
‘ఆశలు ఉండగానే సరిపోదు ఆశయ సాధనకు కృషి చేయాల్సిందే! అప్పుడే సరైన ఫలితాన్ని సాధించగలం అంటోంది 19 ఏళ్ల కాట్రావత్ అంజలి. సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా తాల్ సైనిక్ క్యాంపులో ఉస్మానియా వర్సిటీ సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థిని, ఎన్‌సిసి క్యాడెట్ అంజలి ఫైరింగ్ విభాగంలో తన ప్రతిభను చూపింది. పతకాలూ సాధించింది. నవ శక్తికి ప్రతీకగా నిలుస్తున్న మహబూబ్‌నగర్ వాసి అంజలి చెబుతున్న విషయాలు ఆమె మాటల్లోనే..
‘‘మా నాన్న నర్సింహ లారీ డ్రైవర్. అమ్మ దుర్గ గృహిణి. పుట్టిందీ, పెరిగిందీ మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి. ఓయూ సైఫాబాద్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీతో పాటు ఆ కాలేజీలో ఎన్‌సిసిలో సి–సర్టిఫికెట్ చేస్తున్నాను. ఈ యేడాది ఢిల్లీలో జరిగిన టీఎస్సీ (తాల్ సైనిక్ క్యాంప్)లో పాల్గొనే అవకాశం లభించింది. ఇది జాతీయ స్థాయి ఈవెంట్. ఆర్మీ వింగ్‌కి మాత్రమే అవకాశం ఉండే ఈవెంట్ కూడా. ఐయుసి, ఐజిసి, టీ ఆర్జీ.. ఇలా లాంచింగ్ వరకు దశల వారీగా శిక్షణ తీసుకుంటూ, పోటీలో పాల్గొంటూ, సక్సెస్ సాధిస్తేనే టీఎస్సీకి ఎంపిక కాగలం.
ప్రత్యేక శిక్షణ
నేను పాల్గొన్నది ఫైరింగ్ అప్లికేషన్. దీనికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రతిరోజూ చేయాల్సిన వ్యాయామాలు, మోటివేషన్ క్లాసులు, ఫైరింగ్‌లో ఏ మోడ్‌పాయింట్ ఎలా తీసుకోవాలనేది శిక్షణలో భాగం. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఉండే ట్రైనింగ్‌తో పాటు రేంజ్ సెక్షన్ దగ్గర ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. భుజ బలానికి ప్రత్యేక వ్యాయామాలు ఉంటాయి. స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ల క్లాసులు ఉంటాయి. మానసికంగా ఒకే విషయంపైన ఏకాగ్రత ఉండేలా శిక్షణ ఇస్తారు. పాయింట్ 22 బోర్ రైఫిల్ బరువు 3–4 కేజీలు ఉంటుంది. దీనిని మోయడమే కాదు, అదే సమయంలో ఫైర్ చేయడానికి చాలా శక్తి కావాలి. ఇందుకోసం బలం పెరిగేలా ఆహార నియమాలు, డిప్స్, పుషప్స్, కోర్‌మజిల్ స్ట్రెంథెనింగ్ .. వంటివి రోజూ సాధన చేస్తూ ఉండాలి.
స్ఫూర్తిని నింపే ఈవెంట్..
జాతీయ స్థాయిలో జరిగే టీఎస్సీలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఉన్న 17 డైరెక్టరేట్స్ నుంచి మంచి శిక్షణ తీసుకున్న విద్యార్థులు పాల్గొంటారు. ప్రతి డైరెక్టరేట్ నుంచి 40–50 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారు. ఇందులో మన ప్రాంతం నుంచి నేను పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చింది. జాతీయ స్థాయి శిక్షణ పొందిన విద్యార్థులను కలుసుకోవడం, వారి సంస్కృతి గురించి తెలుసుకోడం, పోటీలో పతకాలు సాధించడమూ చాలా సంతోషాన్నిచ్చింది.
ఆశ .. ఆశయం
చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని, డిఫెన్స్‌లోకి వెళ్లాలనేది నా ఆలోచన. దానికి తగినట్టుగా నాకున్న ఆసక్తిని గమనించి, మా ఎన్సీసీ అసోసియేట్ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ పల్లటి నరేష్ ఆసక్తి ఉందా అని అడిగారు. నా ఆనందం మాటల్లో చెప్పలేను. నాకు ఇష్టమైన రైఫిల్ ట్రైనింగ్‌లో మిస్ కాకుండా పాల్గొనడం మొదలుపెట్టాను. ఈ ట్రైనింగ్ వల్ల కొన్ని నెలలుగా కాలేజీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్లాసులు, ల్యాబ్స్ మిస్ అయ్యాను. మా లెక్చరర్స్ సపోర్ట్ ఉండటం మరింత బలాన్నిచ్చింది. ఇప్పుడు ఫైనలియర్ కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. స్టేట్ పోలీస్ ట్రైనింగ్‌కి అప్లికేషన్ పెట్టుకున్నాను. సెంట్రల్ డిఫెన్స్‌లో పాల్గొనాలనేది నా ఆశ. అందుకు తగిన ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అని ఆనందంగా వివరించింది అంజలి.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి