ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలపై తగ్గని భారం
శాతవాహన, తెలంగాణ వర్సిటీల పరిధి పరిమితమే..
కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ వచ్చినప్పటికీ వర్సిటీల విషయంలో మారని వైనం
ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు తప్పని తిప్పలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు దాటినా.. విశ్వవిద్యాలయాల పరిపాలనకు తగిన విధంగా వాటిని పునర్‌వ్యవస్థీకరించలేదు. దీంతో ఆయా జిల్లాల విద్యార్థులు, అఫిలియేషన్ కలిగిన కళాశాలలు ఇబ్బంది పడుతున్నాయి. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం కొత్త జిల్లాలు, మూడేళ్ల క్రితం కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ వర్సిటీల పరిధి విషయంలో మాత్రం అవసరమైన మార్పులు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలోనే కొత్తగా శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇప్పటికీ ఆయా ఉమ్మడి జిల్లాల పరిధికి మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో గతం నుంచే ఉన్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీలపై మాత్రం భారం అలాగే ఉంది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పునర్‌వ్యవస్థీకరించాలని పలువురు కోరుతున్నారు.
ప్రత్యేక కమిటీ నివేదిక
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆయా కళాశాలల అఫిలియేషన్ విషయమై.. జిల్లాల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేయాలంటూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గతంలోనే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయగా.. ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణలో శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే కళాశాలల అఫిలియేషన్ విషయానికి వస్తే.. తెలంగాణ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, శాతవాహన వర్సిటీ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి.
అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాశాలల అఫిలియేషన్ మాత్రం.. ఇప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తరువాత.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను ఆనుకున్న నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీని దాటుకుని ఆయా జిల్లాల వారు సుదూరంలోని వరంగల్ కాకతీయ వర్సిటీకి వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీని అనుకున్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు కరీంనగర్ మీదుగానే వరంగల్ వెళ్లాల్సి వస్తోంది.
అయితే గతంలోనే ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆయా వర్సిటీలు, కొత్త జిల్లాల మధ్య దూరం, కళాశాలల సంఖ్యను బట్టి పరిధి మార్పుపై ప్రతిపాదనలు చేశారు. ఆయా అంశాల ఆధారంగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు తెలంగాణ వర్సిటీ పరిధిలోకి కొత్తగా నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు, శాతవాహన వర్సిటీ పరిధిలోకి ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట జిల్లాలను కేటాయించేలా నివేదికలో ప్రతిపాదించారు.
చదవండి: ‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లు
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉస్మానియా పరిధిలో ఉండగా.. కొత్త ప్రతిపాదనల ప్రకారం సంగారెడ్డి జిల్లా మాత్రమే ఆ వర్సిటీ పరిధిలో ఉంచాలని నిర్ణయించారు. అంటే ఉస్మానియా వర్సిటీ పరిధిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలు ఉండేలా ప్రతిపాదించారు. ఇక కాకతీయ వర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండేలా నిర్ణయించారు. ఇక మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండలోని మూడు జిల్లాలు, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని ఐదు జిల్లాలు యధావిధిగా ఉండేలా నివేదికలో ప్రతిపాదించారు. కాగా ఇందుకు సంబంధించి విధాన నిర్ణయం విషయంలో జాప్యం జరుగుతోంది.
పరిధులపై ప్రత్యేక కమిటీ ప్రతిపాదనలు..
ఉస్మానియా: రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, వికారాబాద్
కాకతీయ: వరంగల్, హన్మకొండ, జనగాం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
తెలంగాణ: నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్
శాతవాహన: కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట
మహాత్మాగాంధీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి
పాలమూరు: మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట
Comments
Please login to add a commentAdd a comment