
ఇద్దరు జవాన్లు మృతి.. ఐదుగురికి గాయాలు
మణిపూర్‌లో సాయుధ దుండగుల దుశ్చర్య
హఠాత్తుగా కాన్వాయ్‌ని చుట్టుముట్టి కాల్పులు
ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు వస్తుండగా ఘటన
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలోని నంబోల్ సబాల్ లెయ్‌కై సమీపంలో పారామిలటరీ దళం ‘అస్సాం రైఫిల్స్’ వాహన శ్రేణిపై గుర్తుతెలియని వ్యక్తులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని మణిపూర్ పోలీసు అధికారులు వెల్లడించారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి 33 మంది అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంలో బిష్ణుపూర్‌కు బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 5.50 గంటలకు వాహనాన్ని సాయుధ దుండగులు చుట్టుముట్టి కాల్పులు జరిపి, తక్షణమే అక్కడి నుంచి పరారయ్యారు. ఇంఫాల్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారిని నాయక్ సుబేదార్ శ్యామ్ గురూంగ్, రైఫిల్‌మేన్ కేశాప్‌గా గుర్తించారు. గాయపడినవారిని సమీపంలోని ‘రిమ్స్’కు తరలించారు.
బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. దాదాపు ఐదుగురు వ్యక్తులు తమపై కాల్పులు జరిపారని గాయపడిన జవాన్ ఎన్.నాంగ్‌థాన్ చెప్పాడు. ప్రధాన రహదారిపై చుట్టుపక్కల జనం ఉండడంతో తాము అప్రమత్తంగా వ్యవహరించామని, వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించలేకపోయామని వెల్లడించాడు. మాజీ సీఎం ఎన్.బీరేన్‌సింగ్ ‘రిమ్స్’లో బాధితులను పరామర్శించారు. గాయపడిన జవాన్లు మణిపూర్, అస్సాం, సిక్కిం, మేఘాలయా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారు.
మోదీ వచ్చి వెళ్లిన వారం రోజులకే..
భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారమే మణిపూర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే దుండగులు భద్రతా సిబ్బందిపై దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి కారణం ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. తీవ్రవాద సంస్థలు ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
ఇది మణిపూర్‌పై దాడి: బీరేన్ సింగ్
అస్సాం రైఫిల్స్‌పై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన హింసాకాండ అని పేర్కొన్నారు. ఈ మేరకు మణిపూర్ రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు జవాన్లు మృతిచెందడం పట్ల గవర్నర్ విచారం వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
క్రూరమైన దాడులను సహించే ప్రసక్తే లేదని, దుండగులను శిక్షించడం ఖాయమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. తాజా దాడి పట్ల మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇది సాక్షాత్తూ మణిపూర్‌పై జరిగిన క్రూరమైన దాడిగా అభివర్ణించారు. అస్సాం రైఫిల్స్ సిబ్బంది ప్రాణత్యాగం ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. వారిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించక తప్పదని తేల్చిచెప్పారు.
రెండేళ్లుగా ఘర్షణలు
మణిపూర్‌లో రెండు ప్రధానమైన జాతులైన కుకీలు, మైతేయీల మధ్య 2023 మే నెల నుంచి ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 260 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 13 పోలీసు స్టేషన్ల పరిధిలో మినహా రాష్ట్రమంతటా సైనిక దళాల(ప్రత్యేక అధికారాల) చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) అమల్లో ఉంది. శుక్రవారం కాల్పులు జరిగిన నంబోల్ ఏరియాలో ఈ చట్టం అమల్లో లేదు. శుక్రవారం ఉదయం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించారు. ఓ కేసులో 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినందుకు ఆందోళనకు దిగారు. అస్సాం రైఫిల్స్‌పై దాడికి స్థానిక తీవ్రవాద సంస్థలే కారణం కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.