Tenth examination
-
TS: ‘పది’లో ఆరు పేపర్లే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లే ఉండనున్నాయి. ఇప్పటివరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఒక్కో సబ్జెక్టుకు ఒక్క పేపర్ మాత్రమే నిర్వహించనున్నారు. దీనితోపాటు పరీక్ష సమయాన్ని అరగంట పాటు పెంచారు. బహుళ ఐచ్చిక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో.. గత ఏడాది లాక్డౌన్ సమయం నుంచే పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు బోధన సరిగా జరగలేదు. దీంతో పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని గత ఏడాదే నిర్ణయించారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేశారు. ఈ ఏడాది మొదట్లోనూ అదే తరహా పరిస్థితి ఎదురైంది. కానీ కాస్త ఆలస్యంగానైనా ఆన్లైన్ క్లాసులు జరిగాయి. సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు కూడా మొదలయ్యాయి. అయినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందని పరిస్థితి ఉందని ‘స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (టీఎస్‌సీఈఆర్‌టీ)’పేర్కొంది. పదో తరగతికి ఆరు పేపర్లే పెట్టాలని సిఫారసు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. 2021–22 ఏడాదికి సంబంధించి టెన్త్ పరీక్షలను కుదిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ఇదే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాటైంది. అప్పట్నుంచీ 11 పేపర్ల విధానమే కొనసాగుతోంది. వాటిని ఆరుకు కుదించడం బోర్డు చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి తొలినాళ్లలో 9, 10 తరగతులు రెండింటి నుంచీ ప్రశ్నలిచ్చేవారు. దీనివల్ల విద్యార్థి సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, నైపుణ్యం తెలుసుకునే అవకాశం ఉండేదని చెప్పేవారు. తర్వాత ఆ విధానాన్ని సరళీకరించి పదో తరగతి పాఠాలకే పరిమితం చేశారు. కొన్నేళ్ల కింద మరోసారి పరీక్షల విధానాన్ని మార్చారు. పబ్లిక్ పరీక్షల ద్వారా విద్యార్థికి ఇచ్చే మార్కులను ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 80కి పరిమితం చేశారు. మిగతా 20 మార్కులను ఇంటర్నల్స్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది. రెండు పేపర్లలో గతంలో ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారో.. అదే తరహాలో ఇప్పుడూ ప్రశ్నల శాతాన్ని ఖరారు చేసేఅవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సిలబస్ గందరగోళం! కోవిడ్ నేపథ్యంలో మొత్తం సిలబస్ బోధించడం కష్టమని భావించిన విద్యాశాఖ దాన్ని 30 శాతం మేర తగ్గించింది. కానీ దీనిపై ఇంతవరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఇంకా బోధించని పాఠాలను నిలిపివేస్తారా? ఎవైనా నిర్థిష్టమైన పాఠాలను ఎంపిక చేసి, కోత పెడతారా? అన్నది తేల్చాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో కొంత సిలబస్ పూర్తికాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసుకుని, రివిజన్ మొదలుపెట్టాయి. సిలబస్ కోత విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఇబ్బందులు ఉంటాయి’’అని యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. సిలబస్‌పై విద్యాశాఖ వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, నాణ్యతకు పదునుపెట్టే సబ్జెక్టుల్లో కోత పెట్టొద్దని మరో ఉపాధ్యాయ సంఘం నేత నర్సిరెడ్డి సూచించారు. -
షాక్ నుంచి తేరుకుని సత్తా చాటింది!
పట్నా: దృఢచిత్తం ముందు దురదృష్టం తలవంచింది. ఎదురీతతో విధిరాతను మార్చుకుంది. సంకల్పంతో ముందడుగు వేసింది. తనకు అవమానాన్ని భరించి దిగమింకుని చదువులో సత్తా చాటింది. బిహార్ లోని నలంద ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక పదవ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాసైంది. 67 శాతం ఉత్తీర్ణతతో 335 మార్కులు సాధించింది. మ్యాథ్స్ లో 76 శాతం మార్కులు తెచ్చుకుంది. పరీక్షలకు కొద్ది రోజుల ముందే ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ షాక్ నుంచి కోలుకుని ఆమె పరీక్షల్లో ప్రథమశ్రేణిలో పాసవడం పట్ల బాలిక కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఆమె బాగా చదువుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంటి దగ్గరే ట్యూషన్ పెట్టించి చదువు చెప్పించినందుకు జిల్లా అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. -
టెన్త్ పరీక్షలకు 5.61 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం చివరిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వీటిని నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 5,61,600 మందికి పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇక గతేడాది 2,56,353 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలకు హాజరుకాగా... ఈసారి ఆ సంఖ్య బాగానే పెరుగుతుందని, మొత్తం విద్యార్థుల్లో సగానికిపైగా ఇంగ్లిష్ మీడియం వారే ఉంటారని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు పాత సిలబస్‌లో ఫెయిలైన 11,600 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ పరీక్షలతోపాటే ఓపెన్ స్కూల్ పరీక్షలను కూడా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే ఒకే సమయంలో నిర్వహణ సాధ్యమా, కాదా అన్నదానిపై పరిశీలన జరుపుతోంది. వీలయితే అవే తేదీల్లో ఉదయం సాధారణ పరీక్షలు, మధ్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక జిల్లాకు రెండు చొప్పున సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఆధార్ అనుసంధానం? పదో తరగతి విద్యార్థుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంపై సాధ్యాసాధ్యాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల్లో 85 శాతం మంది ఆధార్ నంబర్ ఇచ్చారు. తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొనకపోవడంతో మిగతావారు ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం మిగతావారి ఆధార్ నంబర్లను కూడా తీసుకోనున్నారు. పరీక్షలు పూర్తయి ఫలితాల వెల్లడి నాటికి విద్యార్థులందరి ఆధార్ నంబర్లు అందితే... పదో తరగతి మెమోల్లో ఆధార్ నంబర్‌ను ముద్రించాలని విద్యాశాఖ యోచిస్తోంది. తద్వారా విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సులువుగా అందుబాటులోకి తేవచ్చని పేర్కొంటోంది. ఒకసారి పదో తరగతి మెమోలో ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా ఇంటర్, డిగ్రీ, ఇతర కోర్సుల మెమోల్లోనూ ఆధార్ నంబర్‌ను ముద్రించవచ్చని... తద్వారా నకిలీల బెడదను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పొరపాట్ల సవరణకు అవకాశం పరీక్ష ఫీజు చెల్లించి, వివరాలను అందజేసిన విద్యార్థుల మెమోల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఫీజు చెల్లించిన విద్యార్థులందరి సమాచాన్ని ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా పాఠశాలలు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి తమ విద్యార్థుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని విద్యార్థులకు చూపి, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసి డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. ఇందుకు మూడు రోజులు సమయం ఇస్తామని, విద్యార్థుల మెమోల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల వివరాలు.. రెగ్యులర్ 5.13,000 వొకేషనల్ 9,900 ప్రైవేటు 38,700 మొత్తం 5,61,600 ఓపెన్ స్కూల్‌కు వెళ్లే పాత సిలబస్ విద్యార్థులు 11,600 -
విద్యా సమాచారం
సాక్షి’, పనాచె ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు డిసెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు శిక్షణ రిజిస్ట్రేషన్లు ప్రారంభం హైదరాబాద్: ఇంగ్లిష్‌లో ఓ ప్రవాహంలా మాట్లాడగలిగేలా అత్యుత్తమ స్థాయిలో నేర్చుకొనేందుకు పనాచె సంస్థ సహకారంతో ‘సాక్షి’ మీడియా గ్రూప్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును నిర్వహిస్తోంది. నెల రోజుల ఈ కోర్సులో ఇంగ్లిష్తో పరిచయం, సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్ (ధారాళత-అనుసంధానం), ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం-అనవసర భయాలను అధిగమించడం, వాయిస్-యాక్సెంట్ (స్వరం-ఉచ్ఛారణ), ముఖ్యమైన గ్రామర్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. విద్యా సంబంధ విషయాల్లో సాక్షి ‘ఎడ్జ్’ భాగస్వామి అయిన పనాచె.. వ్యక్తిగతమైన మరియు వృత్తి సంబంధిత అభివృద్ధికి బాటలు వేసే శిక్షణను అందించడంలో అగ్రగామి సంస్థగా పేరొందింది. పనాచెలోని విలక్షణమైన శిక్షణా పద్ధతులు నేర్చుకొనేందుకు అనువైన, ప్రేరణ కలిగించే వాతావరణాన్ని ఏర్పరచి, శిక్షణ కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ పూర్తి పరిజ్ఞానాన్ని అందించి, విజయం వైపు నడిపిస్తాయి. ఆ సంస్థ సహకారంతో నిర్వహించే ఈ స్పొకెన్ ఇంగ్లిష్ కోర్సు డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమవుతుంది. పరిమిత సంఖ్యలో నిర్వహించే బ్యాచ్‌లకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. మరిన్ని వివరాలు మరియు దరఖాస్తులకు సంబంధించిన సమాచారం కోసం 9666950078 నంబర్లో, sakshiedge@gmail.comకు ఈమెయిల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చు. టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో వచ్చే నెల 1 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో వచ్చే నెల 8 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 15 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ. 125, ఫెయిల్ అయిన వారు 3, అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చొప్పున చెల్లించాలని తెలిపారు. వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలి. ఏఎంవీఐ ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఈనెల 8న నిర్వహించిన అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) రాత పరీక్ష కీని తమ వెబ్సైట్లో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణియన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ కీపై అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 16 వరకు ఆన్లైన్లో అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. వెంకటేశ్వర వేదిక్ వర్సిటీలో ఆగమ కోర్సు సాక్షి, హైదరాబాద్: తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో కొత్త ఆగమ కోర్సును ప్రవేశపెట్టారు. వర్సిటీలో ఇప్పుడున్న కోర్సులకు అదనంగా శ్రీ వైదిక ఆగమ ప్రతిష్ట కలపమ్ (సమర్త ఆగమ) కోర్సును ప్రవేశపెడుతున్నట్లు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల్లో ఎల్పీసెట్ నోటిఫికేషన్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భాషా పండిత శిక్షణ కోర్సుల్లో (ఎల్పీసెట్) ప్రవేశాల కోసం ఎల్పీసెట్ నోటిఫికేషన్ మరో 4 రోజుల్లో జారీ కానుంది. దీనికి అవసరమైన చర్యలపై విద్యాశాఖ దృష్టి సారించింది. అలాగే పండిత శిక్షణ కాలేజీలకు అనుబంధ గుర్తింపు విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) గుర్తింపుగల ఉపాధ్యాయ విద్య శిక్షణ కోర్సుల్లో భాషా పండిత కోర్సులు లేవు. కానీ మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో తెలుగు, ఉర్దూ, హిందీ పండిత శిక్షణ కాలేజీలు ఉన్నాయి. ఎన్సీటీఈ గుర్తింపు లేకుండా ఈ కోర్సులను ఎలా కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యా పరిశోధ న శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఎన్‌సీటీఈకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎన్సీటీఈ.. కమిటీ వేసి చర్యలు చేపడతామంది. మరోవైపు పండిత శిక్షణ కోర్సులు చేసిన వారికి గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులతో సంబంధం లేదని, వీరికి టెట్ పేపరు ఎలా ఉండాలన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎన్సీటీఈని కోరుతూ ఎస్సీఈఆర్టీ లేఖ రాసింది. పాఠ్య పుస్తకాల కొరత తీర్చాలి: ఎస్టీయూటీఎస్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో వెంటనే పాఠ్య పుస్తకాల కొరతను తీర్చాలని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజిరెడ్డి, భుజంగరావు శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం సగమైనా పుస్తకాల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యా శాఖ చర్యలు చేపట్టాలని కోరారు. ‘జనరల్’ అర్హత మార్కులను తగ్గించండి డీఎస్సీ అభ్యర్థుల సంఘం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించాలని రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం కోరింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో సంఘ ప్రతినిధులు మధుసూదన్, రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం టెట్‌లో జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం 5 శాతం మార్కులకు సడలింపు ఇచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న టెట్‌లో జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులను 5 శాతం మేర తగ్గించాలని కోరారు. మరుగుదొడ్ల నిర్వహణకు నిధులివ్వండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించారని, అయితే వాటి నిర్వహణకు సరిపడా నిధులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, రవి పేర్కొన్నారు. సర్వ శిక్షా అభియాన్ నుంచి 60కి పైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు రూ. 1,000, వంద మందికి పైగా విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 1,500 ఇచ్చారని, 150కి పైగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలకు రూ. 2,500 ఇచ్చారని, అయితే అన్ని స్కూళ్లకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎస్ఎస్ఏ 10,500 స్కూళ్లకు ఈ నిధులను ఇచ్చిందని, ఇవి ఎటూ సరిపోవని పేర్కొన్నారు. ఇంకా 18 వేల పాఠశాలలకు నిధులివ్వలేదని, దీంతో మరుగుదొడ్ల నిర్వహణ లేక నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పండిందని పేర్కొన్నారు. 70 ఏళ్లకే అదనపు పెన్షన్ ఇవ్వాలి: ఏఐటీవో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 70 ఏళ్ల వయసు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వాలని ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) చైర్మన్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ పి.వెంకట్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. 70 ఏళ్లు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వాలని పదో పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ సిఫారసు చేసినా, 75 ఏళ్ల వయసు నిండిన వారికే ప్రభుత్వం అదన పు పెన్షన్ ఇస్తోందని పేర్కొన్నారు. టీచర్లకు 16 రోజుల ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని సీఎస్‌ను కోరిన పీఆర్టీయూ-టీఎస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న టీచర్లు, లెక్చరర్లు అదనంగా 16 రోజులు పని చేశారని పీఆర్టీయూ-టీఎస్ పేర్కొంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీచర్లు, లెక్చరర్లు అదనంగా పని చేసిన 16 రోజుల కాలానికి ఆర్జిత సెలవులు (ఈఎల్స్) మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మకు పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి విజ్ఞఫ్తి చేశారు. సచివాలయంలో శుక్రవారం సీఎస్‌ను కలిసి, టీచర్లు 32 రోజుల పాటు సమ్మె చేయడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లిందని, అందుకోసం 16 రోజులు అదనంగా పనిచేశారని చెప్పారు. ఇదే విషయంపై పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి మరో ప్రకటనలో డిమాండ్ చేశారు. -
పరీక్షలు రాసేదెలా!!
‘పది’ విద్యార్థులలో ఉత్కంఠ - తల్లిదండ్రులలో ఆందోళన - మారిన సిలబస్‌తో ఇబ్బందులు - సరిగా సాగని విద్యాబోధన - గ్రామీణ ప్రాంతాలలో అవస్థలు బాన్సువాడ : బట్టీ విధానానికి స్వస్తి పలికి సామర్థ్యాల ఆధారంగా, విషయ అవగాహనతో విద్యార్థులు పరీక్షలు రాయాలని విద్యా శాఖ ప్రవేశపెట్టిన నూతన సిలబస్‌కు అనుగుణంగా విద్యాబోధన సాగడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం సిలబస్‌ను మార్చినా, బోధనలో మాత్రం అధికారులు శ్రద్ధ చూపలేదు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పదోతరగతి విద్యార్థులలో ఆం దోళన పెరుగుతోంది. నూతన సిలబస్‌తో కుస్తీ పడుతూనే మొదటిసారిగా కొత్త పరీక్షా విధానానికి వారు సిద్ధమవుతున్నారు. మార్చిన సిల బస్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినా, ప్రరుువేటు ఉపాధ్యాయులకు శిక్షణ కరువైంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ తది తర పట్టణాలలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విధానం అమలవుతున్నా, మారుమూల గ్రా మాలలో మాత్రం కొత్త సిలబస్‌కు అనుగుణం గా బోధన జరలేదని విద్యార్థులే పేర్కొంటున్నా రు. కొత్త విధానంలో బోధించడంతోపాటు వి ద్యార్థులకు ప్రాజెక్టు పనులు అప్పగించడంలో పలువురు ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, తమ బిడ్డల భవి ష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. గందరగోళంగా ప్రాజెక్ట్ వర్క్ మారిన సిలబస్ ప్రకారం పాఠ్యాంశం పూర్తి కాగానే విద్యార్థికి ప్రాజె క్టు వర్క్ ఇవ్వాలి. దీనిని పూర్తి చేయడానికి విద్యార్థులు ప్రముఖుల జీవిత చరిత్ర, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, ఇతర ముఖ్యాంశాల గురించి తెలుసుకోవాల్సి ఉం టుంది. ఇందుకోసం వారు నెట్ సెంటర్లపై ఆధారపడి ప్రాజె క్ట్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో నెట్ సౌకర్యం లేని విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రాజెక్టు వర్క్‌కు ఈ సారి 20 మార్కులను కేటాయించనుండడంతో ఉపాధ్యాయులు విద్యార్థి తెలివి అంచనాను బట్టి మార్కులు వేయాల్సి వస్తోం ది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం తెలుగు, ఇం గ్లిష్ మీడియం విద్యార్థులందరికీ ఒకే పరీక్షా వి ధానం అమలు చేస్తోంది. దీనితో ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు సొంతంగా ఆలోచించి రాయడం కష్టంగా మారింది. సాంఘిక శాస్త్రంలో సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన విద్యార్థులకు మాత్రమే గరిష్ట మార్కులు వచ్చే అవకాశం ఉం ది. గణితంలో కొన్ని అభ్యాసాలు, లెక్కలు చేస్తే పరీక్షల్లో గతంలో అవే తరచుగా వచ్చేవి. ప్ర స్తుత విధానంలో మాదిరి లెక్కలను సాధిం చడం ద్వారా మార్కులు పొందాల్సి ఉంది. పూర్తి కాని సిలబస్ జిల్లాలోని ఇంకా కొన్ని పాఠశాలలలో కొత్త సిల బస్ పూర్తి కాలేదు. మారిన సిలబస్ ప్రకారం ఫిబ్రవరి చివరినాటికి కూడా పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటోంది. పలు పాఠశాలలలో జనవరి సిలబస్ కూడా పూర్తి కాలేదు.ఈ పరిస్థితులలో కొత్త సిలబస్ ప్రకారం విద్యార్థులు పరీక్షలు రాయడం కష్టమేనని విద్యార్థుల తల్లిదండ్రులు చెబు తున్నారు. గతంలో డిసెంబర్ చివరి వరకు సిలబస్ పూర్తి చేసి, ఆ తర్వాత ప్రతి పాఠ్యాంశాలలో ఉన్న కీలక అంశాలు, ప్రశ్నలు, ఖాళీలు పూరించడం తదితర అంశాల పై పునశ్చరణ నిర్వహించేవారు. వెనుకబడినవారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసేవారు. డి-గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారిని కనీస ఉత్తీర్ణతా స్థాయికి తీసుకువచ్చే వారు. ఇదంతా డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి చేసేవారు. కానీ, ప్రస్తుతం అలా జరగడం లేదు. సిలబస్ పూర్తయి, మాదిరి పరీక్షల నిర్వహణ కూడా జరగని పా ఠశాలలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల కోసం కొన్ని చిట్కాలు - పిల్లలకు వీలైంత ప్రేమగా చెప్పి చది వించి ఫలితాలు సాధించాలి. తెల్లవారుజామున నిద్ర లేపాలి. - ఈ నెల రోజులు ఇంట్లో టీవీకి కేబుల్ కనెక్షన్ తీసేయిస్తే మంచిది. - పిల్లలు ఏ సబ్జెక్ట్ కష్టమని భావిస్తారో తొ లుత దాన్నే చదివించాలి. మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. - బుల్లెట్ పాయింట్స్, సైడ్ హెడింగ్స్‌తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. - నెల రోజులకు సంబంధించి టైంటేబుల్ ను తయారు చేసుకొని, తేదీలవారీగా సబ్జెకులకు సమయం కేటాయించాలి. - మ్యాథ్స్ చేయడం వచ్చునని, నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చే యాలి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో థియరీలను ప్రాక్టీస్ చేయించాలి. - రాత్రి పది గంటల వరకు చదివిస్తే సరిపోతుంది. అంతకు మించి మెలకువగా ఉంచితే పిల్లలు నిద్రలేమితో బాధపడుతారు. సమస్యలు వస్తాయి. - రోజుకు కనీసం ఆరు గంటలు గాఢమైన నిద్ర పోయేలా చూడాలి. - ఉదయం స్నానం చేశాక ఓ 20 నిమిషాలు మెడిటేషన్ లేదా యోగా చేయిస్తే ప్రయోజనం ఉంటుంది.