 శాతం మంది ఆధార్ నంబర్ ఇచ్చారు. తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొనకపోవడంతో మిగతావారు ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం మిగతావారి ఆధార్ నంబర్‌లను కూడా తీసుకోనున్నారు. పరీక్షలు పూర్తయి ఫలితాల వెల్లడి నాటికి విద్యార్థులందరి ఆధార్ నంబర్‌లు అందితే... పదో తరగతి మెమోల్లో ఆధార్ నంబర్‌ను ముద్రించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
తద్వారా విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సులువుగా అందుబాటులోకి తేవచ్చని పేర్కొంటోంది. ఒకసారి పదో తరగతి మెమోలో ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా ఇంటర్, డిగ్రీ, ఇతర కోర్సుల మెమోల్లోనూ ఆధార్ నంబర్‌ను ముద్రించవచ్చని... తద్వారా నకిలీల బెడదను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
పొరపాట్ల సవరణకు అవకాశం
పరీక్ష ఫీజు చెల్లించి, వివరాలను అందజేసిన విద్యార్థుల మెమోల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఫీజు చెల్లించిన విద్యార్థులందరి సమాచాన్ని ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆయా పాఠశాలలు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి తమ విద్యార్థుల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిని విద్యార్థులకు చూపి, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసి డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. ఇందుకు మూడు రోజులు సమయం ఇస్తామని, విద్యార్థుల మెమోల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపడతామని తెలిపారు.
విద్యార్థుల వివరాలు..
రెగ్యులర్ 5.13,000
వొకేషనల్ 9,900
ప్రైవేటు 38,700
మొత్తం 5,61,600
ఓపెన్ స్కూల్‌కు వెళ్లే పాత సిలబస్ విద్యార్థులు 11,600