UGC Regulations
-
కేరళ: విజయన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ
తిరువనంతపురం: కేరళలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైకోర్టులో పినరయి విజయన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీకి వీసీని నియమించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ఆదేశాలను సోమవారం పక్కపెట్టింది ఉన్నత న్యాయస్థానం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రెగ్యులేషన్స్ 2018 ను ఉల్లంఘించేదిగా ఆ నియామకం ఉందన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ మేరకు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కొత్త వీసీని నియమించాలని ఛాన్స్లర్ ఆఫ్ వర్సిటీస్ అయిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను ఆదేశించింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఈమధ్యే డాక్టర్ రిజీని నియమించింది కేరళ ప్రభుత్వం. అయితే ఆ నియామకం చెల్లుబాటు కాదని, యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘించేదిగా ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక.. ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నియామకాన్ని సైతం సుప్రీంకోర్టు తన దేశాలతో రద్దు చేసింది. యూజీసీ రూల్స్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ మూడు పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదనగా పంపాల్సి ఉంటుంది. అయితే కలాం యూనివర్సిటీకి మాత్రం ఒకే ఒక్క పేరు ప్రతిపాదించింది కేరళ ప్రభుత్వం. ఆపై తొమ్మిది యూనివర్సిటీల వీసీలను తప్పుకోవాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆదేశించడం.. కేరళ ప్రభుత్వంతో జరుగుతున్న జగడం తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో, గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేరళ రాష్ట్ర కేబినెట్ ఓటు వేసింది. -
జర్నలిజంలో సర్టిఫికెట్ కోర్సు
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జర్నలిస్టులకు ఉపయుక్తంగా మూడు నెలల కాల పరిమితితో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. యూజీసీ నిబంధనలను అనుసరించి ప్రెస్ అకాడమీ సొంతంగా నాలుగు సబ్జెక్టులతో కోర్సు రూపొందించినట్టు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఉత్తీర్ణులై కోర్సులో చేరే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీతో కేవలం రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువత కూడా పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందొచ్చన్నారు. అనంతరం కోర్సు బ్రోచర్‌ను విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం(నేటి) నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్‌అకాడమీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచినట్టు శ్రీనాథ్ వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ రిజిస్ట్రార్ విజయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించి, డిసెంబర్ మొదటి వారంలో తుది పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 91541 04393 నంబర్‌ను, pressacademycontact@gmail.comను సంప్రదించాలని సూచించారు. -
యూజీసీ నిబంధనల నుంచి మినహాయించాలి
సాక్షి, అమరావతి: ఢిల్లీలో టీటీడీ సహకారంతో ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్ క్యాంపస్‌కు యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఆ వివరాలివీ.. అఫిలియేషన్‌కు ఇబ్బందులు.. ‘ఢిల్లీలోని తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందించాలన్న లక్ష్యంతో ప్రముఖ నాయకురాలు దుర్గాభాయ్ దేశ్‌ముఖ్, కె.ఎల్.రావు, సి.అన్నారావుల చొరవతో 1961లో ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్ క్యాంపస్‌గా కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ యాక్ట్ 1922 ప్రకారం టీటీడీ చైర్మన్ నేతృత్వంలోని గవర్నింగ్ కౌన్సిల్ ఈ కాలేజీ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. కౌన్సిల్‌లోని 15 మంది సభ్యుల్లో పది మందిని టీటీడీ నామినేట్ చేస్తుంది. కాలేజీ అభివృద్ధి, ఇతర అంశాలను బోర్డు పర్యవేక్షిస్తోంది. టీటీడీ ఇందుకు నిధులను అందిస్తోంది. దేశ రాజధానిలో తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న ఈ కాలేజీ 2020లో ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్‌లో 14వ స్ధానంలో నిలిచింది. అయితే 2009 ఏప్రిల్ 16న యూజీసీ రాసిన లేఖలో యూనివర్సిటీలు ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిధిలో మాత్రమే ఆఫ్‌లైన్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. రాష్ట్రాల యూనివర్శిటీ యాక్ట్ ప్రకారం వాటి భౌగోళిక పరిధుల్లో మాత్రమే క్యాంపస్ లను ఏర్పాటు చేయాలని, ఆ పరిధికి వెలుపల ఏర్పాటు చేయడానికి వీలులేదని 2013 జూన్ 27న యూజీసీ నోటీసు జారీ చేసింది. ఈ కారణంగా ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీకి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందేందుకు యూజీసీ నిబంధనలు ఆటంకంగా మారాయి. ఫలితంగా ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల పలు ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణలోనే ఉండిపోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూజీసీ నిబంధనలతో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థులు ఢిల్లీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్ క్యాంపస్‌కు ఆంధ్రా యూనివర్సిటీ అఫ్లీయేషన్ కల్పించేలా యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలి’ అని లేఖలో సీఎం కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలో రాష్ట్రం ఉన్నత విద్యలో పురోగతి సాధిస్తోందని, జాతీయ విద్యా విధానంలో నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు. -
నియామకాలు నిలిపివేయండి
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నియామకాలను నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. నియామకాల్లో యూనివర్సిటీ వారీగా ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్లు కాకుండా, విభాగాల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు అమలు చేయాలని గత ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నియామకాల్లో కోర్టు నిబంధనలు పాటించాలని యూజీసీ అప్పట్లో యూనివర్సిటీలకు లేఖలు రాసింది. అయితే తాజాగా ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేవరకు నియామకాలను ఏ దశలో ఉన్నా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు గురువారం యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఊర్మిళదేవి అన్ని రాష్ట్రాల, సెంట్రల్ యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. -
ర్యాగింగ్ చేస్తే ఇక ఫిర్యాదు ఈజీ
న్యూఢిల్లీ : ర్యాగింగ్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో రాగింగ్‌ను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2009లో నిబంధనలు రూపొందించింది. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతీ సంవత్సరం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ర్యాగింగ్‌ను నిరోధించడం కోసం యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నంబర్‌ను రూపొందించామన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు చేయాలనుకుంటే 1800-180-5522 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఇందుకోసం 12 భాషల్లో కాల్ సెంటర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదులు స్వీకరించడానికి యాంటీ ర్యాగింగ్ వెబ్సైట్ www.antiragging.in ను కూడా రూపొందించామన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు, స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. గతేడాది మే 17న యాంటీ ర్యాగింగ్ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించామని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. యాంటీ ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన గురించి, బాధితుల మానసిక వేదనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేశామన్నారు. యూజీసీ వెబ్‌పేజీ http://www.ugc.ac.in/page/Videos-Regarding-Ragging.aspx లో చూడవచ్చని, సీబీఎస్సీ కూడా ర్యాగింగ్ వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించి www.cbseaff.nic.inలోని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్న హెచ్ఆర్డీ శాఖ బాధితుల గురించి అనేక సంక్షేమ చర్యలు తీసుకుంటోందన్నారు. బాధితులతో పాటు నేరస్తుల మానసిక ఆరోగ్యం గురించి పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో ఓరియెంటేషన్, స్వాగత కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రూపొందించిన నిబంధనలు అమలయ్యేలా వైస్ చాన్స్లర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. -
సమాచారం ఇచ్చే తనిఖీలు
డిగ్రీ కళాశాలల బలోపేతంపై ఓయూ వినూత్న పద్ధతి * ప్రిన్సిపాళ్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు * యూజీసీ నిబంధనలు పాటించేలా చర్యలు హైదరాబాద్: డిగ్రీ కళాశాలల తనిఖీలకు ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది వినూత్న పద్ధతి ఎంచుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకుండా కళాశాలల్లో తనిఖీలు చేపట్టేవారు. అధికారుల ప్రయోగం ఫలిస్తే ఇకపై ఈ విధానానికి చెల్లుచీటి పడనుంది. ముందస్తు సమాచారం, తగిన గడువు ఇచ్చి ఇకపై తనిఖీలు చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. అంతేగాక కళాశాలలు ఏయే నిబంధనలు పాటించాలన్న అంశంపై కళాశాల ప్రిన్సిపాళ్లకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇది ముగిసిన తర్వాత కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రణాళిక లు రూపొందిస్తున్నారు. కళాశాలల తనిఖీల సమయంలో ఫ్యాకల్టీ, వసతుల కల్పనపై ఆరా తీస్తే విస్మయం గొలిపేలా సంబంధిత కళాశాలల యాజమాన్యాల నుంచి అధికారులకు సమాధానాలు ఎదురయ్యేవి. ప్రతి కళాశాల యూజీసీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉన్నా... అసలు అవేమీ తెలియనట్లు యాజమాన్యాలు ప్రవర్తించేవి. దీంతో విసుగు చెందిన అధికారులు.. యాజమాన్యాల తెరచాటు వ్యవహారానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. ముందస్తుగా కళాశాల తనిఖీలపై సమాచారం అందించి వారు యూజీసీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొని అ తర్వాత తనిఖీలు చేపట్టేందుకు నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని, కళాశాలలు బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవు.. ఓయూ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 470 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో కళాశాలలు ఏ వర్సిటీ పరిధిలోనూ లేవు. వీటన్నింటినీ పర్యవేక్షించడం వర్సిటీకి కష్టంగా మారింది. తనిఖీలు చేపట్టడానికి ప్రత్యేక బృందం అంటూ లేకపోవడంతో కళాశాలల నిర్వహణపై అజమాయిషీ కొరవడింది. బోధనలో నాణ్యత , పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ, లైబ్రరీ, ల్యాబ్స్, కంప్యూటర్ సౌకర్యం, సరిపడ గదులు తదితరాలు లేకున్నా కళాశాలలు కొనసాగుతున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి కళాశాల తమ పూర్తి వివరాలతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలి. కానీ, 50 శాతం పైగా కళాశాలలకు వెబ్సైట్లు లేవు. అలాగే, యాంటీ ర్యాగింగ్ కమిటీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏ కళాశాలలోనూ కనిపించడం లేదు. అందుకే ఇకపై యూజీసీ నిబంధనలు పాటించేలా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 25వ తేదీ తర్వాత ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి కళాశాలకు 20 రోజులు గడువిచ్చి.. తదుపరి అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. అప్పటికీ మార్పు రాకుంటే కళాశాల గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటారు. -
‘రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలి’
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లోని అధ్యాపకుల పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎఫ్యూటీఏ) ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించింది. యూజీసీ రెగ్యులేషన్స్ 2010 చట్టం ప్రకారం యూనివర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలుగా ఇదివరకే నిర్ణయించారని గుర్తుచేసింది. గతంలో వర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంటు వయసు 62 సంవత్సరాలుగా ఉండేదని, ఈ కొత్త చట్టంప్రకారమైనా రాష్ట్రప్రభుత్వం 65 ఏళ్లకు పెంచాలని పేర్కొంది. ఈమేరకు ఏపీఎఫ్యూటీఏ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ కె.జాన్ ఒక ప్రకటన విడుదల చేశారు.