మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్‌లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన తాజా హింసలో ఆరుగురు ప్రజలు మరణించారని పోలీసులు తెలిపారు.
మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు.
ఈ హత్యానంతరం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.
కాగా మణిపూర్‌లో గత ఏడాదిన్నర కాలంగా హింస కొనసాగుతూనే ఉంది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్వత - మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు.
ముఖ్యంగా గడచిన ఐదురోజుల్లో హింస మరింత పెరిగింది. శుక్రవారం మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో రెండు ప్రదేశాల్లో డ్రోన్ దాడులు జరిగాయి. అయితే కుకీ మిలిటెంట్లే వీటిని వాడుతున్నారని మైయితీ వర్గం ఆరోపిస్తోంది. కుకీలు మాత్రం ఖండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment