సమాచారం ఇచ్చే తనిఖీలు
డిగ్రీ కళాశాలల బలోపేతంపై ఓయూ వినూత్న పద్ధతి
* ప్రిన్సిపాళ్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు
* యూజీసీ నిబంధనలు పాటించేలా చర్యలు
హైదరాబాద్: డిగ్రీ కళాశాలల తనిఖీలకు ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది వినూత్న పద్ధతి ఎంచుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకుండా కళాశాలల్లో తనిఖీలు చేపట్టేవారు. అధికారుల ప్రయోగం ఫలిస్తే ఇకపై ఈ విధానానికి చెల్లుచీటి పడనుంది.
ముందస్తు సమాచారం, తగిన గడువు ఇచ్చి ఇకపై తనిఖీలు చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. అంతేగాక కళాశాలలు ఏయే నిబంధనలు పాటించాలన్న అంశంపై కళాశాల ప్రిన్సిపాళ్లకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇది ముగిసిన తర్వాత కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రణాళిక లు రూపొందిస్తున్నారు. కళాశాలల తనిఖీల సమయంలో ఫ్యాకల్టీ, వసతుల కల్పనపై ఆరా తీస్తే విస్మయం గొలిపేలా సంబంధిత కళాశాలల యాజమాన్యాల నుంచి అధికారులకు సమాధానాలు ఎదురయ్యేవి.
ప్రతి కళాశాల యూజీసీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉన్నా... అసలు అవేమీ తెలియనట్లు యాజమాన్యాలు ప్రవర్తించేవి. దీంతో విసుగు చెందిన అధికారులు.. యాజమాన్యాల తెరచాటు వ్యవహారానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. ముందస్తుగా కళాశాల తనిఖీలపై సమాచారం అందించి వారు యూజీసీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొని అ తర్వాత తనిఖీలు చేపట్టేందుకు నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని, కళాశాలలు బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.
కనీస సౌకర్యాలు కూడా లేవు..
ఓయూ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 470 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో కళాశాలలు ఏ వర్సిటీ పరిధిలోనూ లేవు. వీటన్నింటినీ పర్యవేక్షించడం వర్సిటీకి కష్టంగా మారింది. తనిఖీలు చేపట్టడానికి ప్రత్యేక బృందం అంటూ లేకపోవడంతో కళాశాలల నిర్వహణపై అజమాయిషీ కొరవడింది. బోధనలో నాణ్యత , పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ, లైబ్రరీ, ల్యాబ్స్, కంప్యూటర్ సౌకర్యం, సరిపడ గదులు తదితరాలు లేకున్నా కళాశాలలు కొనసాగుతున్నాయి.
యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి కళాశాల తమ పూర్తి వివరాలతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలి. కానీ, 50 శాతం పైగా కళాశాలలకు వెబ్‌సైట్లు లేవు. అలాగే, యాంటీ ర్యాగింగ్ కమిటీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏ కళాశాలలోనూ కనిపించడం లేదు. అందుకే ఇకపై యూజీసీ నిబంధనలు పాటించేలా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ నెల 25వ తేదీ తర్వాత ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి కళాశాలకు 20 రోజులు గడువిచ్చి.. తదుపరి అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. అప్పటికీ మార్పు రాకుంటే కళాశాల గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటారు.