సైబర్‌ నేరగాళ్లపై ‘హంటర్‌’ | Mule Hunter surveillance of suspicious accounts and transactions | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లపై ‘హంటర్‌’

Sep 25 2025 5:13 AM | Updated on Sep 25 2025 5:13 AM

Mule Hunter surveillance of suspicious accounts and transactions

ఏఐ ఆధారిత టూల్‌ అభివృద్ధి చేసిన ఆర్బీఐహెచ్‌  

అనుమానిత ఖాతాలు, లావాదేవీలపై మ్యూల్‌ హంటర్‌ నిఘా 

ఇప్పటికే దీన్ని వినియోగిస్తున్న దాదాపు 15 బ్యాంకులు 

మిగిలిన వాటికీ తప్పనిసరి చేసే ఆలోచనలో కేంద్రం 

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు కీలక ఆధారం అవుతున్న మ్యూల్‌ ఖాతాలకు, లావాదేవీలకు చెక్‌ చెప్పడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్బీఐహెచ్‌) రూపొందించిన ఏఐ టూల్‌ మ్యూల్‌హంటర్‌.ఏఐ వినియోగం తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీన్ని ఇప్పటికే దాదాపు 15 బ్యాంకులు వినియోగిస్తుండగా మిగిలిన వాటికీ విస్తరించనున్నారు. ఈ టూల్‌ ద్వారా అనుమానిత బ్యాంకు ఖాతాలతో పాటు లావాదేవీలను గుర్తించడం, బ్లాక్‌ చేయ డం తేలికవుతుంది. ఫలితంగా సైబర్‌ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ఆ ఖాతాల ఆధారంగానే స్కామ్స్‌.. 
» కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి మరీ వివిధ రకాలైన సైబర్‌ నేరాలు చేయిస్తున్న సూత్రధారులు ఇటీవలి కాలంలో విదేశాల్లోనే ఉండి కథ నడుపుతున్నారు. వీళ్లు బా«ధితుల నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి తమ ఖాతాలు వినియోగించరు. వివిధ మార్గాల్లో దళారుల్ని గుర్తించి వారి ద్వారా చిరుద్యోగులు, నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులకు ఎరవేస్తారు. వీరి కేవైసీ వివరాలతో, బోగస్‌ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు.

వీటికి సంబంధించిన డెబిట్‌ కార్డులు, చెక్‌బుక్స్‌ తదితరాలు తీసుకునే దళారులు వాటిని సూత్రధారులకు పంపిస్తూ ఉంటారు. ఈ ఖాతాల (మ్యూల్‌) ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్లు తీసుకునే వారిని మనీ మ్యూల్స్‌గా పరిగణిస్తుంటారు. ఈ మనీ మ్యూల్స్‌కు, వారి ఖాతాలకు చెక్‌ పెట్టడం ద్వారా సైబర్‌ నేరాలను కట్టడి చేయవచ్చని నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.

95% కచ్చితత్వం.. 
ఆర్‌బీఐహెచ్‌ గత ఏడాది డిసెంబర్‌లో ఈ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఆయా బ్యాంకుల్లో ప్రభావవంతంగా పని చేస్తోందని అధికారులు చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటి ద్వారా జరిగే లావాదేవీలను ఈ టూల్‌ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన ఖాతాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ అంశంలో దీని కచ్చితత్వం 95 శాతం ఉన్నట్లు తేల్చారు. 

కొత్తగా తెరిచిన ఖాతాల్లో లేదా వినియోగంలో ఉన్న వాటిలో అకస్మాత్తుగా భారీ మొత్తాలతో లావాదేవీలు జరిగినా అప్రమత్తం చేస్తుంది. నగదు డిపాజిట్‌ అయినా, విత్‌డ్రా అయినా అలెర్ట్‌ చేయడంతో పాటు ఆ ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తుంది. ఒకే చిరునామాతో అనేక బ్యాంకు ఖాతాలు తెరిచినా పసిగట్టడంతో పాటు ఈ–కేవైసీనీ పర్యవేక్షిస్తుంది. ఈ ఏఐ టూల్‌ ఫేషియల్‌ రికగ్నిషన్, బయోమెట్రిక్‌ మ్యాచింగ్, డాక్యుమెంట్‌ అథెంటిసిటీలను తనిఖీ చేయగలదు.  

నరేష్‌ మల్హోత్రా కేసు కలకలం 
ఇటీవలి కాలంలో తరచూ డిజిటల్‌ అరెస్టు మోసాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా మహిళలు, వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని ఈ నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్, మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందంటూ, పోలీసు, ఇతర ఏజెన్సీల అధికారులుగా ఫోన్లు, వీడియో కాల్స్‌ చేసి బెదిరిస్తున్నారు. వీరి మాయలో పడిన వాళ్లు తమ కష్టార్జితం రూ.లక్షల నుంచి రూ.కోట్లు కూడా నష్టపోతున్నారు. 

ఈ క్రమంలో ఢిల్లీలో చోటు చేసుకున్న నరేష్‌ మల్హోత్రా ఉదంతం అన్ని దర్యాప్తు ఏజెన్సీలను కదిలించింది. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి అయిన మల్హోత్రా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 4 మధ్య ‘డిజిటల్‌ అరెస్టు’లో రూ.23 కోట్లు కోల్పోయారు. అన్ని బ్యాంకులు మ్యూల్‌ హంటర్‌ను వినియోగిస్తే ఈ నేరం జరిగేది కాదని, జరిగినా అత్యధిక మొత్తం ఫ్రీజ్‌ అయ్యేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు ఈ టూల్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement