సాక్షి’, పనాచె ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు
డిసెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు శిక్షణ
రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హైదరాబాద్: ఇంగ్లిష్‌లో ఓ ప్రవాహంలా మాట్లాడగలిగేలా అత్యుత్తమ స్థాయిలో నేర్చుకొనేందుకు పనాచె సంస్థ సహకారంతో ‘సాక్షి’ మీడియా గ్రూప్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును నిర్వహిస్తోంది. నెల రోజుల ఈ కోర్సులో ఇంగ్లిష్‌తో పరిచయం, సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్ (ధారాళత-అనుసంధానం), ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం-అనవసర భయాలను అధిగమించడం, వాయిస్-యాక్సెంట్ (స్వరం-ఉచ్ఛారణ), ముఖ్యమైన గ్రామర్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. విద్యా సంబంధ విషయాల్లో సాక్షి ‘ఎడ్జ్’ భాగస్వామి అయిన పనాచె.. వ్యక్తిగతమైన మరియు వృత్తి సంబంధిత అభివృద్ధికి బాటలు వేసే శిక్షణను అందించడంలో అగ్రగామి సంస్థగా పేరొందింది.
పనాచెలోని విలక్షణమైన శిక్షణా పద్ధతులు నేర్చుకొనేందుకు అనువైన, ప్రేరణ కలిగించే వాతావరణాన్ని ఏర్పరచి, శిక్షణ కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ పూర్తి పరిజ్ఞానాన్ని అందించి, విజయం వైపు నడిపిస్తాయి. ఆ సంస్థ సహకారంతో నిర్వహించే ఈ స్పొకెన్ ఇంగ్లిష్ కోర్సు డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమవుతుంది. పరిమిత సంఖ్యలో నిర్వహించే బ్యాచ్‌లకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. మరిన్ని వివరాలు మరియు దరఖాస్తులకు సంబంధించిన సమాచారం కోసం 9666950078 నంబర్‌లో, sakshiedge@gmail.comకు ఈమెయిల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చు.
టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో వచ్చే నెల 1 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో వచ్చే నెల 8 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 15 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ. 125, ఫెయిల్ అయిన వారు 3, అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చొప్పున చెల్లించాలని తెలిపారు. వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలి.
ఏఎంవీఐ ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 8న నిర్వహించిన అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) రాత పరీక్ష కీని తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణియన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ కీపై అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు.
వెంకటేశ్వర వేదిక్ వర్సిటీలో ఆగమ కోర్సు
సాక్షి, హైదరాబాద్: తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో కొత్త ఆగమ కోర్సును ప్రవేశపెట్టారు. వర్సిటీలో ఇప్పుడున్న కోర్సులకు అదనంగా శ్రీ వైదిక ఆగమ ప్రతిష్ట కలపమ్ (సమర్త ఆగమ) కోర్సును ప్రవేశపెడుతున్నట్లు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
4 రోజుల్లో ఎల్‌పీసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భాషా పండిత శిక్షణ కోర్సుల్లో (ఎల్‌పీసెట్) ప్రవేశాల కోసం ఎల్‌పీసెట్ నోటిఫికేషన్ మరో 4 రోజుల్లో జారీ కానుంది. దీనికి అవసరమైన చర్యలపై విద్యాశాఖ దృష్టి సారించింది. అలాగే పండిత శిక్షణ కాలేజీలకు అనుబంధ గుర్తింపు విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) గుర్తింపుగల ఉపాధ్యాయ విద్య శిక్షణ కోర్సుల్లో భాషా పండిత కోర్సులు లేవు. కానీ మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో తెలుగు, ఉర్దూ, హిందీ పండిత శిక్షణ కాలేజీలు ఉన్నాయి. ఎన్‌సీటీఈ గుర్తింపు లేకుండా ఈ కోర్సులను ఎలా కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యా పరిశోధ న శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఎన్‌సీటీఈకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎన్‌సీటీఈ.. కమిటీ వేసి చర్యలు చేపడతామంది. మరోవైపు పండిత శిక్షణ కోర్సులు చేసిన వారికి గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులతో సంబంధం లేదని, వీరికి టెట్ పేపరు ఎలా ఉండాలన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎన్‌సీటీఈని కోరుతూ ఎస్‌సీఈఆర్‌టీ లేఖ రాసింది.
పాఠ్య పుస్తకాల కొరత తీర్చాలి: ఎస్టీయూటీఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో వెంటనే పాఠ్య పుస్తకాల కొరతను తీర్చాలని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజిరెడ్డి, భుజంగరావు శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం సగమైనా పుస్తకాల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యా శాఖ చర్యలు చేపట్టాలని కోరారు.
‘జనరల్’ అర్హత మార్కులను తగ్గించండి డీఎస్సీ అభ్యర్థుల సంఘం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించాలని రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం కోరింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో సంఘ ప్రతినిధులు మధుసూదన్, రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం టెట్‌లో జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం 5 శాతం మార్కులకు సడలింపు ఇచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న టెట్‌లో జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులను 5 శాతం మేర తగ్గించాలని కోరారు.
మరుగుదొడ్ల నిర్వహణకు నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించారని, అయితే వాటి నిర్వహణకు సరిపడా నిధులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, రవి పేర్కొన్నారు. సర్వ శిక్షా అభియాన్ నుంచి 60కి పైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు రూ. 1,000, వంద మందికి పైగా విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 1,500 ఇచ్చారని, 150కి పైగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలకు రూ. 2,500 ఇచ్చారని, అయితే అన్ని స్కూళ్లకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌ఏ 10,500 స్కూళ్లకు ఈ నిధులను ఇచ్చిందని, ఇవి ఎటూ సరిపోవని పేర్కొన్నారు. ఇంకా 18 వేల పాఠశాలలకు నిధులివ్వలేదని, దీంతో మరుగుదొడ్ల నిర్వహణ లేక నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పండిందని పేర్కొన్నారు.
70 ఏళ్లకే అదనపు పెన్షన్ ఇవ్వాలి: ఏఐటీవో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 70 ఏళ్ల వయసు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వాలని ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) చైర్మన్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ పి.వెంకట్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. 70 ఏళ్లు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వాలని పదో పీఆర్‌సీ చైర్మన్ అగర్వాల్ సిఫారసు చేసినా, 75 ఏళ్ల వయసు నిండిన వారికే ప్రభుత్వం అదన పు పెన్షన్ ఇస్తోందని పేర్కొన్నారు.
టీచర్లకు 16 రోజుల ఆర్జిత సెలవులు
మంజూరు చేయాలని సీఎస్‌ను కోరిన పీఆర్‌టీయూ-టీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న టీచర్లు, లెక్చరర్లు అదనంగా 16 రోజులు పని చేశారని పీఆర్‌టీయూ-టీఎస్ పేర్కొంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీచర్లు, లెక్చరర్లు అదనంగా పని చేసిన 16 రోజుల కాలానికి ఆర్జిత సెలవులు (ఈఎల్స్) మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మకు పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి విజ్ఞఫ్తి చేశారు.
సచివాలయంలో శుక్రవారం సీఎస్‌ను కలిసి, టీచర్లు 32 రోజుల పాటు సమ్మె చేయడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లిందని, అందుకోసం 16 రోజులు అదనంగా పనిచేశారని చెప్పారు. ఇదే విషయంపై పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి మరో ప్రకటనలో డిమాండ్ చేశారు.
విద్యా సమాచారం
Published Sat, Nov 14 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM
Advertisement
Advertisement