![Minister Sridhar Babu comments on UGC Regulations](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/sridhar%20babu.jpg.webp?itok=vW5VYRlG)
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రాలకు సంబంధం లేకుండా వీసీల నియామకం సరికాదు
గ్రేడింగ్‌పై నిబంధనలు కూడా అభ్యంతరకరం
యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌పై బెంగళూరులో ఆరు రాష్ట్రాల విద్యా మంత్రుల భేటీ
రాష్ట్రం తరఫున హాజరైన శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు గండికొడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్స్–2025 ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఆరు (బీజేపీయేతర) రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశానికి.. తెలంగాణ విద్యాశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి బదులుగా శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల విద్యామంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ‘ఇప్పటి వరకు విశ్వవిద్యాయాల ఉపకులపతుల నియామకాన్ని చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా ఉన్న సెర్చ్ కమిటీ చేపట్టేది. అసలు రాష్ట్రాలకు సంబంధమే లేకుండా వీసీల నియామకం చేపట్టేలా డ్రాఫ్ట్ రూపొందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉన్నత విద్యకు తెలంగాణ ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
అవసరమైన చోట కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది’.. అని మంత్రి వెల్లడించారు. అయితే దీనిని ప్రోత్సహించాల్సిందిపోయి ఆటంకాలు కల్పించడమేమిటని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఉప కులపతులుగా పరిశ్రమల అధిపతులను, బ్యూరోక్రాట్లను, బయటి వ్యక్తులను నియమించే అవకాశాన్ని కల్పించాలన్న డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌లోని ప్రతిపాదనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యా సంస్థల్లో మూడు వేల మంది విద్యార్థులుంటేనే గ్రేడింగ్‌లు ఇస్తామని, ఉన్నత గ్రేడ్లు వస్తేనే కేంద్ర ప్రోత్సాహకాలు అందుతాయన్న ప్రతిపాదనను కూడా శ్రీధర్ బాబు వ్యతిరేకించారు. ఇది ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు కలిగించే చర్య అని ఆరోపించారు.
పేదలను ఉన్నత విద్యకు దూరం చేసే చర్య
బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలనడం పేదలను ఉన్నత విద్యకు దూరం చేసే ఆలోచనగా మంత్రి శ్రీధర్‌బాబు అభివర్ణించారు. ‘దేశ సరాసరి గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో కేవలం 28 శాతం మాత్రమే ఉంది. అంటే ఉన్నత విద్య చదవాల్సిన వయసులో ఉన్న యువతలో నూటికి 28 మంది మాత్రమే కళాశాలల్లో చేరుతున్నారు.
విద్యార్థుల సంఖ్యను పెంచాలంటే ఎంట్రన్స్ పెట్టాలనే ఆలోచనలు ఆటంకాలు సృష్టిస్తాయి. ఇప్పటిదాకా వైస్ చాన్స్‌లర్ల పదవీకాలం 3 సంవత్సరాలు ఉండగా యూజీసీ రెగ్యులేషన్స్‌లో 5 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన సరికాదు’.. అని పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్, కరెస్పాండెన్స్ కోర్సులకు అనుమతులివ్వబోమని చెప్పడం విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు.
డ్రాఫ్ట్ యూజీసీ నిబంధనలు తెలంగాణకు ఆమోదయోగ్యంగా లేవని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే అధికారికంగా లేఖ రాయడాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యకు సంబంధించిన ఏ ప్రతిపాదనలైనా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిబంధనలు రూపొందించాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.
యూజీసీ రెగ్యులేషన్స్ –2025లోని 15 అంశాలను వ్యతిరేకిస్తూ, అమలును నిలిపివేయాలని రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశం ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరుతూ తీర్మానం చేసింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment