ఇంఫాల్: మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కుకీ-జో కమ్యూనిటీ కోరుతున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్‌ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తిరస్కరించడంతో మరోమారు హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి నేపధ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిలిటెంట్లు.. కోట్రుక్, పొరుగున ఉన్న కదంగ్‌బండ్‌లోని లోయ దిగువ ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు, బాంబు దాడులు చేశారు. కదంగ్‌బండ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై డ్రోన్ నుంచి బాంబు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మదిమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర విభాగాలతోపాటు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొట్రుక్ గ్రామస్తులపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మణిపూర్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment